న్యూఢిల్లీ: రాష్ట్ర ఎన్నికల్లో 70 స్థానాల్లో 67 చోట్ల గెలిచి విజయఢంకా మోగించి మంచి ఉత్సాహంతో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఇతర రాష్ట్రాల్లో కూడా తమ ప్రాభవం చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా రానున్న ఐదేళ్ల కాలంలో నాలుగు రాష్ట్రాల్లో పార్టీ శాఖలను ఏర్పాటు చేసి ఆప్‌ని విస్తరించాలనుకుంటున్నట్లు పార్టీ సీనియర్ వ్యూహకర్త యోగేంద్ర యాదవ్ వెల్లడించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పోటీ చేస్తామని చెప్పారు. తమది ప్రాంతీయ పార్టీ కాదని, దీర్ఘకాలంలో జాతీయ స్థాయిలో ప్రత్యమ్నాయ శక్తిగా రూపాంతరం చెందాలనుకుంటున్నామని తెలిపారు. జాతీయ రాజకీయాల్లోకి నిబద ్ధత గల కొత్త రక్తాన్ని తీసుకురావాలనుకుంటున్నామన్నారు.
రాజకీయ సౌలభ్యం కోసం తృతీయ కూటమివంటి సంకీర్ణాలు పుట్టుకొచ్చాయని, తాము అలాంటి వాటిలో చేరబోమని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా మద్దతు ప్రకటించిన తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ గురించి మాట్లాడుతూ, తమకు ఎవరి మద్దతూ అక్కర్లేదన్నారు. వారితో రాజకీయ మద్దతును పొడిగించబోమన్నారు. తమది కేవలం బలాలు, బలహీనతల మీద పుట్టుకొచ్చిన పార్టీ కాదని, రాజకీయ వ్యతిరేకతను పునాదిగా చేసుకుని ఏర్పడిందనే విషయాన్ని వారు గుర్తెరగాలని చెప్పారు. అడుగుపెట్టిన ప్రతి రాష్ట్రంలో కూడా 20 శాతానికి పైగా ఓట్లు సాధించడమే తమ లక్ష్యమని తెలిపారు. తద్వారా దీర్ఘకాలం కంటే ముందే రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకుంటున్నామన్నారు. అయితే రాజకీయ శూన్యత ఆధారంగా రాష్ట్రాలను ఎంచుకుంటామని తెలిపారు. ఈ ఏడాది జరగనున్న బిహార్, వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని ప్రశ్నించగా సూటిగా జవాబివ్వలేదు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచిన పంజాబ్‌లో 2017లో జరగనున్న ఎన్నికలపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.
నాలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తాం
Published Sun, Feb 15 2015 10:29 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement
Advertisement