WHO report
-
కెమికల్ కిల్లింగ్స్!
వివిధ రసాయనాలు, పురుగుమందులు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని... ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది రసాయనాల కారణంగా మృతిచెందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ మేరకు ప్రజారోగ్యంపై రసాయనాల ప్రభావం పేరుతో తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. అంతర్జాతీయంగా జరిగే అన్ని రకాల మరణాల్లో 3.6 శాతం కెమికల్స్ ద్వారానే జరుగుతున్నాయని నివేదిక వివరించింది. ముఖ్యంగా భారత్‌లో పురుగుమందుల వల్లే ఏడాదికి 70 వేల ఆత్మహత్యలు జరుగుతుండటం ఆందోళనకరమని పేర్కొంది. – సాక్షి, హైదరాబాద్హృద్రోగాలే అధికం హృద్రోగాలే అధికం డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రకారం... కెమికల్స్ వల్ల వచ్చే జబ్బుల్లో అత్యధికంగా 40% గుండె జబ్బులే ఉంటున్నాయి. అలాగే 20% దీర్ఘకాలిక ఊపిరితిత్తుల జబ్బులు, 15% కేన్సర్లు ఉంటున్నాయి. ఏటా లక్ష మంది పురుషుల్లో కెమికల్స్ వల్ల 35 మరణాలు సంభవిస్తుండగా అందులో 32 జబ్బులు దీర్ఘకాలిక జబ్బుల వల్లే జరుగుతున్నాయి. మహిళల్లో లక్షకు 17మంది కెమికల్స్ కారణంగా చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల్లో 20% కెమికల్స్ ద్వారా, రైతు ఆత్మహత్యల్లో 30% కెమికల్స్ ద్వారా, 1.4% నిద్రమాత్రల వంటి మందులు వేసుకోవడమే కారణం. ఏయే రసాయనాల వల్ల ఎటువంటి జబ్బులు..? ఆర్సెనిక్, ఆస్బెస్టాస్, బెంజిన్, బెరీలియం, క్యాడ్మియం తదితర రసాయనాలు 2.9 శాతం కేన్సర్లకు కారణమవుతున్నాయి. ఆర్సెనిక్ భూగర్భ జలాల నుంచి వస్తుండగా బొగ్గు గనుల్లో పనిచేసే వారిలో ఆస్బెస్టాస్ చేరుతోంది. ధూమపానం, వాహన కాలుష్యం ద్వారా బెంజిన్ శరీరంలోకి ప్రవేశిస్తోంది. మురికినీరు లేదా కలుషిత జలాల్లో ఉండే చేపలు తినడం, అలాంటి నీటితో సాగు చేసే ఆలుగడ్డ, వరి, పొగాకు ద్వారా క్యాడ్మియం ఒంట్లోకి చేరుతోంది. సీసం వాడకాన్ని తగ్గించాలి... ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా 41 శాతం దేశాలు సీసంపై చాలావరకు నియంత్రణ విధించాయి. అయినా పెయింటింగ్స్, వాహన ఇంధనాలు, నీరు, ఫుడ్ ప్యాకేజీలు, చిన్నారుల ఆట బొమ్మల్లో దాని వాడకం ఇంకా కొనసాగుతోంది. ఇది తీవ్ర అనారోగ్యానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా వస్తువుల్లో సీసం వాడకాన్ని నివారించాలి. అన్ని రకాల రసాయనాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది చనిపోతున్నారంటే 16 సెకన్లకు ఒకరు మరణిస్తున్నారన్నమాట. – డాక్టర్ కిరణ్ మాదల,సైంటిఫిక్ కమిటీ కన్వీనర్, ఐఎంఏ, తెలంగాణ సీసంతో ఆరోగ్యానికి హాని.. కెమికల్స్ వల్ల హానిలో సగ భాగం సీసం అనే లోహం ద్వారానే జరుగుతోంది. సీసాన్ని పెయింటింగ్స్, ప్లంబింగ్ పనులతోపాటు స్మోకింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మైనింగ్, ఐరన్, ఉక్కు తయారీ, ఆయిల్ రిఫైనింగ్‌లో, పెట్రోల్, విమాన ఇంధనాలు, కాస్మెటిక్స్, సంప్రదాయ మందులు, నగల తయారీ, సిరామిక్స్, ఎల్రక్టానిక్ వస్తువులు, వాటర్ పైప్‌లలో సీసం ఉంటోంది. కలర్ కోటింగ్‌తో కూడిన ఆహారాలు తినడం వల్ల గుండె జబ్బుల్లో 4.6 శాతం, కిడ్నీ జబ్బుల్లో 3 శాతం సీసం ద్వారా వస్తున్నాయి. చిన్నారుల్లో మూడో వంతు బుద్ధిమాంద్యం సీసం ద్వారా ఏర్పడుతోంది. పిల్లల్లో ఎక్కువగా పెయింటింగ్స్ ద్వారా సీసం వారిలో చేరుతుండగా ఐదేళ్లలోపు పిల్లల్లో సీసం కలిగించే దుష్ప్రభావం ఐదు రెట్లు ఎక్కువగా ఉంటోంది. సీసం కలిసిన వస్తువుల వాడకం వల్ల గర్భిణుల్లో ముందస్తు ప్రసవాలు లేదా అబార్షన్లు జరుగుతున్నాయి. -
దేశంలో కరోనా మరణాలు.. హాట్ టాపిక్‌గా రాహుల్ గాంధీ కామెంట్స్
దేశంలో కోవిడ్ మరణాలపై ఆందోళన నెలకొంది. తాజగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా జనవరి 2020-2021 డిసెంబర్ చివరకు ప్రత్యక్షంగా లేదంటే.. పరోక్షంగా 1.49 కోట్లమంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌లో కరోనా మరణాలు 47 లక్షలని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. అయితే, ఈ ప్రకటనను భారత్ అంగీకరించలేదు. మరణాల లెక్కింపునకు సంస్థ అనుసరించిన పద్ధతులపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.ఈ నేపథ్యంలో దేశంలో కరోనా మరణాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ మరణాలపై శుక్రవారం రాహుల్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘కోవిడ్ మహమ్మారి కారణంగా 47 లక్షల మంది భారతీయులు మరణించారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు 4.8 లక్షలు కాదు. సైన్స్ అబద్ధం చెప్పుదు.. కానీ మోదీ చెబుతారు. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను గౌరవించండి. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం రూ. 4 లక్షల పరిహారం ఇవ్వాలి’’ అని అన్నారు. అంతకు ముందు కూడా రాహుల్ గాంధీ.. కరోనా కారణంగా దేశంలో 40 లక్షల మంది భారతీయులు చనిపోయారని ఆరోపించారు. 47 lakh Indians died due to the Covid pandemic. NOT 4.8 lakh as claimed by the Govt. Science doesn't LIE. Modi does. Respect families who've lost loved ones. Support them with the mandated ₹4 lakh compensation. pic.twitter.com/p9y1VdVFsA — Rahul Gandhi (@RahulGandhi) May 6, 2022 ఇది కూడా చదవండి: సీఎంను చంపేస్తానంటూ బహిరంగంగా వార్నింగ్.. బీజేపీ కీలక నేత అరెస్ట్ -
ఆ వ్యాధితో గతేడాది కోటిన్నర మంది మృతి.. కరోనా ఎంతపని చేసింది..?
దాదాపుగా దశాబ్ధం తర్వాత మొదటిసారి క్షయ (టీబీ) మరణాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురువారం విడుదలచేసిన గ్లోబల్ టీబీ - 2021 నివేదికలో వెల్లడించింది. చదవండి: ఛీ! యాక్!! మూడేళ్లగా పచ్చిమాంసం మాత్రమే తింటున్నాడు.. ఒక్క రోజు కూడా.. 2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా క్షయ వ్యాధికి చికిత్స అందించడంలో తీవ్ర అంతరాయం కలిగింది. మహమ్మారి మూలంగా అనేక మంది రోగులు కనీసం వ్యాధి నిర్ధారణకు కూడా నోచుకోలేదు. గణాంకాల ప్రకారం 2019లో 7.1 కోట్ల మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా, 2020లో ఆ సంఖ్య 5.8 కోట్లకు పడిపోయింది. అందుకు బారీ మూల్యమే చెల్లించవలసి వచ్చింది. గత యేడాది మనదేశంతో సహా దాదాపుగా 30 దేశాల్లో సమారు కోటిన్నర మంది (2,14,000 మంది హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తులతో కలిపి) క్షయతో మరణించారని డబ్యూహెచ్‌వో తన నివేదికలో తెలియజేసింది. ఐతే 2021-22లో టీబీ మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను హెచ్చరించింది. సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ చేయడం, చికిత్స అందించడంలోని సవాళ్లను అధిగమిస్తే దీనినుంచి బయటపడొచ్చని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యాధుల కారణంగా అనారోగ్యంతో బాధపడేవారికి కోవిడ్ సమయంలో చికిత్స అందించడంలో తీవ్ర అంతరాయం కలిగింది. దాని పర్యవసానమే ఈ మృత్యుఘోష!! చదవండి: అప్పుడు కన్నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు.. ఇప్పుడు ఎందరికో ఆసరా..! -
డేంజర్ జోన్లో మన నగరాలు
జెనీవా : ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్యభరిత నగరాల్లో భారత్ అగ్రభాగాన నిలిచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం జెనీవాలో విడుదల చేసిన ప్రపంచ కాలుష్య డేటాబేస్ నివేదికలో టాప్ 15 నగరాల్లో 14 నగరాలు భారత్‌కు చెందినవే కావడం గమనార్హం. ఈ జాబితాలో కాన్పూర్ అత్యంత కాలుష్యభరిత నగరంగా ముందువరుసలో నిలిచింది. ఇక్కడ ప్రమాదకారక పీఎం 2.5 స్థాయి 173 మైక్రోగ్రాములుగా నమోదైంది. ఇక ప్రపంచంలో అత్యంత కాలుష్యనగరాల్లో వరుసగా ఫరీదాబాద్, వారణాసి, గయ, పట్నా, ఢిల్లీ, లక్నో, ఆగ్రా, ముజఫర్‌పూర్, శ్రీనగర్, గుర్గావ్, జైపూర్, పటియాలా, జోథ్‌పూర్‌లు నిలిచాయి. ఈ జాబితాలో 15వ స్ధానంలో కువైట్‌కు చెందిన అలి సుబా అల్సలేం నిలిచింది. ఢిల్లీలో కాలుష్య తీవ్రతపై ఇటీవల నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ప్రపంచ కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ 6వ స్థానంలో ఉంది. 2010, 2014 మధ్య ఢిల్లీలో కాలుష్య స్థాయి కొంత మెరుగైనా 2015లో మళ్లీ పరిస్థితి విషమించింది. వాయు కాలుష్యం కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేసింది. కాలుష్య సంబంధ గుండె జబ్బులతో 34 శాతం మంది మరణిస్తుంటే 21 శాతం మంది న్యుమోనియా, 20 శాతం మంది స్ర్టోక్ కారణంగా మరణిస్తున్నారు. వాయు కాలుష్యంతో వాటిల్లుతున్న మరణాల్లో 19 శాతం శ్వాససంబధిత సీఓపీడీ వ్యాధి కారణంగా, ఏడు శాతం మంది లంగ్ క్యాన్సర్‌తో మరణిస్తున్నారని డబ్ల్యూహెచ్ఓ నివేదిక పేర్కొంది. -
సగం మందికి పైగా శంకర్ దాదాలే!
మీకు ఆరోగ్యం బాగోలేదని డాక్టర్ వద్దకు వెళ్లారా.. ఆయన మిమ్మల్ని జాగ్రత్తగానే చూశారని అనుకుంటున్నారా? ఎందుకైనా మంచిది.. ఓసారి ఆయన ఏం చదివారో తెలుసుకోండి. ఎందుకంటే మన దేశంలో సగానికి పైగా డాక్టర్లకు అసలు మెడికల్ డిగ్రీలే లేవట. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ తాజాగా వెల్లడించిన ఓ నివేదికలో తెలిపింది. దేశంలో అత్యవసరంగా వైద్యసంస్కరణలు చేపట్టాలని తెలిపింది. 2001 నాటికి దేశంలో 102 కోట్ల జనాభా ఉంటే వారికి కేవలం 20 లక్షల మంది మాత్రమే హెల్త్ వర్కర్లున్నారని, వీళ్లలో 39.6 శాతం మంది వైద్యులని, 30.5 శాతం మంది మిడ్వైఫ్లని, కేవలం 1.2 శాతం మంది మాత్రమే డెంటిస్టులు ఉన్నారని లెక్కలు వివరించింది. వైద్యులలో 77.2 శాతం మంది అలోపతి, 22.8 శాతం మంది హోమియో, ఆయుర్వేదం, యునానీ వైద్యులు. అయితే.. ఇందులో అసలు విషయం ఏమిటంటే మొత్తం అలోపతి డాక్టర్లలో 57.3 శాతం మందికి అసలు మెడికల్ డిగ్రీలే లేవట. 31.4 శాతం మంది అయితే కేవలం సెకండరీ స్కూల్ విద్యతోనే చదువు ఆపేశారు. నర్సుల పరిస్థితి మరీ ఘోరం. 67.1 శాతం మంది అర్హత సెకండరీ స్కూల్ విద్య మాత్రమే. దేశంలోని 73 జిల్లాల్లో అసలు వైద్య పరమైన అర్హతలున్న నర్సులు ఒక్కరు కూడా లేరు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల అర్హతలు దారుణంగా ఉన్నాయి. అలోపతి వైద్యుల శాతం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాలతో పాటు యూపీ, బిహార్, మధ్యప్రదేశ్ కూడా ఉన్నాయి. పురుష వైద్యుల సంఖ్య బాగా ఎక్కువగానే ఉన్నా, వాళ్ల విద్యార్హతలు మాత్రం మహిళా వైద్యుల కంటే బాగా తక్కువట. అలోపతి వైద్యుల్లో పురుషుల్లో కేవలం 37.7 శాతం మంది మాత్రమే తగిన అర్హతలు ఉన్నవాళ్లయితే మహిళల్లో మాత్రం ఇది 67.2 శాతంగా ఉంది. దేశంలో మొత్తం 593 జిల్లాలుండగా, 58 జిల్లాల్లో అసలు దంత వైద్యులే లేరట. -
ఢిల్లీ అత్యంత కాలుష్య నగరం కాదు
డబ్ల్యూహెచ్‌వో తాజా జాబితా న్యూఢిల్లీ: ప్రపంచంలోని తొలి ఏడు అత్యంత కాలుష్య నగరాల్లో భారత్‌నుంచి నాలుగు నగరాలున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం వెల్లడించింది. అయితే గతేడాది వెల్లడించిన వివరాల్లో తొలి స్థానంలో ఉన్న ఢిల్లీ ఈసారి 11వ స్థానంలో నిలిచింది. ఢిల్లీలో ఏడాదికి సగటున కాలుష్యసూచీ 122 (ఘనపు మీటర్లో ఉండే మైక్రోగ్రాముల కాలుష్యం) గా నమోదైందని, గతేడాది జాబితాలో ఇది 153గా ఉందని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల కారణంగానే దేశరాజధాని కాలుష్య రేటింగ్స్‌లో మార్పు వచ్చిందని తెలిపింది. ప్రపంచంలోని 80 శాతం నగరాల్లో ప్రజలు కాలుష్యమైన గాలినే పీల్చుకుంటున్నారన్న డబ్ల్యూహెచ్‌వో.. 103 దేశాల్లోని 3వేల నగరాల్లో సేకరించిన కాలుష్య వివరాలను విశ్లేషించి తాజా జాబితాను రూపొందించింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ప్రపంచ కాలుష్య నగరాల జాబితాలో రెండోస్థానంలో ఉండగా.. యూపీలోని అలహాబాద్ (3), పట్నా (6), రాయ్‌పూర్ (7) టాప్-7లో ఉన్నాయి. నిరుటి జాబితాలో టాప్-20 కాలుష్య నగరాల్లో 13 భారత నగరాలుండగా.. ఈ సంఖ్య తాజా జాబితాలో 10కి చేరింది. ఇరాన్‌లోని జబోల్ నగరం అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. కాగా, యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లో నగరాల్లో కాలుష్య ప్రభావం క్రమంగా తగ్గుతుండగా.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో (ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, ఆగ్నేయాసియా దేశాల్లో) పెరుగుదల కనబడుతోందని.. ఆయా దేశాలు దీనిపై దృష్టిసారించాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించింది. అయితే.. కోటి 40లక్షలకు మించి జనాభా ఉన్న నగరాల కాలుష్యంలో మాత్రం ఢిల్లీయే ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండగా.. ఈజిప్టులోని కైరో, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. Latest WHO report- Delhi no more most polluted city. Congrats Delhiites. — Arvind Kejriwal (@ArvindKejriwal) 12 May 2016