debt issues
-
అప్పులపై ఇన్నిరోజులూ పచ్చి అబద్ధాలే..!
సాక్షి, అమరావతి: అప్పుల విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలేనని అసెంబ్లీ సాక్షిగా, అదీ కూటమి ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్లోనే తేలిపోయింది. మరో పక్క చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్‌కు రూ.91,443 కోట్ల అప్పులు, మరో రూ.1.09 లక్షల కోట్ల పన్నులు ఆధారంగా ఉండటం విశేషం. ఓసారి రూ.14 లక్షల కోట్లు అప్పులని, మరోసారి రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారని, రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేశారంటూ గత ప్రభుత్వంపై ఎల్లోమీడియా చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి పయ్యావుల సోమవారం అసెంబ్లీకి సమరి్పంచిన బడ్జెట్ పత్రాల్లో స్పష్టమైంది. బడ్జెట్ అప్పులతో పాటు గ్యారెంటీల ద్వారా చేసిన అప్పులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే 2023–24 ఆర్థిక ఏడాది పూర్తయ్యేనాటికి రూ.6.46 లక్షల కోట్లేనని బడ్జెట్ పత్రాల్లో మంత్రి పేర్కొన్నారు. ఇందులో బడ్జెట్ అప్పులు 2023–24 మార్చి కి రూ.4.91 లక్షల కోట్లేనని పేర్కొన్నారు. ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన అప్పులు రూ.1.54 లక్షల కోట్లేనని చెప్పారు. 2024–25 ఏడాది మార్చికి బడ్జెట్ అప్పులు రూ.5,60,094.25 కోట్లకు చేరతాయని, ఇది జీఎస్డీపీలో 34.14%గా ఉంటుందని మంత్రి బడ్జెట్ డాక్యుమెంట్లో పేర్కొన్నారు.వైఎస్ జగన్ పాలనలోనే అప్పులు తక్కువఇవాళ అసెంబ్లీ సాక్షిగా తేలిన రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లు. ఇందులో చంద్రబాబు 2019లో దిగిపోయే నాటికే రూ.4,06,383 కోట్ల అప్పు ఉంది. ఆ తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోవిడ్ సమయంలో సైతం పెద్ద ఎత్తున సంక్షేమాభివృద్ధి పథకాలు అమలు చేస్తూ.. సుమారు రూ.2 లక్షల కోట్లకుపైగా డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లో జమ చేసినప్పటికీ రాష్ట్ర అప్పు ఇంతేనని తేలింది. ఈ లెక్కన వైఎస్ జగన్ హయాంలో చేసిన అప్పు కంటే చంద్రబాబు హయాంలో చేసిన అప్పులే ఎక్కువని బట్టబయలైంది. రూ.14 లక్షల కోట్ల అప్పులు అంటూ టీడీపీ కూటమి నేతలు చెప్పింది దు్రష్పచారం అని తేటతెల్లమైంది. -
భారీ పెట్టుబడుల దిశగా రియల్ ఎస్టేట్
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ పరిశ్రమ డిమాండ్‌కు తగ్గట్టుగా భారీ పెట్టుబడుల దిశగా అడుగులు వేస్తోంది. గడిచిన 19–20 నెలల్లో రియల్ ఎస్టేట్ సంస్థలు రూ.లక్ష కోట్ల మేర పెట్టుబడులు సమీకరించడం ఈ డిమాండ్‌కు అద్దం పడుతోంది. 92 శాతం పెట్టుబడులను డెట్ ఇష్యూల జారీ ద్వారానే సమీకరించాయి. అంతేకాదు మరో రూ.28,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఇష్యూలు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. హౌసింగ్ మార్కెట్లో బూమ్‌కు తోడు స్థిరమైన నగదు ప్రవాహాలు ఈ రంగంలోని కంపెనీలకు అనుకూలిస్తున్నాయి. తక్కువ క్రెడిట్ రిస్క్ ఉండడంతో డెట్ పత్రాల మార్గంలో నిధుల సమీకరణకు మొగ్గు చూపిస్తున్నాయి. 2023, 2024లో ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్, సివిల్ కన్స్ట్రక్షన్ కంపెనీలు డెట్ మార్గంలో రూ.95,975 కోట్ల నిధులు సమీకరించాయి. ఇందులో 2023లో రూ.61,600 కోట్లు, ఈ ఏడాది రూ.34,375 కోట్ల చొప్పున సమకూర్చుకున్నాయి. ఈక్విటీ రూపంలో నిధుల సమీకరణ తక్కువగానే ఉన్నప్పటికీ, ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. 2023లో ఈక్విటీ జారీ రూపంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ కంపెనీలు రూ.124 కోట్లు రాబట్టగా, 2024లో ఇప్పటి వరకు రూ.8,772 కోట్లు సమీకరించాయి. ఇందులో ఐపీ వోలు కూడా ఉన్నాయి. ఇక సమీప కాలంలో సమీకరించనున్న రూ.28,350 కోట్లలో.. డెట్ మార్గంలో రూ.16,635 కోట్లు, రూ.9,695 కోట్లు క్యూఐపీ రూ పంలో, మిగిలినది ఐపీవోల రూపంలో రానుంది.మెరుగైన అమ్మకాలు లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీల అమ్మకాలు కరోనా అనంతరం ఏటా 15–20 శాతం మేర వృద్ధి చెందడంతో నగదు ప్రవాహాలు (నికర నిధుల మిగులు) మెరుగయ్యాయి. అంతేకాదు భవిష్యత్ నగదు ప్రవాహాలు అంచనాలపైనా స్పష్టత ఏర్పడింది. ‘‘ఇళ్ల అమ్మకాలపై చెల్లింపులు సాధారణంగా క్రమానుగతంగా (మైలురాయి చేరికల ఆధారంగా) ఉంటుంది. ఇది రియల్ ఎస్టేట్ సంస్థల నగదు ప్రవాహాలు మెరుగయ్యేలా చేసింది’’అని ఈక్విరస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఎండీ విజయ్ అగర్వాల్ తెలిపారు. కొత్త ప్రాజెక్టులను ఆరంభించిన వెంటనే 25–30 శాతం మేర అమ్ముడుపోయే పరిస్థితులు కనిపిస్తున్నట్టు చెప్పారు. దీంతో నగదు ప్రవాహాలపై అంచనాలకు ఇది వీలు కలి్పస్తోందని, దీంతో అవి డెట్ రూపంలోనిధుల సమీకరణకు ఆసక్తి చూపిస్తున్నట్టు వివరించారు. ఈక్విటీఈక్విటీ మార్గమే చౌక మార్గమే చౌక ఈ ఏడాది ఈక్విటీ జారీ రూపంలో రియల్ ఎస్టేట్ కంపెనీలు పెద్ద మొత్తంలో నిధుల సమీకరణకు ఉన్న కారణాలను నిపుణులు వెల్లడిస్తున్నారు. రుణాలపై వడ్డీ రేట్లు పెరిగిపోవడం ఇందులో ప్రధానమైనది. రియల్ ఎస్టేట్ కంపెనీలు రెండంకెల రాబడులను ఆశిస్తుంటాయి. దీంతో ప్రస్తుత తరుణంలో ఈక్విటీ జారీయే మెరుగైన మార్గమని భావించడంతో.. ఈ దిశగా ఆసక్తి నెలకొంది. ఈ నిధులను భూముల సమీకరణపై ఎక్కువగా వెచి్చస్తున్నాయి. 2024 మొదటి ఆరు నెలల్లో 54 భూ లావాదేవీలు నమోదయ్యాయి. వీటి పరిమాణం 1,000 ఎకరాలపైనే ఉంది. గతేడాది 100 భూలావాదేవీలు నమోదు కాగా, వీటి పరిమాణం 2,700 ఎకరాలుగా ఉంది. -
వేలల్లో జీతాలు.. లక్షల్లో అప్పులు...
దిగువ మధ్యతరగతికి చెందిన రాజేష్ తండ్రి కష్టంలో బీటెక్ చేశాడు. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో కష్టపడి సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుని మొత్తానికి ఒక ఐటీ కంపెనీలో చేరాడు. అంతవరకూ తండ్రి రామారావు పంపే ఐదారువేలను అతి పవిత్రంగా చూసుకుంటూ ఆచితూచి ఖర్చుపెడుతూ ఉన్నంతలో సంతోషంగా ఉండేవాడు.. ఒక్కసారిగా ఐటీ ఉద్యోగం ఆయన జీవితాన్ని మార్చేసింది.. ఇన్నాళ్ల నాటి ఆయన సంతోషాలను తీసుకుని ఒత్తిడిని నెత్తినపెట్టింది. ఊరికి వెళ్ళేటపుడు హాయిగా బస్సులో వెళ్లే రాజేష్ ఇప్పుడు సెకెండ్ క్లాస్ ఏసీ లేకుంటే ప్రయాణం కుదరడం లేదు. మామూలు టిఫిన్లు మానేశాడు.. రెండు ఇడ్లీలు కూడా రెస్టారెంట్లోనే తింటున్నాడు. మామూలు బట్టలు నాసిరకంగా కనిపిస్తున్నాయి. అన్నీ బ్రాండెడ్.. మామూలు ఆండ్రాయిడ్ మొబైల్ చూసి ఫ్రెండ్ నవ్వాడని దాన్ని పారేసి లక్షన్నర పెట్టి ఐ- ఫోన్ కొన్నాడు. టీషర్ట్స్, చెప్పులు, వాచీ.. ఆఖరుకు తాను ప్రతినెలా క్రాఫ్ చేయించుకునే సెలూన్‌ను కూడా మార్చేశాడు.. దాన్నిపుడు స్పా అంటున్నారు.. జంట్స్ హైటెక్ సెలూన్ అన్నమాట. మామూలు హీరో హొండాను అమ్మేసి పెద్ద బైక్ మూడు లక్షలు పెట్టి కొన్నాడు. ఫ్రెండ్స్‌తో రూమ్ షేరింగ్ తప్పు అనిపించింది.. ఇంకాస్త పెద్ద ఫ్లాట్‌కు మారాడు.. రెంట్ పదిహేనువేలు.. ఒక్కడికే ఇంత ఇల్లు ఎందుకురా అని నాన్న అంటే ఈమాత్రం లేకపోతే మనకు గౌరవం ఉండదు నాన్నా అని నమ్మించాడు.. ఓహో.. నిజమే కావచ్చు అనుకున్నాడు అమాయకపు పల్లెటూరి రామారావు. కాలం మారింది. కరోనా దెబ్బకు ఉద్యోగం పోయింది.. పరిస్థితి తిరగబడింది.. ఉద్యోగం పోయినా అప్పులు ఊరుకోవు. ప్రతిరోజు బ్యాంక్ వాళ్ల ఫోన్లు.. క్రెడిట్ కార్డ్స్ బిల్స్ కట్టకపోతే పెనాల్టీ.. ఇవన్నీ వెరసి రాజేష్‌ను ఒత్తిడిలోకి నెట్టేశాయి.. రెండు మూడేళ్ళలో రాజేష్ మొత్తం హై క్లాస్ అయిపోయాడు. జీతం డెబ్బై వేలు అయినా అందులో అరవైవేల వరకు ఖర్చులు, ఇన్స్టాల్మెంట్స్కు పోతున్నాయి. నేలయ్యేసరికి మిగిలేది ఏమీ ఉండడం లేదు. తండ్రికి అయినా అయిదారువేలు పంపే పరిస్థితి లేకపోతోంది. డబ్బు భలే జబ్బు మొదట్నుంచి లావిష్, విలాసంగా బతికే కుటుంబాలు వేరు.. కానీ దిగువ మధ్యతరగతి నుంచి వచ్చి, ఒకేసారి ఆర్థిక స్థోమత పెరిగినవాళ్లు ఆ పరిస్థితిని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. అందరితోబాటూ మనమూ భారీగా రిచ్చుగా లేకపోతే పదిమందిలో తమకు విలువ తగ్గుతుందనే ఆత్మన్యూనతా భావన వారిని మరింత చిక్కుల్లోకి నెట్టేస్తోంది. అవసరం ఉన్నా లేకున్నా భారీ ఖర్చులు.. వీళ్ళ జీతం చూసి బ్యాంకులు సులువుగా లోన్లు ఇస్తూ కుర్రాళ్లను తమగుప్పిట్లో పెట్టుకున్నాయి. పైసా చేతిలో లేకున్నా క్రెడిట్ కార్డుతో కొనేసే అవకాశం కూడా ఉండడంతో.. హోటల్ బిల్లులు.. బట్టలు.. ఫోన్లు ఇవన్నీ ఎడాపెడా కొనేస్తున్నారు. తాహతుకు మించి అద్దెలు కట్టి ఇద్దరు దంపతులు ఉన్న చోటకూడా ట్రిపుల్ బెడ్ రూమ్స్ అద్దెకు తీసుకుంటున్నారు. ప్రతివారం సినిమాలు.. మల్టీప్లెక్సులు.. పబ్బులు.. రెండువారాలకోసారి పార్టీలు.. ఇవన్నీ వారి జీవన ప్రమాణాలను పెంచుతున్నాయి అనుకుంటున్నారు తప్ప తమ జీవితాలను కిందికి తొక్కేస్తున్నాయని గ్రహించేలోపు పరిస్థితులు చేయిజారిపోతున్నాయి. తన టీములో పనిచేసే కొలీగ్‌కు కార్ ఉంది కాబట్టి మనం కొనేయాలి. ఆయన లక్షన్నర పెట్టి టీవీ కొన్నాడు కాబట్టి మనం కొనకపోతే పెద్ద నేరం. ఏటా మూడుసార్లు కనీసం యాభైవేలు ఖర్చు చేసి టూర్లు వెయ్యాలి.. బ్రాండెడ్ వస్తువులు లేకపోతే నామోషీ.. పదిమందిలో నిలవలేం.. వారిముందు ఐదు వందల విలువైన చెప్పులు వేస్తే నవ్వుతారు కాబట్టి చెప్పులు కనీసం పదివేలకు తగ్గకూడదు. తరచూ పార్టీలు ఇవ్వకుంటే మనకు గౌరవం ఉండదు కాబట్టి అప్పు చేసి అయినా పార్టీలు ఇవ్వాలి. ఇవన్నీ ప్రస్తుతం యువతను మింగేస్తున్న అవలక్షణాలు . ఎవరో ఏమో అనుకుంటారు అనే భావనలో తమనుతాము మోసం చేసుకుంటూ అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఒకవేళ కాలం తిరగబడి ఉద్యోగం తేడా జరిగి.. ఆర్నెల్లు ఖాళీగా ఉండాల్సి వస్తే ? అప్పుడు ఏమి చేస్తారు. సేవింగ్స్ కూడా పెద్దగా ఉండవు.. ఈ టీవీలు.. అద్దె ఫ్లాట్స్.. కార్లు.. యాపిల్ వాచీలు.. ఇవేమి వాళ్ళను కాపాడే పరిస్థితి ఉండదు.. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. జీతం ఉండగానే పొదుపు చేసుకోవాలి. ముందు తరాల కోసం కాకున్నా మీకోసం మీరు పొదుపు చేసుకోవాలి. మన తాత తండ్రులు నాలుగురేసి పిల్లల్ని అలవోకగా పెంచేవాళ్ళు.. ప్రయోజకులను చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్క పిల్లాడితో ఉన్న జీవితాన్ని ఈదలేకపోతున్నారు.. కారణం ఏమిటి? అప్పట్లో బాధ్యత.. ఆదాయాన్ని బట్టి ప్లానింగ్ ఉండేది. ఇప్పుడు అవసరం లేని ఖర్చులు.. విలాసాలు.. ఫాల్స్ ప్రిస్టేజిలు.. యువతను అప్పుల్లోకి దించేస్తున్నాయి. అలాగని అందరూ అలాగే ఉన్నారని కాదు.. ఇల్లు.. స్థలాలు.. పొలాలు.. బంగారం కొంటూ బాధ్యతగా ఉంటున్నవాళ్లూ ఉన్నారు.. ఇలా ఉద్యోగాలు చేస్తూ అప్పులపాలై ఒత్తిడిమధ్య నలిగిపోతున్నవాళ్లూ ఉన్నారు. -సిమ్మాదిరప్పన్న. -
పెన్నీ స్టాక్స్‌తో జర జాగ్రత్త!
ముఖ విలువకు దగ్గరగా లేదా అంతకంటే బాగా తక్కువ ధర పలికే షేర్లను స్టాక్ మార్కెట్లో పెన్నీ స్టాక్స్‌గా పిలుస్తుంటారు. సాధారణంగా వీటిలో అత్యధిక శాతం కంపెనీలు బలహీన ఫండమెంటల్స్ కలిగి ఉండటం, నష్టాలు నమోదు చేస్తుండటం, రుణ భార సమస్యలు ఎదుర్కోవడం, కార్పొరేట్ సుపరిపాలనలో వెనుకబడటం వంటి ఏవైనా ప్రతికూలతలను కలిగి ఉంటాయి. అయితే కొన్ని కంపెనీలు పనితీరును ఏటికేడాది మెరుగుపరచుకోవడం ద్వారా భవిష్యత్‌లో మిడ్ క్యాప్ కంపెనీలుగా ఎదుగుతుంటాయి కూడా. అయితే ఇటీవల పలు పెన్నీ స్టాక్స్ అనుమానాస్పదంగా పెరుగుతుండటంపై నియంత్రణ సంస్థలు ఇన్వెస్టర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ వివరాలు చూద్దాం.. ముంబై: సాధారణంగా స్టాక్ మార్కెట్లు నిలకడగా పరుగు తీస్తున్నప్పుడు క్రమంగా పెన్నీ స్టాక్స్‌లో కద లికలు మొదలవుతుంటాయి. ఈ బాటలో ఇటీవల పలు పెన్నీ స్టాక్స్ అంతంత మాత్ర బిజినెస్‌లు కలిగి ఉన్నప్పటికీ భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. నిజానికి అటు సెబీ, ఇటు స్టాక్ ఎక్సే్ఛంజీలు ప్రమాదకర స్థాయిలో పెరిగే పెన్నీ స్టాక్స్‌పై కన్నేసి ఉంచుతాయి. అయినప్పటికీ కొంతమంది ఆపరేటర్ల కారణంగా కొన్ని షేర్లు ఏకధాటిగా పరుగు పెడుతుంటాయి. ఇది అనుమానాస్పదమేనని బ్రోకింగ్ వర్గా లు పేర్కొంటున్నాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి సుమారు 150 షేర్లు 2022 ఏప్రిల్ 1 నుంచి 200 శాతం నుంచి 2,000 శాతం వరకూ దూసుకెళ్లాయి. నామమాత్ర బిజినెస్‌లు మాత్రమే కలిగి ఉన్న కంపెనీల షేర్లు ఈ స్థాయిలో పరుగు తీయడం ప్రమాదకర విషయమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదీ తీరు గతేడాది నవంబర్ నుంచి సాఫ్ట్రాక్ వెంచర్ ఇన్వెస్ట్మెంట్స్ షేరు 3,368 శాతం దూసుకెళ్లింది. 2022 డిసెంబర్‌తో ముగిసిన 12 నెలలను పరిగణిస్తే కంపెనీ రూ. 25 లక్షల ఆదాయం, రూ. 10 లక్షల నికర లాభం మాత్రమే సాధించింది. ఇక గత అక్టోబర్ నుంచి బోహ్రా ఇండస్ట్రీస్ షేరు 1,823 శాతం జంప్‌చేసింది. గతేడాది(2021–22) ఎలాంటి ఆదాయం ఆర్జించకపోయినా రూ. 1.37 కోట్ల ఇతర ఆదాయం నమోదైంది. రూ. 2.62 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గత 12 నెలల కాలాన్ని తీసుకుంటే శ్రీ గాంగ్ ఇండస్ట్రీస్ రూ. 113 కోట్ల ఆదాయం, రూ. 7 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఏప్రిల్ నుంచి ఈ షేరు 1,911 శాతం లాభపడింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఏకంగా 8,800 శాతం దూసుకెళ్లి తదుపరి 74 శాతం పతనమైంది. వెరసి రూ. 2.7 నుంచి 242ను అధిగమించింది. ఇన్వెస్టర్ల కన్ను కొద్ది నెలలుగా కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్లలోకి ప్రవేశిస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయ్ కుమార్ పేర్కొన్నారు. మార్కెట్లపై అంతగా అవగాహనలేని కొంతమంది కొత్త ఇన్వెస్టర్లు ఇలాంటి ఆపరేటర్ల స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతుంటారని తెలియజేశారు. తాజాగా పెన్నీ స్టాక్స్ ర్యాలీపై స్పందించిన సెబీ ఈ నెల మొదట్లో 55 సంస్థలను మార్కెట్ నుంచి నిషేధించింది. ఈ జాబితాలో నటులు అర్షద్ వార్సి, ఆయన భార్య మారియా గోరెట్టి ఉన్నారు. సాధనా బ్రాడ్‌క్యాస్ట్, షార్ప్‌లైన్ బ్రాడ్‌క్యాస్ట్ యూట్యూబ్ చానళ్ల ద్వారా షేర్ల కొనుగోలుకి అక్రమ సిపారసులతోపాటు.. షేర్ల ధరలను కృత్రిమంగా పెంచి లబ్ది పొందిన కారణంగా సెబీ చర్యలు చేపట్టింది. కొన్ని కంపెనీల షేర్లు భారీ లాభాలనిస్తాయంటూ తప్పుడు సిఫారసులు చేయడం, కృత్రిమంగా పెంచిన ధరలతో ఆయా షేర్లను విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు సెబీ పేర్కొంది. కాగా.. మెర్క్యురీ మెటల్స్, ఎస్‌అండ్‌టీ కార్ప్, కర్ణావటి ఫైనాన్స్, కేఅండ్‌ఆర్ రైల్ ఇంజినీరింగ్, టేలర్‌మేడ్ రీన్యూ, ఆస్కమ్ లీజింగ్, రీజెన్సీ సిరామిక్స్ తదితరాలు 1,000 శాతంపైగా లాభపడటం గమనార్హం!! -
అప్పుల బాధతో ముగ్గురు రైతుల ఆత్మహత్య
మోత్కూరు, గన్నేరువరం, హసన్‌పర్తి: రుణ బాధలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. గురువారం ఒక్కరోజే వివిధ జిల్లాల్లో ముగ్గురు అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడ్డారు. యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండాపురం గ్రామానికి చెందిన రైతు బీసు నాగరాజు (29) తనకున్న ఎకరంతో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశారు. పత్తి పంటలో దిగుబడి రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక బుధవారం రాత్రి ఇంట్లో పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలో మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా మైలారం గ్రామానికి చెందిన రైతు బండి సంపత్ (38) 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పెట్టిన పెట్టుబడి రాలేదు. దీంతో గురువారం తెల్లవారుజామున పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన పోరెడ్డి రాఘవరెడ్డి(42) పంట దిగుబడి రాక వడ్డీలు పెరిగిపోయాయి. దీంతో ఆందోళనకు గురై గురువారం పురుగుల మందుతాగాడు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
అప్పులబాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
మహబూబాబాద్ రూరల్/చెన్నారావుపేట: ఆ రైతు కుటుంబాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. అప్పు తెచ్చి వైద్యం చేయించుకున్నారు. ఎలాగోలా బతికి బయటపడిన ఆ రైతు పంటల సాగుకు మరికొంత అప్పు చేశాడు. అయితే ఆశించిన రీతిలో పంట పండక అప్పుల భారం నెత్తినపడింది. తీర్చేదారి లేక ఆ ఇంటి పెద్ద పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా లక్ష్మతండా గ్రామ పంచాయతీ పరిధిలోని బూరుకుంట తండాలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన ధరంసోత్ రాములు నాయక్ (58)కు 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కుటుంబం మొత్తానికి కరోనా రావడంతో వైద్యం కోసం అప్పు చేశాడు. మిర్చి, పత్తి పంటల సాగుకు మరికొంత అప్పు తెచ్చాడు. మొత్తంగా రూ.15 లక్షల వరకు అప్పులయ్యాయి. కానీ పంటల దిగుబడి రాలేదు. అప్పుల భారంతో మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం ఉదయం ఇంటి సమీపంలోని వ్యవసాయ భూమిలో పురుగు మందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాములు నాయక్ రాత్రి 9 గంటల సమయంలో మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో మరో రైతు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగాపురం గ్రామానికి చెందిన ఎడ్ల బొంద్యాలు (65)కు ఆరుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఐదో కుమార్తెకు గత ఏడాది వివాహం చేశాడు. ఇందుకోసం రూ.4 లక్షలు, వ్యవసాయానికి మరో రూ.లక్ష అప్పు చేశాడు. అయితే పంటలు సరిగా పండక, అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో.. తీర్చలేనని మనస్తాపానికి గురై ఈ నెల 15న ఇంట్లోనే పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఆయన మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మేకల కాపరిగా కామాగిరి సర్పంచ్
ఇచ్చోడ: అభివృద్ధి పనులకు నిధులు సరిపోలేదు. చేసిన పనులకు బిల్లులు మంజూరు కాలేదు.. దీంతో సొంత డబ్బు వెచ్చించి.. అప్పులు చేసి అభివృద్ధి పనులు పూర్తి చేశాడు. అప్పులకు వడ్డీలు కట్టలేక.. కుటుంబాన్ని పోషించేందుకు మేకలు కాస్తున్నాడు.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కామాగిరి సర్పంచ్ తొడసం భీంరావు దుస్థితి ఇది. కూలి పనులు చేసుకునే ఆదివాసీ దివ్యాంగుడు భీంరావు కామాగిరి జనరల్ స్థానం నుంచి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. పంచాయతీకి వస్తున్న అరకొర నిధులు ట్రాక్టర్ ఈఎంఐ, విద్యుత్ బిల్లులు, పారిశుధ్య కార్మికుల వేతనాలకు కూడా సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో గ్రామ అభివృద్ధి కోసం రూ.10 లక్షల వరకు అప్పు చేశారు. బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతుండటం, కుటుంబ పోషణ భారంగా మారడంతో విధిలేని పరిస్థితిలో రోజుకు రూ.200 కూలి కోసం మేకల కాపరిగా మారారు. అప్పులకు వడ్డీలు కట్టేందుకు, కుటుంబ పోషణ కోసం రోజువారీ కూలీగా మారానని భీంరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
అప్పు తీర్చాలన్నందుకు.. ముగ్గురు కలిసి ఒంటరి మహిళను..
అల్వాల్: తీసుకున్న అప్పు తీర్చాలన్నందుకు ముగ్గురు కలిసి ఒంటరి మహిళను హత్య చేశారు. అంతేకాక నిందితులు ఆ హత్యను మరొకరిపై వెళ్లేలా పథకం చేశారు. అల్వాల్‌పోలీసులు తెలిపిన మేరకు..వెంకటాపురం లోతుకుంటలో నివసించే పూలమ్మ(40) దినసరి కూలిగా పనిచేసేది. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. గతనెల 25వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో హత్యకు గురైంది. కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలితో సన్నిహితంగా ఉండే అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఎలాంటి ఆధారాలు లభించలేదు. స్థానికంగా ఉండే సీసీ కెమెరాలు, ఇతరులు తెలిపిన వివరాల ప్రకారం నిఘా పెట్టి నిందితులను అరెస్టు చేశారు. మృతురాలు పూలమ్మ వద్ద సాయిలు(50) మంజుల (40) వినోద(49)లు అప్పుతీసుకున్నారు.అప్పు తిరిగి ఇవ్వమంటు పూలమ్మ ఒత్తిడి పెంచడంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ హత్య మరొకరిపై మోపేలా ప్రణాళిక చేసుకున్నారు. గత 25న రాత్రి పూలమ్మతో సన్నిహితంగా ఉండే వ్యక్తి వచ్చి వెళ్ళిన అనంతరం గుడిసె వెనుక బాగం నుండి పొడగాటి పదునైన గడ్డపారతో మంచంపై నిద్రిస్తున్న పూలమ్మ తలపై పొడవడంతో నిద్రలోనే పూలమ్మ మృతి చెందింది. హత్య చేసిన అనంతరం నిందితుడు సాయిలు ఊరికి వెళ్లాడు. ఉదయం పూలమ్మ మృతి చెందిన సమాచారం తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. గుడిసె లోపల గడియ పెట్టి ఉండడం, మృతురాలు మంచం పై పడి ఉండడం, హత్య స్థలంలోఎలాంటి అనుమానస్థితి లేకపోవడం పోలీసులకు హత్య కేసు చేదించడం సవాల్‌లుగా మారింది. చివరకు పూలమ్మ ఇంటి పక్కన ఉండే సాయిలు, వినోద, మంజులలు హత్య చేశారని తేలడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమన్నందుకే హత్య చేసినట్లు పోలీసులకు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణలో అల్వాల్ పోలీసుల పనితీరును ఉన్నత అధికారులు అభినందించారు. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
- భర్త మృతి..కొన ఊపిరితో భార్య విశాఖపట్నం (చోడవరం): అప్పుల బాధలు దంపతుల ఆత్మహత్యాయత్నానికి దారితీశాయి. భర్త మృతి చెందగా.. భార్య కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ విచారకర సంఘటన విశాఖ జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. మహారాజు అప్పారావు(36) కుటుంబం గ్రామంలోని కల్లాలు వద్ద నివాసముంటోంది. కల్లం దిబ్బ తప్ప అతనికి సెంటు భూమిలేదు. ఏటా కౌలు సాగుతో నెట్టుకొస్తున్నాడు. పెట్టుబడులు పెరిగిపోవడం, పంట కలిసిరాకపోవడంతో సుమారు రూ. 2 లక్షల వరకు అప్పులు చేశాడు. హుద్‌హుద్ ధాటికి తీవ్రంగా నష్టపోయాడు. అప్పుల బాధలు తట్టుకోలేక ఇటీవల మద్యానికి అలవాటు పడ్డాడు. దీంతో తరచూ భార్యాభర్తలు గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంటి సమీపంలోని పశువుల పాకలో ఇద్దరూ పురుగుమందు తాగారు. స్థానికులు గుర్తించి చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ అప్పారావు చనిపోయాడు. భార్య లక్ష్మి(30) పరిస్థితి విషమంగా ఉండటంతో108లో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని బంధువులు తెలిపారు. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అప్పారావుకు లక్ష్మి మూడో భార్య. మొదటి భార్య కామెర్లుతో చనిపోయింది. ఆమెకు పుట్టిన కొడుకు, కుమార్తె తాతగారి ఇంట ఉంటున్నారు. రెండో భార్య విడాకులు తీసుకొని వెళ్లిపోయింది. అనంతరం లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రమణయ్య తెలిపారు.