ఢిల్లీ: ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానరూపకల్పనకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలపై లాభనష్టాలను పేర్కొంటూ గత పార్లమెంట్ సెషన్‌లో కేంద్ర న్యాయ శాఖ మంత్రి విడుదల చేసిన రిపోర్టు తాజాగా తెరమీదకు వచ్చింది. పార్లమెంట్‌లో కిరోడీ లాల్ మీనా అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘావాల్ సమాధానం ఇది..
సవాళ్లు..
►జమిలి ఎన్నికలకు రాజ్యాంగంలోని ఐదు ఆర్టికల్స్‌లో సవరణలు అవసరమని న్యాయ శాఖా మంత్రి తెలిపారు.
1) పార్లమెంటు సభల వ్యవధిపై ఆర్టికల్ 83,
2) లోక్‌సభను రాష్ట్రపతి రద్దు చేయడంపై ఆర్టికల్ 85,
3) రాష్ట్ర శాసనసభల వ్యవధిపై ఆర్టికల్ 172,
4) రాష్ట్రాల శాసనసభలను రద్దు చేయడంపై ఆర్టికల్ 174
5) రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనపై ఆర్టికల్ 356
► ఇది కాకుండా జమిలీ ఎన్నికల నిర్వహణకు దేశం సమాఖ్య నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఏకాభిప్రాయాన్ని పొందడం తప్పనిసరి అని అర్జున్ మేఘావాల్ తెలిపారు.
► అదనపు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (EVMలు/VVPATలు) అవసరమవుతాయి. వీటి ఖర్చు వేల కోట్ల వరకు ఉంటుంది.
► EVM మెషీన్ జీవితకాలం కేవలం 15 సంవత్సరాలు మాత్రమే అని పరిగణనలోకి తీసుకుంటే.. ఈ యంత్రాన్ని దాని జీవిత కాలంలో మూడు లేదా నాలుగు సార్లు ఉపయోగించవచ్చు. ప్రతి 15 సంవత్సరాలకు దాని స్థానంలో మరోటి బర్తీ చేయాలంటే ఒకేసారి భారీ వ్యయం అవుతుందని అర్జున్ మేఘావాల్ చెప్పారు.
► ఇదీగాక అదనపు పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు కూడా అవసరమవుతాయని ఆయన స్పష్టం చేశారు.
లాభాలు..
► జమిలీ ఎన్నికల వల్ల ఒకరకంగా ప్రభుత్వ వ్యయం భారీగా తగ్గుతుందని న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘావాల్ తెలిపారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ప్రచార ఖర్చులు భారీగా ఆదా అవుతాయని పేర్కొన్నారు.
► జాతీయ, రాష్ట్ర ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల వల్ల ఎలక్షన్ ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుంది. ఇది అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
► దక్షిణాఫ్రికాలో జమిలీ ఎన్నికలే జరుగుతాయి. ప్రతి ఐదేళ్లకు ఒకేసారి జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరుగుతాయి. రెండేళ్లకు ఒకసారి మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారు.
► యూకేలోనూ ఎన్నికలు స్థిరమైన కాలవ్యవధుల్లో జరుగుతున్నాయి. పార్లమెంట్ చట్టం 2011 ప్రకారం నిర్ణీత కాలవ్యవధి ప్రకారమే స్థిరంగా నిర్వహిస్తారు.
► స్వీడన్‌లో కూడా జమిలీ తీరు ఎన్నికలే నిర్వహిస్తారు. నాలుగేళ్లకు ఒకసారి సెప్టెంబర్ రెండవ ఆదివారం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు.
ఇదీ చదవండి: ఉదయనిధి ‘సనాతన ధర్మం’ వ్యాఖ్యల దుమారం.. స్టాలిన్ ఏమన్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment