వివిధ రసాయనాలు, పురుగుమందులు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని... ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది రసాయనాల కారణంగా మృతిచెందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ మేరకు ప్రజారోగ్యంపై రసాయనాల ప్రభావం పేరుతో తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. అంతర్జాతీయంగా జరిగే అన్ని రకాల మరణాల్లో 3.6 శాతం కెమికల్స్ ద్వారానే జరుగుతున్నాయని నివేదిక వివరించింది. ముఖ్యంగా భారత్‌లో పురుగుమందుల వల్లే ఏడాదికి 70 వేల ఆత్మహత్యలు జరుగుతుండటం ఆందోళనకరమని పేర్కొంది. – సాక్షి, హైదరాబాద్‌హృద్రోగాలే అధికం
హృద్రోగాలే అధికం
డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రకారం... కెమికల్స్ వల్ల వచ్చే జబ్బుల్లో అత్యధికంగా 40% గుండె జబ్బులే ఉంటున్నాయి. అలాగే 20% దీర్ఘకాలిక ఊపిరితిత్తుల జబ్బులు, 15% కేన్సర్లు ఉంటున్నాయి. ఏటా లక్ష మంది పురుషుల్లో కెమికల్స్ వల్ల 35 మరణాలు సంభవిస్తుండగా అందులో 32 జబ్బులు దీర్ఘకాలిక జబ్బుల వల్లే జరుగుతున్నాయి. మహిళల్లో లక్షకు 17మంది కెమికల్స్ కారణంగా చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల్లో 20% కెమికల్స్ ద్వారా, రైతు ఆత్మహత్యల్లో 30% కెమికల్స్ ద్వారా, 1.4% నిద్రమాత్రల వంటి మందులు వేసుకోవడమే కారణం.
ఏయే రసాయనాల వల్ల ఎటువంటి జబ్బులు..?
ఆర్సెనిక్, ఆస్‌బెస్టాస్, బెంజిన్, బెరీలియం, క్యాడ్మియం తదితర రసాయనాలు 2.9 శాతం కేన్సర్లకు కారణమవుతున్నాయి. ఆర్సెనిక్ భూగర్భ జలాల నుంచి వస్తుండగా బొగ్గు గనుల్లో పనిచేసే వారిలో ఆస్‌బెస్టాస్ చేరుతోంది. ధూమపానం, వాహన కాలుష్యం ద్వారా బెంజిన్ శరీరంలోకి ప్రవేశిస్తోంది. మురికినీరు లేదా కలుషిత జలాల్లో ఉండే చేపలు తినడం, అలాంటి నీటితో సాగు చేసే ఆలుగడ్డ, వరి, పొగాకు ద్వారా క్యాడ్మియం ఒంట్లోకి చేరుతోంది.
సీసం వాడకాన్ని తగ్గించాలి...
ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా 41 శాతం దేశాలు సీసంపై చాలావరకు నియంత్రణ విధించాయి. అయినా పెయింటింగ్స్, వాహన ఇంధనాలు, నీరు, ఫుడ్ ప్యాకేజీలు, చిన్నారుల ఆట బొమ్మల్లో దాని వాడకం ఇంకా కొనసాగుతోంది. ఇది తీవ్ర అనారోగ్యానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా వస్తువుల్లో సీసం వాడకాన్ని నివారించాలి. అన్ని రకాల రసాయనాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది చనిపోతున్నారంటే 16 సెకన్లకు ఒకరు మరణిస్తున్నారన్నమాట. – డాక్టర్ కిరణ్ మాదల,సైంటిఫిక్ కమిటీ కన్వీనర్, ఐఎంఏ, తెలంగాణ
సీసంతో ఆరోగ్యానికి హాని..
కెమికల్స్ వల్ల హానిలో సగ భాగం సీసం అనే లోహం ద్వారానే జరుగుతోంది. సీసాన్ని పెయింటింగ్స్, ప్లంబింగ్ పనులతోపాటు స్మోకింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మైనింగ్, ఐరన్, ఉక్కు తయారీ, ఆయిల్ రిఫైనింగ్‌లో, పెట్రోల్, విమాన ఇంధనాలు, కాస్మెటిక్స్, సంప్రదాయ మందులు, నగల తయారీ, సిరామిక్స్, ఎల్రక్టానిక్ వస్తువులు, వాటర్ పైప్‌లలో సీసం ఉంటోంది.
కలర్ కోటింగ్‌తో కూడిన ఆహారాలు తినడం వల్ల గుండె జబ్బుల్లో 4.6 శాతం, కిడ్నీ జబ్బుల్లో 3 శాతం సీసం ద్వారా వస్తున్నాయి. చిన్నారుల్లో మూడో వంతు బుద్ధిమాంద్యం సీసం ద్వారా ఏర్పడుతోంది. పిల్లల్లో ఎక్కువగా పెయింటింగ్స్ ద్వారా సీసం వారిలో చేరుతుండగా ఐదేళ్లలోపు పిల్లల్లో సీసం కలిగించే దుష్ప్రభావం ఐదు రెట్లు ఎక్కువగా ఉంటోంది. సీసం కలిసిన వస్తువుల వాడకం వల్ల గర్భిణుల్లో ముందస్తు ప్రసవాలు లేదా అబార్షన్లు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment