షి ఈజ్ సంజన | special story to aishwarya rai | Sakshi
Sakshi News home page

షి ఈజ్ సంజన

Published Sun, May 22 2016 10:51 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM

షి ఈజ్  సంజన

షి ఈజ్ సంజన

ఐశ్వర్యారాయ్ చుట్టూ ఇప్పటికి ఈ దేశం మూడుసార్లు  విస్మయంతో పరిభ్రమించింది! మొదటిసారి ‘మిస్ వరల్డ్’గా ఆమె సాక్షాత్కరించినప్పుడు. రెండోసారి బిడ్డ తల్లిగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కాస్త ఒళ్లు చేసి కనిపించినప్పుడు. మూడోసారి.. అదే కాన్స్‌లో మొన్న ఊదారంగు లిప్‌స్టిక్‌తో ఆమె ఓ ఏలియన్‌లా ప్రత్యక్షమైనప్పుడు!


వాస్తవానికి ఇప్పుడు ఐశ్వర్య గురించి మాట్లాడుకోడానికి వేరే సందర్భం ఉంది. రెండు రోజుల క్రితమే ‘సరబ్‌జిత్’ చిత్రం విడుదలైంది. అందులో దల్బీర్‌కౌర్‌గా ఐశ్వర్య పూర్తిస్థాయి పంజాబీ అమ్మాయిగా నటించలేకపోయారని సమీక్షలు, విమర్శలు రావలసిన సమయం ఇది. కానీ అంతకంటే ఎక్కువగా కాన్స్‌లో ఆమె తనకు ఏమాత్రం నప్పని ఊదారంగు లిప్‌స్టిక్‌ను పెదవులపై అద్దుకుని కనిపించడం పెద్ద విశేషం అయింది. ఐశ్వర్య రెడ్ కార్పెట్ మీదకు వచ్చే ముందు ‘స్మర్ఫ్’ని గానీ ముద్దు పెట్టుకుని రాలేదు కదా అని సోషల్ మీడియా నివ్వెరపోయింది. స్మర్ఫ్ అన్నది బెల్జియం దేశపు కామిక్ కథల్లో కనిపించే వింత మానవ ఆకారం. ఇంకా ఇలాంటి ఎన్నో కామెంట్‌లకు ఐశ్వర్య తన ఊదారంగు పెదవులతోనే చిరునవ్వులు చిందించారు. ‘ఐ హాడ్ ఫన్ విత్ ఇట్’ అన్నదొక్కటే ఆమె జవాబు. ఐశ్వర్య ఎప్పటికీ కేట్ మిడిల్టన్‌లా, విక్టోరియా బెక్‌హామ్‌ల సన్నగా, నాజూకుగా ఉండాలన్నది ఆమె అభిమానుల ఆకాంక్ష అయితే కావచ్చు కానీ, వారు ఒక పరిణత సౌందర్యాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించవలసిన సమయం ఏనాడో వచ్చేసిందని గ్రహించాలి.

 

 
ఫోర్డ్.. చక్రం తిప్పింది

ఐశ్వర్య జీవితంలో ఎప్పుడూ ఉల్లాసమే తప్ప.. ఆమెను అమితమైన ఉద్వేగానికి గురిచేసిన సంఘటనలు ఒకటీ రెండుకు మించి లేవు. ఉద్వేగాల ప్రస్తావన దేనికంటే మనిషి మనోబలానికి పరీక్షకు పెట్టే సందర్భాలవి. ప్రాంతాలకు, భాషలకు అతీతంగా దేశం ఆమెను ఒక సౌందర్య దేవతగా మాత్రమే ఆరాధించి ఆగిపోలేదు. సినిమా నటిగా అభిమానించింది. స్కూలు, స్కూలు తర్వాత కాలేజీకి వెళ్లిన ఒక మామూలు అమ్మాయిలాగే ఐశ్వర్య తన చదువును శ్రద్ధగా కొనసాగించారు. అయితే 18 ఏళ్ల వయసులో ఫోర్డ్ కంపెనీ సూపర్ మోడల్ పోటీలో గెలవడం, ఆ గుర్తింపుతో అమెరికన్ మేగజైన్ ‘వోగ్’ లో ఐశ్వర్య ఫోటోలు రావడం.. మోడలింగ్ రంగంపై ఆమెకు ఆసక్తిని ఏర్పరిచాయి. మోడలింగ్ ఆమెను మిస్ వరల్డ్‌ని చేస్తే, మిస్ వరల్డ్  ఆమెను సినీతారను చేసింది. ఈ పేరు ప్రఖ్యాతులు ఐక్యరాజ్యసమితిలోని వివిధ విభాగాలకు ఆమెను రాయబారిని చేశాయి.

 

పంచింది తప్ప... దాచింది లేదు
గ్లామర్ ప్రపంచానికి ఐశ్వర్య గురించి తెలియంది ఏమీ మిగల్లేదు. మిగిలిన కొద్దిపాటి వ్యక్తిగత విషయాలను దాచుకునే ప్రయత్నం ఐశ్వర్య చేయలేదు. ఆమె జీవితంలోని అతి పెద్ద దుమారం ప్రేమ. అతి చిన్న వివాదం పెళ్లి. ఇవి తప్ప.. చాలా మంది ప్రముఖుల జీవిత చరిత్రల్లో కనిపించే వివాదాస్పద అధ్యాయం ఏదీ ఐశ్వర్య కెరియర్‌లో లేదు. ‘పనామా పేపర్స్’లో అమితాబ్ బచ్చన్‌తో పాటు, ఐశ్వర్య పేరు కూడా ఉందని ఇటీవల వచ్చిన ఆరోపణ కూడా ఆమె ఇమేజ్‌ని దెబ్బతీయగలిగింది కాదు. ఎందుకంటే ఐశ్వర్య దాచిపెట్టుకున్నదానికన్నా... పంచి పెట్టిందే ఎక్కువ. అది ప్రేమ అయినా, తన సంపాదన అయినా.

 

రెండు ప్రేమలు.. ఒక ప్రమాదం
బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ ఐశ్వర్యను ప్రేమిస్తున్నాడన్న సంగతి అతడి సన్నిహితుల ద్వారా తొలిసారి ప్రపంచానికి వెల్లడయినప్పుడు ఎవరూ ఆ వార్తకంత ప్రాముఖ్యాన్ని ఇవ్వలేదు. బహుశా ఐశ్వర్య ఆకర్షణశక్తిలో పడనివారెవరైనా ఉంటే అది వార్త అయి ఉండేది. అలాగే ఐశ్వర్య సల్మాన్‌ని ప్రేమిస్తోందని ఆమె సన్నిహితులు ఎవరైనా బయటపెట్టి ఉన్నా కూడా దానికి విశేషమైన ప్రచారం లభించి ఉండేది. ఈ రెండూ జరగలేదు. ఐశ్వర్య తనకు తానుగా బయటికి వచ్చి, సల్మాన్ తనను ప్రేమ పేరుతో వేధించాడని, హింసించాడని బహిరంగంగా వెల్లడించిన తర్వాత గానీ.. సల్మాన్ ఐశ్వర్య ప్రేమలో ఉన్నట్లే, ఐశ్వర్య కూడా సల్మాన్ ప్రేమలో ఉందని ఎవరూ అనుకోలేదు.

 
‘‘తాగేవాడు, దుర్భాషలాడేవాడు. మర్యాద లేకుండా ప్రవర్తించేవాడు. భౌతికంగా, మానసికంగా నన్ను హింసించేవాడు’ అని ఐశ్వర్య నోరు తెరిచి చెప్పినప్పుడు ఆమె అభిమానులు తట్టుకోలేకపోయారు. ‘ఒక దేవత నుంచి వినవలసిన మాటలేనా ఇవి’ అన్నట్లు వారు సల్మాన్‌పై కోపంతో ఉడికిపోయారు. పత్రికలకు మేత దొరికింది కానీ, ఐశ్వర్యకు మన శ్శాంతి కరువైంది. అయితే సల్మాన్ పిచ్చి ప్రేమ వల్ల కరువైన మనశ్శాంతి కంటే ఇది తక్కువే. అందుకే ఆమె మీడియా ముందు ఓపెన్ అయ్యారు.

 
మరో నటుడు వివేక్ ఒబెరాయ్‌కి ఐశ్వర్య జీవితంలో కొంత చోటు ఉన్నట్లు కనిపించినప్పటికీ, అది అతడికి అతడుగా చేసుకున్న చోటు మాత్రమే. అలా ఒక మర్యాదస్థుడైన ప్రేమికుడిలానే వివేక్ మిగిలిపోవడం ఐశ్వర్యను రెండో ప్రేమ ప్రమాదం నుంచి తప్పించింది. 

