ఆ నగరం ధన్యమైంది!
ఆ నేడు
- 20 సెప్టెంబర్, 1946
అదేమిటోగానీ కాన్స్ అనే పేరు వినబడగానే, అది ఒక నగరం పేరనే స్పృహ కంటే, వెండితెర ఒకటి కళ్ల ముందు కదలాడుతుంది. ఆ తెరపై ఒక్కటొక్కటిగా చిత్రాలు ప్రదర్శితమవుతాయి. ‘కాన్స్‌లో సినిమా హాళ్లు మాత్రమే ఉంటాయట’ అనే పుకారు ఒకటి ఉండేది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు... కాన్స్‌కు, సినిమాలకు ఎంత దగ్గరి సంబంధం ఉందో!
ఫ్రాన్స్‌లోని కాన్స్ పట్టణాన్ని భౌగోళిక, ఆర్థిక, సామాజిక కోణాలలో అంచనా వేయడం కంటే...కళాత్మక దృష్టితో అంచనా వేయడమే ఎక్కువ. ఒక పట్టణానికి ఇంతకంటే అదృష్టం ఏముంటుంది గనుక!
ప్రపంచం ముచ్చట పడి మురిసిపోయే కాన్స్ చిత్స్రోత్సవానికి పునాది రాయి 1946 సెప్టెంబరు 20లో పడినప్పటికీ, దీని తాలూకు వేర్లు 1932లో ఉన్నాయి. బ్రిటన్, అమెరికాల సహకారంతో ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ సినిమాటోగ్రాఫిక్ ఫెస్టివల్’ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ కిక్కు చాలాకాలం వరకు పోలేదు. దాని ప్రభావంతోనే కావచ్చు 1946లో ‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ రెక్కలు దాల్చింది. ఆర్థిక సమస్యల వల్ల రెండుసార్లు తప్ప అప్పటి నుంచి క్రమం తప్పకుండా పసందైన రుచితో ప్రపంచ ప్రేక్షకులను కనువిందు చేస్తూనే ఉంది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్.
చిత్రోత్సవ సమయంలో.... కాన్స్‌కు వెళ్లడం అంటే వినోదం మాత్రమే కాదు... విజ్ఞాన దారుల్లో పయనించడం కూడా!