
న్యూఢిల్లీ: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న న్యాయ కోవిదుడు, కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి శాంతి భూషణ్(97) మంగళవారం ఢిల్లీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన కుమారులు జయంత్, ప్రశాంత్ భూషణ్ సైతం న్యాయవాదులుగా పేరొందారు. అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన భూషణ్‌జీ చిరస్మరణీయులంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
1971 లోక్‌సభ ఎన్నికల్లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ రాయ్‌బరేలీ స్థానంలో అక్రమాలకు పాల్పడి గెలిచారని అలహాబాద్ హైకోర్టులో కేసు వేసి నెగ్గిన రాజ్ నారాయణ్ తరఫున శాంతి భూషణ్ వాదించారు. ఆ కేసులో ఇందిరాగాంధీ ఓడిపోవడం, ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా కోర్టు ప్రకటించడంతో దేశంలో ఎమర్జెన్సీ విధించడం తెల్సిందే.