Leaders of disagreement
-
ఆప్‌లో ముదురుతున్న సంక్షోభం
ఆప్ క్రమశిక్షణ కమిటీ నుంచి ప్రశాంత్‌భూషణ్ తొలగింపు అంతర్గత లోక్‌పాల్ రాందాస్‌కు కూడా ఉద్వాసన న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో సంక్షోభం ముది రింది. పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి అసమ్మతి నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లను తొలగించిన మర్నాడు.. ఆదివారం ప్రశాంత్ భూషణ్‌ను పార్టీ క్రమశిక్షణ కమిటీ నుంచి కూడా తొలగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. అలాగే, పార్టీ అంతర్గత లోక్‌పాల్ పదవి నుంచి నేవీ మాజీ చీఫ్ ఎల్.రాందాస్‌నూ సాగనంపింది. అది ఆయనను తొలగించడం కాదని, ఆయన పదవీకాలం ముగిసినందున కొత్త లోక్‌పాల్ కమిటీని ఎన్నుకున్నామని సీనియర్ నేత సంజయ్ సింగ్ చెప్పారు. కొత్త కమిటీలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు దిలీప్‌కుమార్, రాకేశ్ సిన్హా, విద్యావేత్త ఎస్పీ వర్మలకు స్థానం కల్పించారు. ముందుగా చెప్పకుండా తనను తొలగించడంపై రాందాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. లోక్‌పాల్‌గా మరో ఐదేళ్లు కొనసాగాలని గతనెలలోనే వారు తనను కోరారని చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి రాందాస్ అంతర్గత లోక్‌పాల్‌గా ఉన్నారు. ప్రశాంత్‌ను తొలగించిన అనంతరం.. దినేశ్ వాఘేలా అధ్యక్షుడిగా కేజ్రీవాల్‌కు నమ్మకస్తులైన ఆశిశ్ ఖేతన్, పంకజ్ గుప్తా సభ్యులుగా పార్టీ క్రమశిక్షణ కమిటీని కూడా పునర్వ్యవస్థీకరించారు. భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఏప్రిల్ 22న నిర్వహించే పార్లమెంట్ ఘెరావ్ బాధ్యతలను ఇల్యాస్ ఆజ్మీ, ప్రేమ్‌సింగ్ పహడి తదితరులు సభ్యులుగా ఉన్న కమిటీకి అప్పగించారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ బాధ్యతల నిర్వహణను సంజయ్‌సింగ్ నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు. ప్రశాంత్, యోగేంద్రలను జాతీయ కార్యవర్గం(ఎన్ఈ) నుంచి తొలగించడంతో ఇక మిగిలింది వారిని పార్టీ నుంచి పంపించేయడమేనని భావిస్తున్నాయి. మరోపక్క.. తాము కొత్త పార్టీని ప్రారంభించే అవకాశముందని ప్రశాంత్, యోగేంద్రలు మరోసారి సంకేతాలిచ్చారు. వారు ఆదివారం తమ అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మిత్రులే ద్రోహం చేశారు: కేజ్రీవాల్ శనివారం జాతీయ కార్యవర్గ మండలి భేటీలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రసంగాన్ని(ఎడిటెడ్ వీడియో) పార్టీ ఆదివారం యూట్యూబ్‌లో, ట్వీటర్లో పోస్ట్ చేసింది. అందులో.. ‘ఢిల్లీ మొత్తం మన వెంట నిలిచిన సమయంలో కొందరు మిత్రులు మనకు వెన్నుపోటు పొడిచారు. ఢిల్లీ ఎన్నికల్లో మన ఓటమికి కుట్రలు పన్నారు. వలంటీర్లను ప్రచారం కోసం ఢిల్లీ రాకుండా అడ్డుకున్నారు. విరాళాలు రాకుండా చూశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోతేనే పార్టీకి, కేజ్రీవాల్‌కు బుద్ధొస్తుందని ప్రశాంత్ ఎన్నికల ముందు మనలోనే చాలామందితో అన్నారు. నాకు వ్యతిరేకంగా యోగేంద్ర పనిచేస్తున్నారని రెండు ప్రముఖ ఆంగ్ల వార్తా చానళ్ల ఎడిటర్లు నాతో చెప్పారు. ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ తన మొదటి చాయిస్ కాదని చెప్పిన ప్రశాంత్.. అప్పుడే పార్టీని వదిలి ఎందుకు వెళ్లలేదు? నా సొంత మనుషులే నా నిజాయితీని శంకించారు. ప్రశాంత్, యోగేం ద్రలతో పోరులో నా ఓటమిని అంగీకరిస్తున్నా. ఎవరు కావాలో మీరే నిర్ణయించండి. నన్నో, లేక వారినో.. ఎన్నుకోండి’ అని ఉద్వేగంగా కేజ్రీవాల్ ప్రసంగించారు. -
వారిద్దరిపై బహిష్కరణ వేటు
ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లను జాతీయ కార్యవర్గం నుంచి తొలగించిన ఆప్ హైడ్రామా మధ్య జాతీయ మండలి సమావేశంలో తీర్మానం భేటీలో భూషణ్, యాదవ్‌పై కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు గూండాలు, బౌన్సర్లతో మా మద్దతుదారులను కొట్టించారు: యాదవ్ పార్టీకి రాజీనామా చేసిన మేధాపాట్కర్ న్యూఢిల్లీ: ఊహించిందే జరిగింది. సామాన్యుడి పార్టీలో సంక్షోభం చివరికి అసమ్మతి నేతల బహిష్కరణకు దారితీసింది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సీనియర్ నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లను పార్టీలో అత్యున్నత విభాగమైన జాతీయ కార్యవర్గం నుంచి తొలగించారు. తీవ్ర ఉద్రిక్తత, హైడ్రామా మధ్య వారి బహిష్కరణ తీర్మానానికి జాతీయ మండలి ఆమోదం తెలిపింది. శనివారమిక్కడ జరిగిన జాతీయ మండలి సమావేశంలో 300 మందికిపైగా సభ్యులను ఉద్దేశించి కేజ్రీవాల్ గంటకుపైగా మాట్లాడారు. వారిద్దరు (ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్) కావాలో తాను కావాలో తేల్చుకోవాలని సూచించి సమావేశం నుంచి నిష్ర్కమించారు. ఆ వెంటనే కేజ్రీవాల్ సన్నిహితుడు మనీశ్ సిసోడియా.. ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌తోపాటు వారి అనుచరులు ఆనంద్ కుమార్, అజిత్ ఝాలను జాతీయ కార్యవర్గం నుంచి తొలగించే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి 247 మంది మద్దతు తెలపగా, 10 మంది వ్యతిరేకించారని ఆప్ జాతీయ కార్యదర్శి పంకజ్ గుప్తా తెలిపారు. 54 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ: యాదవ్, భూషణ్ తమ బహిష్కరణపై ప్రశాంత్, యోగేంద్ర అగ్గిమీద గుగ్గిలమయ్యారు. జాతీయ మండలి సమావేశం రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట విరుద్ధమని మండిపడ్డారు. ‘‘కేజ్రీవాల్ నియంత లా వ్యవహరిస్తున్నారు. సమావేశానికి ఆయన అనుచరులు గూండాలను, బౌన్సర్లను తీసుకువచ్చారు. తీర్మానాన్ని వ్యతిరేకించిన సభ్యులను వారితో కొట్టించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. అంతావ్యూహం ప్రకారం జరిపించారు. నిబంధనలన్నింటినీ తుంగలోకి తొక్కి నిమిషాల్లోనే తీర్మానాన్ని ఆమోదించినట్లు ప్రకటించారు. దీనిపై కోర్టు లేదా ఎన్నికల సంఘానికి వెళ్తాం. లేదా జాతీయ మండలి సమావేశాన్ని మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్‌ను ముందుంచుతాం’ అని వారిరువురు చెప్పారు. ఘర్షణ వాతావరణం నెలకొంటుందన్న సాకు చూపి భేటీకి రావొద్దం టూ ఆప్ అంతర్గత లోక్‌పాల్ అడ్మిరల్ ఎల్ రాందాస్(రిటైర్డ్)కు శుక్రవారం ఫోన్లో ఎస్ఎంఎస్ పంపారన్నారు. దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆయన పార్టీ నాయకత్వానికి లేఖ కూడా రాశారన్నారు. ఈ మేరకు ఆయన రాసిన లేఖను యాదవ్ వెల్లడించారు. ‘జాతీయ మండలి భేటీలో కేజ్రీవాల్ గంట మాట్లాడారు. మమ్మల్ని తొలగించకపోతే తప్పుకుంటానని చెప్పారు. తర్వాత ఓ పది మంది ఎమ్మెల్యేలు మేం ద్రోహులమంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. 7 నిమిషాలపాటు ఈ డ్రామా సాగింది. ఈ సమయంలో కేజ్రీవాల్ విగ్రహంలా నిలబడి వారిని చూస్తుండిపోయారు’’అని యాదవ్ చెప్పారు. ఆద్యంతం హైడ్రామా.. జాతీయ మండలి సమావేశ ప్రాంగణమైన కలిస్తా రిసార్ట్ వద్ద హైడ్రామా నడిచింది. మండలి సమావేశానికి ముందు 20 నిమిషాల పాటు యోగేంద్ర యాదవ్ అక్కడ ధర్నాకు దిగారు. కేజ్రీవాల్‌ను వ్యతిరేకిస్తున్నవారిని సమావేశ మందిరంలోకి అనుమతించడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరువర్గాలకు చెందిన మద్దతుదారులు పెద్దఎత్తున గుమికూడారు. పరస్పర వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులు, ఆర్ఏఎఫ్ బలగాలను మోహరించారు. సమావేశానికి ఆహ్వానం లేనివారిని లోనికి అనుమతించలేదు. బహిష్కరణ వార్త తెలియగానే కేజ్రీవాల్ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. కేజ్రీవాల్ అనుచరులు యాదవ్, భూషణ్ వైపు వస్తుండడంతో పోలీసులు వారిద్దరికి రక్షణగా నిలిచారు. వాళ్లా.. నేనా..: కేజ్రీవాల్ జాతీయ మండలి భేటీలో కేజ్రీవాల్ ఆవేశంగా మాట్లాడారు. ప్రశాంత్, యోగేంద్రలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాళ్లిద్దరో తానో తేల్చుకోవాలన్నారు. వారిద్దరుంటే తానే పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తానని అన్నట్టు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదనను మండలి తిరస్కరించింది. ఆప్ ప్రస్థానం, పార్టీ విజయాలపైనా కేజ్రీవాల్ సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘ప్రశాంత్, ఆయన తండ్రి శాంతి భూషణ్, యోగేంద్ర మొన్నటి ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవాలని చూశారు. శ్రేణులన్నీ గెలుపు కోసం పోరాడితే వీరు పార్టీని ఓడిచేందుకు యత్నించారు’ అని కేజ్రీవాల్ అన్నట్టు పార్టీ నేత ఒకరు చెప్పారు. పార్టీ తమాషాలా మారిపోయింది: మేధా పాట్కర్ ఆప్ ఓ తమాషా పార్టీలా మారిపోయిందని సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ విమర్శించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ముంబైలో ప్రకటించారు. ‘ఈరోజు ఢిల్లీలో పార్టీ జాతీయ మండలి భేటీలో పరిణామాలు దురదృష్టకరం. ఇలాంటివి ఆప్‌లో కూడా జరుగుతాయనుకోలేదు. ప్రశాంత్ భూషణ్, యాదవ్, ఆనంద్‌కుమార్ పార్టీ ఉన్నతి కోసం కృషి చేశారు. వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారో లేదో నాకు తెలియదు. కానీ ఏదైనా సమస్య ఉంటే చర్చల తర్వాత ఓ నిర్ణయానికి రావాలి. కానీ ఈరోజు జరిగిన దాన్ని ఖండిస్తున్నా. పార్టీలో రాజకీయ విలువలను తొక్కేశారు’’ అని ఆమె పేర్కొన్నారు. కేజ్రీవాల్, ఆయన టీంపై తనకు ఎలాంటి కోపం లేదని, ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పునకు అనుగుణంగా ఆయన పని చేయాలన్నారు. -
‘ఆప్’లో రాజీ చర్చలు విఫలం
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో సంక్షోభానికి తెరపడే సూచనలు కనిపించడం లేదు. అసమ్మతి నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్‌లతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వర్గం జరిపిన రాజీ చర్చలు విఫలమయ్యాయి. చర్చల్లో తమ వాదనను అస లు వినిపించుకోలేదని చర్చలు విఫలమైన నేపథ్యంలో అసమ్మతి నేతలు కేజ్రీవాల్‌కు గురువారం ఒక బహిరంగ లేఖ రాశారు. అందులో.. ‘మర్యాదగా జాతీయ కార్యవర్గానికి రాజీనామా చేయండి లేదా తొలగింపునకు సిద్ధం కండి అని చర్చల సందర్భంగా మీ తరఫువారు మాకు చెప్పారు. ఇది మీ మాటేనని వారు స్పష్టం చేశారు. మేము సభ్యులుగా ఉన్న జాతీయ కార్యవర్గానికి కన్వీనర్‌గా ఉండబోనని మీరు పట్టుబడ్తున్నారనీ చెప్పారు. మేమేం చేశామని మాపై మీకు ఇంత వ్యక్తిగత కక్ష అరవింద్ భాయ్!. నిజమేంటో మీ మనస్సాక్షికి తెలుసు. మిమ్మల్నెప్పుడూ మేం పదవి, అధికారం, సాయం ఏదీ కోరలేదు. పార్టీలో ప్రజాస్వామ్యానికి సంబంధించి మా డిమాండ్లను తీరిస్తే రాజీనామాకు సిద్ధమని కూడా చెప్పాం మీ అపాయింట్మెంట్ కోరి 10 రోజులైంది. మీ నుంచి స్పందన లేదు. అందుకే ఈ బహిరంగ లేఖ రాయాల్సి వచ్చింది’ అని వారు పేర్కొన్నారు. కాగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ గురువారం కేజ్రీవాల్ నివాసంలో సమావేశమై, పార్టీలోని అంతర్గత విబేధాలపై చర్చించింది. యాదవ్, భూషణ్‌లకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదని ఆ భేటీలో కేజ్రీవాల్ మద్దతుదారులు పట్టుబట్టారని సమాచారం. -
టీడీపీలో ముసలం
* మహిళా పెత్తనాన్ని సహించలేకపోతున్న ఓ వర్గం * జిల్లా అధ్యక్షురాలి తీరుపై అసంతృప్తి * త్వరలో చంద్రబాబు వద్దకు అసమ్మతినేతలు సాక్షి, సంగారెడ్డి: వలసలు, వరుస ఓటమితో మూలుగుతున్న జిల్లా టీడీపీ నేతల వర్గపోరుతో మరింత డీలా పడుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షురాలు పని తీరే సరిగా పార్టీలోని ఒక వర్గం నేతలు అధ్యక్షుడు చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీ అధ్యక్షురాలు శశికళాయాదవ్ సిద్దిపేట డివిజన్‌కు చెందిన ఇద్దరు సీనియర్ నాయకుల కనుసన్నల్లోనే పనిచేస్తూ తమను విస్మరిస్తున్నారని వారు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఇది వరకే టీడీపీ పరిస్థితిపై అధిష్టానం అసంతృప్తితో ఉంది. ఇటీవల జరిగి అన్ని ఎన్నికల్లోనూ టీడీపీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. దీనికితోడు ఇటీవల పార్టీ నుంచి వలసలు పెరుగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ ఆకర్ష్మంత్రంతో టీడీపీ జిల్లా, మండల స్థాయి నేతలు గులాబీ గూటికి చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కేడర్‌లో మనోధైర్యం నింపి పార్టీని నడపాల్సిన జిల్లా ముఖ్యనేతలు గ్రూపు తగాదాలతో బజారున పడుతున్నారు. ప్రస్తుతం పార్టీ నేతలు రెండు వర్గాలు విడిపోయినట్లు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షురాలు పనితీరుపై ఓవర్గం నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. గజ్వేల్‌కు, దుబ్బాకకు చెందిన సీనియర్ నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి, బక్కి వెంకటయ్య కనుసన్నల్లోనే పార్టీ జిల్లా అధ్యక్షురాలు పని చేస్తున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది. ఇటీవల సంగారెడ్డిలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలోనూ నేతల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపించాయి. సమావేశానికి ముఖ్యనేతలు సపాన్‌దేవ్ సహా పలువురు నేతలు, ముఖ్య ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టారు. సమావేశంలో వేదికపైకి కొంతమంది నాయకులను ఆహ్వానించి మరికొంత మంది నాయకులను పిలవకపోవడంతో పలువురు నేతలు అసంతృప్తికి లోనయ్యారు. సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు శశికళాయాదవరెడ్డి ప్రసంగం ముగియగానే ఇతర నేతలు కూడా ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. అయితే అసంతృప్తి నేతలంతా ఏకమై జిల్లా అధ్యక్షురాలు ప్రసంగించాక ఇతరులు మాట్లాడటం అనవసరమంటూ వారిని అడ్డుకున్నారు. పార్టీ నుంచి బయటకువెళ్లి ఇటీవలే పార్టీలో చేరిన కొంతమంది నాయకులు తమను అవమానించేందుకే సమావేశంలో తమ ప్రసంగాన్ని అడ్డుకున్నారని, వారి చిల్లర చేష్టలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని జిల్లాకు చెందిన రాష్ట్ర నాయకులు ఒకరు తెలిపారు. ఇదిలా ఉంటే పార్టీ అధ్యక్షురాలు పనితీరుపైనా ఓ వర్గం నాయకులు అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షురాలు సిద్దిపేట ప్రాంతానికి చెందిన ఇద్దరు నేతలు చెప్పినట్లు వ్యవహరిస్తోందని, దీనివల్ల పార్టీని నష్టం చేకూరుస్తోందని అసంతృప్త నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, పెత్తనం చెలాయిస్తున్న ఇద్దరు నేతల తీరుపై అసంతృప్తితో జిల్లా నేతలు పలువురు త్వరలో పార్టీ అధినేత చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.