ఆప్‌లో ముదురుతున్న సంక్షోభం
ఆప్ క్రమశిక్షణ కమిటీ నుంచి ప్రశాంత్‌భూషణ్ తొలగింపు
అంతర్గత లోక్‌పాల్ రాందాస్‌కు కూడా ఉద్వాసన
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో సంక్షోభం ముది రింది. పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి అసమ్మతి నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లను తొలగించిన మర్నాడు.. ఆదివారం ప్రశాంత్ భూషణ్‌ను పార్టీ క్రమశిక్షణ కమిటీ నుంచి కూడా తొలగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. అలాగే, పార్టీ అంతర్గత లోక్‌పాల్ పదవి నుంచి నేవీ మాజీ చీఫ్ ఎల్.రాందాస్‌నూ సాగనంపింది. అది ఆయనను తొలగించడం కాదని, ఆయన పదవీకాలం ముగిసినందున కొత్త లోక్‌పాల్ కమిటీని ఎన్నుకున్నామని సీనియర్ నేత సంజయ్ సింగ్ చెప్పారు. కొత్త కమిటీలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు దిలీప్‌కుమార్, రాకేశ్ సిన్హా, విద్యావేత్త ఎస్పీ వర్మలకు స్థానం కల్పించారు. ముందుగా చెప్పకుండా తనను తొలగించడంపై రాందాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
లోక్‌పాల్‌గా మరో ఐదేళ్లు కొనసాగాలని గతనెలలోనే వారు తనను కోరారని చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి రాందాస్ అంతర్గత లోక్‌పాల్‌గా ఉన్నారు. ప్రశాంత్‌ను తొలగించిన అనంతరం.. దినేశ్ వాఘేలా అధ్యక్షుడిగా కేజ్రీవాల్‌కు నమ్మకస్తులైన ఆశిశ్ ఖేతన్, పంకజ్ గుప్తా సభ్యులుగా పార్టీ క్రమశిక్షణ కమిటీని కూడా పునర్వ్యవస్థీకరించారు. భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఏప్రిల్ 22న నిర్వహించే పార్లమెంట్ ఘెరావ్ బాధ్యతలను ఇల్యాస్ ఆజ్మీ, ప్రేమ్‌సింగ్ పహడి తదితరులు సభ్యులుగా ఉన్న కమిటీకి అప్పగించారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ బాధ్యతల నిర్వహణను సంజయ్‌సింగ్ నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు. ప్రశాంత్, యోగేంద్రలను జాతీయ కార్యవర్గం(ఎన్‌ఈ) నుంచి తొలగించడంతో ఇక మిగిలింది వారిని పార్టీ నుంచి పంపించేయడమేనని భావిస్తున్నాయి. మరోపక్క.. తాము కొత్త పార్టీని ప్రారంభించే అవకాశముందని ప్రశాంత్, యోగేంద్రలు మరోసారి సంకేతాలిచ్చారు. వారు ఆదివారం తమ అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
మిత్రులే ద్రోహం చేశారు: కేజ్రీవాల్
శనివారం జాతీయ కార్యవర్గ మండలి భేటీలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రసంగాన్ని(ఎడిటెడ్ వీడియో) పార్టీ ఆదివారం యూట్యూబ్‌లో, ట్వీటర్‌లో పోస్ట్ చేసింది. అందులో.. ‘ఢిల్లీ మొత్తం మన వెంట నిలిచిన సమయంలో కొందరు మిత్రులు మనకు వెన్నుపోటు పొడిచారు. ఢిల్లీ ఎన్నికల్లో మన ఓటమికి కుట్రలు పన్నారు. వలంటీర్లను ప్రచారం కోసం ఢిల్లీ రాకుండా అడ్డుకున్నారు. విరాళాలు రాకుండా చూశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోతేనే పార్టీకి, కేజ్రీవాల్‌కు బుద్ధొస్తుందని ప్రశాంత్ ఎన్నికల ముందు మనలోనే చాలామందితో అన్నారు. నాకు వ్యతిరేకంగా యోగేంద్ర పనిచేస్తున్నారని రెండు ప్రముఖ ఆంగ్ల వార్తా చానళ్ల ఎడిటర్లు నాతో చెప్పారు. ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ తన మొదటి చాయిస్ కాదని చెప్పిన ప్రశాంత్.. అప్పుడే పార్టీని వదిలి ఎందుకు వెళ్లలేదు? నా సొంత మనుషులే నా నిజాయితీని శంకించారు. ప్రశాంత్, యోగేం ద్రలతో పోరులో నా ఓటమిని అంగీకరిస్తున్నా. ఎవరు కావాలో మీరే నిర్ణయించండి. నన్నో, లేక వారినో.. ఎన్నుకోండి’ అని ఉద్వేగంగా కేజ్రీవాల్ ప్రసంగించారు.