సాక్షి, బెంగళూరు : రానున్న లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర నాయకులు రాష్ట్రంలో సంబరాలు చేసుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం జగన్నాథ భవ న్ ఎదుట డప్పులు వాయించి, టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఇక ఢిల్లీలో జెండా ఎగరేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కర్ణాటక శాఖలో సంబరాలు అంబరాన్నంటాయి.
నగరంలోని బ్రిగేడ్ రోడ్‌లో గుమికూడిన ఆప్ కార్యకర్తలు పార్టీ చిహ్నమైన చీపురు (ఝాడూ) చేతబట్టి ‘ఝాడు ఝాడు’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం ఎదురు కావడంతో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒక్కరు కూడా మీడియా ముందుకు రావడానికి ఇష్టపడలేదు. సీఎం సిద్ధరామయ్య మాత్రం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనగా ఎన్నికల ఫలితాల పై మీడియా ప్రతిస్పందన అడుగ్గా ముక్తసరిగా సమాధానమిచ్చారు. దీంతో బెంగళూరులోని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం బోసిపోయి కనిపించింది. ఈ సందర్భంగా ఫలితాలపై రాష్ట్ర నాయకులు ఏమన్నారంటే....
బీజేపీ విజయమే తప్ప మోడి గెలుపు కాదు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
ఆదివారం వెలువడిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఇది బీజేపీ విజయమే తప్ప నరేంద్రమోడి గెలుపు ఎంత మాత్రం కాదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బీజేపీ విజయానికి స్థానిక నాయకత్వమే కారణం తప్ప మోడి ఫ్యాక్టర్ పనిచేసిందని చెప్పడం సరికాదు. ఈ ఫలితాలు కాంగ్రెస్ ప్రతిష్టను మసకబార్చ లేవని నా అభిప్రాయం. రానున్న లోక్‌సభ ఎన్నికలకు ఈ ఎన్నికల ఫలితాలు దిక్సూచి కాబోవు. లోక్‌సభ ఎన్నికల సమయంలో దేశ వ్యాప్తంగా ఉన్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వ పరిపాలన వంటి అంశాలను ఓటర్లు పరిగణలోకి తీసుకుంటే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం రాష్ట్రంలోని పరిస్థితులు, స్థానిక నేతల చరిష్మాను పరిగణలోకి తీసుకుంటారు. అందువల్ల ఈ ఫలితాలను రానున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో పోల్చడం సరికాదు.
ఈ గెలుపు మోడీదే: బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి
ఆదివారం వెలువడిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సాధించిన విజయంలో మోడీ భాగస్వామ్యం ఎక్కువగా ఉంది. నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినందుకు ప్రజలు బీజేపీకి అందించిన బహుమానమే ఇది. మోడీ ప్రభంజనంతో పాటు స్థానిక నేతల నాయకత్వ పటిమ కూడా తోడవడంతో మా పార్టీ భారీ విజయాలను సొంతం చేసుకోగలిగింది. దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని చెప్పడానికి ఇదో ఉదాహరణ అని భావిస్తున్నాను. ఈ విజయం రాష్ట్రంలోని బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో కూడా బీజేపీ ఎక్కువ స్థానాలు దక్కించుకుంటుంది.
మార్పునకు మొదటి మెట్టు: ‘ఆప్’ రాష్ట్ర నాయకుడు పృధ్వీరెడ్డి
స్వచ్ఛతతో కూడిన రాజకీయాలకు మొదటి బీజం పడింది. ఇదే పరిస్థితి కొనసాగుతుంది. యువతతో పాటు అన్ని వర్గాలకూ ఉపయుక్తకరంగా ఉండే విషయాలను మానిఫెస్టోలో ప్రచురించడం వల్లే ఈ విజయం దక్కింది. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీచేస్తాం. ఇందుకోసం పార్లమెంటుకు ఒక మ్యానిఫెస్టో రూపొందించనున్నాం. ఎటువంటి నేర చరిత లేని అభ్యర్థులనే ఎన్నికల బరిలో నిలబెడతాం.
ఎవరేమన్నారంటే..
Published Mon, Dec 9 2013 3:16 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement
Advertisement