‘ఆప్’లో రాజీ చర్చలు విఫలం
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో సంక్షోభానికి తెరపడే సూచనలు కనిపించడం లేదు. అసమ్మతి నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్రయాదవ్‌లతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వర్గం జరిపిన రాజీ చర్చలు విఫలమయ్యాయి. చర్చల్లో తమ వాదనను అస లు వినిపించుకోలేదని చర్చలు విఫలమైన నేపథ్యంలో అసమ్మతి నేతలు కేజ్రీవాల్‌కు గురువారం ఒక బహిరంగ లేఖ రాశారు. అందులో.. ‘మర్యాదగా జాతీయ కార్యవర్గానికి రాజీనామా చేయండి లేదా తొలగింపునకు సిద్ధం కండి అని చర్చల సందర్భంగా మీ తరఫువారు మాకు చెప్పారు. ఇది మీ మాటేనని వారు స్పష్టం చేశారు. మేము సభ్యులుగా ఉన్న జాతీయ కార్యవర్గానికి కన్వీనర్‌గా ఉండబోనని మీరు పట్టుబడ్తున్నారనీ చెప్పారు.
మేమేం చేశామని మాపై మీకు ఇంత వ్యక్తిగత కక్ష అరవింద్ భాయ్!. నిజమేంటో మీ మనస్సాక్షికి తెలుసు. మిమ్మల్నెప్పుడూ మేం పదవి, అధికారం, సాయం ఏదీ కోరలేదు. పార్టీలో ప్రజాస్వామ్యానికి సంబంధించి మా డిమాండ్లను తీరిస్తే రాజీనామాకు సిద్ధమని కూడా చెప్పాం మీ అపాయింట్‌మెంట్ కోరి 10 రోజులైంది. మీ నుంచి స్పందన లేదు. అందుకే ఈ బహిరంగ లేఖ రాయాల్సి వచ్చింది’ అని వారు పేర్కొన్నారు. కాగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ గురువారం కేజ్రీవాల్ నివాసంలో సమావేశమై, పార్టీలోని అంతర్గత విబేధాలపై చర్చించింది. యాదవ్, భూషణ్‌లకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదని ఆ భేటీలో కేజ్రీవాల్ మద్దతుదారులు పట్టుబట్టారని సమాచారం.