
రాఘవరెడ్డి, సంపత్, నాగరాజు
మోత్కూరు, గన్నేరువరం, హసన్‌పర్తి: రుణ బాధలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. గురువారం ఒక్కరోజే వివిధ జిల్లాల్లో ముగ్గురు అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడ్డారు. యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండాపురం గ్రామానికి చెందిన రైతు బీసు నాగరాజు (29) తనకున్న ఎకరంతో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశారు.
పత్తి పంటలో దిగుబడి రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక బుధవారం రాత్రి ఇంట్లో పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలో మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా మైలారం గ్రామానికి చెందిన రైతు బండి సంపత్ (38) 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాడు.
ప్రకృతి వైపరీత్యాల కారణంగా పెట్టిన పెట్టుబడి రాలేదు. దీంతో గురువారం తెల్లవారుజామున పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన పోరెడ్డి రాఘవరెడ్డి(42) పంట దిగుబడి రాక వడ్డీలు పెరిగిపోయాయి. దీంతో ఆందోళనకు గురై గురువారం పురుగుల మందుతాగాడు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.