కోడలా మజాకా! | What will happen reversal daughter-in-law? | Sakshi
Sakshi News home page

కోడలా మజాకా!

Published Tue, Oct 27 2015 10:29 PM | Last Updated on Sun, Sep 3 2017 11:34 AM

కోడలా  మజాకా!

కోడలా మజాకా!

కోడలు తిరగబడితే ఏమౌతుంది?
చంపేశారట!
మరి రెండో కోడలు కూడా తిరగబడితే?
చంపేయబోయారట!
ఇదేదో చదువు సంస్కారం లేని కుటుంబంలో జరిగిన గాథ కాదు.
లండన్‌లో ఓ ఎన్నారై మెట్టినింటి నిర్వాకం.
ఈ కోడలు తిరగబడింది.
అత్త, భర్తల జాతకాన్ని తిరగరాసింది. లండన్ పోలీసులు
ఇప్పుడు ఇలాంటి కేసుల్లో సరబ్‌జిత్ సహకారం తీసుకుంటున్నారు.

 
కొన్నాళ్ల కిందట లండన్‌లోని ఓ ప్రైవేట్ టెలివిజన్ చానెల్‌లో ‘బ్రిటన్స్ డార్కెస్ట్ టాబూస్’ అనే ప్రోగ్రామ్ కింద ఓ ఎపిసోడ్ వస్తోంది. 45 ఏళ్ల భారతీయ స్త్రీ.. సరబ్‌జిత్.. తన కథను చెప్పుకుపోతోంది. ఆ కథ కన్నీళ్లుగా ఉబికి ఉబికి వస్తోంది. సరబ్‌జిత్ స్వస్థలం పంజాబ్. ఆడపిల్లలు భారమని, ఆ భారాన్ని ఎంత త్వరగా అత్తింటికి బదిలీ చేస్తే అంత మంచిదని భావించే కుటుంబాల్లో సరబ్‌జిత్ కుటుంబం కూడా ఒకటి. అందుకే ఆమెకు పందొమ్మిదేళ్లు రాగానే పెళ్లి చేసేశారు. పైగా లండన్ సంబంధం. 26 ఏళ్ల కిందట మాట కదా.. ఫారిన్‌లో ఉంటున్న పంజాబీ కుటుంబంలోని వరుడంటే సంబరపడ్డారు సరబ్‌జిత్ తల్లిదండ్రులు. కానీ సరబ్‌జిత్ మాత్రం గుండెనిండా గుబులుతోనే వరుడి చేయిపట్టుకుంది. ఎన్నో భయాలతోనే లండన్‌కి ప్రయాణమైంది. అప్పటికే వాళ్ల ఊళ్లోని ఆడపిల్లలు ఫారిన్ సంబంధాలతో పడ్తున్న బాధలు, హింస సరబ్‌జిత్ భయానికి కారణాలు. కానీ తల్లిదండ్రుల ‘పరువు’ బరువు ఆమెను ఆ మూడుముళ్లకు తలవంచేలా చేసింది.
 
కొత్త కాపురం

 అత్తారింట్లో పరిస్థితులే కాదు మనుషులూ చిత్రంగానే అనిపించారు సరబ్‌జిత్‌కి. ఇంట్లో పెత్తనమంతా ఆమె అత్తగారు బచన్ అత్వాల్‌దే. భర్త హరదేవ్‌ది రెస్టారెంట్ బిజినెస్. ఎప్పుడో ఉదయం వెళ్తాడు రాత్రికి వస్తాడు. మరిది సుఖ్‌దేవ్‌దీ వ్యాపారమే. అత్తగారిది, మరిదిది ఒకటే మాట. వాళ్లు చెప్పిన పని చేయడం తప్ప దేనింట్లోనూ స్వతంత్రం ఉండేది కాదు, దేనిమీదా అధికారం ఇచ్చేవారు కాదు. మరబొమ్మలా ఉండాలంతే. ఒకరకమైన ఒంటరితనానికి అలవాటు పడుతున్న సమయంలోనే మరిది సుఖదేవ్‌కి పెళ్లి సంబంధం కుదిరింది. అమ్మాయి వాళ్లూ బ్రిటన్‌లో ఉంటున్న ప్రవాస భారతీయులే. ఈ ఇంటికోడలిగా ఇంకో అమ్మాయి బలైపోతోందనే బాధ ఉన్నా తనకో తోడు దొరుకుతోందని సంతోషపడింది సరబ్‌జిత్.

 కష్టాల భాగస్వామ్యం
 కొత్త కోడలి పేరు సుర్‌జిత్. సరబ్‌జిత్ కన్నా యేడాది చిన్నది.ఆ ఇంట్లో పద్ధతులు, అత్తగారి పెత్తనం కొత్త పిల్లకు మింగుడు పడలేదు. ప్రతిదాన్నీ ప్రశ్నించేది. అత్త, భర్త చేతుల్లో దెబ్బలు తినేది. ‘ఈ ఇంట్లో పద్ధతులింతే. సర్దుకు పోవాలి’అంటూ సరబ్‌జిత్ నచ్చచెప్పేది. రెండుమూడు నెలల తేడాతో ఇద్దరికీ పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టాక అత్తగారి దాష్టీకం మరీ ఎక్కువైంది. ఎంతలా అంటే.. పిల్లలకు తల్లులు పాలు పడుతున్నా సహించలేనంతగా. ‘మీ పాలు పిల్లలకు సరిపోవడం లేదు. అందుకే డబ్బాపాలు పడదాం’ అంటూ నెలల పసికందులకు బలవంతంగా తల్లిపాలు మాన్పించింది అత్తగారు. తనే సీసాతో పాలు పట్టి పిల్లలను మచ్చిక చేసుకుంది. ఎప్పటిలా సరబ్‌జిత్ సహనంతో ఉన్నా సుర్‌జిత్ కోపాన్ని అణచుకోలేకపోయింది. అత్తగారి మీద ఎదురు తిరిగింది. కొడుకు రాగానే ‘పెద్దదాన్ని, అనుభవం ఉన్నదాన్ని పిల్లల ఆలనాపాలనా చూస్తుంటే నీ భార్య సహించట్లేదు. నీ పిల్లల్ని నా దగ్గరకి రానివ్వడం లేదు’ అంటూ లేనిపోనివి కల్పించి కళ్లనీళ్లు పెట్టుకుంది. కరిగిపోయిన సుఖదేవ్ కోపంతో భార్యమీద చేయిచేసుకున్నాడు. అప్పటి నుంచి సుర్‌జిత్ తన పంథా మార్చుకుంది. తనకు నచ్చినట్టు ఉండడం ప్రారంభించింది. పెళ్లికి కాకముందున్న తన అలవాట్లన్నీ అమల్లో పెట్టింది. ఇష్టమైన డ్రెస్‌లు వేసుకోవడం, మేకప్ చేసుకోవడం, ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లడం లాంటివన్నీ చేసింది. ఒక ఫైన్ మార్నింగ్ విడాకులు కావాలని కూడా తేల్చిచెప్పింది. ఆవేశంతో ఊగిపోయింది అత్తగారు. చెంప చెళ్లుమనిపించాడు భర్త. అయినా సరే విడాకులు కావాలి అంది. ఈ పరిణామాలను మౌనంగా చూస్తూ ఉండిపోయింది సరబ్‌జిత్.

 ఇండియా ట్రిప్
 విడాకుల గొడవ కొనసాగుతున్నప్పుడే ఒకరోజు అత్తగారొచ్చి సుర్‌జిత్‌తో ‘బంధువుల పెళ్లి ఉంది. ఇండియా వెళ్లాలి. నేను, సుఖ్‌దేవ్, నువ్వూ.. ముగ్గురం వెళ్లాలి. మాతో వచ్చి బంధువుల దగ్గర మా పరువు కాపాడు. తర్వాత లండన్ వచ్చాక నువ్వు కోరినట్టుగా సుఖ్‌దేవ్ విడాకులు ఇచ్చేస్తాడు’ అంది బతిమాలుకున్నట్టుగా. ‘విడాకులు ఇచ్చేస్తాడు’ అన్న మాటతో అత్తగారి ప్రపోజల్‌ని ఒప్పుకుంది సుర్‌జిత్. అనుకున్నట్టుగానే ఇండియా ప్రయాణం అయ్యారు. బంధువుల పెళ్లీ అయింది. తిరిగి లండన్‌కు చేరుకున్నారు. కానీ సుర్‌జిత్ లేకుండా. ‘అమ్మేది?’ అంటూ బిలబిలమంటూ పరిగెత్తుకుంటూ వచ్చిన పిల్లల్ని దగ్గరకు తీసుకొని ‘నేను లండన్‌కి రానంటూ మీ అమ్మ ఎక్కడికో వెళ్లిపోయింది. మీరంటే ఇష్టంలేదు. అందుకే అమ్మ మిమ్మల్ని వదిలి వెళ్లిపోయింది’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు సుఖ్‌దేవ్. ఆ జవాబు విన్న సరబ్‌జిత్‌కు ఎక్కడో అనుమానం మొదలైంది. అసలు పనిగట్టుకొని సుర్‌జిత్‌ని ఇండియాకు రమ్మన్నప్పుడే ఆమె మనసు శంకించింది. ఇప్పుడు అనుమానం బలపడింది. సుర్‌జిత్ తల్లిదండ్రులకూ ఈ కట్టుకథనే వినిపించారు తల్లీకొడుకులు.
 
సుర్‌జిత్ ఏమైంది?
 ఈ ప్రశ్న కొన్ని పదులు సార్లు అత్తగారిని అడిగింది సరబ్‌జిత్. ఆందోళనతో, భయంతో. ఎప్పుడూ మౌనమే సమాధానంగా వచ్చేది. ఒకరోజు మాత్రం అత్తగారు నోరువిప్పింది.. ‘సుర్‌జిత్‌ను జీప్‌లో రావి నది దగ్గరకి తీసుకెళ్లి గొంతు పిసికి చంపి నదిలో పారేశాం’ అని! విని సరబ్‌జిత్ హతాశురాలైంది. మథన పడింది. కోడలు ఆ నిజాన్ని బయటపెట్టకుండా అత్తగారు ఆమెను దాదాపు హౌజ్ అరెస్ట్ చేసింది. కానీ కూతురి మీద బెంగ పెట్టుకున్న సుర్‌జిత్ తల్లిదండ్రులు మాత్రం ఊరుకోలేదు. ఇండియాలో తమ బంధువులను వాకబు చేస్తూనే ఉన్నారు. ఇక్కడేమో సరబ్‌జిత్‌మీద అత్తగారి హింస ఎక్కువైంది. అట్లా ఓ రెండు నెలలు గడిచాయి. ఒకరోజు సుర్‌జిత్‌తో చెప్పినట్టే సరబ్‌జిత్‌తోనూ అంది అత్తగారు ‘మనం ఇండియాకు వెళ్తున్నాం బంధువు ఫంక్షన్ ఉంది’ అని. అంతే! వెన్నులోంచి వణుకు వచ్చింది సరబ్‌జిత్‌కి. అంటే అత్తగారు తననూ చంపే ప్రోగ్రామ్ పెట్టిందా.. ఇంక ఆలస్యం చేయొద్దు అనుకుంది. ఇంట్లో అత్తగారు లేని టైమ్‌లో సుర్‌జిత్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి సుర్‌జిత్ హత్య గురించి చెప్పింది. వెంటనే వాళ్లు పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. లండన్ పోలీసులు బచ్చన్‌అత్వాల్ ఇంటి కాలింగ్‌బెల్ నొక్కారు. పోలీసుల ముందు మొసలి కన్నీళ్లు కార్చారు అమ్మాకొడుకులు. కానీ అసలు నిజం బయటపెట్టింది సరబ్‌జిత్. ఆమె చెప్పిన ఆధారంతోనే ఇండియాలో బచ్చన్‌అత్వాల్ వాళ్లు హాజరైన పెళ్లి తాలూకు బంధువులను కలిశారు లండన్ పోలీసులు. అసలు ఆ పెళ్లికి సుర్‌జిత్‌ని తీసుకొని రాలేదని చెప్పారు వాళ్లు. ఇంకా కొన్ని ఆధారాలను సేకరించి మళ్లీ బచ్చన్ అత్వాల్, సుఖ్‌దేవ్‌లను విచారించారు. నిజం ఒప్పుకోలేక తప్పలేదు వాళ్లకు. సరబ్‌జిత్ మీద చేసిన వేధింపులూ విచారణకు వచ్చాయి. మొత్తానికి 2007లో ఆ ఇద్దరికీ శిక్ష పడింది. తర్వాత సరబ్‌జిత్‌ను ఇలాంటి కేసుల పరిశోధనలో సహాయకురాలిగా (పి.సి.ఎస్.వో.) లండన్ పోలీసులు నియమించుకున్నారు.

 ఇప్పుడు
 టీవీలో ఇదంతా చెప్తూ రెండు చేతుల్లో ముఖం దాచుకుని తనివితీరా ఏడ్చింది సరబ్‌జిత్. ఎంతలా అంటే అదొక టీవీ చానల్ అని కానీ, తానొక ఇంటర్వ్యూలో ఉన్నాననే స్పృహగానీ కూడా లేనంతగా. తల్లి ఒడిలో తలపెట్టి వెక్కివెక్కి ఏడ్చే బిడ్డలా! ‘ఇది నా ఒక్కదాని కథే కాదు.. భారతదేశంలోని మధ్యతరగతి కుటుంబంలోని ప్రతి ఆడపిల్ల గాథ. అత్తగారిళ్లల్లో చావు రాత రాసుకుంటున్న సుర్‌జిత్‌లూ ఎంతోమంది!’అని చెప్పి ఆ ఇంటర్వ్యూ ముగించింది సరబ్‌జిత్. సరబ్‌జిత్ ఇంటర్వ్యూ చూసిన సంప్రదాయ పంజాబీ కుటుంబాలు అనేకం ఆమెను ఆడిపోసుకున్నాయి. దేశం పరువు తీసిందని బుగ్గలు నొక్కుకున్నాయి. సరబ్‌జిత్ తండ్రి మాత్రం బిడ్డ భుజాన్ని తట్టాడు ‘నీకు నేనున్నా’ నని. అది చాలు నాకు కొత్త జీవితం మొదలుపెట్టడానికి అంటుంది సరబ్‌జిత్. ‘అత్తిళ్లల్లో ఆరళ్లు ఎదుర్కొంటున్న నాలాంటి కోడళ్లకు అండగా నిలబడ్తాను. దానికి సంబంధించి ఓ సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. విదేశీ అల్లుడు కావాలనుకునే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ సెంటర్‌ని నెలకొల్పాలనుకుంటున్నాను’అంటుంది సరబ్‌జిత్. ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉంది.
 - సాక్షి ఫ్యామిలీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement