ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఒక పార్టీ కాదని, అది నియంతృత్వ పోకడలున్న ఒక ‘ఖాప్ పంచాయత్’ అని మంగళవారం పార్టీ
అసమ్మతి నేతల ధ్వజం కేజ్రీవాల్‌ను హిట్లర్‌తో పోల్చిన శాంతిభూషణ్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఒక పార్టీ కాదని, అది నియంతృత్వ పోకడలున్న ఒక ‘ఖాప్ పంచాయత్’ అని మంగళవారం పార్టీ తిరుగుబాటు నేతలు శాంతి భూషణ్, ప్రశాంత్ భూషణ్ మండిపడ్డారు. కేజ్రీవాల్‌ను హిట్లర్‌తో పోలుస్తూ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు శాంతి భూషణ్ తీవ్రంగా విమర్శించారు. ‘హిట్లర్ విధానాలను అవలంబిస్తున్న కేజ్రీవాల్.. హిట్లర్ వస్త్రధారణనూ అనుకరిస్తే మంచిది’ అన్నారు. ‘ఈ ఖాప్ పంచాయత్‌కు ఒక నియంత(కేజ్రీవాల్) ఉన్నాడు. ఆయన ఆదేశాల మేరకు పంచాయత్ సభ్యులు పనిచేస్తుంటారు. ఆయన భజన చేస్తుంటారు’ అంటూ ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు.
కొనసాగుతున్న తొలగింపుల పర్వం
అసమ్మతి నేతలపై వేటు కార్యక్రమాన్ని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కొనసాగిస్తున్నారు. పార్టీ పార్లమెంటరీ నేత పదవి నుంచి మంగళవారం పాటియాలా ఎంపీ ధరమ్‌వీర్ గాంధీని తొలగించి, ఆ స్థానంలో కేజ్రీవాల్‌కు నమ్మకస్తుడైన భగవంత్ మన్‌ను నియమించారు. మన్.. సంగ్రూర్(పంజాబ్) ఎంపీ. అసమ్మతి నేతలు ప్రశాంత్, యోగేంద్రయాదవ్, ఆనంద్‌కుమార్, అజిత్‌లను సోమవారం పార్టీ నుంచి బహిష్కరించడం తెలిసిందే. ప్రశాంత్, యోగేంద్రలతో పార్టీ వ్యవహరిస్తున్న తీరును ధరమ్‌వీర్ వ్యతిరేకించిన ఫలితమే ఈ తొలగింపని భావిస్తున్నారు.