ఈ ఎన్నికలు బీజేపీకే మోదం | BJP likely to get clear majority in Delhi polls: Survey | Sakshi
Sakshi News home page

ఈ ఎన్నికలు బీజేపీకే మోదం

Published Sat, Dec 13 2014 11:40 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

BJP likely to get clear majority in Delhi polls: Survey

 సాక్షి, న్యూఢిల్లీ: విధానభ ఎన్నికల తేదీ ప్రకటించకపోయినప్పటికీ నగరంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. రానున్న ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లు పోటీపడుతుండగా, కాంగ్రెస్ పోయినపరువు నిలబెట్టుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది.ఆప్ నేతలు ప్రస్తుతం ఎన్నికల ఖర్చు కోసం నిధులు సేకరించే పనిలో తలమునకలై ఉన్నారు. బీజేపీ నేతలు ప్రతి ఓటరును చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ తమ నేతలందరిని ఒకతాటిపై తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓటరు నాడిని తెలుసుకోవడానికి సర్వేలు జరిపే సంస్థలు తమ పని ప్రాంభించాయి.
 
 ఈ ఎన్నికలలో బీజేపీకి భారీ మెజారిటీ లభిస్తుందని, ఆమ్ ఆద్మీ పార్టీకి సీట్లు తగ్గుతాయని, కాంగ్రెస్ పరిస్థితి గత ఎన్నికల కంటే దిగజారుతుందని ఈ సర్వేలు చెబుతున్నాయి. రానున్న ఎన్నికలలో పార్టీల స్థితిగతులను అంచనా వేయడం కోసం ఏబీపీ నీల్సన్ ఇప్పటికే రెండు సర్వేలు జరిపింది. ఈ ఎన్నికలలో బీజేపీ భారీ మెజారిటీతో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఈ రెండు సర్వేలు చెబుతున్నాయి. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో పూర్తి మెజారిటీ సాధించేందుకు 36 సీట్లు కావలసి ఉండగా అంతకన్నా దాదాపు పది స్థానాలు అధికంగా బీజేపీకి వస్తాయన్న ఈ సర్వేల సారాంశం. నవంబర్ నెలలో జరిపిన మొదటి సర్వే బీజేపీకి 46 సీట్లు వస్తాయని అంచనా వేయగా, డిసెంబర్‌లో జరిపిన రెండవ  సర్వే ఒక సీటు తగ్గించి చూపింది. గత ఎన్నికలలో బీజేపీకి 32 సీట్లు వచ్చాయి.
 
 నవంబర్ సర్వే ఆమ్ ఆద్మీ పార్టీకి 18 సీట్లు వస్తాయని చూపగా, డిసెంబర్ సర్వే ఈ పార్టీ స్థానాల సంఖ్య ఒకటి తగ్గనుందని  పేర్కొంది. రెండు సర్వేలు ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పడం విశేషం. గత ఎన్నికలలో ఆప్‌కు 28 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ పరిస్థితి రానున్న ఎన్నికలలో మరింత దిగజారుతుందని సర్వేలు అంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 8 సీట్లు గెలిచింది. రానున్న ఎన్నికలలో ఆ పార్టీకి 5 సీట్లు దక్కుతాయని నవంబర్ సర్వే అంచనా వేయగా, డిసెంబర్ సర్వే నాటికి స్థానాల సంఖ్య ఏడుకు పెరిగింది.
 
 సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది బీజేపీకి ఓటేయడానికి మొగ్గుచూపుతున్నప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మిగతా నేతలందరి కంటే అర్వింద్ కేజ్రీవాల్ వైపు మొగ్గు చూపుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉందని సర్వేలు అంటున్నాయి. కేజ్రీవాల్ తరువాతి స్థానం డా. హర్షవర్ధన్‌కు దక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రజాదరణ తగ్గలేదని కూడా ఈ సర్వేలు చెబుతున్నాయి. నరేంద్ర మోదీ తరువాత ఢిల్లీలో అత్యధిక ప్రజాదరణ గల నేత కేజ్రీవాలేనని ఈ సర్వేలు వెల్లడించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement