
ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్ తాజా ఇష్యూ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22 తొమ్మిదవ సిరీస్ ఇది. జనవరి 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. బాండ్ ధర రూ.4,786 అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటన పేర్కొంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే రూ.50 ధర తగ్గుతుంది. అంటే బాండ్ 4,736కే లభిస్తుందన్నమాట. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకూ అందుబాటులో ఉన్న ఎనిమిదవ సిరీస్ ధరతో పోల్చితే (రూ.4,791) తాజా ఇష్యూ ధర ఐదు రూపాయలు తక్కువ కావడం గమనార్హం.
స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌హెచ్‌సీఐఎల్), నిర్దిష్ట పోస్టాఫీసులు, బ్యాంకులు, స్టాక్ ఎక్స్ఛేంజీలు, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల్లో గోల్డ్ బాండ్లు లభ్యం అవుతాయి. దీర్ఘకాల లక్ష్యాల కోసం బంగారాన్ని కొద్ది కొద్దిగా సమకూర్చుకోవాలని అనుకునే వారికి, బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామనుకునే వారికి అందుబాటులో ఉన్న సాధనాల్లో ఇది మెరుగైనదని నిపుణుల విశ్లేషణ. ఇందులో పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుంది. వడ్డీ ఆదాయం లభిస్తుంది. పూర్తి కాలం ఉంచుకుంటే లాభాలపై పైసా పన్ను కట్టక్కర్లేదు. ఇవన్నీ సానుకూలతలు. ఇన్వెస్ట్ చేసిన ధర కంటే బంగారం ధరలు కిందకు పడిపోయి దీర్ఘకాలం పాటు అదే స్థాయిల్లో కొనసాగితే నష్టాలు ఎదుర్కోవాలి. మీరు బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి గోల్డ్ బాండ్‌ని కూడా ఉపయోగించవచ్చు.
(చదవండి: రైల్వే ప్రయాణికులకు షాక్.. ఆ రైల్వే స్టేషన్‌లలో భారీగా బాదుడు!)
Comments
Please login to add a commentAdd a comment