Cons
-
వెహికల్ కొంటున్నారా?.. దీన్ని ఓ లుక్ వేయండి!
ఒక వాహనం కొనుగోలు చేయాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మొత్తం డబ్బు ఒకేసారి చెల్లించి తీసుకోవడం. రెండు 'ఈఎమ్ఐ' రూపంలో తీసుకోవడం. ఇంతకీ ఏ విధంగా కొనుగోలు చేస్తే ఉత్తమం? మొత్తం డబ్బు చెల్లించడం (ఫుల్ క్యాష్) ద్వారా లాభాలేంటి? ఈఎమ్ఐ ద్వారా కొనుగోలు చేస్తే వచ్చే లాభ, నష్టాల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.బంధువులు కొన్నారు, పక్కింటి వాళ్ళు కొన్నారు, ఎదురింటి వాళ్ళు కొన్నారు అని, ఆవేశంతో ఆలోచించకుండా వాహనాలు కొనుగోలు చేస్తే.. ఆ తరువాత ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధిక వడ్డీలు ఆర్థిక ఒత్తిడికి గురి చేస్తాయి. కాబట్టి ఒక వాహనం కొనుగోలు చేసే ముందు ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకోవడం మాత్రమే.. సంపాదనను కూడా బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది.మొత్తం డబ్బు చెల్లించి (ఫుల్ క్యాష్)ఏదైనా వాహనం (కారు / బైక్) కొనాలంటే మొత్తం డబ్బు చెల్లించడం అనేది ఉత్తమ ఎంపిక. ఎందుకంటే ఒకేసారి వాహన ఖరీదును చెల్లించాలమంటే.. ప్రతి నెలా ఈఎమ్ఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. రిజిస్టేషన్స్, యాక్ససరీస్ వంటివన్నీ ఒకేసారి పొందవచ్చు. వడ్డీ చార్జీలు నుంచి తప్పించుకోవచ్చు. అంతే కాకుండా వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా కొన్ని సార్లు ఆఫర్స్ కూడా లభిస్తాయి. తక్షణమే మీరు వాహనానికి ఓనర్ కూడా అవ్వొచ్చు.లోన్ మీద కారు కొనుగోలునిజానికి ప్రతి ఒక్కరూ మొత్తం డబ్బు చెల్లించే విధానం పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక కారు కొనాలంటే కనీసం రూ. 10 లక్షల కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఒకేసారి అంత మొత్తం చెల్లించడం కొందరికి కష్టమే. కానీ వారు ప్రతి నెలా కొంత మొత్తంగా చెల్లిస్తూ కారును కొనుగోలు చేసే స్థోమత ఉంటుంది. అలాంటి వారు తప్పకుండా లోన్ మీద కారును తీసుకోవచ్చు.లోన్ ద్వారా కారు కొనుగోలు చేసేవారు తెలుసుకోవాల్సిన విషయాలు👉లోన్ తీసుకుని కారు కొనేయాలనుకుంటే సరిపోదు. ఎందుకంటే ఒక బ్యాంకు మీకు వెహికల్ లోన్ ఇవ్వాలంటే ముందుగా మీ సంపాదన, సిబిల్ స్కోర్ వంటి వాటిని చూస్తుంది. ఇవన్నీ బేరీజు వేసుకుని మీరు లోన్ తీసుకోవడానికి అర్హులేనా? అర్హులైతే ఎంత వరకు లోన్ మంజూరవుతుంది, అనే విషయాలను పరిగణలోకి తీసుకుంటుంది.👉వెహికల్ లోన్ తీసుకునే వ్యక్తి తిరిగి చెల్లించే సమయం (డ్యూరేషన్) ఎంచుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయమును ఏమిటంటే? మీరు ఎంచుకున్న సమయం లేదా సంవత్సరాలను బట్టి వడ్డీ అనేది నిర్ణయిస్తారు. డ్యూరేషన్ అనేది వీలైనంత తక్కువ సెలక్ట్ చేసుకుంటే వడ్డీ తగ్గుతుంది.👉కొన్ని సందర్భాల్లో కొన్ని డీలర్‌షిప్‌లు కొంత కాలానికి 0% ఫైనాన్సింగ్‌తో సహా ప్రమోషనల్ వడ్డీ రేట్లను అందిస్తాయి. ఇది మీరు తీసుకునే లోన్‌కు సంబందించిన ఖర్చులను కొంత తగ్గించడానికి ఉపయోగపడుతుంది.👉లోన్ తీసుకునే వ్యక్తి వడ్డీ రేట్లను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో తొందరపడితే నష్టపోయేది మీరే. కాబట్టి తక్కువ వడ్డీ రేటుకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోకండి. కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఈ విషయంలో భారీ వడ్డీలను వసూలు చేసి అమాయక ప్రజలను దోచుకునే అవకాశం ఉంది.లోన్ తీసుకుని వాహనాలను కొనుగోలు చేయడంలో పెద్దగా లాభాలు కనిపించవు, కానీ ఆదమరిస్తే నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.👉రుణ గ్రహీత లోన్ తీసుకున్నప్పుడు వడ్డీ చార్జీలను తీసుకోకుండా ముందడుగు వేస్తే.. అసలు ధర కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మళ్ళీ మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.👉వడ్డీ అనేది కూడా చివరి వరకు ఒకేలా ఉండదు. ఇందులో కొన్ని సార్లు పెరుగుదలలు కూడా ఉంటాయి. రేపో రేటు పెరిగితే కొన్ని బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు వడ్డీలను అమాంతం పెంచేస్తాయి. ఇది రుణ గ్రహీత మీద భారం పడేలా చేస్తాయి.👉ముందుగానే మీ సంపాదన, ఈఎమ్ఐ వంటి వాటిని లెక్కించుకోవాలి. ఒకసారి ఈఎమ్ఐ మొదలు పెట్టిన తరువాత.. ఇతరత్రా ఖర్చులు తగ్గించుకోవాలి. లేకుండా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుపోవాల్సి ఉంటుంది. నెలవారీ ఖర్చులు కూడా లెక్కించుకోవడం ఉత్తమం. పొరపాటున ఈఎమ్ఐ కట్టడం ఆలస్యమైతే.. కట్టాల్సిన డబ్బు కంటే ఇంకా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇది సిబిల్ స్కోర్ మీద కూడా ప్రభావం చూపుతుంది.10 లక్షల కారును 7 సంవత్సరాల వ్యవధితో లోన్ ద్వారా తీసుకుంటే?👉ఒక వ్యక్తి రూ. 10 లక్షల కారును కొనాలనుకుంటే.. దానికి కావాల్సిన లోన్‌ను బ్యాంక్ / ఆర్థిక సంస్థ నుంచి తీసుకుంటారు. డ్యూరేషన్ 7 సంవత్సరాలు ఎంచుకున్నట్లయితే.. నెలకు సుమారు రూ. 15వేలు కంటే ఎక్కువ ఈఎమ్ఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా మీకు లోన్ ఇచ్చే బ్యాంక్ ఫిక్స్ చేసే వడ్డీ రేటు మీద ఆధారపడి ఉంటుంది.ఉదాహరణకు.. ఒక బ్యాంక్ 8.65 శాతం వడ్డీతో రూ. 10 లక్షలు లోన్ ఇస్తే (7 సంవత్సరాల కాల వ్యవధి) నెలకు రూ. 15912 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీరు 7 సంవత్సరాల్లో మొత్తం రూ. 13,36,608 చెల్లించాల్సి ఉంటుంది. అంటే తీసుకున్నదానికంటే సుమారు రూ. 3.36 లక్షలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.అదే వడ్డీ రేటు 11 శాతం అనుకుంటే (10 లక్షలు 7 సంవత్సరాల డ్యూరేషన్) అప్పుడు నెలకు రూ. 17122 చొప్పున మొత్తం రూ. 14,38,248 చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి ఎంత వడ్డీకి ఎంత చెల్లించాల్సి ఉంటుందనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. -
సంతోష్ శివన్‌కు కాన్స్ అవార్డు.. తొలి భారతీయుడిగా రికార్డ్
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్‌కు అరుదైన గౌరవం లభించింది. కాన్స్ చలన చిత్రోత్సవాల్లో అందించే ప్రతిష్టాత్మకమైన పియర్ ఏంజెనీ అవార్డు ఈ ఏడాది సంతోష్ శివన్‌ను వరించింది. మే 14 నుంచి మే 25 వరకు 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్‌లో జరగనుంది. మే 24న సంతోష్ శివన్ అవార్డు అందుకోనున్నారని హాలీవుడ్ సమాచారం. కాగా ఈ అవార్డును అందుకోనున్న తొలి భారతీయుడు కూడా సంతోష్ శివనే అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ విషయంలో విశిష్ట సేవలు అందించి, రెట్రో ఫోకస్ అండ్ మోడ్రన్ లెన్స్‌ను కనుగొన్న ఫ్రెంచ్ శాస్త్రవేత్త పియర్ ఏంజెనీకి నివాళిగా 2013లో ఆయన పేరిట పియర్ ఏంజెనీ అవార్డు ఆరంభించారు కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహకులు. అప్పట్నుంచి ప్రతి ఏటా ఒక ఛాయాగ్రాహకుడికి ఈ అవార్డుని ప్రదానం చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది సంతోష్ శివన్ అందుకోనున్నారు. ఇక ఛాయాగ్రాహకుడిగా సంతోష్ చేసిన చిత్రాల్లో హిందీ ‘దిల్ సే’, ‘ముంబైకర్’ (దర్శకుడిగానూ), తెలుగులో ‘స్పైడర్’, తమిళంలో ‘తుపాకీ’, మలయాళంలో ‘ఉరుమి’ (దర్శకుడిగానూ), వంటి పలు చిత్రాలు ఉన్నాయి. కేవలం సినిమాటోగ్రాఫర్‌గానే కాదు.. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా కూడా నిరూపించుకున్నారు. -
జమిలి లాభనష్టాలపై కేంద్రం వివరణ
ఢిల్లీ: ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానరూపకల్పనకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలపై లాభనష్టాలను పేర్కొంటూ గత పార్లమెంట్ సెషన్లో కేంద్ర న్యాయ శాఖ మంత్రి విడుదల చేసిన రిపోర్టు తాజాగా తెరమీదకు వచ్చింది. పార్లమెంట్లో కిరోడీ లాల్ మీనా అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘావాల్ సమాధానం ఇది.. సవాళ్లు.. ►జమిలి ఎన్నికలకు రాజ్యాంగంలోని ఐదు ఆర్టికల్స్‌లో సవరణలు అవసరమని న్యాయ శాఖా మంత్రి తెలిపారు. 1) పార్లమెంటు సభల వ్యవధిపై ఆర్టికల్ 83, 2) లోక్‌సభను రాష్ట్రపతి రద్దు చేయడంపై ఆర్టికల్ 85, 3) రాష్ట్ర శాసనసభల వ్యవధిపై ఆర్టికల్ 172, 4) రాష్ట్రాల శాసనసభలను రద్దు చేయడంపై ఆర్టికల్ 174 5) రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనపై ఆర్టికల్ 356 ► ఇది కాకుండా జమిలీ ఎన్నికల నిర్వహణకు దేశం సమాఖ్య నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఏకాభిప్రాయాన్ని పొందడం తప్పనిసరి అని అర్జున్ మేఘావాల్ తెలిపారు. ► అదనపు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (EVMలు/VVPATలు) అవసరమవుతాయి. వీటి ఖర్చు వేల కోట్ల వరకు ఉంటుంది. ► EVM మెషీన్ జీవితకాలం కేవలం 15 సంవత్సరాలు మాత్రమే అని పరిగణనలోకి తీసుకుంటే.. ఈ యంత్రాన్ని దాని జీవిత కాలంలో మూడు లేదా నాలుగు సార్లు ఉపయోగించవచ్చు. ప్రతి 15 సంవత్సరాలకు దాని స్థానంలో మరోటి బర్తీ చేయాలంటే ఒకేసారి భారీ వ్యయం అవుతుందని అర్జున్ మేఘావాల్ చెప్పారు. ► ఇదీగాక అదనపు పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు కూడా అవసరమవుతాయని ఆయన స్పష్టం చేశారు. లాభాలు.. ► జమిలీ ఎన్నికల వల్ల ఒకరకంగా ప్రభుత్వ వ్యయం భారీగా తగ్గుతుందని న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘావాల్ తెలిపారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ప్రచార ఖర్చులు భారీగా ఆదా అవుతాయని పేర్కొన్నారు. ► జాతీయ, రాష్ట్ర ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల వల్ల ఎలక్షన్ ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుంది. ఇది అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ► దక్షిణాఫ్రికాలో జమిలీ ఎన్నికలే జరుగుతాయి. ప్రతి ఐదేళ్లకు ఒకేసారి జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరుగుతాయి. రెండేళ్లకు ఒకసారి మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారు. ► యూకేలోనూ ఎన్నికలు స్థిరమైన కాలవ్యవధుల్లో జరుగుతున్నాయి. పార్లమెంట్ చట్టం 2011 ప్రకారం నిర్ణీత కాలవ్యవధి ప్రకారమే స్థిరంగా నిర్వహిస్తారు. ► స్వీడన్లో కూడా జమిలీ తీరు ఎన్నికలే నిర్వహిస్తారు. నాలుగేళ్లకు ఒకసారి సెప్టెంబర్ రెండవ ఆదివారం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఇదీ చదవండి: ఉదయనిధి ‘సనాతన ధర్మం’ వ్యాఖ్యల దుమారం.. స్టాలిన్ ఏమన్నారంటే.. -
‘యురేనియం’తో మానవ మనుగడకు ప్రమాదం
సాక్షి, షాద్‌నగర్: నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరిగితే వన్యప్రాణులతో పాటుగా మానవ మనుగడకు ప్రమాదం పొంచి ఉందని సామాజిక ఉద్యమకారిణి, సీనియర్ పాత్రికేయురాలు సజయ ఆందోళన వ్యక్తం చేశారు. నల్లమల్లలో యురేనియం తవ్వకాలను ఎందుకు వ్యతిరేకించాలనే అంశంపై పట్టణంలోని పెన్షనర్ భవనంలో గురువారం ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సజయ హాజరై మాట్లాడారు. నల్లమల్లలో యురేనియం తవ్వకాలు జరిపితే ఎంతోమంది ఉపాధిని కోల్పోయి నిరాశ్రయులుగా మారతారన్నారు. కేంద్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు కృష్ణానది నీటిని వినియోగించడమే కాకుండా అడవిలో 4వేల బోర్లను తవ్వించేందుకు నిర్ణయించిందని తెలిపారు. దీంతో ఆ ప్రాంతం బోరు బావులు, కృష్ణానది ప్రాజెక్టులోని నీరు పూర్తిగా కలుషితమయంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. యురేనియాన్ని వెలికితీసే క్రమంలో నీటితో పాటుగా వాతావరణం కలుషితంగా మారుతుందన్నారు. నల్లమల్ల అడవుల చుట్టూ ఉన్న మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలతోపాటు కృష్ణానది నీటిని వినియోగించే ప్రాంతాలు యురేనియంతో ప్రత్యక్ష, పరోక్షంగా ప్రభావితమవుతాయని హెచ్చరించారు. యురేనియం వెలికితీసి అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని కేంద్రం చెబుతోందని తెలిపారు. యురేనియం భూమిలో ఉన్నంత వరకు జీవకోటికి ఎలాంటి హాని లేదని, దానిని బయటకు తీసేటప్పుడు వెలువడే రేడియేషన్ వల్ల భూమి, వాతావరణం, నీళ్లు పూర్తిగా కలుషితమతాయని చెప్పారు. తద్వారా చర్మవ్యాధులు రావడంతో పాటుగా రేడియేషన్ తీవ్రత పెరిగి ప్రజలకు భయానకమైన క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. పుట్టబోయే శిశువులు అంగవైకల్యం వస్తుందని, రోగాల బారిన పడతారని అన్నారు. సమస్యలు వచ్చినప్పుడు ప్రతిఒక్కరూ ప్రశ్నించే గొంతుకగా మారాలని పిలుపునిచ్చారు. ఉద్యమాలు, పోరాటాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. యురేనియం వ్యతిరేక పోరాటం తెలంగాణ ఉద్యమ తరహాలో చేపట్టాలని అన్నారు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీర్లపల్లి శంకర్, బాల్‌రాజ్‌గౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, అశోక్, ప్రజాసంఘాల నాయకులు టీజీ శ్రీనివాస్, రవీంద్రనాథ్, తిరుమలయ్య, అర్జునప్ప, చంద్రారెడ్డి, సత్యం, శివారెడ్డి, శ్రీనివాస్, సిద్ధార్థ, కరుణాకర్, రఘు తదితరులు ఉన్నారు. -
షి ఈజ్ సంజన
ఐశ్వర్యారాయ్ చుట్టూ ఇప్పటికి ఈ దేశం మూడుసార్లు విస్మయంతో పరిభ్రమించింది! మొదటిసారి ‘మిస్ వరల్డ్’గా ఆమె సాక్షాత్కరించినప్పుడు. రెండోసారి బిడ్డ తల్లిగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కాస్త ఒళ్లు చేసి కనిపించినప్పుడు. మూడోసారి.. అదే కాన్స్‌లో మొన్న ఊదారంగు లిప్‌స్టిక్‌తో ఆమె ఓ ఏలియన్లా ప్రత్యక్షమైనప్పుడు! వాస్తవానికి ఇప్పుడు ఐశ్వర్య గురించి మాట్లాడుకోడానికి వేరే సందర్భం ఉంది. రెండు రోజుల క్రితమే ‘సరబ్జిత్’ చిత్రం విడుదలైంది. అందులో దల్బీర్కౌర్గా ఐశ్వర్య పూర్తిస్థాయి పంజాబీ అమ్మాయిగా నటించలేకపోయారని సమీక్షలు, విమర్శలు రావలసిన సమయం ఇది. కానీ అంతకంటే ఎక్కువగా కాన్స్‌లో ఆమె తనకు ఏమాత్రం నప్పని ఊదారంగు లిప్‌స్టిక్‌ను పెదవులపై అద్దుకుని కనిపించడం పెద్ద విశేషం అయింది. ఐశ్వర్య రెడ్ కార్పెట్ మీదకు వచ్చే ముందు ‘స్మర్ఫ్’ని గానీ ముద్దు పెట్టుకుని రాలేదు కదా అని సోషల్ మీడియా నివ్వెరపోయింది. స్మర్ఫ్ అన్నది బెల్జియం దేశపు కామిక్ కథల్లో కనిపించే వింత మానవ ఆకారం. ఇంకా ఇలాంటి ఎన్నో కామెంట్లకు ఐశ్వర్య తన ఊదారంగు పెదవులతోనే చిరునవ్వులు చిందించారు. ‘ఐ హాడ్ ఫన్ విత్ ఇట్’ అన్నదొక్కటే ఆమె జవాబు. ఐశ్వర్య ఎప్పటికీ కేట్ మిడిల్టన్లా, విక్టోరియా బెక్‌హామ్‌ల సన్నగా, నాజూకుగా ఉండాలన్నది ఆమె అభిమానుల ఆకాంక్ష అయితే కావచ్చు కానీ, వారు ఒక పరిణత సౌందర్యాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించవలసిన సమయం ఏనాడో వచ్చేసిందని గ్రహించాలి. ఫోర్డ్.. చక్రం తిప్పింది ఐశ్వర్య జీవితంలో ఎప్పుడూ ఉల్లాసమే తప్ప.. ఆమెను అమితమైన ఉద్వేగానికి గురిచేసిన సంఘటనలు ఒకటీ రెండుకు మించి లేవు. ఉద్వేగాల ప్రస్తావన దేనికంటే మనిషి మనోబలానికి పరీక్షకు పెట్టే సందర్భాలవి. ప్రాంతాలకు, భాషలకు అతీతంగా దేశం ఆమెను ఒక సౌందర్య దేవతగా మాత్రమే ఆరాధించి ఆగిపోలేదు. సినిమా నటిగా అభిమానించింది. స్కూలు, స్కూలు తర్వాత కాలేజీకి వెళ్లిన ఒక మామూలు అమ్మాయిలాగే ఐశ్వర్య తన చదువును శ్రద్ధగా కొనసాగించారు. అయితే 18 ఏళ్ల వయసులో ఫోర్డ్ కంపెనీ సూపర్ మోడల్ పోటీలో గెలవడం, ఆ గుర్తింపుతో అమెరికన్ మేగజైన్ ‘వోగ్’ లో ఐశ్వర్య ఫోటోలు రావడం.. మోడలింగ్ రంగంపై ఆమెకు ఆసక్తిని ఏర్పరిచాయి. మోడలింగ్ ఆమెను మిస్ వరల్డ్‌ని చేస్తే, మిస్ వరల్డ్ ఆమెను సినీతారను చేసింది. ఈ పేరు ప్రఖ్యాతులు ఐక్యరాజ్యసమితిలోని వివిధ విభాగాలకు ఆమెను రాయబారిని చేశాయి. పంచింది తప్ప... దాచింది లేదు గ్లామర్ ప్రపంచానికి ఐశ్వర్య గురించి తెలియంది ఏమీ మిగల్లేదు. మిగిలిన కొద్దిపాటి వ్యక్తిగత విషయాలను దాచుకునే ప్రయత్నం ఐశ్వర్య చేయలేదు. ఆమె జీవితంలోని అతి పెద్ద దుమారం ప్రేమ. అతి చిన్న వివాదం పెళ్లి. ఇవి తప్ప.. చాలా మంది ప్రముఖుల జీవిత చరిత్రల్లో కనిపించే వివాదాస్పద అధ్యాయం ఏదీ ఐశ్వర్య కెరియర్లో లేదు. ‘పనామా పేపర్స్’లో అమితాబ్ బచ్చన్‌తో పాటు, ఐశ్వర్య పేరు కూడా ఉందని ఇటీవల వచ్చిన ఆరోపణ కూడా ఆమె ఇమేజ్‌ని దెబ్బతీయగలిగింది కాదు. ఎందుకంటే ఐశ్వర్య దాచిపెట్టుకున్నదానికన్నా... పంచి పెట్టిందే ఎక్కువ. అది ప్రేమ అయినా, తన సంపాదన అయినా. రెండు ప్రేమలు.. ఒక ప్రమాదం బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ ఐశ్వర్యను ప్రేమిస్తున్నాడన్న సంగతి అతడి సన్నిహితుల ద్వారా తొలిసారి ప్రపంచానికి వెల్లడయినప్పుడు ఎవరూ ఆ వార్తకంత ప్రాముఖ్యాన్ని ఇవ్వలేదు. బహుశా ఐశ్వర్య ఆకర్షణశక్తిలో పడనివారెవరైనా ఉంటే అది వార్త అయి ఉండేది. అలాగే ఐశ్వర్య సల్మాన్‌ని ప్రేమిస్తోందని ఆమె సన్నిహితులు ఎవరైనా బయటపెట్టి ఉన్నా కూడా దానికి విశేషమైన ప్రచారం లభించి ఉండేది. ఈ రెండూ జరగలేదు. ఐశ్వర్య తనకు తానుగా బయటికి వచ్చి, సల్మాన్ తనను ప్రేమ పేరుతో వేధించాడని, హింసించాడని బహిరంగంగా వెల్లడించిన తర్వాత గానీ.. సల్మాన్ ఐశ్వర్య ప్రేమలో ఉన్నట్లే, ఐశ్వర్య కూడా సల్మాన్ ప్రేమలో ఉందని ఎవరూ అనుకోలేదు. ‘‘తాగేవాడు, దుర్భాషలాడేవాడు. మర్యాద లేకుండా ప్రవర్తించేవాడు. భౌతికంగా, మానసికంగా నన్ను హింసించేవాడు’ అని ఐశ్వర్య నోరు తెరిచి చెప్పినప్పుడు ఆమె అభిమానులు తట్టుకోలేకపోయారు. ‘ఒక దేవత నుంచి వినవలసిన మాటలేనా ఇవి’ అన్నట్లు వారు సల్మాన్‌పై కోపంతో ఉడికిపోయారు. పత్రికలకు మేత దొరికింది కానీ, ఐశ్వర్యకు మన శ్శాంతి కరువైంది. అయితే సల్మాన్ పిచ్చి ప్రేమ వల్ల కరువైన మనశ్శాంతి కంటే ఇది తక్కువే. అందుకే ఆమె మీడియా ముందు ఓపెన్ అయ్యారు. మరో నటుడు వివేక్ ఒబెరాయ్‌కి ఐశ్వర్య జీవితంలో కొంత చోటు ఉన్నట్లు కనిపించినప్పటికీ, అది అతడికి అతడుగా చేసుకున్న చోటు మాత్రమే. అలా ఒక మర్యాదస్థుడైన ప్రేమికుడిలానే వివేక్ మిగిలిపోవడం ఐశ్వర్యను రెండో ప్రేమ ప్రమాదం నుంచి తప్పించింది. బిగ్ ‘బి’ ఫ్యామిలీకి ఐశ్వర్యం రెండుసార్లు తనకు నిమిత్తం లేకుండా ప్రేమ వరకు వెళ్లొచ్చిన ఐశ్వర్యకు నికార్సయిన తొలి ప్రేమ అభిషేక్ నుంచి లభించింది. 2007 ఏప్రిల్ 20న ఐశ్వర్య-అభిషేక్‌ల పెళ్లి జరిగింది. అయితే అసలు పెళ్లికి ముందు జరిగిన దోష నివారణ పెళ్లిలో హిందూ సంప్రదాయం ప్రకారం ఐశ్వర్యను ఒక చెట్టుకు ఇచ్చి చెయ్యడం అనే ‘ఆచారం’పై మానవ హక్కుల సంఘాలు అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. పెళ్లి రోజు 300 మంది పోలీసు సిబ్బంది ముంబైలోని పెళ్లింటి ముందు వధూవరులకు, వారి కుటుంబ సభ్యులకు, ఆహ్వానితులకు కలిపి గట్టి భద్రతా వలయంగా ఏర్పడ్డారు. అభిషేక్ పెళ్లి విషయం తెలిసి, హార్ట్ బ్రేక్ అయిన అభిషేక్ స్నేహితురాలు మణికట్టుపై బ్లేడుతో కోసుకోవడం మినహా... పెళ్లి ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. సౌందర్య ‘భారం’ చక్కటి కళ్లు, చురుకైన నవ్వు, మిస్ వరల్డ్ టైటిల్, హాలీవుడ్ ఫేమ్, భర్తగా ఓ అర్హుడైన బ్రహ్మచారి, దేశం యావత్తూ గౌరవించే ఒక గొప్ప కుటుంబం, ఆ కుటుంబానికి కోడలిగా వెళ్లడం, తర్వాత పాప పుట్టడం.. ఇవన్నీ కూడా ఐశ్వర్య అనే ఒక గాంధర్వ కన్య జీవితంలో జరిగినట్లుగా ఒక కథలా అనిపిస్తాయి. కానీ ఆ తర్వాతి కథనే... వినేందుకు, నమ్మేందుకు మానవమాత్ర హృదయాలు సిద్ధంగా లేవు! రెండు దశాబ్దాల క్రితం మనోఫలకంలో ఉన్న ఐశ్వర్యనే ఈ హృదయాలు ఇప్పటికీ ఆకాంక్షిస్తున్నాయి. అయితే శోభా డే వంటి షో బిజినెస్ కాలమిస్టు ఐశ్వర్య ‘ఎప్పటికీ దేవతలానే ఉండిపోవాలన్న’ అభిమానుల ఆశలోని అసమంజసత్వాన్ని తనది కాని స్వరంలో కాస్త సున్నితంగా ప్రశ్నిస్తున్నారు. బిడ్డ తల్లిగా 38 ఏళ్ల వయసులో ఐశ్వర్యకు ఐక్యరాజ్య సమితి ‘గర్ల్‌చైల్డ్ కాంపెయిన్’ ప్రచార కర్తగా ఉండేందుకు అవకాశం లభించినప్పుడు కూడా ఆమె అభిమానులు పెరుగుతున్న ఐశ్వర్య బరువును తూచారు తప్ప, దేశ ప్రతిష్టకు అమెనొక బరువైన ప్రతీకగా స్వీకరించలేకపోయారు! ఒక వెబ్ సైట్ అయితే ఏనుగులు ఘీంకరిస్తున్న సౌండ్ ఎఫెక్టులతో ‘ఐశ్వర్యారాయ్స్ షాకింగ్ వెయిట్ గెయిన్’ అనే టైటిల్ పెట్టి ఐశ్వర్యపై ఒక వీడియోను పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే దానిని 5 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. కామెంట్లు పెట్టారు. ‘ఆమె ఒక బాలీవుడ్ నటి. అందాన్ని కాపాడుకోవడం, ఫిట్‌గా ఉండడం ఆమె విధి’ అని, ‘డెలివరీ అయ్యాక కూడా తన జీరో సైజ్‌ను వెనక్కి తెచ్చుకున్న విక్టోరియా బెక్‌హామ్ నుంచి ఐశ్వర్య ఎంతో నేర్చుకోవాలి’ అని కొందరు సూచనలు కూడా ఇచ్చారు. అంతః సౌందర్యం ఐశ్వర్యను ఇంకా గ్లామర్ పాత్రల్లో చూడాలనుకుంటున్న వాళ్లు ఉన్నప్పటికీ, గ్లామరస్‌గా కనిపించాలన్న పట్టింపు ఐశ్వర్యలో లేదు. ఆమె వాస్తవంలో జీవిస్తూ, వాస్తవంతో కలిసి ప్రయాణిస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణ ప్రస్తుతం థియేటర్స్‌లో ఉన్న ‘సరబ్జిత్’ చిత్రం. అందులో ఐశ్వర్య డీగ్లామర్ పాత్రను పోషించారు. ‘‘ఎందుకలా తనను తను తగ్గించుకోవడం?’ అనే ఆవేదన అభిమానులలో ఉండొచ్చు. కానీ వాళ్లొక విషయాన్ని గ్రహించాలి. కెరీర్‌కు దూరం అవడం అంటే అభిమానులకు దూరం కావడం కాదు. మరికాస్త దగ్గరవడం! సోషల్ వర్క్ లోని ఆమె అంతఃసౌందర్యాన్ని చూడగలితే ఆమె మనకు ఎంత దగ్గరయ్యారో, ఎంతగా దగ్గరవుతున్నారో తెలుస్తుంది. మరికొన్ని విశేషాలు ఐశ్వర్య యంగ్ మోడల్‌గా ఉన్నప్పుడు ముంబై షాపింగ్ మాల్లో ఓసారి ఐశ్యర్యను బాలీవుడ్ నటి రేఖ చూశారు. వెంటనే ఆ అమ్మాయిని గుర్తుపట్టి, పలకరించి, భుజం తట్టి ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు రేఖ. ఐశ్వర్యకు వాచీలను సేకరించడం ఇష్టం. ఆభరణాలు ధరించడం అయిష్టం. 2005లో బ్రిటన్‌లో ఐశ్యర్యను పోలిన బార్బీ డాల్స్ పరిమితంగా విడుదలయ్యాయి. అవి మార్కెట్లోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే అవన్నీ అమ్ముడయ్యాయి! అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్ 2006లో ఇండియా వచ్చినప్పుడు ఆయనతో కలిసి భోజనం చేయడానికి ఆమిర్‌ఖాన్‌తో పాటు ఐశ్వర్యకూ ఆహ్వానం అందింది. అయితే అప్పుడు ఐశ్వర్య ధూమ్-2 షూటింగ్ కోసం బ్రెజిల్లో ఉండడం వల్ల ఆ విందుకు వెళ్లలేకపోయారు. ఐశ్వర్య సినిమా యాక్టర్ అవాలని కలలు కనలేదు. మెడిసిన్ చదవాలని అనుకున్నారు. ఆమెకు ఇష్టమైన సబ్జెక్ట్ జువాలజీ. ‘ఓప్రా విన్ఫ్రే షో’లో పాల్గొన్న తొలి భారతీయ ప్రముఖురాలు ఐశ్వర్యారాయ్. మేడమ్ తుస్సాడ్స్ మైనపు బొమ్మల మ్యూజియంలో స్థానం దక్కించుకున్న తొలి భారతీయ నటి ఐశ్వర్య. ఐశ్వర్యా రాయ్: నటి, మోడల్ జన్మస్థలం : మంగుళూరు (కర్నాటక) జన్మదినం : 1 నవంబర్ 1973 (42) సంతతి : తుళు తల్లిదండ్రులు : కృష్ణరాజ్ (ఆర్మీ బయాలజిస్ట్) బృంద (గృహిణి) సోదరుడు : అన్న ఆదిత్య (నేవీ ఇంజినీర్) భర్త : అభిషేక్ బచన్ సంతానం : కూతురు ఆరాధ్య (2011) అత్తమామలు : అమితాబ్, జయభాదురి అవార్డులు : మిస్ వరల్డ్ (1994) పద్మశ్రీ (2009) ఫిల్మ్‌ఫేర్ (2 అవార్డులు, 10 నామినేషన్లు) -
ఆ నగరం ధన్యమైంది!
ఆ నేడు - 20 సెప్టెంబర్, 1946 అదేమిటోగానీ కాన్స్ అనే పేరు వినబడగానే, అది ఒక నగరం పేరనే స్పృహ కంటే, వెండితెర ఒకటి కళ్ల ముందు కదలాడుతుంది. ఆ తెరపై ఒక్కటొక్కటిగా చిత్రాలు ప్రదర్శితమవుతాయి. ‘కాన్స్‌లో సినిమా హాళ్లు మాత్రమే ఉంటాయట’ అనే పుకారు ఒకటి ఉండేది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు... కాన్స్‌కు, సినిమాలకు ఎంత దగ్గరి సంబంధం ఉందో! ఫ్రాన్స్‌లోని కాన్స్ పట్టణాన్ని భౌగోళిక, ఆర్థిక, సామాజిక కోణాలలో అంచనా వేయడం కంటే...కళాత్మక దృష్టితో అంచనా వేయడమే ఎక్కువ. ఒక పట్టణానికి ఇంతకంటే అదృష్టం ఏముంటుంది గనుక! ప్రపంచం ముచ్చట పడి మురిసిపోయే కాన్స్ చిత్స్రోత్సవానికి పునాది రాయి 1946 సెప్టెంబరు 20లో పడినప్పటికీ, దీని తాలూకు వేర్లు 1932లో ఉన్నాయి. బ్రిటన్, అమెరికాల సహకారంతో ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ సినిమాటోగ్రాఫిక్ ఫెస్టివల్’ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ కిక్కు చాలాకాలం వరకు పోలేదు. దాని ప్రభావంతోనే కావచ్చు 1946లో ‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ రెక్కలు దాల్చింది. ఆర్థిక సమస్యల వల్ల రెండుసార్లు తప్ప అప్పటి నుంచి క్రమం తప్పకుండా పసందైన రుచితో ప్రపంచ ప్రేక్షకులను కనువిందు చేస్తూనే ఉంది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్. చిత్రోత్సవ సమయంలో.... కాన్స్‌కు వెళ్లడం అంటే వినోదం మాత్రమే కాదు... విజ్ఞాన దారుల్లో పయనించడం కూడా!