January 10
-
బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇదే సువర్ణావకాశం..!
ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్ తాజా ఇష్యూ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22 తొమ్మిదవ సిరీస్ ఇది. జనవరి 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. బాండ్ ధర రూ.4,786 అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటన పేర్కొంది. ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే రూ.50 ధర తగ్గుతుంది. అంటే బాండ్ 4,736కే లభిస్తుందన్నమాట. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకూ అందుబాటులో ఉన్న ఎనిమిదవ సిరీస్ ధరతో పోల్చితే (రూ.4,791) తాజా ఇష్యూ ధర ఐదు రూపాయలు తక్కువ కావడం గమనార్హం. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌హెచ్‌సీఐఎల్), నిర్దిష్ట పోస్టాఫీసులు, బ్యాంకులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో గోల్డ్ బాండ్లు లభ్యం అవుతాయి. దీర్ఘకాల లక్ష్యాల కోసం బంగారాన్ని కొద్ది కొద్దిగా సమకూర్చుకోవాలని అనుకునే వారికి, బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామనుకునే వారికి అందుబాటులో ఉన్న సాధనాల్లో ఇది మెరుగైనదని నిపుణుల విశ్లేషణ. ఇందులో పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుంది. వడ్డీ ఆదాయం లభిస్తుంది. పూర్తి కాలం ఉంచుకుంటే లాభాలపై పైసా పన్ను కట్టక్కర్లేదు. ఇవన్నీ సానుకూలతలు. ఇన్వెస్ట్ చేసిన ధర కంటే బంగారం ధరలు కిందకు పడిపోయి దీర్ఘకాలం పాటు అదే స్థాయిల్లో కొనసాగితే నష్టాలు ఎదుర్కోవాలి. మీరు బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి గోల్డ్ బాండ్‌ని కూడా ఉపయోగించవచ్చు. (చదవండి: రైల్వే ప్రయాణికులకు షాక్.. ఆ రైల్వే స్టేషన్లలో భారీగా బాదుడు!) -
10న ‘అయోధ్య’ విచారణ తేదీ ఖరారు
న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం కేసుల విచారణ తేదీని తాము ఏర్పాటు చేయబోయే ధర్మాసనం ఈ నెల 10వ తేదీన నిర్ణయిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్ల ధర్మాసనం ఈ అంశంపై శుక్రవారం విచారణ చేపట్టింది. వివిధ పక్షాల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, రాజీవ్ ధన్వాన్ తమ వాదనలు వినిపించకుండానే కేవలం 30 సెకన్లలోనే ధర్మాసనం ఈ నిర్ణయం వెలువరించింది. -
10 నుంచి ఆప్ సభ్యత్వ నమోదు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించిన ఆప్ ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. దేశంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో పదిహేను రోజులపాటు సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేత యోగేంద్ర యాదవ్ తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజులపాటు కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం యోగేంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడారు. మొత్తం 545 స్థానాల్లో ఎన్ని స్థానాలకు పోటీ చేయనున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు యాదవ్ సమాధానమిస్తూ... ఈ విషయంలో పార్టీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, అయితే వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకే తాము ఆసక్తి కనబరుస్తున్నామని చెప్పారు. 15 నుంచి 20 స్థానాలకు తగ్గకుండా తమ పార్టీ పోటీ చేసే అవకాశముందన్నారు. కేజ్రీవాల్ నేతృత్వంలోనే లోక్‌సభ ఎన్నికలకు వెళ్తామన్నారు. అయితే పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే విషయం గురించి మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదన్నారు. హర్యానాలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 10 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆప్ పోటీ చేస్తుందని చెప్పారు. నిజానికి హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్‌లో జరగాల్సి ఉన్నా అక్కడ ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశముందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయని, లోక్‌సభ ఎన్నికలతోపాటే వాటిని నిర్వహించే అవకాశముందన్నారు. అందుకే హర్యానాలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయించిందన్నారు. ఆప్‌లో చేరేందుకు దేశంలోని ఎంతోమంది ఆసక్తి కనబరుస్తున్నారని, అందుకే ఈ నెల 10 నుంచి 26 వరకు ‘మై బీ ఆమ్ ఆద్మీ’ పేరుతో సభ్యత్వ నమోదు ప్రక్రియను నిర్వహిస్తున్నామని చెప్పారు. పల్లెల్లో, పట్టణాల్లో పార్టీకి అపూర్వ ఆదరణ లభిస్తోందని, ఈ నేపథ్యంలోనే పార్టీలో చేరాల్సిందిగా ప్రజలను ఈ కార్యక్రమం ద్వారా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అయితే పార్టీలో చేరేందుకు ఎటువంటి సభ్యత్వ నమోదు రుసుము వసూలు చేయడంలేదని తెలిపారు.