ప్రత్యర్థులను ‘ఆప్’తుందా?
- విద్యుత్, నీటి సమస్యలపై పోరాటాలకు వ్యూహాలు
- అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సిద్ధమవుతున్న పార్టీ శ్రేణులు
- ప్రజల నుంచి తప్పని వ్యతిరేకత
సాక్షి, న్యూఢిల్లీ: అనూహ్య విజయంతో దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీసిన ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని రాజకీయ పార్టీగా ఎదిగింది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రధాన పార్టీలతో సై అంటోంది. ఢిల్లీలో పాలన పగ్గాలు చేపట్టిన 49 రోజుల్లోనే వ్యూహాత్మకంగా తప్పుకున్న ఆ పార్టీ నాయకులు భారీ వ్యూహాలతో ముందుకు కదులుతున్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో మరోమారు ఢిల్లీలో తమ సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
గత ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థిగా నిలిచిన బీజేపీ తమను ఇరుకున పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం మరోమారు మంచినీరు, విద్యుత్ సమస్యలను తెరపైకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఆప్ ఎమ్మెల్యేలు లేని నజఫ్‌గఢ్, మటియాలా, ఉత్తమ్‌నగర్, ద్వారకా, పాలం, బవానా, ముండ్కా, సుల్తాన్‌పూర్ మజ్రా, నంగ్లోయి ప్రాంతాల్లో మంచినీటి సమస్య అధికంగా ఉంది. దీనికి తామైతేనే శాశ్వత పరిష్కారం చూపగల్గుతామని భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఈ ఎన్నికల్లోనూ విద్యుత్, మంచినీటి సమస్యలే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్లేందుకు ఆప్‌నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఒకటి రెండు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సూచనలు ఉన్నాయని, వాటికి సిద్ధంగా ఉండాలని కేజ్రీవాల్ సహా ముఖ్యనేతల నుంచి ఆప్ ఎమ్మెల్యేలకు సూచనలు అందినట్టు సమాచారం.
ఇందులో భాగంగా ఆప్ ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండి అధికారులను సమన్వయం చేస్తూ తాగునీటి సమస్యను పరిష్కరిస్తున్నారు. ఆప్ సర్కార్ అధికారంలో లేకపోవడంతో కొన్నిచోట్ల అధికారుల నుంచి విముఖత వ్యక్తం అవుతోంది. ఇటీవల దేవ్లీ ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ ధర్నాలు చేసిమరీ జల్‌బోర్డు అధికారులతో పోరాడి అదనంగా పది ట్యాంకర్లను స్థానికుల అవసరాలకు కేటాయించేలా చేశారు.
తప్పని వ్యతిరేకత...
స్థానికుల సమస్యలు పరిష్కరిస్తామంటూ నియోజకవర్గాలకు వెళుతున్న ఆప్ ఎమ్మెల్యేలకు ప్రజావ్యతిరేకత తప్పడం లేదు. చాలా చోట్ల వారికి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఎంతో నమ్మకంగా ఓట్లు వేస్తే మధ్యలో వదిలి వెళ్లారంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేజ్రీవాల్ చెప్పినట్టు ప్రతి ఇంటికి రోజుకు 700 లీటర్ల మంచినీటి సరఫరా హామీ అన్ని చోట్లా అమలు కావడం లేదు.
అదే విధంగా విద్యుత్ చార్జీలు సైతం వచ్చే నెల నుంచి మోత మోగనున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఆప్ ఎమ్మెల్యేలు స్థానికులకు వీలైనంత ఎక్కువగా అందుబాటులో ఉండి వ్యతిరేకత తగ్గించుకునేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఒకేసారి ఎన్నికల ముందు వెళితే ఇతర పార్టీలకు ఆప్‌కి తేడా లేదన్న అపవాదు వస్తుందనే ఆలోచనతో ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలంతా ఎప్పటికప్పుడు స్థానికుల సమస్యలపై దృష్టి పెడుతున్నారు. ఆప్ వేసే ఎత్తులు జనం ఏమేరకు అర్థం చేసుకుంటారన్నదే అసలు ప్రశ్న.