![Two Farmers Ends Life Due To Debt Issue In Warangal - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/20/FARMERS.jpg.webp?itok=wjQGT_op)
ధరంసోత్ రాములు, ఎడ్ల బొంద్యాలు
మహబూబాబాద్ రూరల్/చెన్నారావుపేట: ఆ రైతు కుటుంబాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. అప్పు తెచ్చి వైద్యం చేయించుకున్నారు. ఎలాగోలా బతికి బయటపడిన ఆ రైతు పంటల సాగుకు మరికొంత అప్పు చేశాడు. అయితే ఆశించిన రీతిలో పంట పండక అప్పుల భారం నెత్తినపడింది. తీర్చేదారి లేక ఆ ఇంటి పెద్ద పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మహబూబాబాద్ జిల్లా లక్ష్మతండా గ్రామ పంచాయతీ పరిధిలోని బూరుకుంట తండాలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన ధరంసోత్ రాములు నాయక్ (58)కు 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కుటుంబం మొత్తానికి కరోనా రావడంతో వైద్యం కోసం అప్పు చేశాడు. మిర్చి, పత్తి పంటల సాగుకు మరికొంత అప్పు తెచ్చాడు.
మొత్తంగా రూ.15 లక్షల వరకు అప్పులయ్యాయి. కానీ పంటల దిగుబడి రాలేదు. అప్పుల భారంతో మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం ఉదయం ఇంటి సమీపంలోని వ్యవసాయ భూమిలో పురుగు మందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాములు నాయక్ రాత్రి 9 గంటల సమయంలో మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్ జిల్లాలో మరో రైతు
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగాపురం గ్రామానికి చెందిన ఎడ్ల బొంద్యాలు (65)కు ఆరుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఐదో కుమార్తెకు గత ఏడాది వివాహం చేశాడు. ఇందుకోసం రూ.4 లక్షలు, వ్యవసాయానికి మరో రూ.లక్ష అప్పు చేశాడు. అయితే పంటలు సరిగా పండక, అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో.. తీర్చలేనని మనస్తాపానికి గురై ఈ నెల 15న ఇంట్లోనే పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఆయన మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment