హత్య, ఆత్మహత్య మధ్య ఆప్
సందర్భం
ఒక నైతిక, రాజకీయ నిర్మాణంగా ఆప్ చావును దాని ఎన్నికల యంత్రాంగం ఎంత కాలం పాటు ఆపగలుగుతుందో మనం చెప్పలేం. అది హత్యకు గురి అవుతుందా? లేదా ఆత్మహత్య చేసుకుం టుందా అనేది మనకు తెలియదు. ఏది జరిగినా అది ప్రజాస్వామ్యానికి మాత్రం మేలు చేయదు.
ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఇప్పుడొక విచిత్రమైన, విషాదకర సన్నివేశాన్ని చూస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ను అంతం చేసేందుకు బీజేపీ పూర్తి స్థాయి యుద్ధాన్ని నిర్వహిస్తోంది. కానీ అందులో అది విజయం సాధించలేకపోవచ్చు. మరోవైపు ఆప్ నాయకత్వం స్వీయవినాశనం అనే ప్రక్రియలో తలమునకలుగా ఉంది. హత్యా? లేక ఆత్మహత్యా? ఈ రెండిం టిలో ఏది ముందు జరుగుతుందో మనం ఊహించలేం! ప్రజాస్వామ్య ప్రయోజనాల రీత్యా ఈ రెంటిలో ఏది ఎక్కువ చెరుపు చేస్తుందో కూడా చెప్పలేం.
ఆప్ తనకు పోటీదారు కాగలదనే విషయాన్ని బీజేపీ 2013లోనే పసిగట్టింది. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ తమకు దీర్ఘకాలిక ప్రమాదాన్ని తెచ్చిపెట్టగలిగే స్థితిలో లేదని, కానీ ఆదర్శవాదానికి ప్రాతినిధ్యం వహించే ఈ కొత్త పార్టీతో మాత్రం తమకు ముప్పు పొంచి ఉందని వారు ఆనాడే గ్రహించారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు తర్వాత ఆప్‌ను దెబ్బ తీయడానికి బీజేపీ చట్టపరమైన, చట్టవిరుద్ధమైన అధికారాలన్నింటినీ ప్రయోగించింది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల్లో ఫెడరల్ సూత్రాలకు స్పష్టమైన ఉల్లంఘన.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రాజ్యాంగబద్ధమైన అధికారిగా కన్నా కేంద్ర ప్రభుత్వ ఏజెంటుగానే ఎక్కువ పని చేశాడనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన అనేక రోజువారీ కార్యక్రమాలను సైతం నజీబ్ జంగ్ అడ్డుకున్నారు. ఆప్ ఎమ్మెల్యేలు పాల్పడిన నిజమైన, ఊహాజనితమైన నేరాలన్నింటి పట్ల ఢిల్లీ పోలీసులు ఎంత క్రియాశీలకంగా స్పందించారంటే మరే రాష్ట్ర పోలీసులూ, మరే ఇతర పాలక పార్టీ పట్లా అంతగా స్పందించలేదు. పోలీసులు ఇవే ప్రమాణాలను అందరి పట్లా సమానంగా వర్తింపజేసినట్టయితే బీజేపీకి చెందిన డజన్ల కొద్ది ఎంపీలూ, వందల కొద్ది ఎమ్మెల్యేలు ఈపాటికి జైలులో ఉండాల్సింది. ఆప్ ఖాతాల్లో ఎలాగైనా సరే అవకతవకల్ని తవ్వితీయడం కోసం ఆదాయపన్ను శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ వేధింపులనే భావించాలి. స్వయంగా అక్రమ విదేశీ నిధుల స్వీకరణ ఆరోపణలెదుర్కొంటున్న బీజేపీ ఇతరులపై వేలెత్తి చూపడమంటే అది గురివింద గింజ సామెత వంటిదే. ప్రభుత్వ నిధులను పార్టీ ప్రచారానికి అక్రమంగా వినియోగించినందుకు ఆప్‌కు రూ. 87 కోట్ల జరిమానా విధిం చిన కమిటీ సిఫార్సు కూడా పక్షపాత వైఖరికి అతీతమైంది కాదు. అరవింద్ కేజ్రీవాల్ తదితరులపై అరుణ్ జైట్లీ పెట్టిన పరువు నష్టం కేసు విచారణ క్రమం కూడా అసాధారణ వేగంతో నడుస్తోందని చెప్పాలి. అధికార పార్టీ పన్నిన వ్యూహంలో భాగంగా ఆప్‌పై తలపెట్టిన ఈ ఏకపక్షమైన చర్యలను గోరంతలు కొండంతలు చేసి చూపడానికి మీడియాలోని ఒక సెక్షన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది.
బీజేపీ తన ఉక్కు పిడికిలిని మరింత గట్టిగా బిగించబోనున్నదనే సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి. షుంగ్లూ కమిటీ నివేదికను విడుదల చేయడాన్ని బట్టి ఇక వరుసగా అనేక చట్టపరమైన చర్యలుంటాయనేది తేటతెల్లం. పార్టీ కార్యాలయం కేటాయింపును రద్దు చేయడమనేది చాలా చిన్న చర్య. దీని తర్వాత కొందరు మంత్రులపైనా, ఢిల్లీ ప్రభుత్వంలోని కీలక అధికారులపైనా క్రిమినల్ కేసులు నమోదు చేసే పరంపర మొదలు కావచ్చు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆప్ అభ్యర్థికి ఓటమి ఎదురైంది. ఈ నెల 23న జరుగబోయే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడ ఆప్ ఓటమి పాలు కావచ్చు. అంతా బీజేపీ ఊహ ప్రకారం జరిగితే అది ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడంపై కూడా ఆలోచించవచ్చు.
సాధారణంగా ఒక భారీ పాలక శక్తి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నప్పుడు కొత్త పార్టీ పట్ల సానుభూతి, సహకారం వ్యక్తం కావాలి. రోజు రోజుకూ కుదించుకుపోతున్న ఆప్ గట్టి సమర్థకుల సమూహం ఇంకా ఇదే నమ్ముతోంది. కానీ చీమ సైతం ఏనుగును ఢీకొనగలదనే కథను నమ్మడానికి ఇప్పుడెవరూ సిద్ధంగా లేరు. ఆప్ ప్రధానంగా మూడు వాగ్దానాలు చేసింది: రాజకీయాలలో నైతికత, సుపరిపాలన, ఓటర్లు కల్పిం చిన బలమైన అధికారం. రాజకీయాలలో నైతికత విషయంలో అది చాలా కాలం క్రితమే అర్హతను కోల్పోయింది. నమ్మదగని అభ్యర్థులను చేర్చుకోవడం, పార్టీ నిబంధనావళిని బేఖాతరు చేయడం, తమ సొంత లోక్‌పాల్‌నే పార్టీలోంచి అవమానకరంగా గెంటెయ్యడం వంటివన్నీ ఒక నైతిక నిర్మాణంగా ఆప్ మరణానికి ముందస్తు సూచికలే.
సుపరిపాలన హామీ కూడా పూర్తిగా అబద్ధంగా తేలిపోయింది. పరి పాలన అనే వ్యవహారానికి సంబంధించిన మౌలిక వ్యాకరణాన్నే ఆప్ ప్రభుత్వం అర్థం చేసుకోలేదని పదే పదే రుజువయింది. ఆప్ ప్రభుత్వం ఢిల్లీ పరిపాలన విషయంలో రాజ్యాంగ నియమాలను ఎలా ఉల్లంఘించిందో ఢిల్లీ హైకోర్టు గతంలోనే వెల్లడించింది. ఈసీ ఎదుట విచారణలో ఉన్న లాభసాటి పదవులకు సంబంధించిన కేసు.. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకంలో ఈ ప్రభుత్వం చట్టాన్ని ఎలా తోసిరాజందో తెలి యచెబుతోంది. నిజాయితీపరులుగా పేరున్న ముగ్గురు రిటైర్డ్ అధికారు లతో కూడిన షుంగ్లూ కమిటీ పలు వ్యవహారాల్ని బయటపెట్టింది.
ఆశ్రిత పక్షపాతం, అధికార దుర్వినియోగానికి సంబంధించిన అనేక వ్యవహారాలను షుంగ్లూ కమిటీ బయటపెట్టింది. స్వయంగా సీఎం నిబంధనలను ఉల్లంఘిస్తూ తన దగ్గరి బంధువును మొదట రెసిడెంట్ డాక్టర్‌గా, ఆ తర్వాత ఆరోగ్యశాఖ మంత్రికి ఓఎస్‌డీగా నియమిం చారు. చాలామంది పార్టీ కార్యకర్తలకు అక్రమంగా ప్రయోజనాలు చేకూరుస్తూ లాభదాయకమైన పదవులు కట్టబెట్టారు. పైపెచ్చు, అవినీతి, ఫోర్జరీ, నైతిక పతనం తదితర ఆరోపణలతో పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది.
బీజేపీతో ఢీకొనగలిగే శక్తి తనకే ఉందని చెప్పుకున్న ఆప్‌కు పంజాబ్, గోవా ఫలితాలతో గర్వభంగం జరిగింది. ఓటమి తరువాత ఈవీఎంలను నిందించే హాస్యాస్పదమైన ఎత్తుగడను చేపట్టారు. ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలలో ఇంటి పన్నును రద్దు చేస్తామనే హామీ కూడా ఆప్‌లో పేరుకుపోయిన నిరాశకే నిదర్శమని భావించవచ్చు. ఒక నైతిక, రాజకీయ నిర్మాణంగా ఆప్ చావును దాని ఎన్నికల యంత్రాంగం ఎంత కాలం పాటు ఆపగలుగుతుందో మనం చెప్పలేం. అది హత్యకు గురవుతుందా లేదా ఆత్మహత్య చేసుకుంటుందా అనేది కూడా మనకు తెలి యదు. ఎలా జరిగినా అది ప్రజాస్వామ్యానికి మాత్రం మేలు చేయదు.
- యోగేంద్ర యాదవ్
వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు
మొబైల్ : 98688 88986 Twitter : @_YogendraYadav