Sarabjit
-
ఆస్కార్ జాబితాలో ‘ఎంఎస్ ధోని’
ఐష్ నటించిన సరబ్జిత్ సినిమా కూడా.. లాస్ ఏంజెలిస్: భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ’ చలనచిత్రం ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు అర్హత చిత్రాల సుదీర్ఘ జాబితాలో చోటు దక్కించుకుంది. ఆ చిత్రంతోపాటు ఐశ్వర్యారాయ్ బచ్చన్ రణదీప్ హుడా ప్రధాన పాత్రల్లో నటించిన సరబ్జిత్ సినిమా కూడా ఆస్కార్ అర్హత దక్కించుకున్న 336 ఫీచర్ సినిమాల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఈ రెండూ జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలే కావడం గమనార్హం. ఆస్కార్ అర్హత సాధించిన జాబితాలోని ఫీచర్ సినిమాల వివరాలను బుధవారం ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ విడుదల చేసిందని ఎంటర్టైన్ మెంట్ వీక్లీ పేర్కొంది. 2016 ఏడాదికిగానూ అకాడమీ అవార్డుల జాబితాలో ఉన్న ఈ సినిమాల్లో.. లాస్ ఏంజెలిస్‌లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కనీసం వారంపాటు ప్రదర్శితమైన వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. 35 ఎంఎం లేదా 70 ఎంఎం సినిమా లేదా అర్హత కలిగిన డిజిటల్ ఫార్మాట్లో కనీసం 40 నిమిషాల నిడివికి మించ కుండా ఉండాలి. ఆస్కార్ అర్హ త జాబితాలో క్వీన్ ఆఫ్ కత్వే, లాలా లాండ్, మూన్ లైట్, మాంచెస్టర్ బై ది సీ, సైలెన్స్, అరైవల్, హాక్షా రిడ్జ్, డెడ్‌పూల్, సూసైడ్ స్క్వాడ్, కెప్టెన్అమెరికా, సివిల్ వార్, ఎక్స్‌మెన్ లాంటి చిత్రాలు ఉన్నాయి. -
షి ఈజ్ సంజన
ఐశ్వర్యారాయ్ చుట్టూ ఇప్పటికి ఈ దేశం మూడుసార్లు విస్మయంతో పరిభ్రమించింది! మొదటిసారి ‘మిస్ వరల్డ్’గా ఆమె సాక్షాత్కరించినప్పుడు. రెండోసారి బిడ్డ తల్లిగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కాస్త ఒళ్లు చేసి కనిపించినప్పుడు. మూడోసారి.. అదే కాన్స్‌లో మొన్న ఊదారంగు లిప్‌స్టిక్‌తో ఆమె ఓ ఏలియన్లా ప్రత్యక్షమైనప్పుడు! వాస్తవానికి ఇప్పుడు ఐశ్వర్య గురించి మాట్లాడుకోడానికి వేరే సందర్భం ఉంది. రెండు రోజుల క్రితమే ‘సరబ్జిత్’ చిత్రం విడుదలైంది. అందులో దల్బీర్కౌర్గా ఐశ్వర్య పూర్తిస్థాయి పంజాబీ అమ్మాయిగా నటించలేకపోయారని సమీక్షలు, విమర్శలు రావలసిన సమయం ఇది. కానీ అంతకంటే ఎక్కువగా కాన్స్‌లో ఆమె తనకు ఏమాత్రం నప్పని ఊదారంగు లిప్‌స్టిక్‌ను పెదవులపై అద్దుకుని కనిపించడం పెద్ద విశేషం అయింది. ఐశ్వర్య రెడ్ కార్పెట్ మీదకు వచ్చే ముందు ‘స్మర్ఫ్’ని గానీ ముద్దు పెట్టుకుని రాలేదు కదా అని సోషల్ మీడియా నివ్వెరపోయింది. స్మర్ఫ్ అన్నది బెల్జియం దేశపు కామిక్ కథల్లో కనిపించే వింత మానవ ఆకారం. ఇంకా ఇలాంటి ఎన్నో కామెంట్లకు ఐశ్వర్య తన ఊదారంగు పెదవులతోనే చిరునవ్వులు చిందించారు. ‘ఐ హాడ్ ఫన్ విత్ ఇట్’ అన్నదొక్కటే ఆమె జవాబు. ఐశ్వర్య ఎప్పటికీ కేట్ మిడిల్టన్లా, విక్టోరియా బెక్‌హామ్‌ల సన్నగా, నాజూకుగా ఉండాలన్నది ఆమె అభిమానుల ఆకాంక్ష అయితే కావచ్చు కానీ, వారు ఒక పరిణత సౌందర్యాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించవలసిన సమయం ఏనాడో వచ్చేసిందని గ్రహించాలి. ఫోర్డ్.. చక్రం తిప్పింది ఐశ్వర్య జీవితంలో ఎప్పుడూ ఉల్లాసమే తప్ప.. ఆమెను అమితమైన ఉద్వేగానికి గురిచేసిన సంఘటనలు ఒకటీ రెండుకు మించి లేవు. ఉద్వేగాల ప్రస్తావన దేనికంటే మనిషి మనోబలానికి పరీక్షకు పెట్టే సందర్భాలవి. ప్రాంతాలకు, భాషలకు అతీతంగా దేశం ఆమెను ఒక సౌందర్య దేవతగా మాత్రమే ఆరాధించి ఆగిపోలేదు. సినిమా నటిగా అభిమానించింది. స్కూలు, స్కూలు తర్వాత కాలేజీకి వెళ్లిన ఒక మామూలు అమ్మాయిలాగే ఐశ్వర్య తన చదువును శ్రద్ధగా కొనసాగించారు. అయితే 18 ఏళ్ల వయసులో ఫోర్డ్ కంపెనీ సూపర్ మోడల్ పోటీలో గెలవడం, ఆ గుర్తింపుతో అమెరికన్ మేగజైన్ ‘వోగ్’ లో ఐశ్వర్య ఫోటోలు రావడం.. మోడలింగ్ రంగంపై ఆమెకు ఆసక్తిని ఏర్పరిచాయి. మోడలింగ్ ఆమెను మిస్ వరల్డ్‌ని చేస్తే, మిస్ వరల్డ్ ఆమెను సినీతారను చేసింది. ఈ పేరు ప్రఖ్యాతులు ఐక్యరాజ్యసమితిలోని వివిధ విభాగాలకు ఆమెను రాయబారిని చేశాయి. పంచింది తప్ప... దాచింది లేదు గ్లామర్ ప్రపంచానికి ఐశ్వర్య గురించి తెలియంది ఏమీ మిగల్లేదు. మిగిలిన కొద్దిపాటి వ్యక్తిగత విషయాలను దాచుకునే ప్రయత్నం ఐశ్వర్య చేయలేదు. ఆమె జీవితంలోని అతి పెద్ద దుమారం ప్రేమ. అతి చిన్న వివాదం పెళ్లి. ఇవి తప్ప.. చాలా మంది ప్రముఖుల జీవిత చరిత్రల్లో కనిపించే వివాదాస్పద అధ్యాయం ఏదీ ఐశ్వర్య కెరియర్లో లేదు. ‘పనామా పేపర్స్’లో అమితాబ్ బచ్చన్‌తో పాటు, ఐశ్వర్య పేరు కూడా ఉందని ఇటీవల వచ్చిన ఆరోపణ కూడా ఆమె ఇమేజ్‌ని దెబ్బతీయగలిగింది కాదు. ఎందుకంటే ఐశ్వర్య దాచిపెట్టుకున్నదానికన్నా... పంచి పెట్టిందే ఎక్కువ. అది ప్రేమ అయినా, తన సంపాదన అయినా. రెండు ప్రేమలు.. ఒక ప్రమాదం బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ ఐశ్వర్యను ప్రేమిస్తున్నాడన్న సంగతి అతడి సన్నిహితుల ద్వారా తొలిసారి ప్రపంచానికి వెల్లడయినప్పుడు ఎవరూ ఆ వార్తకంత ప్రాముఖ్యాన్ని ఇవ్వలేదు. బహుశా ఐశ్వర్య ఆకర్షణశక్తిలో పడనివారెవరైనా ఉంటే అది వార్త అయి ఉండేది. అలాగే ఐశ్వర్య సల్మాన్‌ని ప్రేమిస్తోందని ఆమె సన్నిహితులు ఎవరైనా బయటపెట్టి ఉన్నా కూడా దానికి విశేషమైన ప్రచారం లభించి ఉండేది. ఈ రెండూ జరగలేదు. ఐశ్వర్య తనకు తానుగా బయటికి వచ్చి, సల్మాన్ తనను ప్రేమ పేరుతో వేధించాడని, హింసించాడని బహిరంగంగా వెల్లడించిన తర్వాత గానీ.. సల్మాన్ ఐశ్వర్య ప్రేమలో ఉన్నట్లే, ఐశ్వర్య కూడా సల్మాన్ ప్రేమలో ఉందని ఎవరూ అనుకోలేదు. ‘‘తాగేవాడు, దుర్భాషలాడేవాడు. మర్యాద లేకుండా ప్రవర్తించేవాడు. భౌతికంగా, మానసికంగా నన్ను హింసించేవాడు’ అని ఐశ్వర్య నోరు తెరిచి చెప్పినప్పుడు ఆమె అభిమానులు తట్టుకోలేకపోయారు. ‘ఒక దేవత నుంచి వినవలసిన మాటలేనా ఇవి’ అన్నట్లు వారు సల్మాన్‌పై కోపంతో ఉడికిపోయారు. పత్రికలకు మేత దొరికింది కానీ, ఐశ్వర్యకు మన శ్శాంతి కరువైంది. అయితే సల్మాన్ పిచ్చి ప్రేమ వల్ల కరువైన మనశ్శాంతి కంటే ఇది తక్కువే. అందుకే ఆమె మీడియా ముందు ఓపెన్ అయ్యారు. మరో నటుడు వివేక్ ఒబెరాయ్‌కి ఐశ్వర్య జీవితంలో కొంత చోటు ఉన్నట్లు కనిపించినప్పటికీ, అది అతడికి అతడుగా చేసుకున్న చోటు మాత్రమే. అలా ఒక మర్యాదస్థుడైన ప్రేమికుడిలానే వివేక్ మిగిలిపోవడం ఐశ్వర్యను రెండో ప్రేమ ప్రమాదం నుంచి తప్పించింది. బిగ్ ‘బి’ ఫ్యామిలీకి ఐశ్వర్యం రెండుసార్లు తనకు నిమిత్తం లేకుండా ప్రేమ వరకు వెళ్లొచ్చిన ఐశ్వర్యకు నికార్సయిన తొలి ప్రేమ అభిషేక్ నుంచి లభించింది. 2007 ఏప్రిల్ 20న ఐశ్వర్య-అభిషేక్‌ల పెళ్లి జరిగింది. అయితే అసలు పెళ్లికి ముందు జరిగిన దోష నివారణ పెళ్లిలో హిందూ సంప్రదాయం ప్రకారం ఐశ్వర్యను ఒక చెట్టుకు ఇచ్చి చెయ్యడం అనే ‘ఆచారం’పై మానవ హక్కుల సంఘాలు అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. పెళ్లి రోజు 300 మంది పోలీసు సిబ్బంది ముంబైలోని పెళ్లింటి ముందు వధూవరులకు, వారి కుటుంబ సభ్యులకు, ఆహ్వానితులకు కలిపి గట్టి భద్రతా వలయంగా ఏర్పడ్డారు. అభిషేక్ పెళ్లి విషయం తెలిసి, హార్ట్ బ్రేక్ అయిన అభిషేక్ స్నేహితురాలు మణికట్టుపై బ్లేడుతో కోసుకోవడం మినహా... పెళ్లి ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. సౌందర్య ‘భారం’ చక్కటి కళ్లు, చురుకైన నవ్వు, మిస్ వరల్డ్ టైటిల్, హాలీవుడ్ ఫేమ్, భర్తగా ఓ అర్హుడైన బ్రహ్మచారి, దేశం యావత్తూ గౌరవించే ఒక గొప్ప కుటుంబం, ఆ కుటుంబానికి కోడలిగా వెళ్లడం, తర్వాత పాప పుట్టడం.. ఇవన్నీ కూడా ఐశ్వర్య అనే ఒక గాంధర్వ కన్య జీవితంలో జరిగినట్లుగా ఒక కథలా అనిపిస్తాయి. కానీ ఆ తర్వాతి కథనే... వినేందుకు, నమ్మేందుకు మానవమాత్ర హృదయాలు సిద్ధంగా లేవు! రెండు దశాబ్దాల క్రితం మనోఫలకంలో ఉన్న ఐశ్వర్యనే ఈ హృదయాలు ఇప్పటికీ ఆకాంక్షిస్తున్నాయి. అయితే శోభా డే వంటి షో బిజినెస్ కాలమిస్టు ఐశ్వర్య ‘ఎప్పటికీ దేవతలానే ఉండిపోవాలన్న’ అభిమానుల ఆశలోని అసమంజసత్వాన్ని తనది కాని స్వరంలో కాస్త సున్నితంగా ప్రశ్నిస్తున్నారు. బిడ్డ తల్లిగా 38 ఏళ్ల వయసులో ఐశ్వర్యకు ఐక్యరాజ్య సమితి ‘గర్ల్‌చైల్డ్ కాంపెయిన్’ ప్రచార కర్తగా ఉండేందుకు అవకాశం లభించినప్పుడు కూడా ఆమె అభిమానులు పెరుగుతున్న ఐశ్వర్య బరువును తూచారు తప్ప, దేశ ప్రతిష్టకు అమెనొక బరువైన ప్రతీకగా స్వీకరించలేకపోయారు! ఒక వెబ్ సైట్ అయితే ఏనుగులు ఘీంకరిస్తున్న సౌండ్ ఎఫెక్టులతో ‘ఐశ్వర్యారాయ్స్ షాకింగ్ వెయిట్ గెయిన్’ అనే టైటిల్ పెట్టి ఐశ్వర్యపై ఒక వీడియోను పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే దానిని 5 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. కామెంట్లు పెట్టారు. ‘ఆమె ఒక బాలీవుడ్ నటి. అందాన్ని కాపాడుకోవడం, ఫిట్‌గా ఉండడం ఆమె విధి’ అని, ‘డెలివరీ అయ్యాక కూడా తన జీరో సైజ్‌ను వెనక్కి తెచ్చుకున్న విక్టోరియా బెక్‌హామ్ నుంచి ఐశ్వర్య ఎంతో నేర్చుకోవాలి’ అని కొందరు సూచనలు కూడా ఇచ్చారు. అంతః సౌందర్యం ఐశ్వర్యను ఇంకా గ్లామర్ పాత్రల్లో చూడాలనుకుంటున్న వాళ్లు ఉన్నప్పటికీ, గ్లామరస్‌గా కనిపించాలన్న పట్టింపు ఐశ్వర్యలో లేదు. ఆమె వాస్తవంలో జీవిస్తూ, వాస్తవంతో కలిసి ప్రయాణిస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణ ప్రస్తుతం థియేటర్స్‌లో ఉన్న ‘సరబ్జిత్’ చిత్రం. అందులో ఐశ్వర్య డీగ్లామర్ పాత్రను పోషించారు. ‘‘ఎందుకలా తనను తను తగ్గించుకోవడం?’ అనే ఆవేదన అభిమానులలో ఉండొచ్చు. కానీ వాళ్లొక విషయాన్ని గ్రహించాలి. కెరీర్‌కు దూరం అవడం అంటే అభిమానులకు దూరం కావడం కాదు. మరికాస్త దగ్గరవడం! సోషల్ వర్క్ లోని ఆమె అంతఃసౌందర్యాన్ని చూడగలితే ఆమె మనకు ఎంత దగ్గరయ్యారో, ఎంతగా దగ్గరవుతున్నారో తెలుస్తుంది. మరికొన్ని విశేషాలు ఐశ్వర్య యంగ్ మోడల్‌గా ఉన్నప్పుడు ముంబై షాపింగ్ మాల్లో ఓసారి ఐశ్యర్యను బాలీవుడ్ నటి రేఖ చూశారు. వెంటనే ఆ అమ్మాయిని గుర్తుపట్టి, పలకరించి, భుజం తట్టి ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు రేఖ. ఐశ్వర్యకు వాచీలను సేకరించడం ఇష్టం. ఆభరణాలు ధరించడం అయిష్టం. 2005లో బ్రిటన్‌లో ఐశ్యర్యను పోలిన బార్బీ డాల్స్ పరిమితంగా విడుదలయ్యాయి. అవి మార్కెట్లోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే అవన్నీ అమ్ముడయ్యాయి! అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్ 2006లో ఇండియా వచ్చినప్పుడు ఆయనతో కలిసి భోజనం చేయడానికి ఆమిర్‌ఖాన్‌తో పాటు ఐశ్వర్యకూ ఆహ్వానం అందింది. అయితే అప్పుడు ఐశ్వర్య ధూమ్-2 షూటింగ్ కోసం బ్రెజిల్లో ఉండడం వల్ల ఆ విందుకు వెళ్లలేకపోయారు. ఐశ్వర్య సినిమా యాక్టర్ అవాలని కలలు కనలేదు. మెడిసిన్ చదవాలని అనుకున్నారు. ఆమెకు ఇష్టమైన సబ్జెక్ట్ జువాలజీ. ‘ఓప్రా విన్ఫ్రే షో’లో పాల్గొన్న తొలి భారతీయ ప్రముఖురాలు ఐశ్వర్యారాయ్. మేడమ్ తుస్సాడ్స్ మైనపు బొమ్మల మ్యూజియంలో స్థానం దక్కించుకున్న తొలి భారతీయ నటి ఐశ్వర్య. ఐశ్వర్యా రాయ్: నటి, మోడల్ జన్మస్థలం : మంగుళూరు (కర్నాటక) జన్మదినం : 1 నవంబర్ 1973 (42) సంతతి : తుళు తల్లిదండ్రులు : కృష్ణరాజ్ (ఆర్మీ బయాలజిస్ట్) బృంద (గృహిణి) సోదరుడు : అన్న ఆదిత్య (నేవీ ఇంజినీర్) భర్త : అభిషేక్ బచన్ సంతానం : కూతురు ఆరాధ్య (2011) అత్తమామలు : అమితాబ్, జయభాదురి అవార్డులు : మిస్ వరల్డ్ (1994) పద్మశ్రీ (2009) ఫిల్మ్‌ఫేర్ (2 అవార్డులు, 10 నామినేషన్లు) -
నేల తుడిచి.. గిన్నెలు కడిగి.. వంట చేసి...
అందాల సుందరి ఐశ్వర్యా రాయ్ జీవితం ఎంత విలాసవంతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏది కోరితే అది వండి పెట్టడానికి వంట మనుషులు, కాలు బయటపెడితే కారులో తీసుకెళ్లడానికి డ్రైవర్.. ఇలా ఐష్‌కి బోల్డంత మంది సేవకులు ఉంటారు. అలాంటి ఐశ్వర్యవంతురాలు ఈ మధ్య సాదాసీదా మహిళలా డ్రెస్ చేసుకుని, గుళ్లో నేల తుడిచి, వంట చేసి, భక్తులతో పాటు తాను కూడా నేల మీద కూర్చుని భోజనం చేసి, గిన్నెలు కడగడం టాపిక్ అయ్యింది. ఐష్ ఇదంతా చేసింది అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్లో. మామూలుగా ఐష్ అడపాదడపా గుళ్లకు వెళుతుంటారు. కానీ, ఇలాంటి సేవా కార్యక్రమం ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు చేసింది ‘సరబ్జిత్’ సినిమా కోసమే. పాకిస్తాన్ జైలులో మగ్గి, ప్రాణాలు వదిలిన పంజాబీ రైతు సరబ్జిత్ సింగ్ జీవితం ఆధారంగా ఒమంగ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సరబ్జిత్ సోదరి దల్బీర్ కౌర్‌గా ఐష్ నటిస్తున్న విషయం తెలిసిందే. అమృత్సర్ స్వర్ణదేవాలయంలో ఓ భక్తురాలిగా ఐష్ సేవ చేస్తున్న సన్నివేశాలను ఇటీవల చిత్రీకరించారు. అందులో భాగంగానే ఆమె నేల తుడిచి, వంట చేసి, భక్తులతో కలిసి భోజనం చేసి, గిన్నెలు కడిగారు. ఇదంతా సినిమా కోసమే అయినా ఐష్ నటిస్తున్నట్లుగా లేదనీ, నిజంగానే భక్తితో చేసినట్లు అనిపించిందని షూటింగ్ చూసినవాళ్లు పేర్కొన్నారు. తోడబుట్టినవాడు దేశం కాని దేశంలో అన్యాయంగా జైలుపాలయ్యాడనే బాధ దల్బీర్ కళ్లల్లో స్పష్టంగా కనిపించేది. ఇప్పుడు వెండితెరపై ఈ పాత్ర చేస్తున్న ఐష్ తన కళ్లల్లో ఆ బాధను అద్భుతంగా ఆవిష్కరించగలుగుతున్నారని చిత్రబృందం అంటోంది. -
కోడలా మజాకా!
కోడలు తిరగబడితే ఏమౌతుంది? చంపేశారట! మరి రెండో కోడలు కూడా తిరగబడితే? చంపేయబోయారట! ఇదేదో చదువు సంస్కారం లేని కుటుంబంలో జరిగిన గాథ కాదు. లండన్‌లో ఓ ఎన్నారై మెట్టినింటి నిర్వాకం. ఈ కోడలు తిరగబడింది. అత్త, భర్తల జాతకాన్ని తిరగరాసింది. లండన్ పోలీసులు ఇప్పుడు ఇలాంటి కేసుల్లో సరబ్జిత్ సహకారం తీసుకుంటున్నారు. కొన్నాళ్ల కిందట లండన్‌లోని ఓ ప్రైవేట్ టెలివిజన్ చానెల్లో ‘బ్రిటన్స్ డార్కెస్ట్ టాబూస్’ అనే ప్రోగ్రామ్ కింద ఓ ఎపిసోడ్ వస్తోంది. 45 ఏళ్ల భారతీయ స్త్రీ.. సరబ్జిత్.. తన కథను చెప్పుకుపోతోంది. ఆ కథ కన్నీళ్లుగా ఉబికి ఉబికి వస్తోంది. సరబ్జిత్ స్వస్థలం పంజాబ్. ఆడపిల్లలు భారమని, ఆ భారాన్ని ఎంత త్వరగా అత్తింటికి బదిలీ చేస్తే అంత మంచిదని భావించే కుటుంబాల్లో సరబ్జిత్ కుటుంబం కూడా ఒకటి. అందుకే ఆమెకు పందొమ్మిదేళ్లు రాగానే పెళ్లి చేసేశారు. పైగా లండన్ సంబంధం. 26 ఏళ్ల కిందట మాట కదా.. ఫారిన్లో ఉంటున్న పంజాబీ కుటుంబంలోని వరుడంటే సంబరపడ్డారు సరబ్జిత్ తల్లిదండ్రులు. కానీ సరబ్జిత్ మాత్రం గుండెనిండా గుబులుతోనే వరుడి చేయిపట్టుకుంది. ఎన్నో భయాలతోనే లండన్‌కి ప్రయాణమైంది. అప్పటికే వాళ్ల ఊళ్లోని ఆడపిల్లలు ఫారిన్ సంబంధాలతో పడ్తున్న బాధలు, హింస సరబ్జిత్ భయానికి కారణాలు. కానీ తల్లిదండ్రుల ‘పరువు’ బరువు ఆమెను ఆ మూడుముళ్లకు తలవంచేలా చేసింది. కొత్త కాపురం అత్తారింట్లో పరిస్థితులే కాదు మనుషులూ చిత్రంగానే అనిపించారు సరబ్‌జిత్‌కి. ఇంట్లో పెత్తనమంతా ఆమె అత్తగారు బచన్ అత్వాల్దే. భర్త హరదేవ్ది రెస్టారెంట్ బిజినెస్. ఎప్పుడో ఉదయం వెళ్తాడు రాత్రికి వస్తాడు. మరిది సుఖ్దేవ్దీ వ్యాపారమే. అత్తగారిది, మరిదిది ఒకటే మాట. వాళ్లు చెప్పిన పని చేయడం తప్ప దేనింట్లోనూ స్వతంత్రం ఉండేది కాదు, దేనిమీదా అధికారం ఇచ్చేవారు కాదు. మరబొమ్మలా ఉండాలంతే. ఒకరకమైన ఒంటరితనానికి అలవాటు పడుతున్న సమయంలోనే మరిది సుఖదేవ్‌కి పెళ్లి సంబంధం కుదిరింది. అమ్మాయి వాళ్లూ బ్రిటన్‌లో ఉంటున్న ప్రవాస భారతీయులే. ఈ ఇంటికోడలిగా ఇంకో అమ్మాయి బలైపోతోందనే బాధ ఉన్నా తనకో తోడు దొరుకుతోందని సంతోషపడింది సరబ్జిత్. కష్టాల భాగస్వామ్యం కొత్త కోడలి పేరు సుర్జిత్. సరబ్జిత్ కన్నా యేడాది చిన్నది.ఆ ఇంట్లో పద్ధతులు, అత్తగారి పెత్తనం కొత్త పిల్లకు మింగుడు పడలేదు. ప్రతిదాన్నీ ప్రశ్నించేది. అత్త, భర్త చేతుల్లో దెబ్బలు తినేది. ‘ఈ ఇంట్లో పద్ధతులింతే. సర్దుకు పోవాలి’అంటూ సరబ్జిత్ నచ్చచెప్పేది. రెండుమూడు నెలల తేడాతో ఇద్దరికీ పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టాక అత్తగారి దాష్టీకం మరీ ఎక్కువైంది. ఎంతలా అంటే.. పిల్లలకు తల్లులు పాలు పడుతున్నా సహించలేనంతగా. ‘మీ పాలు పిల్లలకు సరిపోవడం లేదు. అందుకే డబ్బాపాలు పడదాం’ అంటూ నెలల పసికందులకు బలవంతంగా తల్లిపాలు మాన్పించింది అత్తగారు. తనే సీసాతో పాలు పట్టి పిల్లలను మచ్చిక చేసుకుంది. ఎప్పటిలా సరబ్జిత్ సహనంతో ఉన్నా సుర్జిత్ కోపాన్ని అణచుకోలేకపోయింది. అత్తగారి మీద ఎదురు తిరిగింది. కొడుకు రాగానే ‘పెద్దదాన్ని, అనుభవం ఉన్నదాన్ని పిల్లల ఆలనాపాలనా చూస్తుంటే నీ భార్య సహించట్లేదు. నీ పిల్లల్ని నా దగ్గరకి రానివ్వడం లేదు’ అంటూ లేనిపోనివి కల్పించి కళ్లనీళ్లు పెట్టుకుంది. కరిగిపోయిన సుఖదేవ్ కోపంతో భార్యమీద చేయిచేసుకున్నాడు. అప్పటి నుంచి సుర్జిత్ తన పంథా మార్చుకుంది. తనకు నచ్చినట్టు ఉండడం ప్రారంభించింది. పెళ్లికి కాకముందున్న తన అలవాట్లన్నీ అమల్లో పెట్టింది. ఇష్టమైన డ్రెస్‌లు వేసుకోవడం, మేకప్ చేసుకోవడం, ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లడం లాంటివన్నీ చేసింది. ఒక ఫైన్ మార్నింగ్ విడాకులు కావాలని కూడా తేల్చిచెప్పింది. ఆవేశంతో ఊగిపోయింది అత్తగారు. చెంప చెళ్లుమనిపించాడు భర్త. అయినా సరే విడాకులు కావాలి అంది. ఈ పరిణామాలను మౌనంగా చూస్తూ ఉండిపోయింది సరబ్జిత్. ఇండియా ట్రిప్ విడాకుల గొడవ కొనసాగుతున్నప్పుడే ఒకరోజు అత్తగారొచ్చి సుర్జిత్తో ‘బంధువుల పెళ్లి ఉంది. ఇండియా వెళ్లాలి. నేను, సుఖ్‌దేవ్, నువ్వూ.. ముగ్గురం వెళ్లాలి. మాతో వచ్చి బంధువుల దగ్గర మా పరువు కాపాడు. తర్వాత లండన్ వచ్చాక నువ్వు కోరినట్టుగా సుఖ్‌దేవ్ విడాకులు ఇచ్చేస్తాడు’ అంది బతిమాలుకున్నట్టుగా. ‘విడాకులు ఇచ్చేస్తాడు’ అన్న మాటతో అత్తగారి ప్రపోజల్‌ని ఒప్పుకుంది సుర్జిత్. అనుకున్నట్టుగానే ఇండియా ప్రయాణం అయ్యారు. బంధువుల పెళ్లీ అయింది. తిరిగి లండన్‌కు చేరుకున్నారు. కానీ సుర్జిత్ లేకుండా. ‘అమ్మేది?’ అంటూ బిలబిలమంటూ పరిగెత్తుకుంటూ వచ్చిన పిల్లల్ని దగ్గరకు తీసుకొని ‘నేను లండన్‌కి రానంటూ మీ అమ్మ ఎక్కడికో వెళ్లిపోయింది. మీరంటే ఇష్టంలేదు. అందుకే అమ్మ మిమ్మల్ని వదిలి వెళ్లిపోయింది’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు సుఖ్‌దేవ్. ఆ జవాబు విన్న సరబ్జిత్కు ఎక్కడో అనుమానం మొదలైంది. అసలు పనిగట్టుకొని సుర్జిత్ని ఇండియాకు రమ్మన్నప్పుడే ఆమె మనసు శంకించింది. ఇప్పుడు అనుమానం బలపడింది. సుర్జిత్ తల్లిదండ్రులకూ ఈ కట్టుకథనే వినిపించారు తల్లీకొడుకులు. సుర్జిత్ ఏమైంది? ఈ ప్రశ్న కొన్ని పదులు సార్లు అత్తగారిని అడిగింది సరబ్జిత్. ఆందోళనతో, భయంతో. ఎప్పుడూ మౌనమే సమాధానంగా వచ్చేది. ఒకరోజు మాత్రం అత్తగారు నోరువిప్పింది.. ‘సుర్జిత్ను జీప్‌లో రావి నది దగ్గరకి తీసుకెళ్లి గొంతు పిసికి చంపి నదిలో పారేశాం’ అని! విని సరబ్జిత్ హతాశురాలైంది. మథన పడింది. కోడలు ఆ నిజాన్ని బయటపెట్టకుండా అత్తగారు ఆమెను దాదాపు హౌజ్ అరెస్ట్ చేసింది. కానీ కూతురి మీద బెంగ పెట్టుకున్న సుర్జిత్ తల్లిదండ్రులు మాత్రం ఊరుకోలేదు. ఇండియాలో తమ బంధువులను వాకబు చేస్తూనే ఉన్నారు. ఇక్కడేమో సరబ్జిత్మీద అత్తగారి హింస ఎక్కువైంది. అట్లా ఓ రెండు నెలలు గడిచాయి. ఒకరోజు సుర్జిత్తో చెప్పినట్టే సరబ్జిత్తోనూ అంది అత్తగారు ‘మనం ఇండియాకు వెళ్తున్నాం బంధువు ఫంక్షన్ ఉంది’ అని. అంతే! వెన్నులోంచి వణుకు వచ్చింది సరబ్‌జిత్‌కి. అంటే అత్తగారు తననూ చంపే ప్రోగ్రామ్ పెట్టిందా.. ఇంక ఆలస్యం చేయొద్దు అనుకుంది. ఇంట్లో అత్తగారు లేని టైమ్‌లో సుర్జిత్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి సుర్జిత్ హత్య గురించి చెప్పింది. వెంటనే వాళ్లు పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. లండన్ పోలీసులు బచ్చన్‌అత్వాల్ ఇంటి కాలింగ్‌బెల్ నొక్కారు. పోలీసుల ముందు మొసలి కన్నీళ్లు కార్చారు అమ్మాకొడుకులు. కానీ అసలు నిజం బయటపెట్టింది సరబ్జిత్. ఆమె చెప్పిన ఆధారంతోనే ఇండియాలో బచ్చన్‌అత్వాల్ వాళ్లు హాజరైన పెళ్లి తాలూకు బంధువులను కలిశారు లండన్ పోలీసులు. అసలు ఆ పెళ్లికి సుర్జిత్ని తీసుకొని రాలేదని చెప్పారు వాళ్లు. ఇంకా కొన్ని ఆధారాలను సేకరించి మళ్లీ బచ్చన్ అత్వాల్, సుఖ్‌దేవ్‌లను విచారించారు. నిజం ఒప్పుకోలేక తప్పలేదు వాళ్లకు. సరబ్జిత్ మీద చేసిన వేధింపులూ విచారణకు వచ్చాయి. మొత్తానికి 2007లో ఆ ఇద్దరికీ శిక్ష పడింది. తర్వాత సరబ్జిత్ను ఇలాంటి కేసుల పరిశోధనలో సహాయకురాలిగా (పి.సి.ఎస్.వో.) లండన్ పోలీసులు నియమించుకున్నారు. ఇప్పుడు టీవీలో ఇదంతా చెప్తూ రెండు చేతుల్లో ముఖం దాచుకుని తనివితీరా ఏడ్చింది సరబ్జిత్. ఎంతలా అంటే అదొక టీవీ చానల్ అని కానీ, తానొక ఇంటర్వ్యూలో ఉన్నాననే స్పృహగానీ కూడా లేనంతగా. తల్లి ఒడిలో తలపెట్టి వెక్కివెక్కి ఏడ్చే బిడ్డలా! ‘ఇది నా ఒక్కదాని కథే కాదు.. భారతదేశంలోని మధ్యతరగతి కుటుంబంలోని ప్రతి ఆడపిల్ల గాథ. అత్తగారిళ్లల్లో చావు రాత రాసుకుంటున్న సుర్జిత్లూ ఎంతోమంది!’అని చెప్పి ఆ ఇంటర్వ్యూ ముగించింది సరబ్జిత్. సరబ్జిత్ ఇంటర్వ్యూ చూసిన సంప్రదాయ పంజాబీ కుటుంబాలు అనేకం ఆమెను ఆడిపోసుకున్నాయి. దేశం పరువు తీసిందని బుగ్గలు నొక్కుకున్నాయి. సరబ్జిత్ తండ్రి మాత్రం బిడ్డ భుజాన్ని తట్టాడు ‘నీకు నేనున్నా’ నని. అది చాలు నాకు కొత్త జీవితం మొదలుపెట్టడానికి అంటుంది సరబ్జిత్. ‘అత్తిళ్లల్లో ఆరళ్లు ఎదుర్కొంటున్న నాలాంటి కోడళ్లకు అండగా నిలబడ్తాను. దానికి సంబంధించి ఓ సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. విదేశీ అల్లుడు కావాలనుకునే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ సెంటర్‌ని నెలకొల్పాలనుకుంటున్నాను’అంటుంది సరబ్జిత్. ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉంది. - సాక్షి ఫ్యామిలీ