
నేను తప్పుచేస్తే శిక్షకు సిద్ధం
తప్పు చేస్తే పార్టీ తీసుకునే ఎలాంటి క్రమశిక్షణా చర్యలకైనా తాను కట్టుబడి ఉంటానని ఆమ్ఆద్మీపార్టీ సీనియర్ నేత యోగేంద్రయాదవ్ అన్నారు.
తప్పు చేస్తే పార్టీ తీసుకునే ఎలాంటి క్రమశిక్షణా చర్యలకైనా తాను కట్టుబడి ఉంటానని ఆమ్ఆద్మీపార్టీ సీనియర్ నేత యోగేంద్రయాదవ్ అన్నారు. బుధవారం సాయంత్రంలోగా ఓ మంచి వార్త ఉంటుందని నమ్ముతున్నానని చెప్పారు. పార్టీకి చెందిన రాజకీయ వ్యవహారాల కమిటీలో ఉన్నానా లేదా అనేది విషయమే కాదని, కమిటీ పార్టీలో ఒక భాగం మాత్రమేనని పార్టీనే తనకు ముఖ్యమని ఆయన చెప్పారు. జాతీయ కన్వీనర్ హోదా నుంచి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను తొలగించే కుట్రలు చేస్తున్నారని ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్పై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే బుధవారం పార్టీ అంతర్గత సమావేశం జరుగుతుంది. ఇందులో వీరిద్దరిని ఈ కమిటీ నుంచి తప్పిస్తారన్న విశ్వసనీయ సమాచారం ఉంది. అదీ కాకుండా అతి ముఖ్యమైన ఈ సమావేశానికి కేజ్రీవాల్ హాజరుకాకపోవడం కూడా మరింత అనుమానాలకు తావిస్తోంది. పార్టీలో చాలామంది కేజ్రీవాల్ మద్దతు దారులు ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్ను తొలగించాలనే డిమాండ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. వీరి వ్యవహారంపై కేజ్రీవాల్ కూడా కాస్త అసహనం వ్యక్తం చేస్తూ ఇదంతా ఎటూ తేలని రోత పుట్టించే అంశంగా అభివర్ణించారు కూడా.