అందాల సుందరి ఐశ్వర్యా రాయ్ జీవితం ఎంత విలాసవంతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏది కోరితే అది వండి పెట్టడానికి వంట మనుషులు, కాలు బయటపెడితే కారులో తీసుకెళ్లడానికి డ్రైవర్.. ఇలా ఐష్‌కి బోల్డంత మంది సేవకులు ఉంటారు. అలాంటి ఐశ్వర్యవంతురాలు ఈ మధ్య సాదాసీదా మహిళలా డ్రెస్ చేసుకుని, గుళ్లో నేల తుడిచి, వంట చేసి, భక్తులతో పాటు తాను కూడా నేల మీద కూర్చుని భోజనం చేసి, గిన్నెలు కడగడం టాపిక్ అయ్యింది. ఐష్ ఇదంతా చేసింది అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో.
మామూలుగా ఐష్ అడపాదడపా గుళ్లకు వెళుతుంటారు. కానీ, ఇలాంటి సేవా కార్యక్రమం ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు చేసింది ‘సరబ్‌జిత్’ సినిమా కోసమే. పాకిస్తాన్ జైలులో మగ్గి, ప్రాణాలు వదిలిన పంజాబీ రైతు సరబ్‌జిత్ సింగ్ జీవితం ఆధారంగా ఒమంగ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సరబ్‌జిత్ సోదరి దల్బీర్ కౌర్‌గా ఐష్ నటిస్తున్న విషయం తెలిసిందే. అమృత్‌సర్ స్వర్ణదేవాలయంలో ఓ భక్తురాలిగా ఐష్ సేవ చేస్తున్న సన్నివేశాలను ఇటీవల చిత్రీకరించారు.
అందులో భాగంగానే ఆమె నేల తుడిచి, వంట చేసి, భక్తులతో కలిసి భోజనం చేసి, గిన్నెలు కడిగారు. ఇదంతా సినిమా కోసమే అయినా ఐష్ నటిస్తున్నట్లుగా లేదనీ, నిజంగానే భక్తితో చేసినట్లు అనిపించిందని షూటింగ్ చూసినవాళ్లు పేర్కొన్నారు. తోడబుట్టినవాడు దేశం కాని దేశంలో అన్యాయంగా జైలుపాలయ్యాడనే బాధ దల్బీర్ కళ్లల్లో స్పష్టంగా కనిపించేది. ఇప్పుడు వెండితెరపై ఈ పాత్ర చేస్తున్న ఐష్ తన కళ్లల్లో ఆ బాధను అద్భుతంగా ఆవిష్కరించగలుగుతున్నారని చిత్రబృందం అంటోంది.
నేల తుడిచి.. గిన్నెలు కడిగి.. వంట చేసి...
Published Sat, Feb 27 2016 11:37 PM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM
Advertisement