ఆప్ నుంచి ప్రశాంత్‌భూషణ్, యోగేంద్ర ఔట్
న్యూఢిల్లీ: అసమ్మతి నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారంటూ సోమవారం రాత్రి వారిద్దరిని పార్టీ నుంచి బహిష్కరించింది. వీరితోపాటు అనంద్ కుమార్, అజిత్ ఝాలను కూడా బహిష్కరిస్తున్నట్టు తెలిపింది. వీరికి జాతీయ క్రమశిక్షణ కమిటీ రెండ్రోజుల కిందటే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆప్ ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగాన్ని పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని వారు సోమవారమే సమాధానమిచ్చారు.
మార్చి 28న జరిగిన అక్రమ సమావేశం తర్వాత క్రమశిక్షణ కమిటీ ఏర్పాటైందని.. దానికి తమ నుంచి సమాధానం కోరే అధికారం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కేజ్రీవాల్ తొలి విడత ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు ఆ పదవికి రాజీనామా చేసే ముందు పార్టీ కార్యవర్గంలో ఎవరినీ సంప్రదించలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. వీరి జవాబుతో కమిటీ సంతృప్తి చెందలేదని, అందుకే బహిష్కరణ వేటు వేసిందని పార్టీ ప్రతినిధి దీపక్ బాజ్‌పాయి తెలిపారు.