వారిద్దరిపై బహిష్కరణ వేటు
ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లను
జాతీయ కార్యవర్గం నుంచి తొలగించిన ఆప్
హైడ్రామా మధ్య జాతీయ మండలి సమావేశంలో తీర్మానం
భేటీలో భూషణ్, యాదవ్‌పై కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు
గూండాలు, బౌన్సర్లతో మా మద్దతుదారులను కొట్టించారు: యాదవ్
పార్టీకి రాజీనామా చేసిన మేధాపాట్కర్
న్యూఢిల్లీ: ఊహించిందే జరిగింది. సామాన్యుడి పార్టీలో సంక్షోభం చివరికి అసమ్మతి నేతల బహిష్కరణకు దారితీసింది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సీనియర్ నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లను పార్టీలో అత్యున్నత విభాగమైన జాతీయ కార్యవర్గం నుంచి తొలగించారు. తీవ్ర ఉద్రిక్తత, హైడ్రామా మధ్య వారి బహిష్కరణ తీర్మానానికి జాతీయ మండలి ఆమోదం తెలిపింది. శనివారమిక్కడ జరిగిన జాతీయ మండలి సమావేశంలో 300 మందికిపైగా సభ్యులను ఉద్దేశించి కేజ్రీవాల్ గంటకుపైగా మాట్లాడారు. వారిద్దరు (ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్) కావాలో తాను కావాలో తేల్చుకోవాలని సూచించి సమావేశం నుంచి నిష్ర్కమించారు. ఆ వెంటనే కేజ్రీవాల్ సన్నిహితుడు మనీశ్ సిసోడియా.. ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌తోపాటు వారి అనుచరులు ఆనంద్ కుమార్, అజిత్ ఝాలను జాతీయ కార్యవర్గం నుంచి తొలగించే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి 247 మంది మద్దతు తెలపగా, 10 మంది వ్యతిరేకించారని ఆప్ జాతీయ కార్యదర్శి పంకజ్ గుప్తా తెలిపారు. 54 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారన్నారు.
ప్రజాస్వామ్యం ఖూనీ: యాదవ్, భూషణ్
తమ బహిష్కరణపై ప్రశాంత్, యోగేంద్ర అగ్గిమీద గుగ్గిలమయ్యారు. జాతీయ మండలి సమావేశం రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట విరుద్ధమని మండిపడ్డారు. ‘‘కేజ్రీవాల్ నియంత లా వ్యవహరిస్తున్నారు. సమావేశానికి ఆయన అనుచరులు గూండాలను, బౌన్సర్లను తీసుకువచ్చారు. తీర్మానాన్ని వ్యతిరేకించిన సభ్యులను వారితో కొట్టించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. అంతావ్యూహం ప్రకారం జరిపించారు. నిబంధనలన్నింటినీ తుంగలోకి తొక్కి నిమిషాల్లోనే తీర్మానాన్ని ఆమోదించినట్లు ప్రకటించారు. దీనిపై కోర్టు లేదా ఎన్నికల సంఘానికి వెళ్తాం. లేదా జాతీయ మండలి సమావేశాన్ని మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్‌ను ముందుంచుతాం’ అని వారిరువురు చెప్పారు. ఘర్షణ వాతావరణం నెలకొంటుందన్న సాకు చూపి భేటీకి రావొద్దం టూ ఆప్ అంతర్గత లోక్‌పాల్ అడ్మిరల్ ఎల్ రాందాస్(రిటైర్డ్)కు శుక్రవారం ఫోన్‌లో ఎస్‌ఎంఎస్ పంపారన్నారు. దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆయన పార్టీ నాయకత్వానికి లేఖ కూడా రాశారన్నారు. ఈ మేరకు ఆయన రాసిన లేఖను యాదవ్ వెల్లడించారు. ‘జాతీయ మండలి భేటీలో కేజ్రీవాల్ గంట మాట్లాడారు. మమ్మల్ని తొలగించకపోతే తప్పుకుంటానని చెప్పారు. తర్వాత ఓ పది మంది ఎమ్మెల్యేలు మేం ద్రోహులమంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. 7 నిమిషాలపాటు ఈ డ్రామా సాగింది. ఈ సమయంలో కేజ్రీవాల్ విగ్రహంలా నిలబడి వారిని చూస్తుండిపోయారు’’అని యాదవ్ చెప్పారు.
ఆద్యంతం హైడ్రామా.. జాతీయ మండలి సమావేశ ప్రాంగణమైన కలిస్తా రిసార్ట్ వద్ద హైడ్రామా నడిచింది. మండలి సమావేశానికి ముందు 20 నిమిషాల పాటు యోగేంద్ర యాదవ్ అక్కడ ధర్నాకు దిగారు. కేజ్రీవాల్‌ను వ్యతిరేకిస్తున్నవారిని సమావేశ మందిరంలోకి అనుమతించడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరువర్గాలకు చెందిన మద్దతుదారులు పెద్దఎత్తున గుమికూడారు. పరస్పర వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులు, ఆర్‌ఏఎఫ్ బలగాలను మోహరించారు. సమావేశానికి ఆహ్వానం లేనివారిని లోనికి అనుమతించలేదు. బహిష్కరణ వార్త తెలియగానే కేజ్రీవాల్ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. కేజ్రీవాల్ అనుచరులు యాదవ్, భూషణ్ వైపు వస్తుండడంతో పోలీసులు వారిద్దరికి రక్షణగా నిలిచారు.
వాళ్లా.. నేనా..: కేజ్రీవాల్
జాతీయ మండలి భేటీలో కేజ్రీవాల్ ఆవేశంగా మాట్లాడారు. ప్రశాంత్, యోగేంద్రలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాళ్లిద్దరో తానో తేల్చుకోవాలన్నారు. వారిద్దరుంటే తానే పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తానని అన్నట్టు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదనను మండలి తిరస్కరించింది. ఆప్ ప్రస్థానం, పార్టీ విజయాలపైనా కేజ్రీవాల్ సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘ప్రశాంత్, ఆయన తండ్రి శాంతి భూషణ్, యోగేంద్ర మొన్నటి ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవాలని చూశారు. శ్రేణులన్నీ గెలుపు కోసం పోరాడితే వీరు పార్టీని ఓడిచేందుకు యత్నించారు’ అని కేజ్రీవాల్ అన్నట్టు పార్టీ నేత ఒకరు చెప్పారు.
పార్టీ తమాషాలా మారిపోయింది: మేధా పాట్కర్
ఆప్ ఓ తమాషా పార్టీలా మారిపోయిందని సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ విమర్శించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ముంబైలో ప్రకటించారు. ‘ఈరోజు ఢిల్లీలో పార్టీ జాతీయ మండలి భేటీలో పరిణామాలు దురదృష్టకరం. ఇలాంటివి ఆప్‌లో కూడా జరుగుతాయనుకోలేదు. ప్రశాంత్ భూషణ్, యాదవ్, ఆనంద్‌కుమార్ పార్టీ ఉన్నతి కోసం కృషి చేశారు. వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారో లేదో నాకు తెలియదు. కానీ ఏదైనా సమస్య ఉంటే చర్చల తర్వాత ఓ నిర్ణయానికి రావాలి. కానీ ఈరోజు జరిగిన దాన్ని ఖండిస్తున్నా. పార్టీలో రాజకీయ విలువలను తొక్కేశారు’’ అని ఆమె పేర్కొన్నారు. కేజ్రీవాల్, ఆయన టీంపై తనకు ఎలాంటి కోపం లేదని, ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పునకు అనుగుణంగా ఆయన పని చేయాలన్నారు.