shanti bhushan
-
మాజీ న్యాయ మంత్రి శాంతిభూషణ్ కన్నుమూత
న్యూఢిల్లీ: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న న్యాయ కోవిదుడు, కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి శాంతి భూషణ్(97) మంగళవారం ఢిల్లీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన కుమారులు జయంత్, ప్రశాంత్ భూషణ్ సైతం న్యాయవాదులుగా పేరొందారు. అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన భూషణ్జీ చిరస్మరణీయులంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 1971 లోక్‌సభ ఎన్నికల్లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ రాయ్‌బరేలీ స్థానంలో అక్రమాలకు పాల్పడి గెలిచారని అలహాబాద్ హైకోర్టులో కేసు వేసి నెగ్గిన రాజ్ నారాయణ్ తరఫున శాంతి భూషణ్ వాదించారు. ఆ కేసులో ఇందిరాగాంధీ ఓడిపోవడం, ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా కోర్టు ప్రకటించడంతో దేశంలో ఎమర్జెన్సీ విధించడం తెల్సిందే. -
మాస్టర్ రోస్టర్ సీజేఐనే: సుప్రీం
న్యూఢిల్లీ: ‘మాస్టర్ రోస్టర్’ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)నే అని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. విశేషాధికారాలతోపాటు వివిధ ధర్మాసనాలకు కేసులను కేటాయించే అధికారం సీజేఐదేనని తేల్చి చెప్పింది. కేసుల కేటాయింపులో ప్రస్తుతం అనుసరిస్తున్న రోస్టర్ విధానాన్ని సవాల్ చేస్తూ కేంద్ర మాజీ మంత్రి శాంతి భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్‌భూషణ్‌ల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బెంచ్.. ‘సమానుల్లో ప్రథముడు సీజేఐ, కోర్టు పరిపాలన వ్యవహారాల్లో నాయకత్వ బాధ్యతలను చేపట్టే అధికారం ఆయనకు ఉంది’ అని తెలిపింది. ‘మాస్టర్ రోస్టర్‌గా సీజేఐను పేర్కొనడంలో ఎలాంటి వివాదమూ లేదు. సుప్రీంకోర్టులోని వివిధ బెంచ్‌లకు కేసులను కేటాయించే అధికారం ఆయనకు ఉంది’ అని జస్టిస్ ఏకే సిక్రీ తన తీర్పులో పేర్కొన్నారు. జస్టిస్ భూషణ్ కూడా తన తీర్పులో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘కేసులను కేటాయించడంతోపాటు వివిధ ధర్మాసనాలకు ఆ బాధ్యతలను అప్పగించే విశేషాధికారం సీజేఐకు ఉంది. సుప్రీంకోర్టు పాటిస్తున్న ప్రమాణాలు, పద్ధతులు కాలపరీక్షకు తట్టుకుని నిలబడ్డాయి. ఇప్పుడు వాటిని మార్చకూడదు. సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జి ప్రధాన న్యాయమూర్తి. ఆయనే అధికార ప్రతినిధి, న్యాయవ్యవస్థకు నాయకుడు’ అని పేర్కొన్నారు. సీజేఐకి కేసుల కేటాయింపులో విశేషాధికారాలు ఉండరాదనీ, కేసుల కేటాయింపు బాధ్యతను సుప్రీంకోర్టులోని ఐదుగురు సీనియర్ జడ్జిలతో కూడిన బెంచ్‌కు అప్పగించాలని శాంతి భూషణ్ తన పిల్లో కోరారు. -
రోస్టర్ విధానంపై నేడు తీర్పు
న్యూఢిల్లీ: కేసుల కేటాయింపులో ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) అవలంబిస్తున్న రోస్టర్ విధానాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు తీర్పు చెప్పనుంది. మాజీ న్యాయ శాఖ మంత్రి శాంతి భూషణ్ ఈ పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంలో జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం ఏప్రిల్ 27నే తీర్పును రిజర్వు చేసింది. -
ఏప్రిల్ 27న సీజేఐపై పిల్ విచారణ
న్యూఢిల్లీ: కేసుల కేటాయింపులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుసరిస్తున్న రోస్టర్ విధానాన్ని సవాలు చేస్తూ న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ దాఖలు చేసిన పిల్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. శుక్రవారం పిల్‌ను ధర్మాసనం స్వీకరిస్తూ.. ఏప్రిల్ 27న విచారణ ప్రారంభిస్తామని తెలిపింది. ఈ పిల్ విచారణలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, అదనపు సొలిసిటర్ జనరల్(ఏసీజే) తుషార్ మెహతాలు సాయం చేయాలని జస్టిస్ ఏకే సిక్రీ,, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం కోరింది. కేసుల కేటాయింపు బాధ్యతను సుప్రీంకోర్టులో ఐదుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలీజియంకు అప్పగించాలన్న ఆలోచనతో ఏకీభవించడం లేదని ధర్మాసనం పేర్కొంది. కేసుల కేటాయింపులో సీజేఐ తీరును నిరసిస్తూ ఈ ఏడాది జనవరి 12న సుప్రీంలో అత్యంత సీనియర్ న్యాయమూర్తులైన జస్టిస్ జే.చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ జోసెఫ్ కురియన్ల ప్రెస్ కాన్ఫరెన్స్ అంశాన్ని ప్రస్తావించేందుకు శాంతి భూషణ్ తరఫు న్యాయవాదులు ప్రయత్నించగా ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘మేం ఆ విషయంలోకి వెళ్లడం లేదు. కొన్ని స్పష్టమైన కారణాల నేపథ్యంలో ఆ విషయంపై మాకు ఎలాంటి ఆసక్తిలేదు. వాటిని ప్రస్తావించవద్దు’ అని స్పష్టం చేసింది. ‘కేసుల కేటాయింపు బాధ్యతను కొలీజియంకు అప్పగిస్తే.. ఆ పని కోసమే రోజూ లేక వారానికి రెండు మూడు సార్లు సమావేశం కావాల్సి ఉంటుంది. అది ఆచరణ సాధ్యమైన పరిష్కారం కాదు’ అని సుప్రీం పేర్కొంది. సీజేఐ మాస్టర్ ఆఫ్ రోస్టర్ అన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిందని బెంచ్ తెలిపింది. సీజేఐ సమానుల్లో ప్రథముడని, కేసుల కేటాయింపు, అలాగే కేసుల విచారణకు బెంచ్‌ల ఏర్పాటులో ఆయనకు ప్రత్యేకాధికారాలు ఉన్నాయని ఏప్రిల్ 11న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించింది. పిల్లో ముఖ్య ప్రశ్నల్ని లేవనెత్తాం శాంతి భూషణ్ తరఫున న్యాయవాది దుష్యంత్ దవే వాదిస్తూ.. సీజేఐ అధికారాలకు సంబంధించిన నిబంధనల్ని పిల్లో లేవనెత్తారని, నియమాలకు విరుద్ధంగా సుప్రీంలో జరుగుతున్న వ్యవహారాల్ని అది ప్రశ్నిస్తోందన్నారు. నియమాలకు విరుద్ధంగా సీజేఐ తన అధికారాల్ని వినియోగిస్తున్నారని, తన నియమావళికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కట్టుబడి ఉండాలని అన్నారు. -
ఆ పిల్‌ను విచారించలేను
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో జరుగుతున్న పరిణామాలపై సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జె.చలమేశ్వర్ గురువారం మరోసారి ఆవేదన వెలిబుచ్చారు. అలాగే సుప్రీంలో కేసుల కేటాయింపునకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేనని, తన తీర్పును తోసిపుచ్చే పరిస్థితిని మరోసారి తాను కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో తానేమీ చేయలేనని, తన ఇబ్బందిని అర్థం చేసుకోవాలని పిటిషనర్‌కు వెల్లడించారు. సుప్రీంకోర్టులో సీజేఐనే సుప్రీం అని పేర్కొంటూ బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం తీర్పు వెలువరించిన నేపథ్యంలో తన తండ్రి శాంతిభూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని.. జస్టిస్ చలమేశ్వర్ ధర్మాసనాన్ని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆశ్రయించారు. సీజేఐకున్న మాస్టర్ ఆఫ్ రోస్టర్ అధికారాల్ని సవాలు చేయడంతో పాటు, కేసుల కేటాయింపునకు మార్గదర్శకాల్ని రూపొందించాలని కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ గతవారం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో గురువారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. శాంతిభూషణ్ పిల్‌ను అత్యవసరంగా విచారించేందుకు జస్టిస్ చలమేశ్వర్ నిరాకరించడంతో.. ప్రశాంత్ భూషణ్ వెంటనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా బెంచ్‌ను ఆశ్రయించారు. పిటిషన్‌ను వెంటనే విచారణకు స్వీకరించాలని కోరగా.. ‘పరిశీలిస్తాం’ అని సీజేఐ ధర్మాసనం తెలిపింది. అంతకుముందు జస్టిస్ చలమేశ్వర్ బెంచ్ వద్ద పిల్ అంశాన్ని ప్రశాంత్ భూషణ్ ప్రస్తావిస్తూ.. ఇది అత్యవసర అంశమని పేర్కొన్నారు. మాస్టర్ ఆఫ్ రోస్టర్ విధానాన్ని పిల్ సవాలు చేస్తున్నందున సీజేఐ విచారణ చేయకూడదని.. అందువల్లే మీ బెంచ్‌కు రిఫర్ చేశానని చెప్పారు. అయితే ఈ అంశంలో జోక్యం చేసుకోవడం తనకు ఇష్టం లేదని, అందుకు గల కారణాలు అందరికీ తెలిసినవేనని చలమేశ్వర్ పేర్కొన్నారు. ఇటీవల జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసఫ్‌లు సుప్రీంకోర్టులో జరుగుతున్న వ్యవహారాలు, న్యాయవ్యవస్థలో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యాన్ని తప్పుపడుతూ లేఖలు రాసిన తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నాపై దుష్ప్రచారం: జస్టిస్ చలమేశ్వర్ ‘సుప్రీంకోర్టులో, దేశంలో జరుగుతున్న వ్యవహారాల్ని ప్రస్తావిస్తూ నేను కొద్ది రోజుల క్రితం లేఖ రాశా. నేను ఏదో ప్రయోజనం ఆశిస్తున్నానంటూ కొందరు తీవ్రంగా దుష్ప్రచారం చేస్తున్నారు. రెండు నెలల్లో రిటైర్ కాబోతున్నాను. ఈ సమయంలో అలాంటి ప్రచారాన్ని నేను కోరుకోవడం లేదు. అందువల్ల ఈ విషయంలో నేను ఇంతకంటే ఏమీ చేయలేదు. క్షమించండి. దయచేసి నా ఇబ్బందిని అర్థం చేసుకోండి’ అని జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నారు. ‘వచ్చే 24 గంటల్లో మరోసారి నా తీర్పును తోసిపుచ్చే పరిస్థితిని నేను కోరుకోవడం లేదు. అందువల్లే నేను ఈ పిల్‌ను విచారణకు స్వీకరించలేను’ అని ప్రశాంత్ భూషణ్‌కు స్పష్టం చేశారు. గతేడాది నవంబర్ 10న తన నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పును సీజేఐ బెంచ్ తోసిపుచ్చిన విషయాన్ని పరోక్షంగా ఆయన గుర్తుచేశారు. ఏకే సిక్రీ ధర్మాసనానికి పిల్ సుప్రీం బెంచ్‌లకు కేసుల కేటాయింపులో మాస్టర్ ఆఫ్ రోస్టర్‌గా సీజేఐకున్న అధికారాల్ని ప్రశ్నిస్తూ శాంతి భూషణ్ దాఖలు చేసిన పిల్ శుక్రవారం విచారణకు రానుంది. సుప్రీం జడ్జీల్లో సీనియారిటీలో ఆరో స్థానంలో ఉన్న జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్‌ను విచారిస్తుంది. ఆరు నెలలుగా... సుప్రీంకోర్టులో అధికార పరిధిపై దాదాపు ఆరు నెలలుగా వివాదం కొనసాగుతోంది. ► నవంబర్ 9, 2017: మెడికల్ అడ్మిషన్ స్కాంలో ఒక ఎన్జీవో సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టులోని ఐదుగురు అత్యంత సీనియర్ జడ్జిలతో కూడిన ధర్మాసనానికి అప్పగిస్తూ నవంబర్ 10న ఆదేశాలు జారీ చేసిన చలమేశ్వర్ ధర్మాసనం గతంలో ఆ కేసు విచారణలో జస్టిస్ దీపక్ మిశ్రా ప్రమేయం ఉన్నందున... ధర్మాసనంలో ఆయన ఉండకూడదని పిటిషనర్ కోరగా.. చీఫ్ జస్టిస్ లేకుండానే ధర్మాసనం ఏర్పాటుకు ఆదేశాలు. ► నవంబర్ 10: ఆ ఆదేశాలను కొట్టివేసిన జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్.. ధర్మాసనం ఏర్పాటు అధికారం సీజేఐకే ఉంటుందని, ద్విసభ్య, త్రిసభ్య ధర్మాసనాలు కేసును తమ బెంచ్‌కు గాని, రాజ్యాంగ ధర్మాసనాలకు గానీ కేటాయించలేవని స్పష్టీకరణ. ► జనవరి 11, 2018: సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రా, ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసఫ్ పేర్లను సుప్రీం జడ్జీలుగా సిఫార్సు చేసిన కొలీజియం. ► జనవరి 12: కేసుల కేటాయింపులో సీజేఐ వైఖరిని ప్రశ్నిస్తూ.. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్. ► మార్చి 21: న్యాయవ్యవస్థలో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యంపై ఫుల్ బెంచ్ ఏర్పాటు చేయాలని సీజేఐకు జస్టిస్ చలమేశ్వర్ లేఖ. ► ఏప్రిల్: జనవరి 11న కొలీజియం చేసిన సిఫార్సులపై కేంద్రం జాప్యాన్ని తప్పుపడుతూ సీజేఐకి జస్టిస్ జోసెఫ్ కురియన్ లేఖ ► ఏప్రిల్ 11: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమానుల్లో ప్రథముడని, కేసుల కేటాయింపు, కేసుల విచారణకు ధర్మాసనాల ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగపరమైన విశిష్టాధికారం ఆయనకే ఉంటుందని తీర్పిచ్చిన జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం. -
‘‘వైజ్ఞానిక వ్యభిచారం’’
జీవన కాలమ్ పురాణాల్లో శక్తి లేకపోతే కాలగర్భంలో కలసిపోతాయి. కానీ వాటికి కొత్త వికారాలను జత చేసి ‘‘వైజ్ఞానిక వ్యభిచారం’ చెయ్యడం ఈనాడు మేధావులనిపించుకునేవారి వ్యసనం. పాపులారిటీకి దొంగ తోవ. ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది శాంతి భూషణ్గారు ఉత్తరప్రదేశ్‌లో రోమియోల కార్యకలాపాలను అదుపులోకి తెచ్చే ’వ్యతిరేక ఉద్యమాన్ని’ విమర్శిస్తూ ’’రోమియోకి ఒకరే ప్రియురాలు. మరి శ్రీకృష్ణుడికి వేల మంది ప్రియురాళ్లు. ఈ ఉద్యమాన్ని ’’శ్రీకృష్ణ వ్యతిరేక ఉద్యమం’ అని పిలిచే దమ్ము యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి ఉందా?’ అన్నారు. 21వ శతాబ్దపు తెలివితేటలు వికటించినప్పుడు వచ్చే వికారమిది. ఈ మధ్య ఈ తెలివితేటలు చాలా మంది ‘అధునిక రచయిత’లలో మరీ వికటిస్తున్నాయి. ముఖ్యంగా పురాణాలమీదా, దేవుడిమీదా బొత్తిగా నమ్మకం లేని వారిమాట. ఒకానొక సభలో కుచేలుని గురించి మాట్లాడుతూ శ్రీకృష్ణుడు ఆయనతో అన్నాడట: ’’ఏమయ్యా, ఎనిమిది మంది భార్యల్ని పెట్టుకుని నేను ఒక్కడినే కన్నాను. పేదరికంలో ఉంటూ అంతమంది పిల్లల్ని కని నీ పెళ్లాన్ని హింసించేవేమయ్యా’’ అని. ప్రేక్షకులు ఈ ’రుచి’కరమైన జోక్‌కి కిసుక్కున నవ్వుకున్నారు. కుచేలుడి వృత్తాంతం ఉద్దేశం అదికాదు. రచనల్లో literary metaphorని అర్ధం చేసుకోలేని ప్రబుద్ధుల కుప్పిగంతులివి. ఇప్పటి చాలా మంది స్త్రీలకి విష్ణుమూర్తి పాలసముద్రం మీద పాము పడుకుని ఉండగా, లక్ష్మిదేవి కాళ్లుపట్టడం ఎబ్బెట్టుగా, అభ్యంతరంగా కనిపించవచ్చు. మన వేదాల్లో చెప్పారు స్త్రీకి మూడు దశల్లో ముగ్గురి రక్షణ ఉంటుందట. చిన్నతనంలో తండ్రి, పెళ్లాయ్యాక భర్త, వృద్ధాప్యంలో కొడుకు? ఇది ఎప్పటి మాట! ఇవాళ స్త్రీలు రాజ్యాలు ఏలుతున్నారు. ఇందిరాగాంధీ ఆనాడు బంగ్లాదేశ్‌ని విముక్తం చేసి ప్రత్యేక పాలకులకు అప్పగించారు. వాలెంతినా తెరిస్కోవా, చావ్లా రోదసీయానం చేశారు. దీపా కర్మాకర్, సింధు భారతదేశాన్ని ప్రపంచస్థాయిలో నిలిపారు. అలసిన భార్య కాళ్లు పట్టిన భర్త నా ‘‘మనసున మనసై’’ కార్యక్రమంలో 22 ఏళ్ల క్రితం గర్వంగా చెప్పుకున్నాడు. కాలం మా రింది. విలువలూ మారుతాయి. ఆయా రచనలను, పాత్రలను ఆ నేపథ్యంలోనే బేరీజు వెయ్యాలి. ఆ రచనలమీద విమర్శకి ఈనాటి కొలబద్దలు న్యాయంకాదు– అన్నారు సింగపూర్ తెలుగు సభల్లో ప్రముఖ విమర్శకులు ఆచార్య వెలమల సిమ్మన్నగారు. ముందు ముందు రాముడు అరణ్యాలలో ఉంటూ ప్రతీరోజూ వరస తప్పకుండా ఏ బ్లేడుతో గెడ్డం గీసుకున్నాడు? ఎలా క్షవరం చేసుకున్నాడు. అలా కడిగిన ముత్యంలా కనిపించడానికి ఎవరు అతని బట్టలు, ఏ సబ్బుతో రోజూ ఉతికి పెట్టారు. సీతమ్మవాడిన శానిటరీ టవల్స్ ఏ కంపెనీవయివుంటాయి? వంటి విలక్షణమయిన వికారాలు రావచ్చు. దేవుళ్లనీ, పురాణాలనీ వెనకేసుకు రావడం నా లక్ష్యం కాదు. ఇలాంటి రచనలు లోగడ చాలా మంది లబ్దప్రతిష్టులు చేశారు. ‘‘ఆ నాటకాలన్నీ బుద్ధిలేక రాశాను’’ అన్నారు చలంగారు. మిగతా వారు అనలేదు. కానీ అనే పక్షానికి ఒరిగారు. శ్రీకృష్ణుడు, భీష్ముడు, రాముడు – ఇలాంటి పాత్రలు ఒక సంస్కృతీ పరిణామంలో కొన్ని దేశాలలో కేవలం పాత్రలుకావు– ‘వ్యవస్థ’లు (Institutions). దమ్ముంటే మరో ‘శ్రీకృష్ణుడి’ని సృష్టించమనండి. ఆ పాత్రకి ‘‘శాంతి భూషణ్’’ అని పేరు పెట్టమనండి. శ్రీకృష్ణుడు ఈ జాతికి ‘భగవద్గీత’ని ఇచ్చిన ఆచార్యుడు. ఆయన్ని వెక్కిరిస్తే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినట్టు. కొన్ని శతాబ్దాల రాపిడిలో నిగ్గు తేలిన పాత్రీకరణ అది. An evolved institution. అవి కొన్ని శతాబ్దాల సంస్కృతి పెంచిన పూలతోటలు. మనసుంటే ఇన్ని నీళ్లు పోయండి. మనసు లేకపోతే మంట పెట్టకండి. విష వృక్షాల్ని పెంచకండి. ఈ దేశంలో దిగంబర కవుల్లో ఒకాయన ఆశ్రమ స్వీకారం చేసి సన్యాసి అయ్యాడు. విప్లవ గీతాలతో జాతిని ఉత్తేజపరిచిన గాయకుడు గద్దర్ ఆధ్యాత్మికతవేపు మలుపు తిరిగారు. కాళీపట్నం రామారావు మేష్టారు తొంభైవ పడిలో రామాయణం, భాగవతం చదువుకుంటున్నారు. రావిశాస్త్రి గారు చివరిరోజుల్లో సద్గురు శివానందమూర్తిగారిని దర్శించుకుని ‘అయ్యో! వీరిని ముందుగా కలసి ఉంటే బాగుండేదే!’’ అని వాపోయారట. త్రిపురనేని గోపీచంద్, కొడవటిగంటి, జ్యేష్ట, శ్రీపతి వంటివారు తమ ఆలోచనాసరళిని మలుపుతిప్పారు. అది ఆక్షేపణీయం కాదు. విశ్వాసానికి ఆలస్యంగా వేసిన మారాకు. ఇది సామాజిక చైతన్యంలో పరిణామం. వెక్కిరించడం వెకిలితనం. తను నమ్మిందే సత్యమనే అర్థం లేని అహంకారం. శతాబ్దాల రాపిడిలో ఒక వ్యవస్థలో చిరస్మరణీయమైన – పాత్రలుగా కాక ‘వ్యవస్థ’లయిన పాత్రలను ఆధునికమైన ‘ఎంగిలి’ తెలివితేటలకి ‘రీ ఇంటర్‌ప్రెటేషన్’ అని దొంగపేరు పెట్టిన పెద్దలు నాలిక కొరుక్కున్నారు. పురాణాల్లో శక్తిలేకపోతే కాలగర్భంలో కలసిపోతాయి. కాని వాటికి కొత్త వికారాలను జత చేసి ‘‘వైజ్ఞానిక వ్యభిచారం’ చెయ్యడం ఈనాడు మేధావులనిపించుకునేవారి వ్యసనం. పాపులారిటీకి దొంగ తోవ. వ్యాసకర్త గొల్లపూడి మారుతీరావు -
కొలీజియంలో న్యాయమంత్రి ఉంటే తప్పేంటి?
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకం కోసం రూపొందిస్తున్న కొలీజియం వ్యవస్థలో కేంద్ర న్యాయశాఖ మంత్రిని చేర్చటం వల్ల న్యాయ స్వతంత్రతకు వచ్చిన ముప్పేమీ లేదని ప్రముఖ న్యాయవాది శాంతి భూషణ్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో న్యాయవ్యవస్థపై జరిగిన ఓ కార్యక్రమంలో.. మాజీ న్యాయశాఖ మంత్రి కూడా అయిన శాంతి భూషణ్ మాట్లాడుతూ.. ‘కొలీజియంలో న్యాయమంత్రిని చేర్చటం వల్ల వచ్చే ప్రమాదమేమీ లేదు. ఐదుగురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులున్న కొలీజియంలో మంత్రి ఒక్కడే ఏం చేయగలరు? మీ ఆలోచనలను ప్రభావితం చేసే శక్తి ఆయనకుంటుందా? దీని వల్ల న్యాయ వ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటుందని నేననుకోవటం లేదు’ అని అన్నారు. 1950-60 నాటి రాజకీయ నాయకులు ఇప్పుడు లేరని.. అందువల్ల న్యాయవ్యవస్థే పలు అంశాల్లో బాధ్యత తీసుకోవాలని శాంతి భూషణ్ సూచించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఉన్నత వర్గానికి చెందిన వారుండటం వల్ల మిగిలిన వెనకబడిన, మైనారిటీ వర్గాలకు న్యాయం జరగటం లేదని జాతీయ జ్యుడిషియల్ అకాడమీ మాజీ డెరైక్టర్ మోహన్ గోపాల్ అన్నారు. న్యాయమూర్తుల ఎంపికలో పారదర్శకత లోపిస్తోందని సీపీఐ నేత నీలోత్పల్ బసు అభిప్రాయపడ్డారు. -
ఆప్.. ఒక ఖాప్ పంచాయత్!
అసమ్మతి నేతల ధ్వజం కేజ్రీవాల్‌ను హిట్లర్‌తో పోల్చిన శాంతిభూషణ్ న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఒక పార్టీ కాదని, అది నియంతృత్వ పోకడలున్న ఒక ‘ఖాప్ పంచాయత్’ అని మంగళవారం పార్టీ తిరుగుబాటు నేతలు శాంతి భూషణ్, ప్రశాంత్ భూషణ్ మండిపడ్డారు. కేజ్రీవాల్‌ను హిట్లర్‌తో పోలుస్తూ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు శాంతి భూషణ్ తీవ్రంగా విమర్శించారు. ‘హిట్లర్ విధానాలను అవలంబిస్తున్న కేజ్రీవాల్.. హిట్లర్ వస్త్రధారణనూ అనుకరిస్తే మంచిది’ అన్నారు. ‘ఈ ఖాప్ పంచాయత్‌కు ఒక నియంత(కేజ్రీవాల్) ఉన్నాడు. ఆయన ఆదేశాల మేరకు పంచాయత్ సభ్యులు పనిచేస్తుంటారు. ఆయన భజన చేస్తుంటారు’ అంటూ ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. కొనసాగుతున్న తొలగింపుల పర్వం అసమ్మతి నేతలపై వేటు కార్యక్రమాన్ని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కొనసాగిస్తున్నారు. పార్టీ పార్లమెంటరీ నేత పదవి నుంచి మంగళవారం పాటియాలా ఎంపీ ధరమ్వీర్ గాంధీని తొలగించి, ఆ స్థానంలో కేజ్రీవాల్‌కు నమ్మకస్తుడైన భగవంత్ మన్ను నియమించారు. మన్.. సంగ్రూర్(పంజాబ్) ఎంపీ. అసమ్మతి నేతలు ప్రశాంత్, యోగేంద్రయాదవ్, ఆనంద్‌కుమార్, అజిత్‌లను సోమవారం పార్టీ నుంచి బహిష్కరించడం తెలిసిందే. ప్రశాంత్, యోగేంద్రలతో పార్టీ వ్యవహరిస్తున్న తీరును ధరమ్వీర్ వ్యతిరేకించిన ఫలితమే ఈ తొలగింపని భావిస్తున్నారు. -
బీజేపీ బ్రహ్మాస్త్రం.. కిరణ్‌బేడీ
బేడీపై శాంతి భూషణ్ ప్రశంసలు సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం కిరణ్ బేడీ అని ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్) వ్యవస్థాపక సభ్యుడు, ప్రముఖ న్యాయవాది శాంతి భూషణ్ అన్నారు. కిరణ్ బేడీని పార్టీలో చేర్చుకోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థిని చేయడం బీజేపీ మాస్టర్ స్ట్రోక్ అని గురువారం విలేకరులతో అన్నారు. కిరణ్‌బేడీ ఢిల్లీ ముఖ్యమంత్రి అయితే అన్నా హజారే ఎంతో సంతోషిస్తారని శాంతిభూషణ్ వ్యాఖ్యానించారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేసిన పోరాట ప్రభావం బేడీపై తీవ్రంగా ఉందని.. ఆమె బీజేపీలో చేరటం ఎన్నికల్లో ఆ పార్టీ ప్రత్యర్థులకు తిరుగులేని దెబ్బ అని అన్నారు. కిరణ్ బేడీ తనకు బాగా తెలుసునని ఆమె ముఖ్యమంత్రి అయితే ఢిల్లీకి నిజాయితీతో కూడిన సర్కారును అందిస్తారని చెప్పారు. అయితే తాను కిరణ్ బేడీని మాత్రమే సమర్థిస్తున్నానని, బీజేపీని కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. కిరణ్ బేడీ ఆప్ తరపున సీఎం అయితే బాగుండేదని చెప్పారు. ఆప్‌లో ఏదీ సక్రమంగా లేదని, వ్యవస్థాపక సిద్ధాంతాల నుంచి ఆ పార్టీ పక్కదారి పట్టిందని ఈ విషయం పై పార్టీ పున:సమీక్ష జరపాలని శాంతిభూషణ్ అభిప్రాయపడ్డారు. పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అధికార పిపాసి అని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్ కన్నా అజయ్ మాకెన్ మెరుగైన సీఎం అభ్యర్థి అని అభిప్రాయపడ్డారు. పార్టీ నేషనల్ కౌన్సిల్ దారితప్పిన కేజ్రీవాల్‌ను పార్టీ కన్వీనర్ పదవి నుంచి తప్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, కిరణ్‌బేడీ శాంతి భూషణ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆప్‌లో కలకలం: శాంతి భూషణ్ వ్యాఖ్యలు ఆప్‌లో తీవ్ర కలకలాన్ని సృష్టించాయి. పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యానికి శాంతిభూషణ్ వ్యాఖ్య లు ప్రతిబింబమని కేజ్రీవాల్ తెలిపారు. శాంతి భూషణ్‌కు అన్ని విషయాలు తెలిసినట్టు లేదని తాము తెలియజెప్తామని అన్నారు. శాంతి భూషణ్ కుమారుడు ప్రశాంత్ కూడా తండ్రి మాటలను ఖండించారు. ఆ మాటల్లో తప్పు లేదు... కాంగ్రెస్, బీజేపీల నుంచి డబ్బులు తీసుకుని ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయమని తాను అనటంలో తప్పేమీ లేదని అరవింద్ కేజ్రీవాల్ గురువారం అన్నారు. రాజకీయాల్లో స్వచ్ఛత కోసమే తాను ఆ మాటలన్నానని స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీలు ఎన్నికల సందర్భంగా పంచి పెట్టేది పూర్తిగా నల్లధనమని, ఆ సొమ్ముల్ని తీసుకుని వాటికి ఓటు వేయవద్దని చెప్పటం లంచాన్ని ప్రోత్సహించినట్లు కాదని ఆయన అన్నారు. కాగా, కేజ్రీవాల్ వ్యాఖ్యలపై షోకాజ్ నోటీసు ఇచ్చిన ఈసీ.. ఆయన జవాబివ్వటం కోసం మరో రెండు రోజులు గడువిచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ మాటలను యునెటైడ్ జనతాదళ్ అధ్యక్షుడు శరద్ యాదవ్ సమర్థించారు. కేజ్రీవాల్‌కు ఇచ్చిన షోకాజ్ నోటీసును వెనక్కి తీసుకోవాలని ఈసీకి లేఖ రాశారు. ఎన్నికల బరిలో 693 మంది నామినేషన్ల పరిశీలన అనంతరం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నిలిచిన అభ్యర్థు లు 693మంది అని ఎన్నికల సంఘం తెలి పింది. 923 మంది నామినేషన్ వేయగా, 230 నామినేషన్లను తిరస్కరించారు. -
దూకుడు తగ్గాలి.. వివేచన పెరగాలి!
ప్రజా పోరాటాలతో వెలుగులోకి వచ్చి ఆనతికాలంలోనే హస్తిన సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రభ నానాటికి కొడిగడుతోంది. తొందరపాటుతో ముఖ్యమంత్రి పదవిని వదులుకున్న ఆయన ఇప్పుడు ఇంటా, బయటా విమర్శల పాలవుతున్నారు. సీఎం సీటు వదులుకుని తప్పుచేశానని ఒప్పుకున్నప్పటికీ సొంత పార్టీ నాయకులు ఆయనను క్షమించడం లేదు. రోజుకొకరు అన్నట్టుగా ఆయనపై బహిరంగంగానే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఆప్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన సుప్రీంకోర్టు న్యాయవాది శాంతిభూషణ్ తాజాగా కేజ్రీవాల్ వైఖరిని తప్పుబట్టారు. రాజకీయాల్లో రాణించే లక్షణాలు కేజ్రీవాల్ లేవని తేల్చేశారు. పార్టీని నడిపించే సామర్థ్యం ఆయనకు లేదని వ్యాఖ్యానించారు. తానొక్కడినే పార్టీని నడిపించాలన్న తలంపుతో ఉన్నట్టు కనబడుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఢిల్లీలో మళ్లీ పాగా వేసేందుకు ఆప్ సమాయత్తమవుతున్న సమయంలో శాంతిభూషణ్ చేసిన చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని ఇరుకున పడేశాయి. కేజ్రీవాల్ పై విమర్శలు కొత్త కాదు. కాని పార్టీ వ్యవస్థాపక సభ్యుడైన సీనియర్ న్యాయవాది ఆయనపై విమర్శలు చేశారంటే ఆలోచించాల్సిన విషయమే. సీఎం పదవికి రాజీనామా చేసిన వెంటనే ఆ తప్పును సరిదిద్దుకోకపోవడంతో కేజ్రీవాల్ విఫలమయ్యారు. ఢిల్లీ ప్రజల తీర్పును అవమానించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయకుండానే లోక్‌సభ ఎన్నికలకు వెళ్లడం కూడా పార్టీకి నష్టం కలిగించింది. లోక్‌సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ పోటీ చేయకుండా ప్రచారానికే పరిమితమైతే ఫలితాలు తమకు మరింత అనుకూలంగా వచ్చేవన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఆది నుంచి దూకుడుగా వ్యవహరించిన కేజ్రీవాల్ మున్ముందు బాగా ఆలోంచి నిర్ణయాలు తీసుకుంటేనే రాజకీయాల్లో నిలబడగలుగుతారని కూడా సలహాయిస్తున్నారు. ఆచితూచి అడుగేస్తేనే పాలిటిక్స్ లో మనగలుగుతారని సూచిస్తున్నారు. -
పార్టీని నడిపించే సత్తా లేదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత అర్వింద్ కేజ్రీవాల్ పై మరోమారు విమర్శలు వెల్లువెత్తాయి. స్వపక్ష నేతల నుంచి, ప్రతిపక్ష నేతల నుంచి విమర్శలకు గురికావడం కొత్తకాకపోయినప్పటికీ ఈసారి ఏకంగా ఆప్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన సుప్రీంకోర్టు న్యాయవాది శాంతిభూషణ్ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. కేజ్రీవాల్ నాయక త్వ పటిమను శాంతిభూషణ్ సవాల్ చేశారు. ‘అర్వింద్ కేజ్రీవాల్ తెలివైనవాడు, చురుకైనవాడు, గొప్ప వ్యూహకర్త అయినప్పటికీ పార్టీని నడిపించే సామర్థ్యం ఆయనకు లేదు’ అని శాంతి భూషణ్ అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్‌కు వ్యవస్థాపక నైపుణ్యం లేదని, అందువల్లనే దేశమంతటా పార్టీని విస్తరించలేకపోయారన్నారు. సమయం, సామర్థ్యమున్న మరొకరికి ఆ బాధ్యతను అప్పగించాలన్నారు. నేషనల్ కౌన్సిల్ తనను కన్వీనర్‌గా నియమించినందువల్ల పార్టీకి ప్రాతినిధ్యం వహించే ప్రధాన గొంతుక తనదేననేది ఆయన మనోగతమై ఉండొచ్చన్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా అపరిపక్వతతో కూడినదన్నారు. ఎవరినీ సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల విషయమై ఒత్తిడి పెంచేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించిన రోజునే శాంతిభూషణ్ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్‌పై విమర్శలు చేయడం సంచలనం రేకెత్తించింది. పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నిస్తున్న తరుణంలో కేజ్రీవాల్ నాయకత్వ సామర్థ్యాన్ని సవాలుచేస్తూ శాంతిభూషణ్ విమర్శలు చేయడం పార్టీని ఇరుకునపడేసింది. వ్యక్తిగత అభిప్రాయం అది శాంతిభూషణ్ వ్యక్తిగత అభిప్రాయమని, దానిని పార్టీ వేదికపై ప్రస్తావిస్తే బాగుండేదని శాంతిభూషణ్ కుమారుడు, ఆప్ నేత ప్రశాంత్ భూషణ్ అన్నారు. మరోవైపు పార్టీలో అంతర్గత ప్రజస్వామ్యం లేదనే ఆరోపణలతో అదే పార్టీకిచెందిన మరో నాయకుడు యోగేంద్ర యాదవ్ ఏకీభవించలేదు. ఆప్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని ఆయన అన్నారు. ఏకీభవిస్తున్నా: షాజియా ఇల్మీ శాంతిభూషణ్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో కేజ్రీవాల్ వ్యతిరేకులు ఆయనపై విమర్శనాస్త్రాలు సంధించారు. శాంతి భూషణ్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానంటూ ఆప్ అధినాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్న షాజియా ఇల్మీ పేర్కొన్నారు. కాగా శాంతిభూషణ్ వంటి వ్యక్తి విమర్శిం చినందువల్ల అర్వింద్ కేజ్రీవాల్...పార్టీకి రాజీ నామా చేయాలని మాజీ నేత, మ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ పేర్కొన్నారు. దేశ రాజకీయ చరిత్రలోనే కేజ్రీవాల్ అంత ఆశపోతు రాజకీయనేత మరొకరు లేరని కాంగ్రెస్ నేత ముఖేష్ శర్మ విమర్శించారు.