నగరంలోని మూడు ప్రధాన పార్టీలు బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికలు జరిపించాలనే కోరుతుండడంతో ఢిల్లీలో త్వరలోనే అసెంబ్లీ జరిగే అవకాశాలు అధికమయ్యాయి.
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలోని మూడు ప్రధాన పార్టీలు బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికలు జరిపించాలనే కోరుతుండడంతో ఢిల్లీలో త్వరలోనే అసెంబ్లీ జరిగే అవకాశాలు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ తేదీలపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం.. కనీసం మూడు నెలల వరకు ఎన్నికలు జరిపించే అవకాశాలు లేవని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు, ఈ నేపథ్యంలో అక్టోబర్‌లో హర్యానా తదితర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటితోపాటే ఢిల్లీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చని చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. లోక్‌సభ ఎన్నికల్లో వాడిన ఓటింగ్ యంత్రాలను కనీసం 45 రోజుల వరకు వాడకూడదనే నియమం ఉంది. అందువల్ల ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపించాలని నిర్ణయించినా నెలన్నర వరకు పోలింగ్ జరిపే అవకాశం లేదు.
అదీగాక ఎన్నికల ఏర్పాట్ల కోసం కనీసం రెండు నెలల వ్యవధి అవసరం. ఈ రెండు నిబంధనలను బట్టి చూస్తే జూలై వరకు వరకు ఎన్నికలు జరిగేందుకు వీల్లేదు.ఢిల్లీలో అసెంబ్లీని లెఫ్టినెంట్ గవర్నర్ ఎప్పుడు రద్దు చేసి, ఎన్నికలు జరిపించాలనే దానిపై లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో, కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుటుంది. ఢిల్లీ విధాన సభ భవిష్యత్తును ఎన్నికల కమిషన్ లెఫ్టినెంట్ గవర్నర్ విచక్షణకే వదిలివేసింది. కాబట్టి ఈ అంశంపై నిర్ణయానికి రావాల్సింది రాజ్‌నివాస్, కేంద్రమేనని ఒక నాయకుడు అన్నారు. దేశరాజధానిలో ప్రభుత్వం ఏర్పాటు చేయడగానికి మార్గం లేదని పేర్కొంటూ లెఫ్టినెంట్ గవర్నర్ నివేదిక పంపించాల్సి ఉంటుంది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అసెంబ్లీని రద్దు చేయాలని రాష్ట్రపతికి సిఫార్సు చేయగలుగుతుంది. ఈ మేరకు కేంద్రం ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జనిపించాలని ఎన్నికల కమిషన్‌ను కోరుతుంది. తదనుగుణంగా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది.
ఎన్నికలకు సిద్ధమంటున్న మూడు పార్టీలు
కాంగ్రెస్ మద్దతుతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటుచేయాలని ఆప్ ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వచ్చినా తమకు ఆ ఉద్దేశం లేదని, తాజాగా ఎన్నికలకు వెళ్తామని ఆ పార్టీ వివరణ ఇవ్వడం తెలిసిందే. కాంగ్రెస్ లేదా బీజేపీ మద్దతుతో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కొందరు ఆప్ ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని కోరినట్టు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనకు ఆప్ నాయకత్వం అంగీకరించలేదు. కాంగ్రెస్ కూడా ఆప్‌కు మద్దతు ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. తాజాగా ఎన్నికలకు వెళ్లడమే శ్రేయస్కరమని ప్రకటించింది. బీజేపీ కూడా ఇదే వైఖరితో ఉండడంతో తాజా ఎన్నికలు అనివార్యమయ్యాయని చెప్పవచ్చు. గత డిసెంబర్‌లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు 27, బీజేపీకి 31, కాంగ్రెస్‌కు ఎనిమిది స్థానాలు వచ్చాయి. అయితే బీజేపీ ఎమ్మెల్యేల్లో ముగ్గురు ప్రస్తుతం ఎంపీలుగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ జన్‌లోక్‌పాల్ బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ మద్దతు ఇవ్వకపోవడానికి నిరసనగా కేజ్రీవాల్ సర్కారు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక తాజా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏడింటికి ఏడు స్థానాలను గెల్చుకోగా ఆప్ రెండో స్థానానికి పరిమితమయింది.