 

బిగ్ ‘బి’ ఫ్యామిలీకి ఐశ్వర్యం
రెండుసార్లు తనకు నిమిత్తం లేకుండా ప్రేమ వరకు వెళ్లొచ్చిన ఐశ్వర్యకు నికార్సయిన తొలి ప్రేమ అభిషేక్ నుంచి లభించింది.  2007 ఏప్రిల్ 20న ఐశ్వర్య-అభిషేక్‌ల పెళ్లి జరిగింది. అయితే అసలు పెళ్లికి ముందు జరిగిన దోష నివారణ పెళ్లిలో హిందూ సంప్రదాయం ప్రకారం ఐశ్వర్యను ఒక చెట్టుకు ఇచ్చి చెయ్యడం అనే ‘ఆచారం’పై మానవ హక్కుల సంఘాలు అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. పెళ్లి రోజు 300 మంది పోలీసు సిబ్బంది ముంబైలోని పెళ్లింటి ముందు వధూవరులకు, వారి కుటుంబ సభ్యులకు, ఆహ్వానితులకు కలిపి గట్టి భద్రతా వలయంగా ఏర్పడ్డారు. అభిషేక్ పెళ్లి విషయం తెలిసి, హార్ట్ బ్రేక్ అయిన అభిషేక్ స్నేహితురాలు మణికట్టుపై బ్లేడుతో కోసుకోవడం మినహా... పెళ్లి ఘట్టం ప్రశాంతంగా ముగిసింది.

 

సౌందర్య ‘భారం’
చక్కటి కళ్లు, చురుకైన నవ్వు, మిస్ వరల్డ్ టైటిల్, హాలీవుడ్ ఫేమ్, భర్తగా ఓ అర్హుడైన బ్రహ్మచారి, దేశం యావత్తూ గౌరవించే ఒక గొప్ప కుటుంబం, ఆ కుటుంబానికి కోడలిగా వెళ్లడం, తర్వాత పాప పుట్టడం.. ఇవన్నీ కూడా ఐశ్వర్య అనే ఒక గాంధర్వ కన్య జీవితంలో జరిగినట్లుగా ఒక కథలా అనిపిస్తాయి. కానీ ఆ తర్వాతి కథనే... వినేందుకు, నమ్మేందుకు మానవమాత్ర హృదయాలు సిద్ధంగా లేవు! రెండు దశాబ్దాల క్రితం మనోఫలకంలో ఉన్న ఐశ్వర్యనే ఈ హృదయాలు ఇప్పటికీ  ఆకాంక్షిస్తున్నాయి. అయితే శోభా డే వంటి షో బిజినెస్ కాలమిస్టు  ఐశ్వర్య ‘ఎప్పటికీ దేవతలానే ఉండిపోవాలన్న’ అభిమానుల ఆశలోని అసమంజసత్వాన్ని తనది కాని స్వరంలో కాస్త సున్నితంగా ప్రశ్నిస్తున్నారు.

 
బిడ్డ తల్లిగా 38 ఏళ్ల వయసులో ఐశ్వర్యకు ఐక్యరాజ్య సమితి ‘గర్ల్‌చైల్డ్ కాంపెయిన్’ ప్రచార కర్తగా ఉండేందుకు అవకాశం లభించినప్పుడు కూడా ఆమె అభిమానులు పెరుగుతున్న ఐశ్వర్య బరువును తూచారు తప్ప, దేశ ప్రతిష్టకు అమెనొక బరువైన ప్రతీకగా స్వీకరించలేకపోయారు! ఒక వెబ్ సైట్ అయితే ఏనుగులు ఘీంకరిస్తున్న సౌండ్ ఎఫెక్టులతో ‘ఐశ్వర్యారాయ్స్ షాకింగ్ వెయిట్ గెయిన్’ అనే టైటిల్ పెట్టి ఐశ్వర్యపై ఒక వీడియోను పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే దానిని 5 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. కామెంట్లు పెట్టారు. ‘ఆమె ఒక బాలీవుడ్ నటి. అందాన్ని కాపాడుకోవడం, ఫిట్‌గా ఉండడం ఆమె విధి’ అని, ‘డెలివరీ అయ్యాక కూడా తన జీరో సైజ్‌ను వెనక్కి తెచ్చుకున్న విక్టోరియా బెక్‌హామ్ నుంచి ఐశ్వర్య ఎంతో నేర్చుకోవాలి’ అని కొందరు సూచనలు కూడా ఇచ్చారు.

 

అంతః సౌందర్యం
ఐశ్వర్యను ఇంకా గ్లామర్ పాత్రల్లో చూడాలనుకుంటున్న వాళ్లు ఉన్నప్పటికీ, గ్లామరస్‌గా కనిపించాలన్న పట్టింపు ఐశ్వర్యలో లేదు. ఆమె వాస్తవంలో జీవిస్తూ, వాస్తవంతో కలిసి ప్రయాణిస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణ ప్రస్తుతం థియేటర్స్‌లో ఉన్న ‘సరబ్‌జిత్’ చిత్రం. అందులో ఐశ్వర్య డీగ్లామర్ పాత్రను పోషించారు. ‘‘ఎందుకలా తనను తను తగ్గించుకోవడం?’ అనే ఆవేదన అభిమానులలో ఉండొచ్చు. కానీ వాళ్లొక విషయాన్ని గ్రహించాలి. కెరీర్‌కు దూరం అవడం అంటే అభిమానులకు దూరం కావడం కాదు. మరికాస్త దగ్గరవడం! సోషల్ వర్క్ లోని ఆమె అంతఃసౌందర్యాన్ని చూడగలితే ఆమె మనకు ఎంత దగ్గరయ్యారో, ఎంతగా దగ్గరవుతున్నారో తెలుస్తుంది.

 

 

మరికొన్ని విశేషాలు
ఐశ్వర్య యంగ్ మోడల్‌గా ఉన్నప్పుడు ముంబై షాపింగ్ మాల్‌లో ఓసారి ఐశ్యర్యను బాలీవుడ్ నటి రేఖ చూశారు. వెంటనే ఆ అమ్మాయిని గుర్తుపట్టి, పలకరించి, భుజం తట్టి ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు రేఖ. ఐశ్వర్యకు వాచీలను సేకరించడం ఇష్టం. ఆభరణాలు ధరించడం అయిష్టం.  2005లో బ్రిటన్‌లో ఐశ్యర్యను పోలిన బార్బీ డాల్స్ పరిమితంగా విడుదలయ్యాయి. అవి మార్కెట్‌లోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే అవన్నీ అమ్ముడయ్యాయి!

     
అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్ 2006లో ఇండియా వచ్చినప్పుడు ఆయనతో కలిసి భోజనం చేయడానికి ఆమిర్‌ఖాన్‌తో పాటు ఐశ్వర్యకూ ఆహ్వానం అందింది. అయితే అప్పుడు ఐశ్వర్య ధూమ్-2 షూటింగ్ కోసం బ్రెజిల్‌లో ఉండడం వల్ల ఆ విందుకు వెళ్లలేకపోయారు. ఐశ్వర్య సినిమా యాక్టర్ అవాలని కలలు కనలేదు. మెడిసిన్ చదవాలని అనుకున్నారు.  ఆమెకు ఇష్టమైన సబ్జెక్ట్ జువాలజీ.  ‘ఓప్రా విన్‌ఫ్రే షో’లో పాల్గొన్న తొలి భారతీయ ప్రముఖురాలు ఐశ్వర్యారాయ్. మేడమ్ తుస్సాడ్స్ మైనపు బొమ్మల మ్యూజియంలో స్థానం దక్కించుకున్న తొలి భారతీయ నటి ఐశ్వర్య.

 

 

ఐశ్వర్యా రాయ్: నటి, మోడల్
జన్మస్థలం :   మంగుళూరు (కర్నాటక)
జన్మదినం :   1 నవంబర్ 1973 (42)
సంతతి : తుళు
తల్లిదండ్రులు :      కృష్ణరాజ్ (ఆర్మీ బయాలజిస్ట్)  బృంద (గృహిణి)
సోదరుడు :   అన్న ఆదిత్య (నేవీ ఇంజినీర్)
భర్త :     అభిషేక్ బచన్
సంతానం :    కూతురు ఆరాధ్య (2011)
అత్తమామలు :     అమితాబ్, జయభాదురి
అవార్డులు :   మిస్ వరల్డ్ (1994) పద్మశ్రీ (2009) ఫిల్మ్‌ఫేర్ (2 అవార్డులు, 10 నామినేషన్లు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement