అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో చేసిన పాపాలకుగానూ(తప్పిదాలు).. ఏకంగా డిప్యూటీ సీఎంగా పని చేసిన ఓ వ్యక్తికి శిక్షలు విధించింది సిక్కు మతానికి చెందిన అకాల్ తఖ్త్. బాత్రూంలు, వంటగదులు, వరండాలు కడగడం.. షూలు, చెప్పులను శుభ్రం చేయడం లాంటి పనులు చేయాలని హుకుం జారీ చేసింది. ఆ ఆదేశాల్ని ఉల్లంఘించకుండా సుఖ్‌బీర్ సింగ్ బాదల్ శిరసావహించారు. ఈ క్రమంలోనే ఆయనపై జరిగిన హత్యాయత్నం తీవ్ర చర్చనీయాంశమైంది. అదే సమయంలో.. అకాల్ తఖ్త్ విధించిన ఈ శిక్షల గురించి తెలిసి చాలామంది ముక్కున వేలేసుకున్నారు.
సిక్కు మత సమగ్రతను కాపాడుకోవడంతో పాటు తప్పు చేసిన వ్యక్తికి తన తప్పును సరిదిద్దుకునేందుకు అవకాశం ఇచ్చి.. తద్వారా మత సిద్ధాంతాలకు అనుగుణంగా ఆ వ్యక్తిని మార్చుకోవడమే అకాల్ తఖ్త్ ఉద్దేశం. అయితే.. ఇక్కడే కొన్ని సందేహాలు కలగకమానవు. అసలు అకాల్ తఖ్త్‌ను నడిపించేదెవరు?. ఒకవేళ ఆ శిక్షకు తలొగ్గకపోతే ఏం చేస్తారు?. నిజంగానే తీవ్ర పరిణామాలు ఉంటాయా?. సాధారణంగా అకాల్ తఖ్త్ విధించే శిక్షలను పరిశీలిస్తే..
బహిరంగ క్షమాపణలు.. తప్పు చేసినవాళ్లతో సిక్కు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిస్తారు
పాప పరిహారం కింద.. సేవా కార్యక్రమాల్లో(బాత్రూంలు, వంటగది, వరండాలు శుభ్రం చేయడం.. వంట చేర్చి వార్చడం, కాపలా పని, వగైరా) ద్వారా పాప పరిహారం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు.
బహిష్కరణ.. నేర తీవ్రతను బట్టి సిక్కు సమాజం నుంచి వాళ్లను వెలివేస్తారు. ఇది కొంత కాలపరిమితితో ఉంటుంది. తద్వారా.. మతపరమైన కార్యక్రమాల్లో వాళ్లు భాగం కాలేరు.
మరి ఈ శిక్షలను ఉల్లంఘిస్తే..?
ఎవరైనా అకాల్ తఖ్త్ శిక్షలను గనుక ఉల్లంఘిస్తే.. పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.
శాశ్వత బహిష్కరణ.. అకాల్ తఖ్త్ శిక్షలకు తలొగ్గనివాళ్లను శాశ్వతంగా సిక్కు సమాజం నుంచి వెలివేస్తారు.
సామాజిక బహిష్కరణలో భాగంగా.. సిక్కు కమ్యూనిటీ నుంచి వాళ్లకు ఎలాంటి సంబంధాలు ఉండవు. ఎలాంటి సాయం అందించరు. తద్వారా.. వాళ్లను ఒంటరిని చేసేస్తారు.
ఆధ్యాత్మిక సయోధ్య.. దండించడం బదులు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయత్నం చేస్తారు. కౌన్సెలింగ్‌లాంటివి ఇప్పించి.. వాళ్లను మళ్లీ దారిలో పెట్టే ప్రయత్నం చేశారు.
పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చితం మరొకటి ఉండదంటారు కదా. ఒత్తిడి చేయడం ద్వారా వాళ్లు తమ తప్పులను ఒప్పకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తారు.
ఇవేవీ పని చేయని క్రమంలో.. సిక్కు సంఘాలే రంగంలోకి దిగుతాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాయి. అయితే.. ఇన్నేళ్ల కాలంలో పరిస్థితి ఇంతదాకా ఏనాడూ రాలేదు.
అకాల్ తఖ్త్ ద్వారా శిక్షించబడిన వాళ్లు ఎందరో.. వాళ్లలో కొందరు ప్రముఖులూ ఉన్నారు.
మహారాజా రంజిత్ సింగ్
సిక్కుల తొలి చక్రవర్తి. పరమతానికి చెందిన నృత్యకారిణిని వివాహం చేసుకున్నారనే నేరం కింద అకాల్ తఖ్త్ ఆయనకు కొరడాతో దెబ్బలు తినాలని శిక్ష విధించింది. అయితే ఆయన క్షమాపణలు చెప్పడంతో మన్నించి వదిలేసింది తఖ్త్.
జ్ఞానీ జైల్‌సింగ్
భారత మాజీ రాష్ట్రపతి. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ టైంలో ఆయన రాష్ట్రపతిగా ఉన్నారు. స్వర్ణ దేవాలయంలోకి ఆర్మీని అనుమతించారనే నేరం కింద ఆయన్ని అకాల్ తఖ్త్ శిక్షించింది. అయితే రాత పూర్వకంగా క్షమాపణలు కోరుతూ ఆయన లేఖ రాశారు.
బూటా సింగ్
కేంద్ర మాజీ మంత్రి. ఈయన్ని కూడా ఆపరేషన్ బ్లూ స్టార్ కిందే శిక్షించింది అకాల్ తఖ్త్. శిక్షను అంగీకరించిన ఆయన.. కమ్యూనిటీ సేవలో పాల్గొన్నారు కూడా.
సుర్జిత్ సింగ్ బర్నాలా
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. ఆపరేషన్ బ్లాక్ థండర్(అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్‌లోకి బ్లాక్ క్యాట్ కమాండోలను అనుమతించడంలో ఈయన పాత్ర ఎంతో ఉంది. అందుకే ఆయన్ని కాస్త కఠినంగానే శిక్షించారు. అకాల్ తఖ్త్‌కు జరిమానా కట్టడంతో బూట్లు శుభ్రం చేసి.. సిక్కు ప్రార్థనల్లో పాల్గొని తన పాపపరిహారం చేసుకున్నారాయన.
సుఖ్వీర్‌సింగ్ బాదల్
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం. శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 2007-17 మధ్య కాలంలో పార్టీతోపాటు వారి ప్రభుత్వం రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు అకాల్ తఖ్త్ నిర్ధారించింది. ఇందులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మద్దతు ఇవ్వడం కూడా ఉంది. ఈ విషయంలో పార్టీ చీఫ్ సుఖ్‌బీర్‌ను దోషిగా తేల్చింది. అయితే తాను చేసిన తప్పులను అంగీకరించిన(మూడు నెలల కిందటే) సుఖ్‌బీర్ బేషరతు క్షమాపణలు చెప్పారు. ఆపై కాలు ఫఫ్రాక్చర్ అయ్యి వీల్ చైర్‌కు పరిమితమైనా సరే.. అభియోగాలు ఎదుర్కొంటున్న తోటి పార్టీ నేతలతో కలిసి ఇప్పుడు అకాల్ తఖ్త్ విధించిన శిక్షలను అనుభవించారు.
అకాల్ తఖ్త్.. ఒరిజినల్ పేరు అకాల్ బుంగా. సిక్కులు పవిత్రంగా భావించే ఐదు తఖ్త్‌లలో ఇది ఒకటి. పంజాబ్ అమృత్‌సర్ దర్బార్ సాహిబ్ కాంప్లెక్స్‌లో ఉంది. సిక్కులు అత్యున్నత ఆధ్యాత్మిక విభాగం. సిక్కు మతగురువు గురు హరగోవింద్ జూన్ 15, 1606లో దీనిని అమృత్ సర్‌లోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లో నెలకొల్పారు. ఆ ప్రాంతంలోనే ఆయన బాల్యమంతా గడిచిందన్న వాదన ఒకటి ఉంది.
👉పిరి-మిరి అంటే.. ఆధ్యాత్మికంగానే కాకుండా సిక్కు సమాజానికి ఎదురయ్యే ఆందోళనల మీద చర్చ జరిపే ఉద్దేశంతో ఒక తాత్కాలిక అధికార వేదికను గురు హరగోవింద్ స్థాపించారు. పిరి-మిరికి ప్రతీకగా ఈ వేదికపై రెండు కత్తులను ఉంచారాయన. హర్‌గోవింద్‌తో పాటు బాబా బుద్ధా, భాయ్ గురుదాస్‌లు అకాల్ తఖ్త్ ఏర్పాటులో భాగమయ్యారు.
👉సిక్కుల అత్యున్నత విభాగంగా అకాల్ తఖ్త్‌కు పేరుంది. సర్బత్ ఖాల్సా యావత్ సిక్కు సంఘాలకు అత్యున్నత అధికారి కాగా.. జతేదార్(లీడర్)ను అకాల్ తఖ్త్ అధికార ప్రతినిధిగా గుర్తిస్తారు. సిక్కులకు మతపరమైన అధికారానికి కేంద్రంగా ఉన్న అకాల్ తఖ్త్‌ను అభివర్ణిస్తారు.
👉 పంజాబ్‌తో పాటు పాట్నా, బీహార్, మహారాష్ట్రలలో ఇలాంటి అధికార కేంద్రాలే ఉన్నాయి. అకాల్ తఖ్త్ నుంచి జారీ అయ్యే హుకామ్నామా(ఆదేశాలను).. ప్రతీ సిక్కు పాటించడం తప్పనిసరి.
👉 అకాల్ తఖ్త్ అనేది.. ఆకాలంలో అణచివేతకు వ్యతిరేకంగా చేసిన సిక్కులు చేసిన పోరాటానికి గుర్తు. అయితే ఈ సిక్కుల సార్వభౌమాధికార ప్రతీకపై దాడులు జరిగాయి. 18వ శతాబ్దంలో అహ్మద్ షా అబ్దాలీ దాడులతో మొదలై.. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్‌లో అకాల్ తఖ్త్ దెబ్బ తింది. ఆ తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో తాత్కాలికంగా అకాల్ తఖ్త్ నిర్మాణం జరిగినప్పటికీ.. దానిని ప్రభుత్వ వ్యతిరేక వర్గం ధ్వంసం చేసి.. పునఃనిర్మించుకున్నారు.
ఆపరేషన్ బ్లూస్టార్‌లో..
దామ్‌దామి తక్సల్ 14వ జతేదార్ అయిన జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేపై.. పంజాబ్‌లో అతివాద సంస్థను నడిపిస్తున్నాడనే అభియోగాలు ఉన్నాయి. 1983 జులైలో.. అకాలీదళ్ అధ్యక్షుడు హర్‌చరణ్ సింగ్ లాంగోవాల్, అప్పటి అకాల్ తఖ్త్ జతేదర్‌ల ఆహ్వానం మేరకు బింద్రాన్‌వాలే గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌కి చేరుకున్నాడు. అక్కడ అరెస్ట్‌కు భయపడి అకాల్ తఖ్త్‌లో తలదాచుకున్నాడు. అయితే..
అతని జాడ కనిపెట్టిన అప్పటి ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. భారత సైన్యానికి అనుమతి ఇచ్చింది. 1984 జూన్ 3 నుంచి జూన్ 5వ తేదీల మధ్యలో.. గోల్డెన్ టెంపుల్‌లో ఆపరేషన్ బ్లూ స్టార్ నడిచింది. ఈ ఆపరేషన్‌లో అకాల్ తఖ్త్ భారీగా డ్యామేజ్ అయ్యింది. మిలిటెంట్లకు, ఆర్మీకి మధ్య జరిగిన కాల్పుల్లో భింద్రాన్‌వాలే చనిపోయాడు.
ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత.. అకాల్ తఖ్త్‌ను తిరిగి నిర్మించేందుకు అప్పటి జతేదార్ బాబా సంతా సింగ్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఇందుకు కేంద్రం నుంచి నిధుల సమీకరణ కూడా చేయాలనుకున్నాడు. అయితే.. అందుకు సిక్కుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం అయ్యింది. అయినా కూడా సర్బత్ ఖాల్సా సహకారంతో జతేదార్ నెలన్నర వ్యవధిలోనే(1984, ఆగష్టు 11) అకాల్ తఖ్త్ నిర్మాణం పూర్తి చేశారు.
అయితే.. అదే సర్బత్ ఖాల్సా కూల్చేయాలని తీర్మానం చేసింది. జనవరి 1986లో కూల్చేసి.. బాబా సంతా సింగ్‌ను సిక్కు మర్యాదను దెబ్బ తీశాడనే కారణం చూపించి వెలివేసింది. 2001లో తిరిగి ఆయన్ని సిక్కు కమ్యూనిటీలో చేర్చుకుంది. అయితే.. సిక్కులకు న్యాయ పీఠంగా అకాల్ తఖ్త్ కొనసాగుతున్నప్పటికీ.. కాలక్రమంలోని పరిణామాలు(నిర్మాణాలపరంగా) మాత్రం ఆ సాంస్కృతిక వారసత్వాన్ని మాత్రం బాగా దెబ్బతీసింది.
Comments
Please login to add a commentAdd a comment