యోగేంద్ర యాదవ్
కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై యోగేంద్ర యాదవ్ ఆరోపణ
ఇంద్రజీత్ సింగ్ ఆస్తుల విలువ రూ. 300 కోట్ల పైనే
రియల్ ఎస్టేట్ భూమిని వ్యవసాయ భూమిగా చూపారు
ధరమ్‌పాల్ ఆస్తుల విలువ ఆరున్నర కోట్లంటే నవ్వుతారు
వారికి బిల్డర్ మాఫియాతో సంబంధాలున్నాయి
విలేకరుల సమావేశంలో వెల్లడించిన ఆప్ నేత
న్యూఢిల్లీ: తన ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్‌లను సమర్పించారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత యోగేంద్ర యాదవ్ ఆరోపించారు. గుర్గావ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆప్ తరఫున ఆయన బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు ప్రత్యర్థులుగా బీజేపీ నుంచి రావ్ ఇంద్రజీత్‌సింగ్, కాంగ్రెస్ నుంచి ధరమ్‌పాల్ యాదవ్ పోటీ పడుతున్నారు. కాగా నామినేషన్ వేసిన సందర్భంగా రావ్ ఇంద్రజీత్ సింగ్ తన స్థిర, చరాస్తుల విలువ రూ.14.1 కోట్లుగా చూపారు.
సర్కిల్ రేట్ల ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ. 300 కోట్లకు పైగానే ఉంటుందని యాదవ్ ఆరోపిస్తున్నారు. వ్యవసాయ భూమిని అభివృద్ధి చేసి, నిర్మాణాలకు అనువుగా మార్చిన తర్వాత మళ్లీ దానిని వ్యవసాయ భూమిగా చూపలేమని యాదవ్ పేర్కొన్నారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం... ‘రావ్ ఇంద్రజీత్‌సింగ్‌కు రేవారి జిల్లా రామ్‌పూర్ తాలూకాలో 41 ఎకరాల స్థిరాస్తి ఉంది. అదికాకుండా 2.78 ఎకరాల భూమి గుర్గావ్‌లో ఉంది. ఈ భూములను యూనిటెక్, క్రిష్ డెవలపర్స్ సంస్థలకు సింగ్ అప్పగించారు. అంటే ఇక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కానీ ఈ భూమిని సింగ్ తన అఫిడవిట్‌లో వ్యవసాయ భూమిగానే చూపారు. సర్కిట్ రేట్ల ప్రకారం రాంపూర్‌లో ఉన్న భూమి విలువ రూ. 198 కోట్లు కాగా గుర్గావ్‌లో ఉన్న భూమి విలువ 59.93 కోట్లు ఉంటుంది. ఇవి కాకుండా చరాస్తుల మొత్తాన్ని రూ. 8.27 కోట్లుగా చూపారు. వీటి మొత్తం విలువ కలిపితే సింగ్ ఆస్తుల విలువ దాదాపు రూ. 300 కోట్ల వరకు ఉంటుంది. కానీ ఆయన మాత్రం అఫిడవిట్‌లో కేవలం రూ.14.1 కోట్లుగానే చూపారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా గుర్గావ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రావ్ ధరమ్‌పాల్ కూడా తన మొత్తం ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి చూపలేదు.
హిందూ ఉమ్మడి కుటుంబ చట్టం కిందే ఆయన తన ఆస్తుల మొత్తానికి ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా ఎన్నికల సంఘానికి ఆస్తులు చూపే విషయానికి వచ్చేసరికి తనకున్న ఆస్తిని వ్యక్తిగత ఆస్తిగా మార్చి చూపారు. ఆయనకు కేవలం రూ. 6.5 కోట్ల ఆస్తులు మాత్రమే ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపారు. ఇది వింటే ఎవరైనా నవ్వుతారు.
బిల్డర్ మాఫియాతో సంబంధాలు...
కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులుగా గుర్గావ్ నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులకు బిల్డర్ మాఫియాతో సంబంధాలున్నాయని యాదవ్ ఆరోపించారు. ఆ మాఫియా అండదండలతోనే సంపన్నులుగా ఎదిగారని, ధనబలంతో పార్టీ టికెట్లు సంపాదించారని ఆరోపించారు.