Mob Attacks
-
కార్ ఆసుపత్రిలో విధ్వంసం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య వ్యవహారం మరో మలుపు తిరిగింది. యువ వైద్యురాలు శవమై కనిపించిన ప్రభుత్వ ఆర్.జి.కార్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో దుండగులు వీరంగం సృష్టించారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఆసుపత్రి ప్రాంగణంలోకి చొరబడ్డారు. అడ్డొచ్చిన నర్సులను నెట్టేశారు. కర్రలు, ఇటుకలు, ఇనుప రాడ్లతో వార్డుల్లో విధ్వంసానికి దిగారు. ఎమర్జెన్సీ, ఔట్ పేషెంట్స్ వార్డులు, నర్సింగ్ స్టేషన్, మెడిసిన్ స్టోర్‌లో పరికరాలు, ఔషధాలను చిందరవందర చేశారు. హత్య కేసు ఆధారాలు చెరిపేసేందుకు ప్రయతి్నంచారు. సీసీటీవీ కెమెరాలను పగులగొట్టారు. జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్న వేదికను సైతం ధ్వంసం చేశారు. ఆ సమయంలో అక్కడ పోలీసులు పరిమిత సంఖ్యలోనే ఉండడంతో విధ్వంసాన్ని అడ్డుకోలేకపోయారు. పై అధికారులకు సమాచారం చేరవేయడంతో అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. పోలీసుల రాకను గమనించిన దుండగులు రాళ్లు విసిరారు. దాంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. 40 మందికిపైగా దుండగులు నిరసనకారుల రూపంలో ఆసుపత్రిలోకి ప్రవేశించారని పోలీసు అధికారులు చెప్పారు. రాళ్ల దాడిలో పోలీసు వాహనంతోపాటు మరో రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. కొందరు పోలీసులు గాయపడ్డారని వెల్లడించారు. ఇప్పటిదాకా 12 మంది దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. రోగుల హాహాకారాలు ఆసుపత్రి వార్డుల్లో దుండగులు వీరవిహారం చేస్తుండడంతో రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బయటకు పరుగులు తీశారు. చికిత్స పొందకుండానే కొందరు సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. విలువైన వైద్య పరికరాలు, ఔషధాలను దండుగులు ఎత్తుకుపోయినట్లు తెలిసింది. విధ్వంసం జరుగుతున్న సమయంలో ఆసుపత్రిలో విధుల్లో ఉన్న పోలీసులు చేతులెత్తేశారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. నర్సులకు కేటాయించిన వార్డుల్లో ఆశ్రయం పొందారు. తమను దాచిపెట్టండి అంటూ ఇద్దరు పోలీసులు వేడుకున్నారని ఓ నర్సు చెప్పారు.నిరసన వ్యక్తం చేసిన డాక్టర్లు, నర్సులు ప్రభుత్వ ఆసుపత్రిలో దుండగుల వీరంగం పట్ల డాక్టర్లు, నర్సులు నిరసన వ్యక్తం చేశారు. గురువారం ఆసుపత్రి ప్రాంగణంలో బైఠాయించారు. తమకు భద్రత కలి్పంచాలని డిమాండ్ చేశారు. తమపై దాడులను సహించే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. పోలీసుల సమక్షంలోనే దుండగులు రెచ్చిపోయారని, తమపై చెయ్యి చేసుకున్నారని ఆరోపించారు. తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి, ఉద్యమాన్ని విరమించుకొనేలా చేయాలన్నదే వారి ప్రయత్నమని చెప్పారు. ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు.దుమ్మెత్తిపోసుకున్న మమత, బీజేపీఆస్పత్రి విధ్వంసంపై మమత, బెంగాల్ బీజేపీ నేతలు పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నారు. సీపీఎం, బీజేపీ కార్యకర్తలే విధ్వంసానికి పాల్పడ్డారని మమత ఆరోపించగా, అది ఆమె పంపిన తృణమూల్ గూండాల పనేనని బీజేపీ తిప్పికొట్టింది. ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఆస్పత్రి విధ్వంస ఘటన పౌర సమాజానికి సిగ్గుచేటని బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోసు అన్నారు. దాన్ని తీవ్రంగా ఖండించారు.రేపు వైద్యుల దేశవ్యాప్త సమ్మెవైద్యురాలి హత్యకు నిరసనగా శనివారం వైద్యుల దేశవ్యాప్త సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచి్చంది. అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. మరోవైపు దీనిపై నిరసనలు కొనసాగించాలని ఫోర్డా నిర్ణయించింది. తమ డిమాండ్లను పరిష్కారంపై కేంద్ర మంత్రి నుంచి జేపీ నడ్డా లిఖితపూర్వక హామీ ఇవ్వనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.సీబీఐ దర్యాప్తు వేగవంతం వైద్యురాలి కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. గురువారం బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడి హత్యపై వివరాలు సేకరించారు. ఆమె స్నేహితుల గురించి ఆరా తీశారు. కార్ ఆసుపత్రి వైద్యులతోనూ మాట్లాడారు. మాజీ మెడికల్ సూపరింటెండెంట్, వైస్ ప్రిన్సిపాల్, ప్రిన్సిపాల్, ఛెస్ట్ డిపార్టుమెంట్ చీఫ్‌ను విచారించారు. -
Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
న్యూఢిల్లీ/బిష్కెక్: స్థానికులు, విదేశీయులకు మధ్య ఘర్షణలతో కిర్గిజ్స్తాన్ రాజధాని బిష్కెక్ అట్టుడికిపోతోంది. విదేశీయులను లక్ష్యంగా చేసుకుని కొందరు స్థానికులు దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడి మెడికల్ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న ఇండియా, పాకిస్తాన్ విద్యార్థులపై అల్లరి మూకలు దాడులకు దిగుతున్నాయి. ఈ నేపథ్యలో బిష్కెక్లోని భారతీయ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం శనివారం సూచించింది. గొడవలు సద్దుమణిగేదాకా ఎవరూ బయటకు రావొద్దని, హాస్టళ్లు, ఇళ్లల్లో ఉండాలని స్పష్టం చేసింది. భారతీయ విద్యార్థులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని, వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నామని కిర్గిజ్స్తాన్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. బిష్కెక్ లో పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని, అయినప్పటికీ విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాలని, హాస్టళ్లు, ఇళ్లల్లో ఉండాలని స్పష్టంచేసింది. ఏదైనా సహాయం కావాలంటే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని బిషె్కక్లోని భారతీయ విద్యార్థులకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సూచించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మన విద్యార్థుల భద్రత గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని, స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. కిర్గిజ్స్తాన్లో ప్రస్తుతం దాదాపు 14,500 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఎంత మంది బిష్కెక్లో ఉన్నారన్నది ఇంకా తెలియరాలేదు. అయితే, బిషె్కక్లో ప్రశాంతమైన వాతావరణ ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం, పౌరుల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కిర్గిజ్స్తాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. ఎందుకీ ఘర్షణలు? కిర్గిజ్స్తాన్లో అలజడికి మూలాలు ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ఉన్నాయి. ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో భాగమైన కిర్గిజ్స్తాన్ 1991లో స్వతంత్ర దేశంగా మారింది. ఇక్కడి అధికారిక భాష రష్యన్. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా హఠాత్తుగా దాడి చేయడంతో కిర్గిజ్స్తాన్కు ఒక్కసారిగా కష్టాలు వచి్చపడ్డాయి. రష్యా నుంచి వచ్చే పెట్టుబడులు ఆగిపోయాయి. రష్యాలోని కిర్గిజ్స్తాన్ కారి్మకులకు వేతనాలు రాక సొంత దేశానికి డబ్బులు పంపడం లేదు. దీనికితోడు కిర్గిజ్‌స్తాన్‌పై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో ఆర్థిక పరిస్థితి దారుణంగా పడిపోయింది. ఆర్థిక వ్యవస్థ స్తంభించింది. మరోవైపు రష్యా నుంచి లక్షలాది మంది కిర్గిజ్స్తాన్కు వలస వస్తున్నారు. కుటుంబాలతో సహా ఇక్కడే స్థిరపడుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారమే 2022 సెపె్టంబర్ నుంచి ఇప్పటిదాకా 1,84,000 రష్యన్లు కిర్గిజ్స్తాన్కు తరలివచ్చారు. ఆర్థిక పరిస్థితి దిగజారడంతో పరిశ్రమలు, దుకాణాలు మూతపడుతున్నాయి. స్థానికులు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతున్నారు. దాంతో వారిలో అసంతృప్తి, అసహనం పెరిగిపోతోంది. విదేశీయులను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నారు. ప్రధానంగా రాజధాని బిషె్కక్లోని వైద్య విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్టు సహా ఇతర దేశాల విద్యార్థులపై వారి కన్నుపడింది. విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లు, ఇళ్లల్లోకి గుంపులు గుంపులుగా చొరబడిమరీ దాడి చేస్తున్నారు. ఇదే అదనుగా అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. విద్యార్థులు సైతం ప్రతిఘటిస్తుండడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఇరువర్గాల మధ్య దాడుల్లో ఇప్పటికే పలువురు గాయపడ్డారు. ముగ్గురు పాకిస్తాన్ విద్యార్థులు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. -
బెంగాల్లో ఈడీ అధికారులపై దాడి
కోల్‌కతా: పశి్చమబెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మద్దతుదారులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై విచక్షణా రహితంగా దాడికి దిగారు. ఘటనలో అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ పరిణామంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశాయి. అరాచకానికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని గవర్నర్ సీవీ ఆనంద బోస్ పేర్కొన్నారు. రేషన్ పంపిణీ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఈడీ అధికారులు సందేశ్‌ఖలిలోని టీఎంసీ నేత షేక్ షాజహాన్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా అక్కడికి చేరుకున్న షాజహాన్ మద్దతుదారులు రెచి్చపోయి ఈడీ అధికారులపై దాడికి తెగబడ్డారు. దాడిలో అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. షాజహాన్ అనుచరులు అధికారుల వాహనాల్నీ వదల్లేదు. వాటిని ధ్వంసం చేశారు. రక్షణగా వచి్చన కేంద్ర పారా మిలటరీ బలగాలపైనా దాడికి దిగారు. సోదాలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా సిబ్బందిపైనా దాడి చేశారు. వారి వాహనాల్ని తుక్కు చేశారు. గాయపడిన ఈడీ అధికారులు ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో అక్కడి నుంచి బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు అధికారులకు ఆస్పత్రిలో చికిత్స చేయించనున్నారు. రాష్ట్రమంత్రి జ్యోతిప్రియో మాలిక్‌కు షాజహాన్ సన్నిహితుడు. రేషన్ కేసులోనే గత ఏడాది మాలిక్ అరెస్టయ్యారు. షేక్ షాజహాన్‌పై ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి నివేదిక పంపినట్లు ఈడీ అధికారి ఒకరు పీటీఐకి చెప్పారు. ఘటనతో సంబంధమున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు రాష్ట్ర పోలీసులు చెప్పారు. సందేశ్‌ఖలి ఘటనను రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ తీవ్రంగా ఖండించారు. ఈడీ అధికారులపై దాడిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అనాగరిక చర్యను, విధ్వంసాన్ని ఆపాలని కోరారు. రాజ్యాంగానికి లోబడి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కేంద్ర అధికారులపై దాడి సమాఖ్య వ్యవస్థపై జరిగిన దాడిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్ పేర్కొన్నారు. ఘటనపై ఎన్ఐఏతో దర్యాప్తు చేయించి, రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ కోరారు. -
Mob Attack: రోహింగ్యాలు వెళ్లిపోవాలని నిరసన
మయన్మార్ దేశానికి చెందిన రోహింగ్యాలు తమ దేశం నుంచి వెళ్లిపోవాలంటూ ఇండోయనేషియాలోని నిరసనకారులు డిమాండ్ చేశారు. పెద్ద నిరసనకారుల మూక బాండా అచే సీటీలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఉన్న మయన్మార్ చెందని రోహింగ్యాలు వెళ్లిపోవాలని దాడులకు దిగారు. ఇండోనేషియా నుంచి రోహింగ్యాలు వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. రోహింగ్యాలు నివాసం ఉంటున్న చోటుకు పెద్ద సంఖ్యలో నిరసనకారులు దూసుకురావటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. A large crowd of Indonesian students stormed a convention center housing hundreds of Rohingya refugees from Myanmar in the city of Banda Aceh, demanding they be deported, @Reuters footage showed https://t.co/dYV7NVFbpE pic.twitter.com/xrhQKlSbB1 — Reuters (@Reuters) December 27, 2023 ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. గ్రీన్ కలర్ జాకెట్లు ధరించిన కొంతమంది నిరసనకారుల మూక ఓ కన్వెన్షన్ సెంటర్ బిల్డింగ్ సెల్లార్లో ఉంటున్న రోహింగ్యాలు వెళ్లిపోవాలంటూ బెదరింపులకు దిగారు. పెద్ద సంఖ్యలో నిరసనకారులు తమపై రావడంతో రోహింగ్యా మహిళలు, చిన్న పిల్లలు భయంతో రోధించారు. నిరసనకారులు 137 మంది రోహింగ్యాలను బలవంతంగా రెండు ట్రక్కులపై ఎక్కించి, బాండా అచే నుంచి పరో ప్రదేశాని బలవంతంగా తరలించారు. రోహింగ్యాలు.. ఇండోనేషియాలో తీవ్రమైన వ్యతిరేతక, తిరస్కరణను ఎదుర్కొంటున్నారు. మయన్మార్ నుంచి పెద్ద సంఖ్యలో ఇండోనేషియాకు వస్తున్న రోహింగ్యాల పట్ల రోజురోజుకు ఇండోనేషియాలో వ్యతిరేకత పెరుగుతోంది. అందులో భాగంగానే బుధవారం నిరసనకారుల మూక రోహింగ్యాలపై దాడులకు తెగపడినట్లు తెలుస్తోంది. This is heartbreaking. This is completely madness. Such a notorious response from Muslim students of Indonesia is extremely shameful. History will not forget this behaviour. May Allah judge it. pic.twitter.com/5O4D8G20HC — Hujjat Ullah (@hujjatullahhb) December 27, 2023 యునైటెడ్ నేషన్స్ రేఫ్యూజీ ఏజెన్సీ ఈ ఘటనపై స్పందించింది. ‘ఈ ఘటన చాలా విచారకరం. మయన్మార్ రోహింగ్యాల కుటుంబాలపై దాడికి దిగటం చాలా బాధకరం. అక్కడ అధిక సంఖ్యలు మహిళలు చిన్నపిల్లలు మాత్రమే ఉన్నారు’ అని పేర్కొంది. వారికి భద్రత కల్పించాలని ఇండోనేషియా ప్రభుత్వాన్ని కోరింది. ఇటీవల ఇండోనేషియాకు వస్తున్న మానవ అక్రమ రవాణాపై ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సంస్థలు రోహింగ్యాలకు తాత్కాలిక వసతులు కల్పించాలని అన్నారు. -
సైన్యాన్ని చుట్టుముట్టిన మహిళలు
ఇంఫాల్: మణిపూర్‌లో శాంతి నెలకొల్పేందుకు యత్నిస్తున్న సైన్యానికి స్థానికంగా ఓ వర్గం మహిళల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మిలిటెంట్లను విడిపించుకునేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు ఆర్మీని దిగ్బంధించారు. దీంతో రోజంతా ఉద్రిక్తత కొనసాగింది. చివరికి, ఆర్మీ తమ అదుపులో ఉన్న మెయిటీ వర్గం మిలిటెంట్లను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఈ ఘటన తూర్పు ఇంఫాల్ జిల్లా ఇథమ్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. భద్రతా బలగాలు శనివారం ఉదయం గ్రామంలో సోదాలు జరిపి 12 మంది మిలిటెంట్లను అదుపులోకితీసుకున్నాయి. విషయం తెల్సుకున్న సుమారు 1,200 మంది మెయిటీ వర్గం మహిళలు సైనికులను చుట్టుముట్టారు. మిలిటెంట్లను వదిలేయాలని భీష్మించారు. సాయంత్రం వరకు ఇదే ప్రతిష్టంభన కొనసాగింది. చివరికి బలగాలు మిలిటెంట్లను వదిలేశాయి. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను, మందుగుండును మాత్రం తీసుకెళ్లామని ఆర్మీ తెలిపింది. రాష్ట్రంలో నెలకొన్న సున్నిత పరిస్థితుల దృష్ట్యా, బలప్రయోగంతో కలిగే నష్టాన్ని, గ్రామస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, మానవతా దృక్పథంతో మిలిటెంట్లను స్థానిక నేతకు అప్పగించినట్లు ఆర్మీ తెలిపింది. ఆర్మీ విడిచిపెట్టిన వారిలో మెయిటీ వర్గం కేవైకేఎల్ గ్రూపునకు చెందిన స్వయం ప్రకటిత లెఫ్టినెంట్ కల్నల్ మొయిరంగ్థెమ్ తంటా అలియాస్ ఉత్తమ్ ఉన్నాడు. ఇతడికి పలు హింసాత్మక ఘటనలతో సహా 2015లో ‘6 డోగ్రా యూనిట్’పై దాడితో సంబంధముంది. ఈ గ్రూప్ మయన్మార్ నుంచి మణిపూర్‌లోకి చొరబడినట్లు ఆర్మీ తెలిపింది. గ్రామంలోకి అదనపు బలగాల ప్రవేశాన్ని ఆలస్యం చేసేందుకు ఆ మార్గంలోని కొన్ని వంతెనల వద్ద అడ్డంకులు కల్పించారంది. కాగా, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ఆదివారం ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులను వివరించారు. -
రాళ్లు రువ్వి దాడికి యత్నం..పోలీసులనే పరుగులు తీయించారు
ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుందంటూ వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో వాటిని తొలగించేందకు పోలీసులు, జిల్లా అధికారులు వచ్చారు. ఐతే వారు ఆక్రమణలు తొలగించి పనిపూర్తి చేసుకుని వెళ్లిపోతుండగా.. ఒక గుంపు దాడికి తెగబడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలోని జితార్ ఖేడి గ్రామంలోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి. వాటిని తొలగించేందుకు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సంజయ్ సాహు నేతృత్వంలోని పోలీసులు బృందం గ్రామానికి వచ్చారు. అక్కడ ఉన్న అక్రమ ఆక్రమణలను తొలగించి వెళ్లిపోతుండగా అకస్మాత్తుగా ఒక గుంపు వచ్చి పోలీసులుపై రాళ్లు రువ్వి.. దాడికి తెగబడ్డారు. ఆ గుంపులో మహిళలు, పిల్లలు తోసహా అధికారులపై దాడికి యత్నించారు. ఈ ఘటనలో బుల్డోజర్లు, కార్లు ధ్వసం అయ్యాయి. ఈ దాడి నుంచి మేజిస్ట్రేట్ సాహును రక్షించేందుకు మరో పోలీసుల వాహనంలో తరలించినట్లు అధికారులు తెలిపారు. వాస్తవానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సమీపంలోని జితార్ ఖేడీ గ్రామంలోని అర బిఘా (6,000 చదరపు అడుగులు) ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు సాహు పేర్కొన్నారు. ఇంతకుమునుపు గతంలో ఈ భూమిలో అన్ని వర్గాల వారు కార్యక్రమాలు నిర్వహించేవారని, ఐతే ఆక్రమణలకు గురికావడంతో అన్నీ ఆగిపోయాయని గ్రామస్తులు చెబుతున్నట్లు వెల్లడించారు. ఫిర్యాదు మేరకు సాహు నేతృత్వంలోని పోలీసుల బృందం ఆక్రమణలు తొలగించేందుకు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఆక్రమణలు తొలగించి పని పూర్తి చేసి వెళ్తుండగా దాడికి పాల్పడ్డారని పోలీసుల చెబుతున్నారు. ఈ దాడిలో పోలీసు సిబ్బంది తోసహా బుల్డోజర్ డ్రైవర్ కూడా గాయపడినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చట్టాన్ని ఉల్లంఘి ఈ ఘటనకు పాల్పడిన వారందరికీ శిక్ష పడుతుందని అదనపు మెజిస్ట్రేట్ సంతోష్ ఠాగూర్ తెలిపారు. (చదవండి: ఆరు నెలల క్రితం అదృశ్యం! చివరికి అస్థిపంజరంగా ఆచూకీ లభ్యం) -
‘ఆ మూక హత్యలు మావాళ్లు చేసినవే’
జైపూర్: తన మద్దతుదారుల మూకదాడిలో ఆవుల స్మగ్లర్లు ఐదుగురు హతమయ్యారని చెప్పుకున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ అహూజాపై ఆల్వార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ దొంగతనం ఆరోపణలపై శుక్రవారం మేవాట్‌కు చెందిన ముస్లింలు చిరంజీలాల్ సైనీ అనే వ్యక్తిని కొట్టి చంపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంలో అహూజా ‘లావాండి ప్రాంతంలో మా వాళ్ల మూకదాడిలో ఐదుగురు హతమయ్యారు. ఇలాంటిది జరగడం మాత్రం ఇదే మొదటిసారి. ఆవుల దొంగలపై మూకదాడులకు పాల్పడిన మా వాళ్లకు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకువచ్చే పూచీ నాది’అని అంటున్నట్లుగా ఉన్న ఓ వీడియో వైరల్ అవుతోంది. -
సిక్కుల జెండా అపవిత్రానికి యత్నం
కపుర్తలా/అమృత్సర్/న్యూఢిల్లీ: అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలోని నిషిద్ధ ప్రాంతాన్ని అపవిత్రం చేసి, మూకదాడిలో ఒక వ్యక్తి హతమైన ఘటన జరిగి 24 గంటలైనా గడవకమునుపే పంజాబ్‌లో మరోచోట అలాంటి పరిణామమే చోటుచేసుకుంది. తాజా ఘటనకు కపుర్తలా వేదికైంది. అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్‌లో చోటుచేసుకుంటున్న ఈ ఘటనలపై ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) ఆందోళన వ్యక్తం చేసింది. కపుర్తలా జిల్లా నిజాంపూర్‌లోని గురుద్వారా వద్దకు ఆదివారం ఉదయం ఒక గుర్తు తెలియని వ్యక్తి చేరుకున్నాడు. గురుద్వారా పైకెక్కి అక్కడున్న పవిత్ర జెండా(నిషాన్ సాహిబ్)ను తొలగించేందుకు యత్నించాడు. గమనించిన గ్రామస్తులు అతడిని వెంటాడి పట్టుకుని తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడని పోలీసులు చెప్పారు. కపుర్తలా పోలీసులు ఈ ఘటనపై స్పందిస్తూ.. గురుద్వారా పైనున్న జెండాను తొలగించేందుకు అగంతకుడు ప్రయత్నించాడని చెప్పారు. ఏవిధమైన అపవిత్రత చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. స్వర్ణదేవాలయంలో ఘటనపై సిట్ స్వర్ణదేవాలయంలో శనివారం జరిగిన ఘటనపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేసినట్లు పంజాబ్ ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి సుఖ్జీందర్ సింగ్ రణ్‌ధావా వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారన్నారు. సిట్ నివేదిక రెండు రోజుల్లో అందుతుందని చెప్పారు. శనివారం నాటి ఘటనపై ఆయన మాట్లాడుతూ.. మూకదాడిలో హతమైన వ్యక్తి ఉదయం 11 గంటల సమయంలో ఆలయంలోకి ప్రవేశించినట్లు సీసీ ఫుటేజీని బట్టి తేలిందన్నారు. కానీ, అతడెవరో గుర్తించాల్సి ఉందన్నారు. అతడి లక్ష్యం ఏమిటి? ఆలయంలోకి ఏ మా ర్గంగుండా ప్రవేశించాడు? వెంట వేరెవరైనా ఉన్నా రా? అనే విషయాలపై క్షుణ్నంగా దర్యాప్తు జరుపు తామని చెప్పారు. అతడి వద్ద సెల్‌ఫోన్, పర్స్, ఐ డెంటిటీ కార్డువంటివి ఏవీ లేదని తెలిపారు. ఘట న నేపథ్యంలో రాష్ట్రంలోని గురుద్వారాలు, దేవాలయాలు, చర్చిలు, మసీదుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. ఇలా ఉండగా, ఆదివా రం సాయంత్రం సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్ని స్వర్ణదేవాలయాన్ని సందర్శించి, ప్రార్థనలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొన్ని స్వార్థ శక్తులు ఈ ఘటనకు కుట్ర చేసి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. అశాంతిని సృష్టించేందుకు కుట్ర.. స్వర్ణదేవాలయాన్ని అపవిత్రం చేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని ఆర్ఎస్ఎస్ ఖండించింది. సమాజంలో అశాంతిని ప్రేరేపించేందుకు జరిగిన కుట్రగా పేర్కొంది. ఇలాంటి ఘటనలకు ప్రేరేపించిన వారిని కఠినంగా శిక్షించాలని ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే అన్నారు. -
అమెరికన్ అసాధారణత్వం ఓ భ్రాంతి
అమెరికన్ ప్రజాస్వామ్యం కేంద్రబిందువైన కేపిటల్ హిల్‌లో కనీవినీ ఎరుగని హింస, అల్లర్లు జరుగుతున్న దృశ్యాలు టెలివిజన్ తెరలపై విస్తృతంగా కనిపించడంతో ప్రపంచవ్యాప్తంగానూ కోట్లాదిమంది ప్రజలు షాక్‌కు గురయ్యారు. కానీ దీంట్లో మరీ అంతగా ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు. అధ్యక్ష పీఠం నుంచి సాక్షాత్తూ డొనాల్డ్ ట్రంప్ అల్లుతూ వచ్చిన రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలకు పరాకాష్టే బుధవారం జరిగిన హింసాకాండ. అధ్యక్ష ఎన్నికలను తమనుంచి తస్కరించారని ట్రంప్ మద్దతుదారులు నమ్మేలా రిపబ్లికన్ పార్టీ శాసనసభ్యులు, మితవాద మీడియా వ్యక్తులు కలిసి ప్రయత్నించారు. వీరందరూ కలిసి దేశాధ్యక్షుడే తన మద్దతుదారులను హింసకు పురిగొల్పేలా రెచ్చగొట్టడంలో తలా ఒక చేయి వేశారు. ఈ క్రమంలో అమెరికా ఎన్నికల ప్రక్రియనే వీరు అపహాస్యం చేసిపడేశారు. అమెరికా అజేయం అనే ఒక ప్రత్యేకతత్వం ఇవాళ ఎక్కడికి చేరుకుంటూ ఉంటోందో మనం ఇప్పుడు స్పష్టంగా చూడవచ్చు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ జనవరి 6న ఎలక్టోరల్ ఓట్లను లెక్కించడానికి అమెరికన్ కాంగ్రెస్‌లోని రెండు చాంబర్లను సమావేశపర్చారు. ఓట్ల లెక్కింపు తర్వాత డెమోక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీచేసిన జో బైడెన్ అమెరికా తాజా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని అధికారంగా నిర్ధారించారు. ఇది మాములు పరిస్థితుల్లో అయితే నేరుగా, స్వచ్ఛంగా ఒక గంటలోపు ముగియవలసిన అతి సాధారణమైన, లాంఛనప్రాయమైన ప్రక్రియ. అవును.. అమెరికా రాజకీయ రణరంగంలో ఇప్పుడు నడుస్తున్నవి ’సాధారణ’ సమయాలు కావు మరి. మొట్టమొదట్లో, పలువురు రిపబ్లికన్ శాసనసభ్యులు డొనాల్డ్ ట్రంప్‌ను మరో దఫా అధ్యక్ష పదవిలో నిలిపి ఉంచడానికి నిస్సిగ్గుగా, వినాశకరమైన రీతిలో ప్రయత్నించి, ఎలక్టోరల్ కాలేజీలో వెలువడిన ఫలితాలపై అభ్యంతరాలు లేవనెత్తడం ప్రారంభించారు. ఆ క్రమంలోనే అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతూ వచ్చింది. తర్వాత ఎన్నికను తారుమారు చేయడానికి వేలాదిమంది ట్రంప్ అనుకూలురైన అమెరికన్లు కేపిటల్ హిల్‌పై దాడి చేసి లోపలకు ప్రవేశించడానికి ప్రయత్నించారు. ‘అమెరికాను మళ్లీ గొప్పగా మలుద్దాం’ అనే అతిశయపూరితమైన టోపీలు ధరించిన నిరసనకారులు ట్రంప్ జెండాలను పట్టుకుని కేపిటల్ హిల్ కార్యాలయాల్లోకి దూసుకెళ్లి, శాసనసభలోని ఆయా ఫ్లోర్ల లోనికి చొరబడేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న కాంగ్రెస్ సభ్యులను హౌస్ గ్యాలరీలో తలదాచుకోవాలని అధికారులు చెప్పారట. తర్వాతి క్రమంలో వాషింగ్టన్ డీసీ మేయర్ మురెల్ బౌజర్ అమెరికా కేపిటల్ హిల్‌లో కర్ఫ్యూ ప్రకటించి రెండువారాల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అమెరికన్ ప్రజాస్వామ్యం నడిగడ్డలో కనీవినీ ఎరుగని హింస, అల్లర్లు జరుగుతున్న దృశ్యాలు టెలివిజన్ తెరలపై, సోషల్ మీడియా టైమ్ లైన్లలో విస్తృతంగా కనిపించడంతో అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ కోట్లాదిమంది ప్రజలు షాక్‌కు గురయ్యారు. కానీ ఈ మొత్తం ప్రక్రియలో మరీ అంతగా ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు. ఎందుకంటే ఇది అనూహ్యంగా జరిగిన ఘటన మాత్రం కానేకాదు. అమెరికా రాజ్యాంగాన్ని, అక్కడి ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేస్తూ అధ్యక్ష పీఠం నుంచి సాక్షాత్తూ డొనాల్డ్ ట్రంప్ అల్లుతూ వచ్చిన రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలకు పరాకాష్టే బుధవారం జరిగిన హింసాకాండ అని మనందరం స్పష్టం చేసుకోవలసిన అవసరం ఉంది. చాలా కాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో మోసం జరిగిందని, అధ్యక్ష పదవిని తననుంచి దొంగిలించారని పేర్కొంటూ నిరాధారపూరితమైన ప్రకటనలను పథకం ప్రకారం వ్యాపింపజేస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే శాంతియుతంగా అధికార మార్పిడి ప్రక్రియను హింసాత్మకంగానైనా సరే అడ్డుకోవడానికి ట్రంప్ తన మద్దతుదారులను బహిరంగంగానే రెచ్చగొట్టి వదిలారు. అంతేకాకుండా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో సహా రిపబ్లికన్ పార్టీ అధికారులపై ఒత్తిడి చేసి తనను అధ్యక్షుడిగా కొనసాగించేందుకు వారివారి రాజ్యాంగ విధులను పక్కనపెట్టాలని చెప్పడానికి కూడా ట్రంప్ సాహసించారు. పైగా జార్జియా రాష్ట్ర కార్యదర్శి బ్రాడ్ రఫెన్స్పెర్జర్కి నేరుగా కాల్ చేసి, జార్జియా రాష్ట్రంలో తాను గెలిచేందుకు అవసరమైన ఓట్లను వెతికిపెట్టాలని కూడా ట్రంప్ ఫోన్ చేసి బాగా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. వాషింగ్టన్ డీసీలో అల్లర్లు, హింసాకాండ జరగడానికి సరిగ్గా కొన్ని గంటల ముందు వైట్‌హౌస్ సమీపంలో 70 నిమిషాలపాటు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగంలో కూడా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వెలువడిన ఫలితం మన ప్రజాస్వామ్య వ్యవస్థపై చేసిన పెనుదాడిగా పేర్కొన్నారు. పైగా ‘మీరు మన దేశాన్ని బలహీనతతో ఎన్నటికీ ముందుకు తీసుకుపోలేరు’ అని చెబుతూ కేపిటల్ హిల్‌కి తరలి రావలిసిందిగా తన మద్దతుదారులకు బహిరంగంగా ఆదేశాలిచ్చారు. అయితే బుధవారం కేపిటల్ హిల్‌లో జరిగిన అల్లర్లకు, హింసాకాండకు ఒక్క ట్రంప్‌ని మాత్రమే బాధ్యుడిగా చేయడం తప్పు. అసంఖ్యాకులైన రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, అధికారులు, మితవాద మీడియా వ్యక్తులు మొత్తంగా కలిసి అమెరికా అధ్యక్ష ఎన్నికలను తమనుంచి తస్కరించారని ట్రంప్ మద్దతుదారులు నమ్మేలా అనేక ప్రయత్నాలు చేశారు. భావజాలపరమైన విశ్వాసం కావచ్చు, దూరదృష్టి లేని రాజకీయ ఆచరణ వాదం కావచ్చు లేదా నిస్సిగ్గుగా అవలంబించిన పక్షపాత వైఖరి కావచ్చు వీరందరూ కలిసి దేశాధ్యక్షుడే తన మద్దతుదారులను హింసకు పురిగొల్పేలా, అమెరికా రాజ్యాంగాన్నే కించపర్చేలా రెచ్చగొట్టడంలో తలా ఒక చేయి వేయటంలో విజయం సాధించారు. ఈ క్రమంలో అమెరికా ఎన్నికల ప్రక్రియనే వీరు అపహాస్యం చేసిపడేశారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి దేశాధ్యక్షుడు చేస్తున్న చట్టవ్యతిరేక ప్రయత్నాలను ఖండించడానికి అనేకమంది రిపబ్లికన్ పార్టీ ప్రముఖులు చివరి నిమిషం వరకు తిరస్కరిస్తూ వచ్చారు. ఎందుకంటే ట్రంప్‌ని నమ్మే కోట్లాదిమంది అభిమానుల మద్దతును ఒక్కసారిగా తాము కోల్పోతామని వీరంతా భయపడ్డారు. అదేసమయంలో చాలామంది ఇతరులు దేశాధ్యక్షుడి విదూషక చేష్టలను తీసిపడేయడం లేక తగ్గించి చూపడం చేయసాగారు. ట్రంప్ ప్రభావం అతిత్వరలో కరిగిపోతుందని వీరు నమ్ముతూవచ్చారు. ఈలోగా మితవాద తీవ్రవాదం నెమ్మదిగా ప్రధానస్రవంతిగా మారిపోయింది. ఇప్పుడు, ఒక రోజంతా ఆందోళనలు, నిరసనలు కొనసాగిన తర్వాత కేపిటల్ హిల్‌ని సురక్షితం చేసి బైడెన్ గెలుపును అధికారికంగా ధ్రువీకరించిన తర్వాత రిపబ్లికన్, డెమోక్రాటిక్ రెండు పార్టీలకు చెందిన రాజకీయ నేతలు ట్రంప్‌ని బహిరంగంగా ఖండించడానికి ముందుకు రావడమే కాకుండా, బైడెన్ నేతృత్వంలోని నూతన పాలనా యంత్రాంగం, అమెరికా ఎదుర్కోనున్న కొత్త సవాలుకు ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడటం మొదలెట్టారు. అయితే ట్రంప్ విదేశీయతా విముఖత, ప్రజలను విభజించేలా తాను వాడే భాషను ఇంతకాలం వారు ఎలా ఆమోదిస్తూ వచ్చారు? ఎన్నికలు జరగడానికి కొన్ని వారాల ముందు మాత్రమే కాదు.. అధ్యక్ష పదవిలో ఉన్నంతకాలం దేశచట్టాలను తుంగలో తొక్కడానికి, అధికారాలను దుర్వినియోగం చేయడానికి ట్రంప్‌ని ఎందుకు అనుమతించారు? ట్రంప్ ఈల వేస్తే చాలు శ్వేతజాతి దురహంకారులూ, జాత్యహంకారులూ, హింసోన్మాదులైన ఫాసిస్టులూ ఎందుకు స్వేచ్ఛగా రోడ్లమీదికొచ్చి వీరంగమాడుతున్నారు? బుధవారం జరిగిన అల్లర్లను, హింసాకాండను నిరోధించడానికి అమెరికన్ రాజ్య వ్యవస్థ అవసరమైన చర్యలను ఎందుకు తీసుకోలేకపోయింది? అధ్యక్షుడు రెచ్చగొట్టినందుకే ట్రంప్ మద్దతుదారులు తమ హింసాకాండను అందరూ చూడాలని బహిరంగంగా ముందుకొచ్చారా? చివరకు మీడియా సైతం ట్రంప్ రెచ్చగొట్టి జరిపించిన ఈ హింసాకాండకు ఏమాత్రం సిద్ధం కానట్లు కనిపించింది. దేశాధ్యక్ష స్థానంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ గత కొద్ది నెలలుగా బహిరంగంగానే కుట్ర చేయడానికి దారులు వెతుక్కుంటున్నారు. అధ్యక్ష పదవి తస్కరణను ఆపివేయండి అంటూ అమెరికా నగరాల్లో వేలాదిమంది నిత్యం నినాదాలు చేస్తూ, తమ ప్రైవేట్ తుపాకులను కూడా పబ్లిగ్గా ప్రదర్శిస్తూ రావడం ప్రపంచమంతా చూస్తూ వచ్చింది. అమెరికాలో జరుగుతున్న పరిణామాలు లాటిన్ అమెరికా, దక్షిణ యూరప్, తూర్పు యూరప్, ఆఫ్రికా ఖండాల్లోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా జరిగి ఉంటే అమెరికా మీడియా సంస్థలు డజన్ల కొద్దీ రిపోర్టర్లను ఆయా దేశాల పార్లమెంటు వద్దకు సకల రక్షణలతో పంపించి అక్కడి ఎన్నికల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితిని, ఆవరించిన హింసాకాండను వారాల తరబడి వ్యాసాల మీద వ్యాసాలు రాయించి ప్రచురించేవారు. టీవీల్లో అసంఖ్యాక ఎపిసోడ్లను ప్రసారం చేసేవారు. కానీ అమెరికాలో జరిగితే మాత్రం ఏమీ ఎరగనట్లు, ఏమీ కానట్లు మౌనం పాటిస్తూ ధర్మపన్నాలు వల్లిస్తుంటారు. దీనికి ఒక కారణాన్ని మనం చూపించవచ్చు. అమెరికా ప్రజాస్వామ్యం ఎట్టిపరిస్థితుల్లోనూ వైఫల్యం చెందడానికి వీల్లేనంత బలంగా ఉందని అందరూ అభిప్రాయపడుతూ ఉండవచ్చు. అమెరికా అజేయం అనే ఒక ప్రత్యేకతత్వం, పాశ్చాత్య ఉదారవాద సంస్థల సంపూర్ణ ఆధిక్యతపై తిరుగులేని విశ్వాసం అనే రెండింటినీ కలిపి చూడండి. అమెరికా ఇవ్వాళ ఎక్కడకు చేరుకుంటూ ఉందో ఇప్పుడు మనం స్పష్టంగా చూడవచ్చు. ఆండ్రియా మమోన్ వ్యాసకర్త చరిత్రకారుడు, రాయల్ హొలోవే లండన్ యూనివర్సిటీ (అల్‌జజీరా సౌజన్యంతో...) -
పోలీసులపై రాళ్ల దాడి : వీడియో వైరల్
కోల్‌కతా : లాక్డౌన్ నిబంధనలను పాటించాలని చెప్పినందుకు.. పోలీసులపై స్థానికులు రాళ్ల దాడికి పాల్పడిన ఘటన పశ్చిబెంగ్‌లోని హౌరాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హౌరాలోని తికియాపారా ప్రాంతంలో జనం భారీగా రోడ్ల మీదకు తరలివచ్చారని పోలీసులుకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. గుంపులుగా ఉంటే కరోనా వ్యాప్తి చెందుతుందని.. సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అయినా సరే వారు పట్టించుకోకుండా అలానే రోడ్లపైకి వచ్చారు. (చదవండి : మేమున్నాం: కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధుడు) దీంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, స్థానికులు వాగ్వాదం జరిగింది. దీంతో వందలాది మంది స్థానికులు పోలీసులపై దూసుకెళ్లి దాడి చేశారు. రాళ్లు విసిరి.. అక్కడి నుంచి తరిమికొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యాయి. అదనపు బలగాలు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. స్థానికులు దాడిచేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1341281459.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రెండో రోజు పార్లమెంట్లో అదే రగడ
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగడం లేదు. రెండో రోజు కూడా ఢిల్లీ అల్లర్లపై అధికార, విపక్ష సభ్యులు బాహాబాహీకి దిగారు. లోక్‌సభ, రాజ్యసభల్లో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం జరగడంతో రెండు సభలను వాయిదా పడ్డాయి. లోక్ సభను మధ్నాహం 12 గంటల వరకు, రాజ్యసభను మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా వేశారు. రెండో రోజు సమావేశాలు మొదలైన వెంటనే లోక్‌సభలో ఢిల్లీ అల్లర్లపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. చర్చకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష నాయకులు నిరసన తెలుపుతూ పోడియం వద్దకు దూసుకొచ్చారు.సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా కోరినప్పటికీ ఇరు పక్షాలు పట్టించుకోలేదు. సభ్యులెవరూ పోడియం వద్దకు రావొద్దని స్పీకర్ పదే పదే సూచించినప్పటికీ విపక్షాలు వినిపించుకోలేదు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఇక పెద్దల సభలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. సభ మొదలవగానే ఢిల్లీ అల్లర్లపై దుమారం రేగింది. అల్లర్లపై చర్చ పెట్టాలని విపక్షాలు కోరాయి. కానీ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు చర్చకు నిరాకరించారు. దీంతో విపక్షనేతలు నినాదాలు చేస్తూ పోడియం వద్దకు దూసుకొచ్చారు. ప్లకార్డులను పట్టుకొని నిరసన తెలిపారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. -
పార్లమెంట్లో ‘ఢిల్లీ అల్లర్ల’ దుమారం
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశం ప్రారంభమైన వెంటనే జేడీయూ ఎంపీ బైద్యనాథ్ ప్రసాద్ మృతికి సభ సంతాపం తెలిపింది. అనంతరం సభను మధ్యాహ్నం 2గంలకు వాయిదా వేశారు. మరోవైపు పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఢిల్లీ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ నిరసన తెలిపాయి. ఢీల్లీ అల్లర్లకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పార్లమెంట్లో ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు పాల్గొన్నారు. ఢిల్లీ హింసకు నిరసనగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా నిరసనకు దిగారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర కళ్లకు గంతలు కట్టుకొని, నోటిపై వేల్లు వేసుకొని నిరసన తెలిపారు. మరోవైపు ఢిల్లీ అల్లర్లు రాజ్యసభను కూడా కుదిపేశాయి. సోమవారం సభ ప్రారంభమవగానే విపక్షాలు ఢిల్లీ అల్లర్లపై చర్చకు పట్టుబట్టాయి. దీనిపై స్పందించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఢిల్లీలో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు అందరూ కృషి చేయాలన్నారు. అంశం గంభీరమైందని, ఇప్పడే దీనిపై చర్చించడం సరికాదన్నారు. సామన్య స్థితి ఏర్పడిన తర్వాత ఈ అంశంపై చర్చిద్దామని చెప్పారు. వెంటనే కాంగ్రెస్ నేత గూలంనబీ ఆజాద్ లేచి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో హింస చెలరేగి పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినా ప్రభుత్వానికి సోయి లేదని విమర్శించారు. కాగా, ఆజాద్ వ్యాఖ్యలను అధికార పక్షం తప్పుబట్టింది. ఇరుపక్షాలు పోడియం వైపుకు దూసుకురావడంతో చైర్మన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లలో మొత్తం 46 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
ఢిల్లీ అల్లర్లు: భవనం మీద నుంచి దూకి..
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఢిల్లీలో జరుగుతున్న ఘటనలతో ఏ క్షణం ఏ జరుగుతుందో అన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. సీఏఏకు అనుకూలంగా వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనల్లో మహిళలు, చిన్నారులు తల్లడిల్లిపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళ తన పిల్లల్ని కాపాడుకోవడానికి ప్రాణాల్ని సైతం లెక్కపెట్టకుండా ఎత్తయిన భవనం మీద నుంచి దూకేసింది. ఇటువంటి ఘటనలు ఢిల్లీలో అనేకం చోటుచేసుకుంటున్నాయి. చదవండి: ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ ఆందోళనకారులు విచక్షణ మరిచి ఇళ్లలోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తున్నారు. ఢిల్లీలోని కరవాల్‌నగర్‌లో ఎన్జీఓ నడుపుతున్న ఓ మహిళ ఇంటిని ఆందోళన కారులు చుట్టుముట్టడంతో తన ఇద్దరు పిల్లల్ని కాపాడుకోవడం కోసం ఆమె మొదటి అంతస్తు పై నుంచి దూకేసింది. ఈ ప్రమాదంలో వారికి గాయాలైనా ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ విధంగా ఆందోళనకారులు నుంచి తప్పించుకున్న వారు అయూబ్ అహ్మద్ అనే కిరాణాషాపు యజమాని ఇంట్లో ఆశ్రయం పొందారు. అనంతరం వారిని కష్టంమీద ఆస్పత్రిలో చేర్పించారు. చదవండి: ఢిల్లీ అల్లర్లు: మిరాకిల్ బాబు..! అయితే అయూబ్ ఇంట్లో వారు తలదాచుకున్నారన్న విషయం తెలుసుకున్న ఆందోళనకారులు ఆయన ఇంటిపై దాడి చేశారు. ఆమె అక్కడ కనిపించకపోవడంతో ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు మాట్లాడుతూ.. తన ఇంటికి దగ్గరలో ఉండే వ్యక్తిపై యాసిడ్ చల్లారని అతను తీవ్ర గాయాలపాలయ్యాడని చెప్పుకొచ్చారు. అదే క్రమంలో వారు మా ఇంటికి మీదకి దాడికి వస్తుండటంతో తన ఇద్దరు కుమార్తెలతో మొదటి అంతస్తు నుంచి దూకి ముస్లింలు నివసించే ప్రాంతానికి వచ్చి ప్రాణాలు దక్కించుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. చదవండి: ఢిల్లీ అల్లర్లు: వివాహమైన 12 రోజులకే.. -
పోలీసులను చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు
-
మణిరత్నంపై రాజద్రోహం కేసు
ముజఫర్‌పూర్/వయనాడ్: మూకదాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసిన 50 మంది ప్రముఖులపై రాజద్రోహం కింద కేసు నమోదైంది. ప్రధాని మోదీకి రాసిన జూలైలో రాసిన ఆ లేఖపై ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహతోపాటు, సినీ దర్శకులు మణిరత్నం, అదూర్ గోపాలకృష్ణన్, అపర్ణసేన్ తదితర యాభైమంది ప్రము ఖులు సంత కాలు న్నాయి. ము స్లింలు, దళితులు, మైనారిటీలపై మూకదాడులను ఆపాలని వారు తమ లేఖలో కోరారు. అయితే, ‘ఆ లేఖ కారణంగా దేశం ప్రతిష్ట దెబ్బతింది. వేర్పాటు ధోరణులను బలపరచడంతోపాటు ప్రధాని అద్భుత పనితీరును అందులో చులకన చేశారు’అని ఆరోపిస్తూ బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన సుధీర్ కుమార్ ఓఝా అనే న్యాయవాది చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు ఆగస్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రాజద్రోహం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని సదర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. -
హంతకుల్లేని హత్య!
ఉన్మాద మూకలు అమాయకుల్ని కొట్టి చంపుతున్న ఉదంతాల్లో చాలా కేసులకు ఏ గతి పట్టిందో రాజస్తాన్‌లోని పెహ్లూ ఖాన్ హత్యోదంతంలోనూ అదే జరిగింది. రెండేళ్లక్రితం రాజస్తాన్‌లోని ఆళ్వార్ జిల్లాలో 55 ఏళ్ల పెహ్లూఖాన్ అనే వ్యక్తిని ఒక మూక కొట్టి చంపిన కేసులో ఆరుగురు నింది తులూ నిర్దోషులని జిల్లా కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు మైనారిటీ తీరనివారు గనుక వారిపై బాల నేరస్తుల కోర్టులో విచారణ జరుగుతోంది. హర్యానాకు చెందిన డెయిరీ రైతు పెహ్లూ ఖాన్, ఆయన కుమారులిద్దరూ జైపూర్ పశువుల సంతలో ఆవుల్ని కొని స్వస్థలానికి వెళ్తుండగా ఉన్మాద మూక వారిపై దాడి చేసింది. పశువుల్ని అక్రమ రవాణా చేస్తు న్నారన్న అనుమానమే ఈ దాడికి కారణం. మూడు గంటలపాటు పెహ్లూఖాన్నూ, ఇతరులనూ కొట్టి తీవ్రంగా గాయపరిస్తే రెండు రోజుల తర్వాత పెహ్లూ ఆసుపత్రిలో కన్నుమూశాడు. ఇలాంటి దాడులు గత అయిదేళ్లలో వందకుపైగా చోటుచేసుకోగా వేళ్లమీద లెక్కపెట్టదగ్గ కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడ్డాయి. ఆ కేసుల్లో కూడా ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. మూకదాడులు చోటు చేసుకున్నప్పుడల్లా కాస్త వెనకో ముందో అధికార, విపక్ష నేతలు ఖండిస్తూనే ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా భిన్న సందర్భాల్లో ఈ తరహా దాడుల్ని సహించేది లేదని హెచ్చరించారు. కానీ కింది స్థాయిలో పరిస్థితులు దానికి తగినట్టుగా లేవు. ఘటన జరిగాక అరెస్టులు చేస్తున్నా దర్యాప్తులో, సాక్ష్యాధారాల సేకరణలో పోలీసులు ఘోరంగా విఫల మవుతున్నారు. చాలా సందర్భాల్లో కావాలని నీరుగారుస్తున్నారు. పెహ్లూఖాన్ ఉదంతంలో వీడియో దృశ్యాలున్నాయి. ఫొటోలున్నాయి. ఒక న్యూస్ చానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో నిందితు డొకరు అతన్ని ఎలా కొట్టి చంపిందీ కళ్లకు కట్టినట్టు వివరించాడు. ఇవన్నీ న్యాయస్థానం ముందు వీగిపోయాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకెక్కిన కేసు స్థితే ఇలా ఉంటే దేశంలో చట్టపాలనపై ఎవరికైనా విశ్వాసం ఉంటుందా? ఇలాంటి దాడులు జరిగినప్పుడల్లా కాంగ్రెస్, దాంతోపాటు ఇతర పార్టీలు బీజేపీ, సంఘ్ పరివార్‌లను తప్పుబడతాయి. ఆ సంస్థలు ఖండిస్తాయి. అక్కడితో అది ముగిసిపోతుంది. పెహ్లూఖాన్ ఉదంతంలో కాంగ్రెస్ ఎంత హడావుడి చేసిందో ఎవరూ మరిచిపోరు. బహుశా దాని పర్యవసానం కావొచ్చు... నిరుడు జరిగిన రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. ప్రత్యేకించి ఆళ్వార్ జిల్లాలో కాంగ్రెస్, బీఎస్పీలు అత్యధిక స్థానాలు గెల్చుకున్నాయి. రాజస్తాన్‌లో జరిగిన మూడు మూక హత్యలూ ఈ ప్రాంతంలో చోటుచేసుకున్నవే. కనీసం ఈ కేసును సవాలుగా తీసుకుని దోషుల్ని దండించడానికి ప్రయత్నిద్దామన్న స్పృహ రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోయింది. ఈ కేసులో పోలీసులు నిందితులపై సరైన సెక్షన్లు పెట్టలేదని ఆరోపణలొచ్చినా దానికి పట్టలేదు. నడిరోడ్డుపై బహిరంగంగా కొట్టి తీవ్రంగా గాయపరిచి చంపితే నిందితులపై పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశమున్న సెక్షన్ 307(హత్యాయత్నం)ను పెట్టలేదు. దానికి బదులు ‘ప్రాణనష్టం జరిగినా హత్యగా పరిగణించవీల్లేని’ చర్యగా సెక్షన్ 308కింద నేరారోపణ చేశారు. పైగా బాధితులపైనే రెండు నెలలక్రితం మరో చార్జిషీటు దాఖలు చేశారు. పెహ్లూఖాన్, అతని కుమారులు, ట్రక్కు యజ మాని పశువుల్ని అక్రమంగా తరలిస్తున్నారన్నది దాని సారాంశం. హర్యానా–రాజస్తాన్ సరిహద్దు ల్లోని ఆళ్వార్ తదితర ప్రాంతాల్లో పాడి పరిశ్రమ ఉంది. అక్కడ పశువుల్ని ఇటునుంచి అటూ, అటునుంచి ఇటూ తరలించడం, అమ్మడం రివాజు. పశువుల్ని రాష్ట్ర సరిహద్దులు దాటించాలంటే జిల్లా కలెక్టర్ అనుమతి అవసరమన్న నిబంధన ఉన్నా చాలామంది దాన్ని పట్టించుకోకుండా వ్యాపార లావాదేవీలు సాగిస్తుంటారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో అధికారులకు వర్తమానం ఇచ్చి నిందితులను పట్టి ఇవ్వొచ్చు. కానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇలా కొట్టి చంపడం, ఆ కేసు కాస్తా వీగిపోవడం, చివరకు బాధితులపై స్మగ్లింగ్ కేసు నమోదు కావడం దిగ్భ్రాంతికలిగిస్తుంది. పెహ్లూ, అతని కుమారులపై చార్జిషీటు నమోదైనప్పుడే కొన్ని సంస్థలు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి. కానీ ఫలితం లేకపోయింది. దర్యాప్తులోనూ, సాక్ష్యాధారాల సేకరణలోనూ పోలీసులు విఫలమైనప్పుడు న్యాయస్థానాలు నిస్సహాయంగా మిగిలిపోతాయి. ఈ కేసులో ప్రభుత్వాసుపత్రి వైద్యులిచ్చిన పోస్టుమార్టం నివేది కకూ, దెబ్బలుతిన్నవారికి తొలుత చికిత్స చేసిన ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడి పోస్టుమార్టం నివేదికకూ పొంతన లేదు. ఒంటినిండా తీవ్ర గాయాలు కావడం వల్లా, షాక్‌కి గురికావటం వల్లా పెహ్లూ మరణించి ఉండొచ్చని ప్రభుత్వాసుపత్రి వైద్యుల నివేదిక చెప్పగా, అతను గుండెపోటుతో చనిపోయాడని ప్రైవేటు ఆసుపత్రి తేల్చిచెప్పింది. నిబంధనల ప్రకారం పెహ్లూ మరణ వాంగ్మూ లంపై మేజిస్ట్రేట్ సంతకం చేయాల్సి ఉండగా అది జరగలేదు. ఇక వీడియో తీసిన వ్యక్తి సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాలేదన్న కారణంతో ఆ సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకునేందుకు కోర్టు నిరాకరించింది. నిరుడు సెప్టెంబర్‌లో మూకదాడి కేసులో జరిగే విచారణకు హాజరుకావడాని కొచ్చిన బాధితులపై దుండగులు దాడిచేశారు. పెహ్లూఖాన్ తరహాలోనే అంతం చేస్తామని తమను హెచ్చరించారని బాధితులు ఫిర్యాదు చేశారు. కానీ అదంతా నిజం కాదని పోలీసులు తేల్చారు. ఇలాంటి పరిస్థితులున్నప్పుడు వీడియో తీసిన వ్యక్తయినా, దాన్ని ప్రత్యక్షంగా చూసిన మరెవరైనా సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రాగలరా? మూకదాడులపై ప్రత్యేక చట్టం తెచ్చే అంశాన్ని పరిశీలిం చమని 2015లో సుప్రీంకోర్టు సూచించింది. కానీ దర్యాప్తు సంస్థల్లో నిబద్ధత కొరవడినప్పుడు ఎన్ని చట్టాలుండి ఏం ప్రయోజనం? ఉదాసీనతతో లేదా ఉద్దేశపూర్వకంగా నిందితులకు తోడ్పడే అధికా రులను సైతం నేరాల్లో భాగస్వాములుగా పరిగణించే నిబంధనలుంటేతప్ప ఈ ధోరణి ఆగదు. -
భారత ఖ్యాతిపై బురదజల్లేందుకే..
ముంబై: అంతర్జాతీయంగా భారత్ ఖ్యాతికి నష్టం వాటిల్లేలా, ప్రధాని నరేంద్ర మోదీపై బురద చల్లేందుకే కొందరు పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని హీరోయిన్ కంగనా రనౌత్ సహా 61 మంది బాలీవుడ్ ప్రముఖులు బహిరంగ లేఖ రాశారు. మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని, ద్వేషపూరిత నేరాలు పెరుగుతున్నాయని 49 మంది ప్రముఖులు ప్రధానికి ఇటీవల లేఖ రాసిన లేఖకు వీరు కౌంటర్ ఇచ్చారు. మంచి పాలన అందించేందుకు, మనవత్వాన్ని చాటేందుకు, నిజమైన జాతీయవాదాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తున్న నరేంద్రమోదీ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో గీత రచయిత ప్రసూన్ జోషి, డ్యాన్సర్ సోనల్ మాన్సింగ్, డైరెక్టర్లు మధుర్ భండార్కర్, వివేక్ అగ్నిహోత్రి తదితరులు ఉన్నారు. మూకదాడులకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ చాలాసార్లు మాట్లాడారని గుర్తు చేశారు. మూక దాడులపై చట్టాలు చేసుకునేందుకు రాష్ట్రాలకు మోదీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారన్నారు. పేదలు నక్సలిజం, ఉగ్ర బాధితులుగా మారినప్పుడు ఈ మేధావు లంతా ఏం చేశారని ప్రశ్నించారు. భారత్‌ను విడగొట్టాలని కశ్మీర్లో వేర్పాటువాదులు డిమాండ్ చేసినప్పుడు, పాఠశాలలను దహనం చేస్తామని హెచ్చరించినప్పుడు వీరంతా ఎక్కడికి పోయారన్నారు. జై శ్రీరాం అని నినదిస్తే హత్యలు చేసినప్పుడు, కశ్మీర్ లోయ నుంచి కశ్మీరీ పండిట్లను, ఉత్తరప్రదేశ్‌లోని ఖైరానా నుంచి హిందువులను వెళ్లగొట్టినప్పుడు వీరెందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. -
మోదీకి ప్రముఖుల లేఖ.. అనంత శ్రీరామ్ కౌంటర్
హైదరాబాద్: దేశంలో గత ఐదేళ్లుగా మూక హత్యలు పెరిగాయంటూ ప్రధాని నరేంద్ర మోదీకి 49 మంది ప్రముఖులు లేఖ రాయడం తీవ్ర దుమారం రేపుతోంది. ‘జై శ్రీరామ్’ రెచ్చగొట్టే యుద్ధ నినాదంగా మారిపోయిందని, ఆయన పేరుతో హత్యలు పెరుగుతున్నాయని, ప్రధానిగా ఈ దుశ్చర్యలను నిలువరించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తే, వారిపై 'యాంటీ నేషనల్', 'అర్బన్ నక్సల్' అనే ముద్ర వేస్తున్నారని వారు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రముఖులు లేఖలో పేర్కొన్న పలు అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూక హత్యలు ఒక మతానికే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని హిందుత్వ సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా పాటల రచయిత అనంత శ్రీరామ్ కూడా 49 మంది ప్రముఖులను తప్పుబట్టారు. దీనికి సంబంధించి తన అధికారిక ఫేస్బుక్ పేజిలో ‘నకిలీ మేథావులు మళ్లీ సకిలించారు’పేరిట ఓ పోస్ట్ పెట్టారు. (చదవండి: మతవిద్వేష దాడుల్ని ఆపండి!) ‘జై శ్రీరాం’ పదం నిషేధించమంటారా? ‘నకిలీ మేధావులు మళ్ళీ సకిలించారు. కుహనా లౌకికవాదులంతా కుమ్మక్కై ప్రధాన మంత్రికి ఉత్తరం రాశారట. అందులో ఏముందయ్యా అంటే "జై శ్రీరాం" అన్న పదం వల్ల ఎన్నో దారుణ మారణ కాండలు జరిగిపోతున్నాయంట. అందువల్ల ఆ పదం వల్ల జరిగే దుష్పరిణామాలు ఆపాల్సిన బాధ్యత ప్రధానమంత్రిదేనట. అంటే ఆ మహాశయులు ఇప్పుడేమంటారు "జై" అన్న పదాన్ని , "శ్రీరాం" అన్న పదాన్ని నిఘంటువుల్లోనించి నిషేధించమంటారా? ఏమో అన్నా అంటారు. మేథావులుకదా. వాళ్ళు అనేవారలు, మేము వినే వారలము. ఉరుమురిమి ఎక్కడో పడ్డట్టు చిక్కంతా వచ్చి ఇప్పుడు క్రిష్ణా రామా అనుకుంటూ శేష జీవితం ఆనందంగా గడుపుతున్న తల్లిదండ్రులని వచ్చి చుట్టుకుంటుంది. ఎందుకంటే నాపేరు "అనంత శ్రీరాం" ఈ మేధావుల మేధస్సుని అంచనా వెయ్యలేక మా తల్లిదండ్రుల్లానే ఎంతోమంది తమ పిల్లల పేర్లలో రామశబ్ధాన్ని ప్రయోగించారు. (సీతారాం ఏచూరి గారి నాన్నగారితో సహా ). ఇప్పుడు వాళ్ళంతా మా జనన ధృవీకరణ పత్రాలు మొదలుకుని ఆధార్ల వరకూ మాపేర్లు మార్చే బృహత్తర బాధ్యతని నెత్తినేసుకోవడం ఎలారా నాయనా అని నెత్తీ , నోరు బాదుకోవలసిన పరిస్థితి. అది మరి మేధావి దెబ్బంటే’అంటూ అనంత శ్రీరామ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
మతవిద్వేష దాడుల్ని ఆపండి!
కోల్‌కతా/న్యూఢిల్లీ: దేశంలో ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీలపై మతం ఆధారంగా జరుగుతున్న మూకహత్యలు, దాడులపై సినీపరిశ్రమతో పాటు వేర్వేరు రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు గళమెత్తారు. ఈ మూకహత్యలను వెంటనే అరికట్టేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని ప్రముఖ దర్శకులు మణిరత్నం, అదూర్ గోపాలకృష్ణన్, అనురాగ్ కశ్యప్, శ్యామ్‌బెనగల్ నటీనటులు అపర్ణాసేన్, కొంకణ్‌సేన్ శర్మ, రేవతి, సౌమిత్రో ఛటర్జీ, గాయని శుభా ముగ్దల్, ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ, సామాజిక కార్యకర్త బినాయక్ సేన్, సామాజికవేత్త ఆశిష్ నంది సహా 49 మంది బహిరంగ లేఖ రాశారు. కోల్‌కతాలో నటి అపర్ణాసేన్ ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు. అందులో.. ‘‘మోదీజీ.. మనదేశంలో ఇటీవల చోటుచేసుకుంటున్న దురదృష్టకరమైన సంఘటనలపై మేమంతా కలత చెందుతున్నాం. మనది శాంతికాముక దేశం. కానీ దేశంలో ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీ మతస్తులను చంపేస్తున్నారు. దీన్ని నిలువరించాలి. ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు చూసి విస్తుపోయాం. ఎందుకంటే ఒక్క 2016లోనే దళితులపై 840 దాడి ఘటనలు నమోదయ్యాయి. 9 ఏళ్లలో మతవిద్వేష దాడులు అమాంతం పెరిగిపోగా, అందులో 62 శాతం మంది బాధితులు ముస్లింలే. 2009, జనవరి 1 నుంచి 2018 అక్టోబర్ 29 వరకూ దేశవ్యాప్తంగా 254 మత విద్వేష ఘటనలు నమోదుకాగా, వీటిలో 91 మంది చనిపోయారు. ఈ విద్వేషదాడుల్లో 90 శాతం 2014, మే తర్వాతే(మోదీ వచ్చాకే) నమోదయ్యాయి. ఈ నేరాల్లో శిక్షలు పడుతున్న కేసులు గణనీయంగా తగ్గిపోవడం ఇంకా దారుణం. మోదీజీ.. మీరు పార్లమెంటులో ఈ మూకహత్యలను ఖండించారు. కానీ అది మాత్రమే సరిపోదు. హత్య కేసుల్లో పెరోల్ లేకుండా జీవితఖైదు పడుతున్నప్పుడు అంతకంటే దారుణమైన మూకహత్యలకు అదే శిక్ష ఎందుకు వర్తించదు? ఇలాంటి ఘటనల్లో దోషులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏ దేశంలో కూడా ప్రజలు భయంతో బతకకూడదు. మెజారిటీ ప్రజలు శ్రీరాముడిని ఆరాధిస్తారు. కానీ, ‘జై శ్రీరామ్’ రెచ్చగొట్టే యుద్ధ నినాదంగా మారిపోయింది. ఆయన పేరుతో హత్యలు చేయడానికి ఇది మధ్యయుగం కాదు. ప్రధానిగా ఈ దుశ్చర్యలను నిలువరించాలి. మతవిద్వేష దాడులతో శ్రీరాముడి పేరును అపవిత్రం చేయడం ఆపండి. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా, జాతివ్యతిరేకులుగా, అర్బన్ నక్సల్స్‌గా ముద్రవేయడం సరికాదు. అధికార పార్టీని విమర్శిస్తే∙దేశాన్ని వ్యతిరేకించినట్లు కాదు. ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కును రాజ్యాంగం కల్పిస్తోంది. ఎక్కడైతే భిన్నాభిప్రాయాన్ని, అసమ్మతిని వినిపించేందుకు అవకాశముంటుందో అదే బలమైన దేశంగా రూపుదిద్దుకుంటుంది’’ అని లేఖలో పేర్కొన్నారు. అందరూ సురక్షితమే: నఖ్వీ భారత్‌లో ముస్లింలు దళితులు సహా మైనారిటీలంతా సురక్షితంగా ఉన్నారని కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. మూకహత్యలు, మతవిద్వేష దాడుల్ని అరికట్టాలని 49 మంది దర్శకులు, నటులు, ఇతర కళాకారులు ప్రధాని మోదీకి రాసిన లేఖను ఆయన తప్పుపట్టారు. నేరాలకు మతం రంగు పులమడం సరికాదని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి మతఘర్షణలు చోటు చేసుకోలేదని గుర్తుచేశారు. ‘‘2014 ఎన్నికల తర్వాత ‘అవార్డు వాపసీ’ పేరుతో ఇలాంటి కార్యక్రమాన్నే మనమంతా చూశాం. ఇది దానికి పార్ట్–2 మాత్రమే. విద్వేష నేరాలు, మూకహత్యలను అరికట్టడానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కానీ తమనుతాము మానవ హక్కుల పరిరక్షకులుగా, లౌకికవాదానికి కస్టోడియన్లుగా చెప్పుకునే కొందరు ఈ నేరాలకు మతం రంగుపులిమే ప్రయత్నం చేస్తున్నారు’’ అని నఖ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దారుణం : కాలేజీలో యువకుడిపై పాశవిక దాడి..!
సాక్షి, అనంతపురం : పట్టణంలోని ఆర్ట్ష్ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. కాలేజీ మైదానంలో ఓ యువకుడిపై కొందరు పోకిరీలు మూకుమ్మడి దాడి చేశారు. కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా చితకబాదారు. రక్తం కారుతున్నా కనికరించకుండా పాశవికంగా మెడభాగంలో కాళ్లతో తన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటికిరావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. బాధితున్ని కనికంటివారిపల్లెకు చెందిన శివయ్యగా గుర్తించారు. అనంతపురం డీఎస్పీ బాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితున్ని విచారించారు. ఆర్ట్ష్ కాలేజీలో చదువుతున్న తన మిత్రుడు రాజేష్‌తో తోటి విద్యార్థులు గొడవకు దిగుతున్నారని, అతను రమ్మనడంతో కాలేజీకి వెళ్లినట్టు శివయ్య చెప్పినట్టు సమాచారం. అయితే, ఇంతపెద్ద ఘర్షణ జరుతున్నా కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. మూడు రోజుల క్రితం ఘర్షణ.. అనంతపురం ఆర్ట్ష్ కాలేజీలో చదువుతున్న రాజేష్ జియో టవర్ వద్ద మెకానిక్‌గా పనిచేస్తున్న శివయ్య స్నేహితులు. మూడు రోజులక్రితం కాలేజీలోని ఓ వర్గంతో రాజేష్‌కు గొడవ జరిగింది. ఈ వ్యవహారంపై రాజేష్ శివయ్య సాయం కోరాడు. దీంతో అతను శుక్రవారం కాలేజీకి వెళ్లాడు. అయితే, అక్కడ రాజేష్ కనిపించలేదు. తిరిగి వస్తుండగా కొంతమంది పోకిరీలు అతనిపై మూకుమ్మడి దాడి చేశారు. స్టూడెంట్ కాకపోయినా శివయ్య కాలేజీకి ఎందుకు వెళ్లాడనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరేదైన కారణముందా అని విచారిస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియనున్నాయి. దాడి జరిగిన సమయంలో శివయ్య మద్యం సేవించి ఉన్నట్టు తెలుస్తోంది. -
మూక హత్య బాధాకరం
న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో ఇటీవల ఒక ముస్లిం యువకుడు మూక హత్యకు గురి కావడం తననెంతో బాధించిందని, దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రధాని మోదీ అన్నారు. జార్ఖండ్ అయినా, బెంగాల్ అయినా, కేరళ అయినా దేశంలో ఎక్కడ హింసాత్మక ఘటనలు జరిగినా అన్నింటినీ ఒకేలా చూడాలని, చట్టం తన పని తాను చేయాలని ఉద్ఘాటించారు. బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ జార్ఖండ్ ఘటనపై స్పందించారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన జార్ఖండ్‌లో జరిగిన మూక హత్యపై మోదీ స్పందించడం లేదంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు ఆయన బదులిస్తూ దేశంలో ప్రతి పౌరుడికీ భద్రత కల్పించడం తమ రాజ్యాంగ విధి అన్నారు.రాజ్యసభ సభ్యులు కొందరు జార్ఖండ్ మూక హత్యల కేంద్రమని అనడాన్ని ప్రస్తావిస్తూ ‘అలా ఒక రాష్ట్రాన్ని అవమానించడం సరైనదేనా అని ప్రధాని ప్రశ్నించారు. మోటారు సైకిలు దొంగిలించాడన్న ఆరోపణతో జార్ఖండ్‌లో ఇటీవల 24 ఏళ్ల ముస్లిం యువకుడిని కొందరు చావబాదడం, అతనిచేత బలవంతంగా జైశ్రీరాం నినాదాలు చేయించడం తెలిసిందే. బిహార్‌లో మెదడువాపు వ్యాధి లక్షణాలతో ఒకే నెలలో 130 మంది పిల్లలు చనిపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఎన్నో సంవత్సరాలయిన తర్వాత కూడా అలాంటి వ్యాధి ఇప్పటికీ ప్రజల్ని చంపుతుండటం ఏడు దశాబ్దాల పాలనలో ఘోర వైఫల్యమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ఓటమిని అంగీకరించలేకపోవడం, ఈవీఎంలను సందేహించడం ద్వారా ప్రజా తీర్పును కించపరచడం కాంగ్రెస్ అహంకారానికి నిదర్శనమన్నారు. 16వ లోక్‌సభ కాలం ముగియడానికి ముందు రాజ్యసభ ఆమోదం పొందని కారణంగా 22 బిల్లులు చెల్లకుండా పోయాయని మోదీ గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకుడు సర్దార్‌వల్లభ్‌భాయ్ పటేల్ మొదటి ప్రధాని అయి ఉంటే కశ్మీర్ సమస్య తలెత్తేదేకాదని తమ పార్టీ నమ్మకమన్నారు. ధన్యవాద తీర్మానం ఆమోదం ప్రధాని ప్రసంగం తర్వాత సభ ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని లోక్‌సభ మంగళవారం ఆమోదించిన సంగతి తెలిసిందే.ఈ తీర్మానంపై ఉభయ సభల్లోనూ 13 గంటల పాటు చర్చ జరిగింది. వివిధ పార్టీలకు చెందిన 50 మంది చర్చలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఈ తీర్మానానికి 200 సవరణలు ప్రతిపాదించింది. అయితే, తర్వాత వాటిని ఉపసంహరించుకుంది. -
‘జార్ఖండ్ మూక దాడి’ వ్యక్తి మృతి
సెరైకేలా–ఖర్సావన్(జార్ఖండ్): మోటార్ సైకిల్ దొంగతనం చేశాడన్న అనుమానంతో జార్ఖండ్‌లో జనసమూహం చేతిలో తీవ్రంగా దెబ్బలు తిన్న యువకుడు మృతి చెందాడు. తీవ్రగాయాల పాలైన తబ్రేజ్ అన్సారీ (24) నాలుగు రోజుల తర్వాత మృతి చెందాడని పోలీసులు తెలిపారు. జంషెడ్‌పూర్‌లోని టాటా మెయిన్ ఆస్పత్రిలో ఈనెల 22న తబ్రేజ్ మృతి చెందినట్లు ధ్రువీకరించారని, అతని మృతిపై దర్యాప్తుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ‘ఈ ఘటనపై సిట్‌ను ఏర్పాటు చేశాం’అని ఎస్పీ కార్తీక్ పేర్కొన్నారు. తబ్రేజ్‌ను జై శ్రీరామ్ అని మతపరమైన నినాదాన్ని ఇవ్వమనడంపైనా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పప్పు మండల్ అనే వ్యక్తిని అరెస్టు చేశామని, దీనిపై విచారణ జరుపుతున్నామన్నారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి తబ్రేజ్ భార్య షాయిస్తా పర్వీన్ పలువురి పేర్లతో ఫిర్యాదు ఇచ్చారని తెలిపారు. గత మంగళవారం జంషెడ్పూర్ నుంచి ఇక్కడి గ్రామానికి తన ఇద్దరు స్నేహితులతో కలిసి వస్తున్న తబ్రేజ్ అన్సారీ అనే ముస్లిం యువకుడిని సెరైకేలా–ఖర్సావన్ జిల్లా ధట్కిడీ గ్రామస్తులు మోటార్ సైకిల్ దొంగతనం చేశారంటూ అడ్డుకున్నారు. ఈ ఘటనలో మిగతా ఇద్దరు తప్పించుకోగా, తబ్రేజ్ గ్రామస్తులకు పట్టుబడ్డాడు. అనంతరం తబ్రేజ్‌ను స్తంభానికి కట్టేసి కర్రలతో ఆ రాత్రంతా కొట్టారు. అలాగే జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ నినాదాలివ్వాలని బలవంతం చేశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతన్ని బుధవారం గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు తబ్రేజ్‌పై దొంగతనం అభియోగాలపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయింది. -
హరియాణా, బిహార్‌ల్లో ముస్లింలపై దాడులు
న్యూఢిల్లీ/బెగుసరాయ్: హరియాణలోని గుర్గావ్లో నలుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని ఓ ముస్లిం వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహ్మద్ బాకర్ ఆలం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ‘ఈ నెల 25న నేను సదర్ బజార్ ప్రాంతంలో ఉండగా నలుగురు మనుషులు నన్ను పిలిచారు. నేను తలపై టోపీ ధరించడం పట్ల వారు అభ్యంతరం తెలుపుతూ, నా టోపీ తీసేసి నన్ను చెంపదెబ్బలు కొట్టారు. భారత మాతకు జై అని అనమన్నారు. నేను వాళ్లు చెప్పినట్లు చేయడంతో మళ్లీ జై శ్రీరామ్ అని జపించమన్నారు. నేను తిరస్కరించడంతో వాళ్లు కర్రలు తీసుకుని నన్ను నిర్దాక్షిణ్యంగా కొట్టారు’ అని పేర్కొన్నాడు. మరో ఘటనలో బిహార్‌లోని బెగుసరాయ్ జిల్లా బరియార్‌పూర్‌లో వీధి వ్యాపారి అయిన ముస్లిం వ్యక్తి మహ్మద్ ఖాసింను రాజీవ్ యాదవ్ అనే వ్యక్తి తుపాకీతో కాల్చాడు. ఇది విద్వేష దాడి అయ్యుండొచ్చని పోలీసులు సోమవారం చెప్పారు. ఆసుపత్రిలో ఖాసిం చికిత్స పొందుతున్న ఖాసిం, తనపై జరిగిన దాడిని ఓ వీడియోలో వివరించాడు. -
శ్రీలంకలో ‘కనిపిస్తే కాల్చివేత’
కొలంబో: దేశంలోని వాయవ్య ప్రావిన్స్‌సహా పలు పట్టణాల్లో మత ఘర్షణలు చెలరేగడంతో శ్రీలంక దేశవ్యాప్తంగా సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 4 గంటల వరకూ కర్ఫ్యూ విధించింది. నిబంధనలను అతిక్రమించే వారిని కన్పించినచోటే కాల్చిచంపాలని ఆర్మీకి ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా శాంతియుతంగా ఉండాలనీ, తప్పు డు వార్తలను, వదంతులను నమ్మవద్దని ప్రధాని విక్రమసింఘే విజ్ఞప్తి చేశారు. ‘ముస్లిం’ షాపులు ధ్వంసం శ్రీలంకలోని వాయవ్య ప్రాంతంలో ఉన్న కులియపిటియా, బింగిరియా, దుమ్మలసురియా, హెట్టిపోలా పట్టణాల్లో మెజారిటీ సింహాళీయులు, ముస్లింల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో వదంతులు వ్యాపించకుండా ఫేస్బుక్, వాట్సాప్‌లపై మళ్లీ నిషేధం విధిస్తున్నామని సైన్యం తెలిపింది. ఈస్టర్ ఉగ్రదాడులకు సంబంధించి శ్రీలంక పోలీసులు ఇప్పటివరకూ వెయ్యి మందికిపైగా అనుమానితులను అరెస్ట్ చేశారు. -
పాకిస్తాన్‌కు వెళ్లిపోండి!
గురుగ్రామ్: హోలీ పండుగ రోజున హరియాణాలోని గురుగ్రామ్‌లో ఓ ముస్లిం కుటుంబంపై దాదాపు 25 మంది దుండగులు దాడి చేసి ‘మీరంతా పాకిస్తాన్ వెళ్లిపొండి’ అని బెదిరించారు. పోలీసులు ఇప్పటివరకూ దాడికి పాల్పడ్డ నిందితులందరినీ అరెస్ట్ చేయకపోవడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. యూపీలోని భాగ్‌పట్ జిల్లాకు చెందిన సాజిద్ తన కుటుంబ సభ్యులతో కలిసి హరియాణాలోని ధుమస్‌పూర్ గ్రామంలో సొంతిల్లు కట్టుకని ఉంటున్నారు. గురువారం హోలీ రోజున సాజిద్, అతని చుట్టాల పిల్లలు ఇంటి దగ్గర్లో ఆడుకుంటున్నారు. అక్కడకు బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు..‘ఏయ్.. ఇక్కడ మీరేం చేస్తున్నారు? పాక్‌కు వెళ్లి క్రికెట్ ఆడుకోండి’ అని అవమానించారు. దీన్ని గమనించిన సాజిద్ అక్కడకు వెళ్లి ఇద్దరు యువకులను నిలదీయడంతో ఆయనపై దాడిచేశారు. తర్వాత కర్రలు, కత్తులు, రాడ్లతో చేరుకున్న 20–25 మంది సాజిద్ ఇంట్లోకి దూసుకొచ్చి దాడిచేశారు. చివరకు ఇంట్లోని విలువైన వస్తువులను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనను పలు రాజకీయపార్టీలు ఖండించాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ మహేశ్ కుమార్(24) నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీపీ దినేశ్ శర్మ తెలిపారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. మరోవైపు ఈ దాడికి పాల్పడిన దుండగుల్ని ఆదివారంలోగా అరెస్ట్ చేసి చర్యలు తీసుకోకపోతే పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయిస్తామని ముస్లిమ్ ఏక్తా మంచ్ హెచ్చరించింది. -
అల్లరిమూకలపై కఠిన చర్యలు
కాన్పూర్/వారణాసి/రన్సాయ్/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కశ్మీరీలపై దాడులు చేస్తున్న అల్లరిమూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ రాష్ట్రాలను ఆదేశించారు. దేశాన్ని ఐక్యంగా ఉంచే వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. లక్నోలో ఇటీవల కశ్మీరీ వ్యాపారులపై కొందరు దుండగులు దాడిచేసిన నేపథ్యంలో ప్రధాని స్పందించారు. కశ్మీరీ సోదరులపై లక్నోలో దాడిచేసిన మూర్ఖులపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన మోదీ, లక్నో ఉత్తర–దక్షిణ కారిడార్ మెట్రో సేవలను ప్రారంభించారు. సహాయ నిరాకరణ చేశారు.. కాశీవిశ్వనాథ్ ఆలయం అప్రోచ్ రోడ్డు–సుందరీకరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం మోదీ మాట్లాడుతూ..‘యూపీలో సమాజ్‌వాదీ ప్రభుత్వం కారణంగా మొదటి మూడేళ్లు వారణాసిలో సహాయ నిరాకరణ ఎదురైంది. అందువల్లే వారణాసి సుందరీకరణ ప్రాజెక్టు ఆలస్యమైంది. కానీ మీరు(ప్రజలు) యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాక ప్రాజెక్టుల నిర్మాణం వేగం పుంజుకుంది. ఈ విషయంలో గత ప్రభుత్వాలు సహకారమందించి ఉంటే ఇప్పుడు శంకుస్థాపన కాకుండా ప్రాజెక్టును ప్రారంభించి ఉండేవాళ్లం. 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా బాబాను (కాశీ విశ్వనాథుడ్ని) పట్టించుకోలేదు. అందరూ మౌనంగా ఉండిపోయారు. అందుకే ‘నువ్వు(మోదీ) ఎక్కువగా మాట్లాడుతావు. ఇప్పుడు ఇక్కడికి(వారణాసి)కి వచ్చి ఏదైనా చేయ్’ అని ఆ పరమశివుడు నిర్ణయించి ఉంటాడు. కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టులో భాగస్వామి కావడాన్ని నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా’ అని తెలిపారు. -
అభినందన్ వెన్నెముకకు గాయం
న్యూఢిల్లీ: పాకిస్తాన్ చెర నుంచి విడుదలైన భారత వాయుసేన(ఐఏఎఫ్) వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు వెన్నెముక కింది భాగంలో గాయమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే పాకిస్తాన్లో అల్లరిమూకలు చేసిన దాడిలో అభినందన్ పక్కటెముక ఒకటి దెబ్బతిందని వెల్లడించాయి. ఎంఆర్ఐ స్కాన్‌లో ఆయన శరీరంలో ఎలాంటి బగ్స్(సూక్ష్మ నిఘా పరికరాలు) లేనట్లు తేలిందని పేర్కొన్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రిలో అభినందన్‌కు చికిత్స కొనసాగుతోంది. భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ ఎఫ్–16 యుద్ధ విమానాన్ని తన మిగ్–21 ద్వారా అభినందన్ కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన విమానం కూడా దెబ్బతినడంతో పారాచూట్‌తో అభినందన్ ఎజెక్ట్ అయ్యారు. విమానం నుంచి బయటకొచ్చే క్రమంలోనే ఆయన వెన్నెముకకు గాయమై ఉంటుందని భావిస్తున్నారు. అభినందన్ ఆరోగ్యస్థితిని అంచనా వేసే ‘కూలింగ్ డౌన్’ ప్రక్రియలో భాగంగా మరిన్ని పరీక్షలు చేయనున్నారు. కొనసాగుతున్న విచారణ.. పైలట్ అభినందన్‌ను ఆదివారం భద్రతాసంస్థల ఉన్నతాధికారులు విచారించారు. పాక్ ఆర్మీకి చిక్కాక ఐఏఎఫ్ రహస్యాలను ఏమైనా బయటపెట్టారా? అనే కోణంలో ఈ విచారణ సాగుతోంది. ఈ విచారణ మరికొన్ని రోజులు కొనసాగవచ్చని అధికారులు వెల్లడించారు. వీలైనంత త్వరగా తిరిగి కాక్‌పిట్‌లో కూర్చునేందుకు అభినందన్ ఆత్రుతగా, ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారన్నారు. ఎఫ్–16 యుద్ధ విమానాన్ని కుప్పకూల్చిన తొలి భారత పైలట్‌గా అభినందన్ చరిత్ర సృష్టించారన్నారు. ‘మహవీర్ అహింసా పురస్కారం’.. అభినందన్‌కు ‘భగవాన్ మహవీర్ అహింసా పురస్కారం’ను అందజేస్తామని అఖిల భారతీయ దిగంబర్ జైన్ మహాసమితి ప్రకటించింది. ఈ పురస్కారాన్ని అందుకోబోతున్న తొలి వ్యక్తి అభినందనేనని సమితి చైర్మన్ మందిరా జైన్ తెలిపారు. త్వరలో బెంగళూరుకు.. సాక్షి, బెంగళూరు: భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ త్వరలో బెంగళూరుకు రానున్నట్లు ఐఏఎఫ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. యుద్ధవిమానాలు నడిపేందుకు అభినందన్ ఫిట్‌గా ఉన్నారా? లేదా? తెలుసుకునేందుకు బెంగళూరులోని హెచ్ఏఎల్లో ఉండే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్లో సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ పరీక్షల్లో ఫిట్నెస్ చాటుకుంటే మళ్లీ యుద్ధవిమానాలు నడిపేందుకు అభినందన్‌ను అనుమతిస్తామని పేర్కొన్నారు. -
సరిహద్దుకు అటూ.. ఇటూ..
శత్రు దేశానికి చిక్కినా ప్రాణాలతో తిరిగొచ్చిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్‌కు యావత్ జాతి జేజేలు పలుకుతోంది. సరిగ్గా ఇదే సమయంలో పాకిస్తాన్లో ఒక పైలట్ కుటుంబం తమ కొడుకు చేసిన త్యాగాన్ని బయటకు చెప్పుకోలేక, బడబాగ్నిలాంటి నిజాన్ని మనసులో దాచుకోనూలేక మౌనంగా రోదిస్తోంది. ఇద్దరూ పైలెట్లే. ఇద్దరి కుటుంబ నేపథ్యం ఒక్కటే. ఇద్దరూ ఆగ్రహావేశాలతో ఊగిపోయే అల్లరిమూక చేతికి చిక్కారు. కానీ ఒకరి కథ సుఖాంతం. మరొకరిది అంతులేని విషాదం. పాకిస్తాన్ వాయుసేన భారత సైనిక స్థావరాలపై దాడికి దిగినప్పుడు ఒక ఎఫ్16 యుద్ధ విమానాన్ని షాహాజుద్దీన్ అనే పైలట్ నడుపుతున్నారు. ఆ విమానాన్ని మన సైనికులు కూల్చేశారు. ఆఖరి నిమిషంలో ప్రాణాలు కాపాడుకోవడానికి ఆయన పారాచూట్ సాయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని నౌషెరా సెక్టార్లో దిగారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో పీవోకే యువతలో భావోద్వేగాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పారాచూట్ నుంచి కిందకి దిగుతున్న షాహాజుద్దీన్‌ను చూసి లామ్వ్యాలీ గ్రామంలో అల్లరిమూక భారత పైలట్ అని పొరపడింది. చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడిచేయడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అభినందన్ వర్ధమాన్ కూడా అల్లరిమూకకు చిక్కినప్పటికీ పాక్ ఆర్మీ ఆయన్ను కాపాడగలిగింది. ఇద్దరిదీ ఒకటే కథ అభినందన్ వర్థమాన్, షాహాజుద్దీన్‌ది ఇంచుమించుగా ఒక్కటే కథ. అభినందన్ తండ్రి సింహకుట్టి వర్ధమాన్ మాజీ ఎయిర్‌మార్షల్ కాగా, షాహాజుద్దీన్ తండ్రి వసీముద్దీన్ కూడా పాకిస్తాన్ వైమానిక దళంలో ఎయిర్మార్షలే. ఎఫ్–16, మిరాజ్ విమానాలను నడపడంలో ఆయన దిట్ట. ఆ ఇద్దరి పైలెట్ల కుమారులు తమ కర్తవ్యాన్ని నిర్వహించడానికి, తమ దేశాల రక్షణ కోసం యుద్ధవిమానాల్లో గగనతలంలో ఒకరితో మరొకరు తలపడ్డారు. కానీ ఆ యుద్ధంలో ఒకరు వీరుడై తిరిగొచ్చి కోట్లాది గుండెల్లో విజేతగా నిలిస్తే, మరొకరు తోటి పాకిస్తానీల చేతుల్లోనే ప్రాణాలు పోగొట్టుకుని కోట్లాది గుండెల్లో విషాదాన్ని నింపేశారు. పాక్వి ఎప్పుడూ కట్టుకథలే యుద్ధ సమయాల్లో నిజాలు చెప్పే చరిత్ర పాక్‌కి లేనేలేదు. 1965 యుద్ధం, 1971 యుద్ధం, కార్గిల్ ఇలా అన్ని సమయల్లో కట్టు కథలే చెప్పింది. ఈసారి కూడా తమ సొంత పైలట్ విషయంలోనూ సరైన సమాచారం లేక మొదట నోరుజారింది. పాక్ మిలటరీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ గఫూర్ ఫిబ్రవరి 28న ఇద్దరు భారతీయ పైలెట్లను పట్టుకున్నామన్నారు. ఒకరు ఆర్మీ కస్టడీలో ఉన్నారని, మరొకరు ఆస్పత్రిలో ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత మాట మార్చి ఒక్కరే తమ చేతికి చిక్కారని వెల్లడించారు. ఆ రెండో పైలట్ ఎక్కడున్నారన్న ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఈ విషయం లండన్‌కి చెందిన లాయర్ ఖలిద్ ఉమర్ ద్వారా వెలుగులోకి వచ్చింది. అల్లరి మూక చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన పాక్ పైలట్ షాహజుద్దీన్ ఉమర్‌కు బంధువు కావడంతో ఈ విషయం బయటకు పొక్కింది. -
సమాచార సృష్టికర్తలు తెలిసిపోతారు!
న్యూఢిల్లీ: సోషల్ మీడియా, ఇతర ఆన్లైన్ వేదికల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కేంద్రం సమాచార, సాంకేతికత నిబంధనల్లో మార్పులు ప్రతిపాదించింది. ప్రభుత్వ సంస్థలు కోరినప్పుడల్లా పలానా సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు సోషల్ మీడియా సంస్థలు సహకరించాలని పేర్కొంది. ఈ మేరకు ఐటీ నిబంధనల్లో మార్పులు చేస్తూ సోమవారం ముసాయిదా సవరణలను ప్రకటించింది. ఈ చర్య వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తూ, పౌరుల జీవితాల్లోకి ప్రభుత్వం చొరబడేందుకు కారణమవుతుందని విపక్షాలు ఆరోపించాయి. ఈ సవరణలు అమల్లోకి వస్తే ప్రజలపై ప్రభుత్వం చలాయిస్తున్న పెద్దన్న అధికారాలు మరింత విస్తృతమవుతాయని, ఈ పరిస్థితి నియంత పాలనకు సమానమవుతుందని కాంగ్రెస్ పేర్కొంది. తాజా నిబంధనలు వ్యక్తిగత గోప్యత, భావ స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవరణలపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలిపేందుకు జనవరి 15 వరకు గడువిచ్చారు. వ్యక్తిగత గోప్యతను కారణంగా చూపుతూ ప్రస్తుతం సోషల్ మీడియా సంస్థలు సమాచార వనరుల్ని వెల్లడించేందుకు నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి సమాచారంతో జాగ్రత్త.. ‘చట్టబద్ధ అధికారం కలిగి ఉన్న సంస్థలు కోరితే సోషల్ మీడియా సంస్థలు తమ ప్లాట్‌ఫాంపై ఉన్న సమాచార సృష్టికర్తలు ఎవరో తెలుసుకునేందుకు సహకరించాలి. అక్రమ, విద్వేషపూరిత సమాచారాన్ని గుర్తించి తొలగించేందుకు లేదా ప్రజలకు కనిపించకుండా చేసేందుకు ఆయా సంస్థలు టెక్నాలజీ ఆధారిత వ్యవస్థల్ని ఏర్పాటుచేసుకోవాలి’ అని ముసాయిదా సవరణల్లో పేర్కొన్నారు. కొన్ని ముఖ్యాంశా>లు..అమర్యాద, దైవదూషణ కలిగించే, అభ్యంతరకర సమాచారాన్ని అప్లోడ్, హోస్టింగ్, షేరింగ్ చేయొద్దని సోషల్ మీడియా సంస్థలు వినియోగదారులకు సూచించాల్సి ఉంటుంది. చట్ట వ్యతిరేక, స్వీకర్తలను తప్పుదోవ పట్టించే, జాతి భద్రతకు ముప్పుగా మారే ఎలాంటి సమాచారాన్నైనా హోస్టింగ్, షేరింగ్ చేయొద్దని అప్రమత్తం చేయాలి. కోర్టు ఆదేశించిన 24 గంటల్లోపు సాధ్యమైనంత త్వరగా అలాంటి సమాచారాన్ని సోషల్ మీడియా సంస్థలు తొలగించాలి. సైబర్ భద్రత, దేశ భద్రత రీత్యా దర్యాప్తు సంస్థలు కోరితే అలాంటి సమాచారాన్ని 72 గంటల్లోగా అందించాలి. ఈ కేసుల దర్యాప్తులో ప్రభుత్వ సంస్థలకు సహకరించేందుకు అవసరమైతే ఇంటర్నెట్ కంపెనీలు సంబంధిత రికార్డుల్ని 180 రోజులు లేదా అంత కన్నా ఎక్కువ కాలం భద్రపరచాలి. నియంత్రణ మా ఉద్దేశం కాదు.. సామాజిక మాధ్యమాల సమాచారాన్ని నియంత్రించే ఉద్దేశం తమకు లేదని, కానీ ఈ సంస్థలు తమ ప్లాట్‌ఫాంలు ఉగ్రవాదం, హింస, నేరానికి దోహదపడకుండా ఉండాలని ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటీవల సంఘ విద్రోహ శక్తులు సోషల్ మీడియాను వినియోగించుకుని కొత్త సవాళ్లు విసిరిన సంగతిని ప్రస్తావించింది. టెక్ కంపెనీలు గూగుల్, ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్లతో ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు గత వారం సమావేశమై ప్రతిపాదిత సవరణలపై చర్చలు జరిపారు. సామాజిక మాధ్యమాలు వేదికగా బూటకపు వార్తలు విస్తరించడం ఇటీవల పెద్ద సమస్యగా మారడం తెల్సిందే. వాట్సప్‌లో వ్యాపించిన పుకార్ల వల్ల దేశవ్యాప్తంగా మూకహింస చెలరేగింది. దీంతో సోషల్ మీడియా సంస్థల్ని చట్ట పరిధిలో జవాబుదారీని చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అంతుచిక్కని ‘వాట్సాప్ హత్యలు’
సాక్షి, న్యూఢిల్లీ : అది మహారాష్ట్రలోని ధూలె జిల్లా రెయిన్‌పడ గ్రామం. సోమవారం ఉదయం దాదాపు నిర్మానుష్యంగా ఉంది. మగ పురుగయితే కనుచూపు మేరలో కనిపించడం లేదు. మహిళలు, చిన్న పిల్లలు చీకటి గదుల్లో నుంచి వెలుతురు వచ్చే కిటికీల గుండా వీధుల్లోకి నిశ్శబ్దంగా చూస్తున్నారు. కాళీగా ఉన్న కొన్ని ఇళ్ల ముందు ఆరేడుగురు పోలీసులు మౌనంగా పచార్లు చేస్తున్నారు. ఎప్పుడూ సందడి లేకుండా ఉండే ఏక గది సర్పంచ్ కార్యాలయం నిశ్శబ్దంగా శ్వాశిస్తున్నట్లుగా ఉంది. అయితే కార్యాలయం తలుపులు బద్దలై ఉన్నాయి. కిటికీ రెక్కలు విరిగి పోయి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూస్తే పక్కన పడేసిన పరుపుపైనా, నేలపైనా, గోడకు కనిపించీ కనిపించనట్లు రక్తం మరకలు కనిపిస్తున్నాయి. అదే గదిలో ఆదివారం నాడు ఐదుగురు అమాయకులు ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలు విడిచారు. వారికి సంతాప సూచకంగా గోడపై గాంధీ, ఇందిరాగాంధీ తదితర జాతీయ నాయకుల పటాలు కదలక, మెదలక మౌన సాక్షిలా ఉన్నాయి. పిల్లలను ఎత్తుకుపోవడానికి వచ్చిన కిడ్నాపర్లుగా భావించి ఐదుగురు వ్యక్తులను రెయిన్‌పడ గ్రామానికి చెందిన ప్రజలు అతి దారుణంగా కొట్టి చంపారు. వారికి ఇరుగు పొరుగు గ్రామాల ప్రజలు కూడా తలా ఓచేయి వేసి సహకరించారు. కాళ్లు, చేతులతోనే ఆ ఐదుగురిని కుళ్ల పొడవడంతో వారి నుంచి రక్తం ఎక్కువ కారినట్టులేదు. ముందస్తు ప్రణాళికతో కొంత మంది కర్రలతో వచ్చి కొట్టడంతో బాధితుల నుంచి కొంత రక్తం చిందింది. మృతులను రాజు భోన్స్లే, దాదారావు భోన్స్లే, భారత్ భోన్స్లే, భారత్ మాల్వీ, అగ్నూ ఇంగోల్‌గా గుర్తించారు. వారంతా ‘నాథ్ పంతీ దేవరీ గోసవీ నోమాడిక్ ట్రైబ్’కు చెందిన వారు. గోసవి సంచార తెగవారని సాధారణంగా పిలుస్తారు. మృతులంతా షోలాపూర్‌లోని ఖేవా గ్రామానికి చెందిన వారు. వారిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. గోసవి తెగవారి ప్రధాన వత్తి భిక్షాటన. వీరు ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు వెళుతుంటారు. ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో డేరాలు వేసుకొని ఉంటారు. ఊరూరు, ఇల్లిళ్లు తిరుగుతూ అడుక్కుతింటారు. తమ ప్రాంతానికి కొంత వారవడంతో పిల్లలను కిడ్నాప్ చేయడానికి వచ్చారన్న అనుమానంతో రెయిన్‌పడ గ్రామస్థులు అడుక్కోవడానికి వచ్చిన ఓ ఐదుగురిని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొట్టి చంపారు. వారిని ఆపేందుకు ఇద్దరు యువకులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. అత్యవసర పరిస్థితుల్లో చేసే ‘ఎస్ఓఎస్’ ఫోన్ కాల్ ద్వారా సమీపంలోనే ఉన్న పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇచ్చినా వారు రెండు గంటలు ఆలస్యంగా వచ్చారు. వాట్సాప్ కారణంగానే 28 మంది హత్య వాట్సాప్‌లో జరుగుతున్న తప్పుడు ప్రచారం కారణంగానే ఈ దారుణం కూడా జరిగింది. ‘మీ పరిసర ప్రాంతాల్లో పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాలు దిగాయి. దాదాపు 300 నుంచి 400 మంది ఉన్నట్లు ఇప్పుడే పోలీసుల నుంచి సమాచారం అందింది. వారు పిల్లలను ఎత్తుకుపోయి కిడ్నీలను, ఇతర అవయవాలను తీసుకొని అమ్ముకుంటారు’ అన్న వాట్సాప్ సందేశాలు గత కొన్ని రోజులుగా తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, గుజరాతీ, అస్సాం, భాషల్లో చక్కర్లు కొడుతున్నాయి. కిడ్నాపర్లు పిల్లలను చంపిన దశ్యం అంటూ ఓ ఫొటోను కూడా వారు పెట్టారు. వాస్తవానికి ఆ ఫొటో సిరియాలో జరిగిన రసాయనిక దాడిలో మరణించిన పిల్లల ఫొటో. ఈ వాట్సాప్ సందేశాలను ప్రజలు గుడ్డిగా నమ్మి అనుమానాస్పదులపై దాడులు చేయడంతో దేశంలో రెయిన్‌పడ మృతులతో కలిపి 28 మంది అన్యాయంగా మరణించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురు, జార్ఖండ్‌లో ఎనిమది, మహారాష్ట్రలో ఏడుగురు, త్రిపురలో ముగ్గురు, తమిళనాడులో ఇద్దరు, అసోంలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మరణించారు. ఒక్కసారైనా ఆలోచించాల్సిందీ.... ‘వాడి గురించి ఏమీ తెలుసుకోకుండా, నా కొడుకును వారంత గుడ్డిగా ఎలా చంపేస్తారు? నా తమ్ముడిని చంపేముందైనా ఒక్కసారి ఆలోచించి ఉండవచ్చుగదా!’ అని రెయిన్పడలో సోమవారం ఉదయం మాటి మాటికి సొమ్మసిల్లుతూ లేస్తూ ప్రశ్నిస్తున్న కల్పనా ఇంగోల్ను ఓదార్చేందుకు అక్కడున్న వారెవరూ సాహసించలేక పోయారు. ఆమె గ్రామస్థుల దాడిలో తన కొడుకును, తమ్ముడిని, అల్లుడిని, అల్లుడి తమ్ముడిని కోల్పోయారు. ‘నా కొడుకు వద్ద గుర్తింపునకు సంబంధించి అన్ని పత్రాలు ఉన్నాయి. ఆఖరికి ఆధార్ కార్డు కూడా ఉంది. అనుమానం వచ్చినప్పుడు ఎవరు నువ్వంటూ......’ మాట మధ్యలోనే ఆమె మళ్లీ సొమ్మసిల్లి పోయింది. ఉదయం 9.30 గంటలకు ఈ దారుణకాండ జూలై ఒకటవ తేదీన ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైందని మొత్తం సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన విశ్వాస్ గంగూర్డే మీడియాకు తెలిపారు. ‘వారు ఐదుగురు ఆదివారం అంగడి జరిగే ప్రదేశానికి వచ్చారు. భిక్షం అడుగుతున్నారు. అందులో ఓ యువకుడు ఓ యువతితో మాట్లాడుతున్నట్లు కనిపించింది. దూరం నుంచి చూసిన స్థానిక ప్రజలు వారిని కిడ్నాపర్లుగా భావించారు. ఒకరినొకరు పిలుచుకుంటూ వారి వద్దకు పరుగెత్తికెళ్లారు. వారు ఏమి చెబుతున్నారో వినిపించుకోకుండానే ఎవర్రా మీరు? అంటూ చితకబాదడం మొదలు పెట్టారు. వారు తప్పించుకునేందుకు పరుగులు తీసినా వెంటబడి కొట్టారు. నేను, మరో యువకుడు వారిని వారించబోయినా ఊరుకోలేదు. నేను దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పింపల్నర్ పోలీసు స్టేషన్‌కు ‘ఎస్ఓఎస్ (సేవ్ అవర్ షిప్ లేదా సేవ్ అవర్ సోల్స్) కాల్’ చేశాను. అలా పరుగెత్తిన ఐదుగురు యువకులు సమీపంలోకి పంచాయితీ కార్యాలయంలో దూరారు. నేను వారిని రక్షించడం కోసం గొళ్లం పెట్టాను. తలుపులు పగులకొట్టుకొని లోపలికి వెళ్లి దాడి చేశారు. పోలీసులు వచ్చేవరకు ఆగాల్సిందిగా కోరాను. వారు వినలేదు. పోలీసులు ఆలస్యంగా వచ్చారు. ఐదుగురు మరణించారు’ అని వివరించారు. కొంత మంది యువకులు కర్రలు పట్టుకొని వచ్చి కొట్టారని, వారు మాత్రం తమ ఊరోళ్లు కాదని ఆయన చెప్పారు. 35 మందిపై కేసు 23 మంది అరెస్ట్ విశ్వాస్ వాంగ్మూలం మేరకు పోలీసులు 35 మందిపై కేసు నమోదు చేసి వారిలో 23 మందిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గురించి తెలిసి బాధితుల తరఫున ఖేవా సర్పంచ్ సోమవారం ఉదయమే రెయిన్‌పడ వచ్చారు. బాధితులను తీసుకెళ్లి ధూలే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, ఇళ్ల పట్టాలివ్వాలని వారు కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. అప్పటివరకు మృతదేహాలను తీసుకెళ్లమని భీష్మించారు. కలెక్టర్ జోక్యంతో చివరకు ఐదు లక్షల రూపాయల నష్టపరిహారానికి బాధితులు అంగీకరించారు. సోమవారం సాయంత్రం చీకటి పడుతుండగా మృతదేహాలు తీసుకొని రెండు అంబులెన్స్‌లు ఖేవా గ్రామానికి బయల్దేదాయి. దేశవ్యాప్తంగా ఇంతటి దారుణాలు జరుగుతున్నప్పటికీ ఈ వాట్సాప్ వదంతుల సష్టికర్తలెవరో పోలీసులు కనుక్కోలేకపోయారు. -
పొమ్మన్నందుకు పోలీసును చావబాదారు..!!
ఉత్తరప్రదేశ్/ముజఫర్‌నగర్ : రాష్ట్రంలో అల్లరి మూకల ఆగడాలకు అడ్డూ, అదుపూ లేకుండా పోతోంది. పోలీసు ఔట్‌పోస్టు వద్ద మద్యం సేవిస్తున్న వారిని అడ్డుకున్నందుకు ఓ కానిస్టేబుల్‌పై మందుబాబులు దాడి చేశారు. దుడ్డు కర్రలతో ఆయన్ని చావ బాదారు. ఈ ఘటన ముజఫర్ నగర్ జిల్లాలోని ఉఖావలి గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ హరిరామ్ యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉఖావలి పోలీసు ఔట్‌పోస్టు వద్ద దీపక్ కుమార్ అనే కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఔట్‌పోస్టు సమీపంలో మద్యం సేవిస్తున్న కొందరిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని దీపక్ హెచ్చరించారు. మద్యం మత్తులో ఉన్న ఆ గుంపులోని వారంతా కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగారు. దీపక్ ఒంటరిగా ఉండడంతో అతనిపై దుడ్డు కర్రలతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ప్రమేయమున్న 21 మందిపై కేసు నమోదు చేశామనీ యాదవ్ తెలిపారు. అనిల్‌కుమార్, మోనూ, ముఖేష్, మనోజ్‌కుమార్‌లను అనే నలుగురిని ఇప్పటికే అరెస్టు చేశామని, మిగతా వారి కోసం గాలింపు చేపట్టామని యాదవ్ పేర్కొన్నారు. -
‘సోషల్’ కిల్లింగ్స్!
బుధవారం పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ వృద్ధుడిపై విరుచుకుపడిన జనం.. అదే రోజు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బీబీనగర్‌లో ఒక వ్యక్తిపై దాడి చేసి చంపేసిన స్థానికులు.. శుక్రవారం మల్కాజ్గిరి ఠాణా పరిధిలో కాలకృత్యాలు తీర్చుకుంటున్న వ్యక్తికి చావుదెబ్బలు.. శనివారం చాంద్రాయణగుట్ట, మాదన్నపేటల్లో ఎనిమిది మందిపై దాడి, ఒకరి మృతి.. సోషల్‌మీడియాలో షికార్లు చేస్తున్న పుకార్ల కారణంగా రాజధానిలో జరిగిన బీభత్సమిది. వాట్సాప్‌లో షేర్ అవుతున్న వీడియోలు, ఫొటోలు సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నా యి. ఇతర రాష్ట్రాలకు చెందిన దోపిడీ దొంగలు, పిల్లల కిడ్నాపర్లు వచ్చారని, ఫలానా చోట ఒకరు చిక్కారని, మరికొందరు ఇంకా సంచరిస్తున్నారనేది వాటి సారాంశం. వీటి ప్రభావంతో తీవ్ర అభద్రతాభావానికి లోనవుతున్న ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. కాస్త అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా దాడులకు తెగబడుతున్నారు. శనివారం రాత్రి చాంద్రాయణగుట్ట పరిధిలో చోటు చేసుకున్న ఇలాంటి ఘటనే చంద్రయ్య(52) అనే హిజ్రా ప్రాణం తీయగా, మరో ముగ్గురిని క్షతగాత్రులుగా మార్చింది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మాదన్నపేట ఠాణా పరిధిలో నలుగురు వ్యక్తులపై దాడికి కారణమైంది. –సాక్షి, హైదరాబాద్ ఇతర దేశాలకు చెందిన పాత వీడియోలే.. ఈ పుకార్లతో పాటు షేర్ అవుతున్న వీడియోలు అత్యంత భయంకరంగా, జుగుప్సాకరంగా ఉంటున్నాయి. ఇవి ఎక్కువగా చిన్నారులకు సంబంధించినవి కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంటోంది. ఇరాన్, ఇరాక్, సిరియా, మయన్మార్, శ్రీలంక, ఆఫ్గానిస్తాన్ తదితర ప్రాంతాల్లో గతంలో చోటు చేసుకున్న దారుణాలకు సంబంధించిన వీడియోలను కొందరు ఇంటర్నెట్ నుంచి తీసి షేర్ చేస్తున్నారు. కొన్ని వీడియోలకు తెలుగు, హిందీ, ఉర్దూ ఆడియో క్లిప్స్ జోడిస్తున్నారు. వీటి ప్రభావానికి లోనవుతున్న సాధారణ ప్రజలు ప్రతి అంశాన్నీ అనుమానాస్పదంగా చూస్తుండటం ఇబ్బందులకు కారణమవుతోంది. ఆధ్యుల్ని గుర్తించడం సాధ్యం కావట్లే.. ఇలాంటి వీడియోలను షేర్ చేసిన వారిలో కొందరిని పోలీసులు గుర్తిస్తున్నప్పటికీ.. వీటికి మూలం ఎవరనేది తెలుసుకోవడం సాధ్యం కావట్లేదు. ఈ పుకార్లు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి ప్రారంభమై రాష్ట్రంలోకి విస్తరించినట్లు భావిస్తున్నారు. వీటిని షేర్ చేసిన వారిలో కొందరిని అరెస్టు చేసిన పోలీసులు సోషల్‌మీడియా సెల్ ద్వారా సూత్రధారుల్ని గుర్తించాలని ప్రయత్నాలు చేశారు. చివరకు వాట్సాప్ సంస్థను సంప్రదించినా మూలం ఎవరనే వివరాలు చెప్పడం సాధ్యం కాదని చేతులెత్తేసింది. దీంతో షేరింగ్ ద్వారా విస్తరణను అడ్డుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ ‘ఇద్దరే’ ప్రధాన టార్గెట్.. పుకార్ల ప్రభావంతో ప్రతి ఒక్కరినీ అనుమానిస్తున్న సాధారణ ప్రజలు ఎవరు అనుమానాస్పదంగా కనిపించినా దాడులకు తెగబడుతున్నారు. వీరికి టార్గెట్‌గా మారుతున్న వారిలో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు, మానసిక వికలాంగులే ఎక్కువగా ఉంటున్నారు. రాజధానిలో వృత్తి, వ్యాపారాల కోసం ఇతర రాష్ట్రాలకు చెందిన వారు వస్తున్నారు. వీరిని స్థానికులు ప్రశ్నించినప్పుడు భాష అర్థం కాక సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. దీంతో అనుమానం పెరిగి, విచక్షణ కోల్పోతున్న ప్రజలు వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఇక మానసిక వికలాంగులు సైతం వీరికి టార్గెట్‌గా మారి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. స్కూళ్లు తెరిస్తే మరింత ప్రమాదం.. ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు కావడంతో పిల్లలంతా ఇంట్లోనే ఉంటున్నారు. మరో వారంలో స్కూళ్లు తెరుచుకోనున్న నేపథ్యంలో ఈ పుకార్ల కారణంగా పరిస్థితులు అదుపుతప్పే ప్రమాదం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా స్కూళ్లు, ప్రిన్సిపాల్స్, పేరెంట్స్ అసోసియేషన్లతో సమన్వయం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. పుకార్లను తిప్పికొట్టడానికి నగర పోలీసు విభాగం సైతం సమాయత్తమవుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో దాదాపు ప్రతి పోలీసుస్టేషన్‌కు ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలు ఉన్నాయి. కమ్యూనిటీ పోలీసింగ్ కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. వీటి ద్వారా ఇలాంటి పుకార్లను సమర్థంగా తిప్పికొట్టడానికి నిర్ణయించారు. ఇతర కోణాలు ఉన్నాయా..? సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేయడం వెనుక వేరే కోణాలు, కారణాలు ఉండి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టు కుని లోతుగా ఆరా తీయడానికి స్పెషల్ బ్రాంచ్‌ను రంగంలోకి దింపడంతో పాటు నిఘా వర్గాల సహకా రం తీసుకుంటున్నారు. ప్రధానంగా పుకార్లు విస్తరిస్తున్న సోషల్ మీడియా గ్రూపులు, అవి విస్తరిస్తున్న ప్రాంతాలు తదితరాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్తున్నారు. మరోవైపు ఈ పుకార్లు నమ్మవద్దంటూ, అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, తమకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ కొత్వాల్ అంజనీకుమార్ ఓ వాయిస్ క్లిప్ విడుదల చేశారు. 1.45 నిమిషాల నిడివితో ఉన్న దీనితో పాటు ఆయన సందేశానికి సంబంధించిన టెక్ట్స్‌ను అన్ని గ్రూపుల్లోనూ ప్రచారం చేస్తున్నారు. ఆధారాలు దొరికితే అడ్మిన్ అరెస్టే.. నగరంలో ఎలాంటి అంతర్రాష్ట్ర కిడ్నాపింగ్, దోపిడీ ముఠాల సంచా రం లేదు. సోషల్‌మీడియాలో ప్రచారమంతా వదంతులే. కిడ్నాపింగ్, దోపిడీ ముఠాలు వచ్చాయన్న ప్రచారం ఉద్రిక్తతతలకు దారితీయడమే కాక పరిస్థితులు చేయి దాటేలా చేస్తోంది. ప్రజా జీవితానికి భంగం కలిగించే ఇలాంటి వదంతులను ప్రచారం చేయడం నేరం. ఇలాంటివి షేర్ చేసిన వారితో పాటు ఆ యా గ్రూపుల అడ్మిన్లూ నేరం చేసినట్లే. తాజా పరిణామాల నేపథ్యంలో సోషల్‌మీడియాపై పూర్తి నిఘా ఉంచాం. ఆధారాలు చిక్కితే గ్రూప్ అడ్మి న్స్నూ అరెస్టు చేస్తాం. చాంద్రాయణగుట్ట ఉదంతానికి సంబంధించి 15 మందిని అదుపులోకి తీసుకున్నాం. తాజా పరిణామాల నేపథ్యంలో తెల్లవారుజామున 2 గంటల వరకు పెట్రోలింగ్ వాహనాలు, బ్లూకోల్ట్స్ సంచరిస్తూనే ఉంటాయి. – అంజనీకుమార్, హైదరాబాద్ కొత్వాల్ -
'ఆ క్షణంలో బస్సు ఆపినట్లయితే ఏం జరిగేదో..'
సాక్షి, న్యూఢిల్లీ : 'పద్మావత్' సినిమా వివాదం వారి జీవితాల్లో మర్చిపోలేని సంఘటనగా మిగిలింది. 30మంది చిన్నారులకు, ఓ టీచర్‌కు, బస్సు డ్రైవర్‌కు, కండక్టర్‌కు పెద్ద భయానక అనుభవంగా గుర్తుండిపోనుంది. ఆ సమయంలో డ్రైవర్ బస్సు ఆపి ఉన్నట్లయితే, బహుశా! చెప్పవీలుకానీ దుర్ఘటన చోటుచేసుకుని చరిత్రలో ఓ చెరిగిపోని మరకగా మిగిలి ఉండేదేమో. పద్మావత్ చిత్రం విడుదలను ఆపేయాలంటూ గుర్గావ్లో ఆందోళన చేస్తున్న కర్ణిసేనకు చెందినవారు కొంతమంది ఓ పాఠశాల బస్సుపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటన ఎలాజరిగిందనే విషయాన్ని కండక్టర్‌ను అడిగి తెలుసుకోగా ఒళ్లు గగుర్పొడిచే అనుభవాన్ని చెప్పాడు. 'సరిగ్గా మేం స్కూల్ నుంచి బయలుదేరి 7కిలో మీటర్ల వరకు వచ్చాం. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఓ బస్సు తగలబడిపోతుండటాన్ని మేం చూశాం. పోలీసులు ఆందోళన కారులను చెదరగొడుతున్నారు.. వారు మాత్రం తిరిగి దాడి చేస్తున్నారు. చెట్ల పొదల్లో నుంచి అనూహ్యంగా మా బస్సు వద్దకు వచ్చి దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో స్కూల్లో 30మంది నర్సరీ చదువుతున్న చిన్నారులు ఉన్నారు. దాదాపు 60మంది ఆందోళన కారులు రాళ్లు విసరడం మొదలుపెట్టారు. దాంతో చిన్నారులు ఏడ్వడం మొదలుపెట్టారు. అందులోని టీచర్ వారిని ఓదార్చడం మొదలుపెట్టింది. అన్ని వైపుల నుంచి రాళ్లు రావడం మొదలయ్యాయి. దాంతో చిన్నారులను సీట్ల కింద దాచి ఉంచే ప్రయత్నం చేశాం. ఒక పెద్ద బండరాయి వచ్చి ముందు అద్దాన్ని బద్ధలు కొట్టింది. దాంతో ఇక ఎంత నష్టం జరిగినా పర్వాలేదని డ్రైవర్, నేను నిర్ణయించుకున్నాం. బస్సును ముందుకు పోనిచ్చాం. పిల్లల ప్రాణాలు ముఖ్యం అని భావించి బస్సును వేగంగా ముందుకు తీసుకెళ్లాం. అప్పటికీ కొంతమంది వెదురు బొంగులతో వెంబడించారు. వెళ్లే క్రమంలోనే గాయపడిన చిన్నారులకు ప్రథమ చికిత్స చేశాం. ఆ సమయంలో బస్సును ఆపినట్లయితే ఏం జరిగి ఉండేదో కూడా ఊహించలేకపోయేవాళ్లం' అని వెల్లడించాడు. ఈ సంఘటన మొత్తం దేశాన్ని కదిలించిన విషయం తెలిసిందే. -
‘నేను ఇక పోలీసుగా ఉండలేను’
శ్రీనగర్: ఉత్తర కశ్మీర్ లోని సోపోర్ ప్రాంతంలో అల్లరిమూకలు తమ ఇంటిపై దాడి చేయడంతో ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులు తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. తాము ఉద్యోగాలు చేయలేమని ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్ లో అశాంతి కారణంగా పోలీసు అధికారులు రాజీనామా చేయడం ఇదే మొదటిసారి. 'నా ఇంటిపై దాడి చేయడంతో నేను రాజీనామా చేస్తున్నా. నేనిక పోలీసుగా ఉండలేను. కుటుంబమంతా నాపై ఆధారపడివుంది. ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకున్నాను. ఇక పోలీసులతో ఉండడని ఇక్కడి ప్రజలకు నేను చెప్పాదలుచుకున్నా’నని ఎస్పీవో వసీమ్ అహ్మద్ షేక్ పేర్కొన్నాడు. వీరి రాజీనామాలపై పోలీసులు మౌనం దాల్చారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాది బుర్హాన్ వాని ఎన్కౌంటర్ తర్వాత కశ్మీర్ లో తలెత్తిన అలర్లలో 68 మంది మృతి చెందారు. 5 వేల మందిపైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. అల్లరిమూకల రాళ్లదాడిలో పెద్ద సంఖ్యలో పోలీసులు గాయపడ్డారు. పలువురు పోలీసుల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి.