
సాక్షి, న్యూఢిల్లీ : అది మహారాష్ట్రలోని ధూలె జిల్లా రెయిన్‌పడ గ్రామం. సోమవారం ఉదయం దాదాపు నిర్మానుష్యంగా ఉంది. మగ పురుగయితే కనుచూపు మేరలో కనిపించడం లేదు. మహిళలు, చిన్న పిల్లలు చీకటి గదుల్లో నుంచి వెలుతురు వచ్చే కిటికీల గుండా వీధుల్లోకి నిశ్శబ్దంగా చూస్తున్నారు. కాళీగా ఉన్న కొన్ని ఇళ్ల ముందు ఆరేడుగురు పోలీసులు మౌనంగా పచార్లు చేస్తున్నారు. ఎప్పుడూ సందడి లేకుండా ఉండే ఏక గది సర్పంచ్ కార్యాలయం నిశ్శబ్దంగా శ్వాశిస్తున్నట్లుగా ఉంది. అయితే కార్యాలయం తలుపులు బద్దలై ఉన్నాయి. కిటికీ రెక్కలు విరిగి పోయి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూస్తే పక్కన పడేసిన పరుపుపైనా, నేలపైనా, గోడకు కనిపించీ కనిపించనట్లు రక్తం మరకలు కనిపిస్తున్నాయి. అదే గదిలో ఆదివారం నాడు ఐదుగురు అమాయకులు ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలు విడిచారు. వారికి సంతాప సూచకంగా గోడపై గాంధీ, ఇందిరాగాంధీ తదితర జాతీయ నాయకుల పటాలు కదలక, మెదలక మౌన సాక్షిలా ఉన్నాయి.
పిల్లలను ఎత్తుకుపోవడానికి వచ్చిన కిడ్నాపర్లుగా భావించి ఐదుగురు వ్యక్తులను రెయిన్‌పడ గ్రామానికి చెందిన ప్రజలు అతి దారుణంగా కొట్టి చంపారు. వారికి ఇరుగు పొరుగు గ్రామాల ప్రజలు కూడా తలా ఓచేయి వేసి సహకరించారు. కాళ్లు, చేతులతోనే ఆ ఐదుగురిని కుళ్ల పొడవడంతో వారి నుంచి రక్తం ఎక్కువ కారినట్టులేదు. ముందస్తు ప్రణాళికతో కొంత మంది కర్రలతో వచ్చి కొట్టడంతో బాధితుల నుంచి కొంత రక్తం చిందింది. మృతులను రాజు భోన్స్‌లే, దాదారావు భోన్స్‌లే, భారత్ భోన్స్‌లే, భారత్ మాల్వీ, అగ్నూ ఇంగోల్‌గా గుర్తించారు. వారంతా ‘నాథ్ పంతీ దేవరీ గోసవీ నోమాడిక్ ట్రైబ్’కు చెందిన వారు. గోసవి సంచార తెగవారని సాధారణంగా పిలుస్తారు.
మృతులంతా షోలాపూర్‌లోని ఖేవా గ్రామానికి చెందిన వారు. వారిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. గోసవి తెగవారి ప్రధాన వత్తి భిక్షాటన. వీరు ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు వెళుతుంటారు. ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో డేరాలు వేసుకొని ఉంటారు. ఊరూరు, ఇల్లిళ్లు తిరుగుతూ అడుక్కుతింటారు. తమ ప్రాంతానికి కొంత వారవడంతో పిల్లలను కిడ్నాప్ చేయడానికి వచ్చారన్న అనుమానంతో రెయిన్‌పడ గ్రామస్థులు అడుక్కోవడానికి వచ్చిన ఓ ఐదుగురిని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొట్టి చంపారు. వారిని ఆపేందుకు ఇద్దరు యువకులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. అత్యవసర పరిస్థితుల్లో చేసే ‘ఎస్‌ఓఎస్’ ఫోన్ కాల్ ద్వారా సమీపంలోనే ఉన్న పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇచ్చినా వారు రెండు గంటలు ఆలస్యంగా వచ్చారు.
వాట్సాప్ కారణంగానే 28 మంది హత్య
వాట్సాప్‌లో జరుగుతున్న తప్పుడు ప్రచారం కారణంగానే ఈ దారుణం కూడా జరిగింది. ‘మీ పరిసర ప్రాంతాల్లో పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాలు దిగాయి. దాదాపు 300 నుంచి 400 మంది ఉన్నట్లు ఇప్పుడే పోలీసుల నుంచి సమాచారం అందింది. వారు పిల్లలను ఎత్తుకుపోయి కిడ్నీలను, ఇతర అవయవాలను తీసుకొని అమ్ముకుంటారు’ అన్న వాట్సాప్ సందేశాలు గత కొన్ని రోజులుగా తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, గుజరాతీ, అస్సాం, భాషల్లో చక్కర్లు కొడుతున్నాయి. కిడ్నాపర్లు పిల్లలను చంపిన దశ్యం అంటూ ఓ ఫొటోను కూడా వారు పెట్టారు. వాస్తవానికి ఆ ఫొటో సిరియాలో జరిగిన రసాయనిక దాడిలో మరణించిన పిల్లల ఫొటో. ఈ వాట్సాప్ సందేశాలను ప్రజలు గుడ్డిగా నమ్మి అనుమానాస్పదులపై దాడులు చేయడంతో దేశంలో రెయిన్‌పడ మృతులతో కలిపి 28 మంది అన్యాయంగా మరణించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురు, జార్ఖండ్‌లో ఎనిమది, మహారాష్ట్రలో ఏడుగురు, త్రిపురలో ముగ్గురు, తమిళనాడులో ఇద్దరు, అసోంలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మరణించారు.
ఒక్కసారైనా ఆలోచించాల్సిందీ....
‘వాడి గురించి ఏమీ తెలుసుకోకుండా, నా కొడుకును వారంత గుడ్డిగా ఎలా చంపేస్తారు? నా తమ్ముడిని చంపేముందైనా ఒక్కసారి ఆలోచించి ఉండవచ్చుగదా!’ అని రెయిన్‌పడలో సోమవారం ఉదయం మాటి మాటికి సొమ్మసిల్లుతూ లేస్తూ ప్రశ్నిస్తున్న కల్పనా ఇంగోల్‌ను ఓదార్చేందుకు అక్కడున్న వారెవరూ సాహసించలేక పోయారు. ఆమె గ్రామస్థుల దాడిలో తన కొడుకును, తమ్ముడిని, అల్లుడిని, అల్లుడి తమ్ముడిని కోల్పోయారు. ‘నా కొడుకు వద్ద గుర్తింపునకు సంబంధించి అన్ని పత్రాలు ఉన్నాయి. ఆఖరికి ఆధార్ కార్డు కూడా ఉంది. అనుమానం వచ్చినప్పుడు ఎవరు నువ్వంటూ......’ మాట మధ్యలోనే ఆమె మళ్లీ సొమ్మసిల్లి పోయింది.
ఉదయం 9.30 గంటలకు
ఈ దారుణకాండ జూలై ఒకటవ తేదీన ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైందని మొత్తం సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన విశ్వాస్ గంగూర్డే మీడియాకు తెలిపారు. ‘వారు ఐదుగురు ఆదివారం అంగడి జరిగే ప్రదేశానికి వచ్చారు. భిక్షం అడుగుతున్నారు. అందులో ఓ యువకుడు ఓ యువతితో మాట్లాడుతున్నట్లు కనిపించింది. దూరం నుంచి చూసిన స్థానిక ప్రజలు వారిని కిడ్నాపర్లుగా భావించారు. ఒకరినొకరు పిలుచుకుంటూ వారి వద్దకు పరుగెత్తికెళ్లారు. వారు ఏమి చెబుతున్నారో వినిపించుకోకుండానే ఎవర్రా మీరు? అంటూ చితకబాదడం మొదలు పెట్టారు. వారు తప్పించుకునేందుకు పరుగులు తీసినా వెంటబడి కొట్టారు. నేను, మరో యువకుడు వారిని వారించబోయినా ఊరుకోలేదు. నేను దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పింపల్నర్ పోలీసు స్టేషన్‌కు ‘ఎస్‌ఓఎస్ (సేవ్ అవర్ షిప్ లేదా సేవ్ అవర్ సోల్స్) కాల్’ చేశాను. అలా పరుగెత్తిన ఐదుగురు యువకులు సమీపంలోకి పంచాయితీ కార్యాలయంలో దూరారు. నేను వారిని రక్షించడం కోసం గొళ్లం పెట్టాను. తలుపులు పగులకొట్టుకొని లోపలికి వెళ్లి దాడి చేశారు. పోలీసులు వచ్చేవరకు ఆగాల్సిందిగా కోరాను. వారు వినలేదు. పోలీసులు ఆలస్యంగా వచ్చారు. ఐదుగురు మరణించారు’ అని వివరించారు. కొంత మంది యువకులు కర్రలు పట్టుకొని వచ్చి కొట్టారని, వారు మాత్రం తమ ఊరోళ్లు కాదని ఆయన చెప్పారు.
35 మందిపై కేసు 23 మంది అరెస్ట్
విశ్వాస్ వాంగ్మూలం మేరకు పోలీసులు 35 మందిపై కేసు నమోదు చేసి వారిలో 23 మందిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గురించి తెలిసి బాధితుల తరఫున ఖేవా సర్పంచ్ సోమవారం ఉదయమే రెయిన్‌పడ వచ్చారు. బాధితులను తీసుకెళ్లి ధూలే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, ఇళ్ల పట్టాలివ్వాలని వారు కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. అప్పటివరకు మృతదేహాలను తీసుకెళ్లమని భీష్మించారు. కలెక్టర్ జోక్యంతో చివరకు ఐదు లక్షల రూపాయల నష్టపరిహారానికి బాధితులు అంగీకరించారు. సోమవారం సాయంత్రం చీకటి పడుతుండగా మృతదేహాలు తీసుకొని రెండు అంబులెన్స్‌లు ఖేవా గ్రామానికి బయల్దేదాయి. దేశవ్యాప్తంగా ఇంతటి దారుణాలు జరుగుతున్నప్పటికీ ఈ వాట్సాప్ వదంతుల సష్టికర్తలెవరో పోలీసులు కనుక్కోలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment