స్వర్ణదేవాలయం వద్ద పెరిగిన పోలీస్ బందోబస్తు
కపుర్తలా/అమృత్‌సర్/న్యూఢిల్లీ: అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలోని నిషిద్ధ ప్రాంతాన్ని అపవిత్రం చేసి, మూకదాడిలో ఒక వ్యక్తి హతమైన ఘటన జరిగి 24 గంటలైనా గడవకమునుపే పంజాబ్‌లో మరోచోట అలాంటి పరిణామమే చోటుచేసుకుంది. తాజా ఘటనకు కపుర్తలా వేదికైంది. అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్‌లో చోటుచేసుకుంటున్న ఈ ఘటనలపై ఆర్‌ఎస్‌ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) ఆందోళన వ్యక్తం చేసింది.
కపుర్తలా జిల్లా నిజాంపూర్‌లోని గురుద్వారా వద్దకు ఆదివారం ఉదయం ఒక గుర్తు తెలియని వ్యక్తి చేరుకున్నాడు. గురుద్వారా పైకెక్కి అక్కడున్న పవిత్ర జెండా(నిషాన్ సాహిబ్)ను తొలగించేందుకు యత్నించాడు. గమనించిన గ్రామస్తులు అతడిని వెంటాడి పట్టుకుని తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడని పోలీసులు చెప్పారు. కపుర్తలా పోలీసులు ఈ ఘటనపై స్పందిస్తూ.. గురుద్వారా పైనున్న జెండాను తొలగించేందుకు అగంతకుడు ప్రయత్నించాడని చెప్పారు. ఏవిధమైన అపవిత్రత చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు.
స్వర్ణదేవాలయంలో ఘటనపై సిట్
స్వర్ణదేవాలయంలో శనివారం జరిగిన ఘటనపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేసినట్లు పంజాబ్ ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి సుఖ్‌జీందర్ సింగ్ రణ్‌ధావా వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారన్నారు. సిట్ నివేదిక రెండు రోజుల్లో అందుతుందని చెప్పారు. శనివారం నాటి ఘటనపై ఆయన మాట్లాడుతూ.. మూకదాడిలో హతమైన వ్యక్తి ఉదయం 11 గంటల సమయంలో ఆలయంలోకి ప్రవేశించినట్లు సీసీ ఫుటేజీని బట్టి తేలిందన్నారు. కానీ, అతడెవరో గుర్తించాల్సి ఉందన్నారు.
అతడి లక్ష్యం ఏమిటి? ఆలయంలోకి ఏ మా ర్గంగుండా ప్రవేశించాడు? వెంట వేరెవరైనా ఉన్నా రా? అనే విషయాలపై క్షుణ్నంగా దర్యాప్తు జరుపు తామని చెప్పారు. అతడి వద్ద సెల్‌ఫోన్, పర్స్, ఐ డెంటిటీ కార్డువంటివి ఏవీ లేదని తెలిపారు. ఘట న నేపథ్యంలో రాష్ట్రంలోని గురుద్వారాలు, దేవాలయాలు, చర్చిలు, మసీదుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. ఇలా ఉండగా, ఆదివా రం సాయంత్రం సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్ని స్వర్ణదేవాలయాన్ని సందర్శించి, ప్రార్థనలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొన్ని స్వార్థ శక్తులు ఈ ఘటనకు కుట్ర చేసి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.
అశాంతిని సృష్టించేందుకు కుట్ర..
స్వర్ణదేవాలయాన్ని అపవిత్రం చేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని ఆర్‌ఎస్‌ఎస్ ఖండించింది. సమాజంలో అశాంతిని ప్రేరేపించేందుకు జరిగిన కుట్రగా పేర్కొంది. ఇలాంటి ఘటనలకు ప్రేరేపించిన వారిని కఠినంగా శిక్షించాలని ఆర్‌ఎస్‌ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment