
స్వాతి(ఫైల్)
సాక్షి, మహబూబాబాద్: వాట్సాప్ వేదికగా జరిగిన ప్రచారంపై నిర్వహించిన కులపంచాయితీలో కొందరు ఓ మహిళపై దాడి చేశారు. ఆ మహిళ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈఘటన ఆదివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ముక్తి స్వాతి(38) తన పెద్ద కుమార్తె రాజేశ్వరికి మే నెలలో వివాహం జరిపించింది. ప్రభుత్వం ఇస్తున్న కల్యాణలక్ష్మి పథకం డబ్బుల కోసం పంచాయతీ కార్యదర్శి సంతకం అవసరం ఉండడంతో గ్రామంలోని ఆఫీసుకు వారంరోజుల క్రితం వెళ్లింది.
ఈ సమయంలో పంచాయతీ కార్యదర్శి మంగీలాల్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని స్వాతి తనతో సన్నిహితంగా ఉండే అదే గ్రామానికి చెందిన చింత అరవింద్‌కు తెలిపింది. దీంతో అరవింద్.. పంచాయతీ కార్యదర్శి మంగీలాల్‌కు ఫోన్ చేసి చంపుతానని బెదిరింపు కాల్స్‌తోపాటు మెసెజ్‌లు పెట్టాడు. ఈక్రమంలో అరవింద్ ఇంటికి పంచాయతీ కార్యదర్శి వెళ్లి అతడి తల్లి భద్రమ్మతో బెదిరిస్తున్న విషయం తెలిపి పోలీసులకు ఫిర్యా దు చేస్తానని అన్నారు. తను తన కొడుకుకు నచ్చజెప్తానని పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని భద్రమ్మ కోరడంతో అతను విషయాన్ని గ్రామ సర్పంచ్ వెంకన్నకు చెప్పాడు. సర్పంచ్ తను మాట్లాడుతానని తెలిపారు.
చదవండి: Hyderabad: ఓ వైపు కరోనా.. మరోవైపు అంటువ్యాధులు..
స్వాతి నంబర్‌తో వాట్సాప్ క్రియేట్ చేసిన అరవింద్
స్వాతికి చిన్న ఫోన్ ఉంది. సిమ్‌ను తన సెల్‌ఫోన్‌లో వేసుకున్న అరవింద్ వాట్సాప్‌ను ఆదివారం క్రియేట్ చేశాడు. దాని ఆధారంగా పంచాయతీ కార్యదర్శి మంగీలాల్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, మహిళలు పంచాయతీ కార్యాలయానికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనే సారాంశంతో గ్రామంలోని పెద్దమనుషులకు మెసెజ్‌లు పంపాడు. దీంతోపాటు పంచాయతీ కార్యదర్శిపై స్వాతి సర్పంచ్‌కు ఫిర్యాదు చేసిన ఆడియో, తదితర సందేశాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో పంచాయతీ కార్యదర్శి ఈ విషయాన్ని మళ్లీ గ్రామసర్పంచ్ వెంకన్నకు తెలిపాడు. సర్పంచ్.. స్వాతితోపాటు ఆమె కులపెద్దమనుషులను పంచాయితీకి పిలిచారు.
పంచాయితీలో స్వాతిపై దాడి
వాట్సాప్‌లో వచ్చిన వాటిపై ఆదివారం సాయంత్రం గ్రామంలో పంచాయితీ నిర్వహిస్తుండగా ‘ఇంత జరగడానికి కారణం నువ్వే’అంటూ స్వాతిపై అరవింద్ తల్లి భద్రమ్మ, స్వాతి ఆడపడుచు సైదమ్మ దాడి చేసి కొట్టారు. పదిమంది దూషిస్తూ కొట్టడాన్ని అవమానంగా భావించిన స్వాతి ఇంటికి వెళ్లింది. రేకులరాడ్డుకు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ తరువాత ఇంటికి వచ్చిన నాగేశ్వరరావు భార్య ఉరివేసుకున్న విషయాన్ని గమనించి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చే వరకు మృతి చెందింది. కాగా, తనపై కావాలని వాట్సాప్‌లో తప్పుడు ప్రచారం చేశారని, తాను ఎవరిపట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని పంచాయతీ కార్యదర్శి మంగీలాల్ తెలిపారు.
చదవండి: మెదక్‌లో విషాదం: విద్యార్థులపై దూసుకెళ్లిన ట్రాక్టర్.. ఇద్దరు మృతి
నలుగురిపై పోలీసులకు ఫిర్యాదు
తన అక్క స్వాతి అవమానభారంతో ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన చింత అరవింద్, చింత భద్రమ్మ, చింత పుల్లయ్య, ఇర్ప సైదమ్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతురాలి సోదరుడు కల్తి ప్రవీణ్ బయ్యారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గార్ల–బయ్యారం సీఐ బాలాజీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment