Vehicle pollution
-
కెమికల్ కిల్లింగ్స్!
వివిధ రసాయనాలు, పురుగుమందులు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని... ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది రసాయనాల కారణంగా మృతిచెందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ మేరకు ప్రజారోగ్యంపై రసాయనాల ప్రభావం పేరుతో తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. అంతర్జాతీయంగా జరిగే అన్ని రకాల మరణాల్లో 3.6 శాతం కెమికల్స్ ద్వారానే జరుగుతున్నాయని నివేదిక వివరించింది. ముఖ్యంగా భారత్‌లో పురుగుమందుల వల్లే ఏడాదికి 70 వేల ఆత్మహత్యలు జరుగుతుండటం ఆందోళనకరమని పేర్కొంది. – సాక్షి, హైదరాబాద్హృద్రోగాలే అధికం హృద్రోగాలే అధికం డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రకారం... కెమికల్స్ వల్ల వచ్చే జబ్బుల్లో అత్యధికంగా 40% గుండె జబ్బులే ఉంటున్నాయి. అలాగే 20% దీర్ఘకాలిక ఊపిరితిత్తుల జబ్బులు, 15% కేన్సర్లు ఉంటున్నాయి. ఏటా లక్ష మంది పురుషుల్లో కెమికల్స్ వల్ల 35 మరణాలు సంభవిస్తుండగా అందులో 32 జబ్బులు దీర్ఘకాలిక జబ్బుల వల్లే జరుగుతున్నాయి. మహిళల్లో లక్షకు 17మంది కెమికల్స్ కారణంగా చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యల్లో 20% కెమికల్స్ ద్వారా, రైతు ఆత్మహత్యల్లో 30% కెమికల్స్ ద్వారా, 1.4% నిద్రమాత్రల వంటి మందులు వేసుకోవడమే కారణం. ఏయే రసాయనాల వల్ల ఎటువంటి జబ్బులు..? ఆర్సెనిక్, ఆస్బెస్టాస్, బెంజిన్, బెరీలియం, క్యాడ్మియం తదితర రసాయనాలు 2.9 శాతం కేన్సర్లకు కారణమవుతున్నాయి. ఆర్సెనిక్ భూగర్భ జలాల నుంచి వస్తుండగా బొగ్గు గనుల్లో పనిచేసే వారిలో ఆస్బెస్టాస్ చేరుతోంది. ధూమపానం, వాహన కాలుష్యం ద్వారా బెంజిన్ శరీరంలోకి ప్రవేశిస్తోంది. మురికినీరు లేదా కలుషిత జలాల్లో ఉండే చేపలు తినడం, అలాంటి నీటితో సాగు చేసే ఆలుగడ్డ, వరి, పొగాకు ద్వారా క్యాడ్మియం ఒంట్లోకి చేరుతోంది. సీసం వాడకాన్ని తగ్గించాలి... ప్రపంచవ్యాప్తంగా భారత్ సహా 41 శాతం దేశాలు సీసంపై చాలావరకు నియంత్రణ విధించాయి. అయినా పెయింటింగ్స్, వాహన ఇంధనాలు, నీరు, ఫుడ్ ప్యాకేజీలు, చిన్నారుల ఆట బొమ్మల్లో దాని వాడకం ఇంకా కొనసాగుతోంది. ఇది తీవ్ర అనారోగ్యానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా వస్తువుల్లో సీసం వాడకాన్ని నివారించాలి. అన్ని రకాల రసాయనాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 లక్షల మంది చనిపోతున్నారంటే 16 సెకన్లకు ఒకరు మరణిస్తున్నారన్నమాట. – డాక్టర్ కిరణ్ మాదల,సైంటిఫిక్ కమిటీ కన్వీనర్, ఐఎంఏ, తెలంగాణ సీసంతో ఆరోగ్యానికి హాని.. కెమికల్స్ వల్ల హానిలో సగ భాగం సీసం అనే లోహం ద్వారానే జరుగుతోంది. సీసాన్ని పెయింటింగ్స్, ప్లంబింగ్ పనులతోపాటు స్మోకింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మైనింగ్, ఐరన్, ఉక్కు తయారీ, ఆయిల్ రిఫైనింగ్‌లో, పెట్రోల్, విమాన ఇంధనాలు, కాస్మెటిక్స్, సంప్రదాయ మందులు, నగల తయారీ, సిరామిక్స్, ఎల్రక్టానిక్ వస్తువులు, వాటర్ పైప్‌లలో సీసం ఉంటోంది. కలర్ కోటింగ్‌తో కూడిన ఆహారాలు తినడం వల్ల గుండె జబ్బుల్లో 4.6 శాతం, కిడ్నీ జబ్బుల్లో 3 శాతం సీసం ద్వారా వస్తున్నాయి. చిన్నారుల్లో మూడో వంతు బుద్ధిమాంద్యం సీసం ద్వారా ఏర్పడుతోంది. పిల్లల్లో ఎక్కువగా పెయింటింగ్స్ ద్వారా సీసం వారిలో చేరుతుండగా ఐదేళ్లలోపు పిల్లల్లో సీసం కలిగించే దుష్ప్రభావం ఐదు రెట్లు ఎక్కువగా ఉంటోంది. సీసం కలిసిన వస్తువుల వాడకం వల్ల గర్భిణుల్లో ముందస్తు ప్రసవాలు లేదా అబార్షన్లు జరుగుతున్నాయి. -
Hyderabad: గుండెకు పొగ పెడుతున్న కాలుష్యం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో కాలుష్యం కోరలు చాస్తోంది. రోజురోజుకు పరిస్థితి తీవ్రంగా మారుతోంది. ముఖ్యంగా డీజిల్ వాహనాల కారణంగా సిటీ పొగచూరుతోందని, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని పీసీబీ తాజా అధ్యయనంలో తేలింది. గ్రేటర్లో వాహనాల సంఖ్య సుమారు 80 లక్షలకు చేరువైంది. ఇందులో పదిహేనేళ్లకు పైబడిన కాలంచెల్లిన వాహనాలు 20 లక్షలకు పైమాటే. వీటిలో డొక్కు బస్సు లు, ట్రక్కులు, కార్లు తదితర డీజిల్ వాహనాలు విడుదల చేస్తున్న పొగతో ప్రధాన నగరంతోపాటు శివారు ప్రాంతాలు పొగచూరుతున్నాయి. ప్రధానంగా మోటారు వాహనాలు, పరిశ్రమలు విడుదల చేస్తున్న పొగలో సూక్ష్మ ధూళి కణాల(పిఎం2.5) మోతాదు అనూహ్యంగా పెరగడంతో సిటీజన్లలో గుండె కండరాలు, దమనులు దెబ్బ తింటున్నట్లు పీసీబీ తాజా అధ్యయనంలో వెల్లడైంది. నగ రంలో 28 ప్రాంతాల్లో సూక్ష్మ ధూళికణాల మోతాదును ఈ సంస్థ నిపుణులు నమోదు చేశారు. వీరి లెక్కల ప్రకారం ఘనపుమీటర్ గాల్లో సూక్ష్మ ధూళికణాల మోతాదు 32 మైక్రో గ్రాములకు మించరాదు. కానీ ఆయా ప్రాంతాల్లో వీటి మోతాదు 60 మైక్రో గ్రాములకు పైగా నమోదవడం ఆందోళన కల్గిస్తోంది. గుండెకూ చేటు.. ఈ సూక్ష్మ ధూళికణాలు గుండెలోని సూక్ష్మ దమనులు, కెరోటిడ్ ఇంటిమా మీడియాపై పేరుకు పోవడంతో వాటి మందం పెరిగి గుండెకు రక్తసరఫరా తగ్గుతున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ పరిణామంతో గుండెదడ, గుండెపోటు తదితర హృదయ సంబంధిత సమస్యలు సిటీజన్లలో క్రమంగా పెరుగుతున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. సూక్ష్మధూళి కణాల కాలుష్యంతో పురుషుల్లో 1.79 శాతం గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని, మహిళల్లో 2.98 శాతం మందికి గుండె సంబందిత సమస్యలు పెరుగుతున్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. ధూళి కణాల కాలుష్యం మెదడుకు రక్తం సరఫరా చేసే రక్త నాళాలకు కూడా చేటు చేస్తుందని ఈ అధ్యయనం స్పష్టంచేయడం గమనార్హం. చదవండి: Hyderabad: పెంపుడు పిల్లిని ఎత్తుకెళ్లాడు.. సీసీటీవీలో రికార్డు.. కేసు నమోదు కాలుష్యానికి కారణాలివే.. ►పలు కూడళ్లలో వాయు కాలుష్యం అవధులు దాటుతోంది. గ్రేటర్ పరిధిలో సుమారు 80 లక్షలకు పైగా ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగ, ట్రాఫిక్ రద్దీలో రహదారులపై రేగుతున్న దుమ్ముతో సిటీజన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ►పలుప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లోచెత్తను తగులబెట్టడంతో కాలుష్య తీవ్రత పెరుగుతోంది. పరిశ్రమలు వెదజల్లుతోన్న కాలుష్యంతో సమీప ప్రాంతాలు పొగచూరుతున్నాయి. ►శివారుప్రాంతాల్లో నిర్మాణ సంబంధ కార్యకలాపాలు పెరగడంతో సూక్ష్మధూళికణాలు పీల్చే గాలిలో చేరి సమీప ప్రాంతాల్లోని సిటీజన్ల ఊపిరితిత్తులోకి చేరుతున్నాయి. ఘణపు మీటరు గాలిలో సూక్ష్మధూళికణాలు(పీఎం2.5) మోతాదు 32 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ పలు కూడళ్లలో పలుమార్లు అంతకు రెట్టింపు స్థాయిలో ధూళికాలుష్యం నమోదవుతోంది. ►గ్రేటర్ పరిధిలో రాకపోకలు సాగించే 80 లక్షలవాహనాల్లో ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు,120.45 కోట్ల లీటర్ల డీజిలును వినియోగిస్తుండడంతో పొగ తీవ్రత ఏటేటా పెరుగుతూనే ఉంది. ►గ్రేటర్ పరిధిలో పదిహేనేళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలు 20 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్ని రోడ్లపైకి ముంచెత్తుతుండడంతో పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాహనాల నుంచి వెలువడుతున్న పొగ నుంచి కార్భన్‌మోనాక్సైడ్,నైట్రోజన్ డయాక్సైడ్,సల్ఫర్‌డయాక్సైడ్,అమ్మోనియా,బెంజీన్,టోలిన్,ఆర్‌ఎస్‌పీఎం(ధూళిరేణువులు) వంటి కాలుష్య ఉద్గారాలు వాతావరణంలో చేరి నగర పర్యావరణం పొగచూరుతోంది. జాగ్రత్తలు తప్పనిసరి.. ►సూక్ష్మ ధూళి కణాల కాలుష్యం బారిన పడకుండా ముక్కుకు మాస్‌్కలు ధరించాలి. ►కాలం చెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా నియంత్రించాలి. ►ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఎక్కువ సేపు గడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ►కల్తీ ఇంధనాల వినియోగాన్ని కట్టడి చేయాలి. ప్రతీపెట్రోలు బంకులో తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో ఇంధన నాణ్యత తనిఖీలు నిర్వహించాలి. కాలుష్య నియంత్రణ మండలి తాజా లెక్కల ప్రకారం నగరంలో బాలానగర్, ప్యారడైజ్, చార్మినార్, జీడిమెట్ల, లంగర్‌హౌజ్, కూకట్పల్లి, సైనిక్‌పురి, నాచారం, జూపార్క్, పంజగుట్ట తదితర ప్రాంతాల్లో ధూళికాలుష్యం వంద మైక్రోగ్రాములు మించడం ఆందోళన కలిగిస్తోంది. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానికులు, పాదచారులు, వాహనదారులు ఈ ధూళికాలుష్యంతో అస్తమా, సైనస్, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులతో సతమతమౌతున్నారు. -
కాలుష్యంపై పోరుకు ‘తుక్కు’ సంకల్పం
మెరుగైనది అందిపుచ్చుకోవాలి. తరుగైనది వదిలించుకోవాలి. వాహనాలకు సంబంధించి ఇది అత్యావశ్యం. బీఎస్–1 ప్రమాణాల వాహనంతో పోలిస్తే బీఎస్–6 ప్రమాణాల వాహనం 36 రెట్లు తక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతుంది. అలాంటప్పుడు లక్షలాది పురాతన వాహనాలను వదిలించుకోవడమే శరణ్యం. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన స్క్రాపేజీ పాలసీ ముసాయిదా కీలకమైనదేగానీ, ఇంకా ప్రభావవంతమైన ఆలోచనలతో రావాల్సి వుంది. వాహనశ్రేణిని మార్చే బాధ్యత రాష్ట్రాల మీద ఉంచడం ఇందులో లోటు. కొత్త వాహనాలు కొనడానికీ, విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచడానికీ ప్రోత్సాహకాలు కల్పించాల్సి వుంది. విష ఉద్గారాలను తీవ్రంగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తేనే కాలుష్య రహిత ప్రపంచాన్ని సాధించుకోగలం. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్క్రాపేజ్ విధాన ముసాయిదా ఎట్టకేలకు అందుబాటు లోకి వచ్చింది. వాయుకాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో 20 ఏళ్ల పైబడ్డ వాహనాలను తుక్కు కింద ఇచ్చేసి కొన్ని ప్రోత్సాహకాలతో కొత్త వాహనాల కొనుగోలుకు వీలు కల్పించే ఈ విధానం కీలకమైందే. కానీ ఈ విధానం ద్వారా గరిష్ట ప్రయోజనాలు పొందడం కష్టసాధ్యం. కాలం చెల్లిన వాహనాలను వదిలించుకున్న వారికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలూ, కంపెనీలే ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ ‘సలహా’, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన భారీ వాహనాల మార్పిడికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ లేకపోవడం విధాన లోపాలుగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి కోవిడ్ అనంతర పరిస్థితుల్లో ఆర్థిక ఉద్దీపనలో భాగంగా కేంద్రం తగిన సాయం చేయడం ద్వారా వాయుకాలుష్యాన్ని గణనీయంగా తగ్గించేందుకు ఈ విధానం ఆలంబనగా నిలిచే అవకాశం ఉండేది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు లేదా భారత్–4 ప్రమాణాలున్న వాహనాల స్థానంలో కొత్తవాటిని ప్రవేశపెట్టేందుకు ఈ విధానాన్ని ఉపయోగించుకుని ఉంటే మెరుగైన ఫలితాలు ఉండేవి. వాహనశ్రేణి ఆధునికీకరణ లేదా స్క్రాపేజీ పాలసీగా కేంద్రం చేస్తున్న ప్రతిపాదన ఏమిటంటే, దశలవారీగా కాలుష్యకారక వాహ నాల స్థానంలో కొత్తవాటిని ప్రవేశపెట్టాలి. ఇంధన సామర్థ్యం పెంపు, రహదారులపై ప్రమాదాలను తగ్గించడం, స్క్రాపింగ్ పరిశ్రమను అసంఘటిత రంగం నుంచి తప్పించడం, ఆటోమోటివ్, స్టీల్, ఎలక్ట్రానిక్ రంగాలకు అవసరమైన పదార్థాలను తుక్కు నుంచి తక్కువ ఖర్చుతో సేకరించడం వంటివి కూడా ఈ విధానపు లక్ష్యాలు. వ్యక్తిగత వాహనాల స్క్రాపేజీకి 25 శాతం, వాణిజ్య వాహనాలకు 15 శాతం రోడ్‌ట్యాక్స్ మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసు కోవాలని కేంద్రం సలహా ఇచ్చింది. రిజిస్ట్రేషన్ చార్జీల మాఫీని కూడా ప్రతిపాదించింది. స్క్రాపేజీ సర్టిఫికెట్ ఆధారంగా కొత్త వాహనం ధరలో ఐదు శాతం డిస్కౌంట్ ఇవ్వాలని కంపెనీలకు సూచించింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో అధీకృత స్క్రాపింగ్ సెంటర్లు, వాహనాల జీవిత కాలాన్ని నిర్ణయించే ఫిట్నెస్ సెంటర్ల ఏర్పాటుకే సహకరిస్తామని కేంద్రం పేర్కొంది. ఈ ఏడాది అక్టోబరుకు స్క్రాపింగ్ నిబంధనల రూపకల్పన, 15 ఏళ్లకంటే పురాతనమైన ప్రభుత్వ రంగ సంస్థల వాహనాలను వచ్చే ఏడాది అక్టోబరుకల్లా తుక్కుగా మార్చాలని కేంద్రం సంకల్పించింది. 2023 అక్టోబరు కల్లా హెవీడ్యూటీ వాహనాలన్నింటికీ ఫిట్నెస్ టెస్టింగ్‌ను తప్పనిసరి చేయనున్నారు. వాహన్ డేటాబేస్ ఆధారంగా స్క్రాపింగ్ కేంద్రాలన్నీ వాహనాల రికార్డులు, యజమానుల వివరా లను ఎప్పటికప్పుడు నమోదు చేస్తుంటాయని కేంద్రం చెబుతోంది. అగ్ని ప్రమాదాలు, ఆందోళనలు, ఇతర ప్రమాదాలు, లోపాలున్నవిగా తయారీదారులు ప్రకటించినవి, పోలీసు, తదితర వర్గాల వారు జప్తు చేసిన వాహనాలన్నింటినీ తుక్కుగా మార్చేస్తారు. దేశవ్యాప్తంగా 20 ఏళ్ల కంటే పురాతనమైన తేలికపాటి వాహనాలు దాదాపు 51 లక్షల వరకూ ఉన్నాయనీ, 15 ఏళ్ల కంటే పురాతనమైనవి మరో 34 లక్షలు ఉన్నాయనీ కేంద్రం అంచనా వేసింది. మధ్యతరహా, భారీ వాహనాల విభాగాల్లో 15 ఏళ్లు దాటినవి 17 లక్షల వరకూ ఉన్నాయి. ఇతర వాహనాలతో పోలిస్తే ఇవి పది నుంచి 12 రెట్లు ఎక్కువ విష ఉద్గా రాలను వెలువరిస్తాయి. వాహనాలను తుక్కుగా మార్చేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పద్ధతులు నేల, నీరు, గాలిని కలుషితం చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని రకాల సౌకర్యాలు, పరికరాలతో, తగిన రక్షణ చర్యలు తీసుకుంటూ వాహనాలను వ్యవస్థీకృతంగా తుక్కుగా మార్చే కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కొత్త విధానం సాయపడుతుంది కూడా. కానీ ఈ విధానం ద్వారా వాయుకాలుష్య పరంగా గరిష్టమైన లబ్ధి మాత్రం చేకూరే అవకాశాలు తక్కువ. వాహనశ్రేణిని మార్చే బాధ్యత మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలపై మోపడం, రోడ్‌ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల్లో అధిక శాతాన్ని మాఫీ చేయాలన్న సిఫారసు అంత ప్రోత్సాహకరంగా ఏమీ లేవు. ఈ రెండింటి ఆదాయంపై ఆధారపడ్డ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానంపై ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఉద్గారాల తగ్గింపు లక్ష్యంగా పలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. కేంద్రం కూడా వాహనాలను మార్చుకునే వారికి జీఎస్టీలో సబ్సిడీ ఇవ్వడం ద్వారా ఈ విధానాన్ని మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు. కాలుష్యం ఎక్కువగా వెదజల్లే వాహనాల స్థానంలో బీఎస్–6 ప్రమా ణాలతో కూడిన వాహనాలు కొనేవారికి నేరుగా ప్రోత్సాహకాలు ఇచ్చే విషయాన్ని కూడా కేంద్రం పరిగణించాలి. బీఎస్–1 ప్రమాణాల వాహనంతో పోలిస్తే బీఎస్–6 ప్రమాణాలున్న వాహనం 36 రెట్లు తక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతుంది. కొత్త వాహనాలను కొనకుండా పాతవాటిని తుక్కుగా మార్చేందుకు మాత్రమే ఇష్టపడే వారికి స్క్రాపేజీ కేంద్రాలిచ్చే సర్టిఫికెట్ల ఆధారంగా రిబేట్లు కల్పించడం, తుక్కుగా మార్చడంతోపాటు కొత్త వాహనాలను కొనేవారికి ఎక్కువ స్థాయిలో ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది. మొత్తమ్మీద పాత వాహనం స్థానంలో బీఎస్–6 ప్రమాణాలున్న వాహనాన్ని కొనుగోలు చేసే వినియోగదారుడికి వాహనం ధరలో కనీసం 15 శాతం ప్రయోజనం కలిగేలా చూడటం ముఖ్యం. పాతబడినప్పటికీ ఆర్థికంగా విలువ ఉన్న వాహనాలకు ఎక్కువ ప్రయోజనాలు కల్పించాలి. వ్యక్తిగత వాహనాల విషయంలో విధానం వేరుగా ఉండాల్సిన అవసరముంది. ద్విచక్ర వాహనాలతోపాటు కార్లకూ స్వచ్ఛంద విద్యుత్ వాహనాల కొనుగోలుకూ మధ్య లింకు ఏర్పరచడం మేలు. వ్యక్తిగత వాహనాల సంఖ్య చాలా ఎక్కువ. భారీ వాహనాల మాదిరి గానే వీటికీ రాయితీలిస్తే కేటాయించిన బడ్జెట్ వీటికే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే స్వచ్ఛందంగా విద్యుత్తు వాహనాలు కొనుగోలు చేసేవారికే రాయితీలు ఇవ్వడం మేలు. ఇలా చేయడం ద్వారా వాయు కాలుష్యం తగ్గింపులో గరిష్ట ప్రయోజనాలు పొంద వచ్చు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ క్లీన్ ట్రాన్స్‌పోర్టేషన్ జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, పురాతన వాహనాల స్థానంలో కొత్త విద్యుత్తు వాహనాల వాడకం ద్వారా ఉద్గారాల తగ్గింపు ఎక్కువ ఉంటుంది. వ్యక్తిగత వాహనాలకు ఇచ్చే ప్రోత్సాహకాలను పరిమితం చేయడం ద్వారా ప్రజలు స్వచ్ఛందంగా విద్యుత్తు వాహనాల కొనుగోలుకు ముందుకొచ్చే అవకాశాలు పెరుగుతాయన్నమాట. 2030 నాటికి వ్యక్తిగత వాహనాల్లో 30–40 శాతం విద్యుత్తు వాహనాలు ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేందుకూ ఇది దోహద పడుతుంది. తుక్కుగా మార్చేసే వాహనాల నుంచి అత్యధిక ప్రయోజనం పొందేందుకు తయారీదారులపై బాధ్యత మోపేలా కొత్త పాలసీ ఉండాలి. 2015లో తయారు చేసిన ఆటోమోటివ్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్–129 (ఏఐఎస్–129)ను కంపెనీలు సమర్థంగా అమలు చేసేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏఐఎస్–129 ప్రకారం వాహన తయారీలో ఎంత మోతాదులో పదార్థం ఉపయోగించారో అందులో 89–85 శాతం రికవరీ, రీసైకిల్, రీయూజ్ చేయాల్సి ఉంటుంది. సీసం, పాదరసం, కాడ్మియం, హెక్సావెలెంట్ క్రోమియం తదితర భార లోహాల వాడకంపై కూడా ఈ ఏఐఎస్–129 పరిమి తులు విధిస్తుంది. స్క్రాపేజీ విధానంలో దీన్ని తప్పనిసరి చేసి, గూడ్స్ వాహనాలను ఎన్1 కేటగిరీకి చేర్చడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. రీసైకిల్ చేయాల్సిన పదార్థాలను 85–95 శాతానికి చేర్చడం, వాడేసిన ఆయిళ్లు, రబ్బర్ల నుంచి ఇంధనాలను ఉత్పత్తి చేయడం, యూరోపియన్ నిబంధనల్లాగే తయారీదారులపై ఎక్స్టెం డెండ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఉండేలా చూడటం అవసరం. అనుమిత రాయ్ చౌదరి వ్యాసకర్త సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ శాస్త్రవేత్త -
బడ్జెట్ 2021: 20 ఏళ్లు దాటితే వాహనాలు తుక్కే
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడో కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు. కాలుష్య నివారణకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దానిలో భాగాంగా ఈ సారి బడ్జెట్లో నూతన పాలసీని ప్రకటించారు. వాహనాలు పర్యావరణ హితంగా ఉండాలన్నది తమ లక్ష్యమన్న ఆర్థిక మంత్రి.. వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి తమ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకురాబోతుందని వెల్లడించారు. ఇక దీనిలో భాగంగా కాలం తీరిన వాహనాలను తుక్కు కిందకు మార్చే పథకాన్ని తర్వలోనే అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా వ్యక్తిగత వాహనాల జీవిత కాలం 20 ఏళ్లు, కమర్షియల్ వాహనాల లైఫ్‌టైమ్‌ని 15 ఏళ్లుగా నిర్ధారించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. వాయు కాలుష్యం నివారణకు రూ.2,217కోట్లు కేటాయించారు. (చదవండి: ఇక 15 ఏళ్ల ప్రభుత్వ వాహనాలు తుక్కుతుక్కే!) -
వాహన కాలుష్యానికి.. ఆన్లైన్ తనిఖీలు
సాక్షి, హైదరాబాద్ : వాహన కాలుష్యానికి ఆన్లైన్ తనిఖీలతో కళ్లెం వేసేందుకు రవాణాశాఖ సన్నద్ధమవుతోంది. ఇప్పటివరకు మనుషుల ద్వారా నిర్వహించే కాలుష్య తనిఖీ పరీక్షలను ఇక నుంచి ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా నిర్వహించనున్నారు.కేంద్రమోటారు వాహన చట్టంలో రూపొందించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాహనాలనే రోడ్లపైకి అనుమతిస్తారు. గ్రేటర్లో వాహన కాలుష్యం రోజు రోజుకు ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ఏటేటా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న కొత్త వాహనాలతో పాటు, కాలం చెల్లిన వాహనాలు సైతం రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. పాత వాహనాలు ప్రమాదకరమైన కాలుష్యకారక పదార్ధాలను వెదజల్లుతున్నాయి. వాటికి నిర్వహించే కాలుష్య తనిఖీల్లో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు ఉండడం లేదు. రోడ్లపై అక్కడక్కడా కనిపించే సంచార పరీక్షాకేంద్రాల్లో ఉత్తుత్తి తనిఖీలను నిర్వహించేస్తున్నారు. రూ.యాభయ్యో, రూ.వందో తీసుకొని కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాలను ఇచ్చేస్తున్నారు. ఆర్టీఏ అధికారులు వాటినే ప్రామాణికంగా తీసుకొని వాహనాల సామర్థ్యాన్ని ధ్రువీకరిస్తున్నారు. దీంతో యథావిధిగా ఈ వాహనాలు భయంకరమైన కాలుష్యాన్ని చిమ్ముతున్నాయి. రవాణాశాఖ లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రస్తుతం 55 లక్షల వాహనాలు ఉన్నాయి. బీఎస్ –4 ప్రమాణాల మేరకు ఉన్న కార్లు, బైక్‌లు, తదితర వ్యక్తిగత వాహనాలు మినహాయిస్తే బస్సులు, ఆటోలు, లారీలు, ఇతర ప్రయాణికుల రవాణా వాహనాల్లో లక్షల కొద్దీ పాత వాహనాలే ఉన్నాయి. బీఎస్–2, బీఎస్–3 వాహనాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇలాంటి వాటి నుంచి ప్రమాదకరమైన సల్ఫర్, కార్బన్‌మోనాక్సైడ్, కార్బన్డయాక్సైడ్, లెడ్ వంటివి పెద్ద మొత్తంలో విడుదలవుతున్నప్పటికీ ఇప్పుడు ఉన్న మాన్యువల్ పద్ధతిలో సరిగ్గా నిర్ధారించలేకపోతున్నారు. పైగా కాలుష్య తనిఖీ నియంత్రణ స్టేషన్లపైన ఎలాంటి నిఘా లేకపోవడం వల్ల 80 శాతం ఉత్తుత్తి తనిఖీలతోనే వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ‘స్మార్ట్‌చిప్’తో ఒప్పందం... కాలుష్యనియంత్రణపైన రవాణా అధికారులు కొంత కాలంగా తీవ్రంగా దృష్టిసారించారు. ఇప్పుడు ఉన్న పద్ధతిని పూర్తిగా మార్చివేసి మనుషులతో ప్రమేయం లేకుండా ఆన్లైన్లోనే వాహనాల కాలుష్యాన్ని నిర్ధారించాలనే ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగా సాంకేతిక సంస్థల నుంచి గతేడాది టెండర్లను ఆహ్వానించారు.పలు సాంకేతిక సంస్థలు పోటీపడ్డాయి. వాటిలో ఢిల్లీకి చెందిన ‘స్మార్ట్‌చిప్’సంస్థను ఎంపిక చేశారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ సంస్థతో ఒప్పదం కుదుర్చుకోనున్నట్లు రవాణాశాఖ ఐటీ విభాగం సంయుక్త రవాణా కమిషనర్ రమేష్ ‘సాక్షి’ కి చెప్పారు. కేంద్ర మోటారు వాహన చట్టంలో నిర్దేశించిన ప్రమాణాల మేరకు కాలుష్య కారకాలను గుర్తించి సర్టిఫికెట్లను అందజేయడంలో తమకు ఈ సంస్థ సాంకేతిక సాయం అందజేస్తుందన్నారు. నగరంలోని సుమారు 350 కి పైగా ఉన్న కాలుష్య తనిఖీ వాహనాలను, కేంద్రాలను ఆన్లైన్ పరిధిలోకి తేనున్నామన్నారు. రహదారులపై వాహనాలకు కాలుష్య పరీక్షలు నిర్వహించినప్పుడు వాటి కాలుష్యం ఏ స్థాయిలో ఉందనేది ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలోనే ఆన్లైన్లో నిర్ధారించి సర్టి ఫికెట్లను అందజేస్తారు. తనిఖీ కేంద్రాల్లోని ప్రింటర్ల ద్వారా ఈ సర్టిఫికెట్లు వాహనదారుడికి చేరుతాయి. ఎక్కడా మనుషుల ప్రమేయానికి తావు ఉండదు. పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. మరోవైపు ఇప్పుడు ఉన్న తనిఖీ కేంద్రాలను కూడా పెంచుతారు. ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం పొందేవిధంగా పర్యవేక్షిస్తారు. పాత పద్ధతికి స్వస్తి.. కేంద్రమోటారు వాహనచట్టం 1988 ప్రకారం కాలుష్య నియంత్రణకు 2002లో తనిఖీ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటిలో కొన్ని పెట్రోల్ బంకులలో ఏర్పాటు చేసిన స్థిరమైన కేంద్రాలు. కాగా. మరికొన్ని సంచార టెస్టింగ్ స్టేషన్లు. ఈ కేంద్రాల్లో గ్యాస్ అనలైజర్లు, స్మోక్ మీటర్లు ఉంటాయి. వాటి సాయంతో వాహనం నుంచి వెలువడే పొగసాంద్రత, దానిలోని కాలుష్య కారక పదార్ధాలను నిర్ధారిస్తారు. కానీ కొన్ని స్టేషన్లలో అనలైజర్లు, స్మోక్మీటర్లు పని చేయడం లేదు. కేవలం ఉత్తుత్తి తనిఖీలతో సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు, సివిల్ పోలీసులు, రవాణా అధికారులు ఈ స్టేషన్ల పై ఎలాంటి తనిఖీలు నిర్వహించపోవడం, చట్టపరమైన చర్యలు లేకపోవడం వల్ల అవి యధేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. వీటికి ఇక కళ్లెం పడనుంది. -
కాలం చెల్లిన వాహనాల మార్పిడిపై రాయితీ!
న్యూఢిల్లీ: దేశంలో పెరిగిపోతున్న వాహన కాలుష్యం నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఉండగా... ఈ దిశగా ఆటోమొబైల్ పరిశ్రమ పలు కీలక సూచనలు చేసింది. రానున్న మధ్యంతర బడ్జెట్లో వీటికి చోటు కల్పించాలని డిమాండ్ చేసింది. ముఖ్యంగా 2000 సంవత్సరానికి ముందు నాటి పాత వాహనాలను వినియోగం నుంచి తప్పించేందుకు ముఖ్య సూచన చేసింది. పాతవాటిని కొత్త వాహనంతో మార్పిడి చేసుకోవడంపై ఒక్కసారి ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అలాగే, కార్లపై రెండుకు మించి పన్ను రేట్లు లేకుండా చూడాలని కోరింది. బడ్జెట్‌కు ముందు భారీ పరిశ్రమల శాఖతో జరిగిన సమావేశంలో ఆటోమొబైల్ తయారీ సంఘాలు సియామ్, ఎస్ఎంఈవీ తమ ప్రతిపాదనలను తెలియజేశాయి. పరిశ్రమ ప్రతిపాదనలు ఇవీ... ∙15 సంవత్సరాలకు పైబడి వయసున్న వాహనాలతోనే 80 శాతం కాలుష్యం, రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వాహనాలను మార్చుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలతో ముందుకు రావాలి. ఇందుకోసం 2000కు ముందు రిజిస్ట్రేషన్ అయిన వాహనాల మార్పిడిపై ఒక్కసారి రాయితీలు కల్పించాలి. జీఎస్టీ, రోడ్డు పన్ను రాయితీ, సబ్సిడీతో కూడిన రుణాల (ఢిల్లీలో మాదిరి) రూపంలో ప్రోత్సాహకాలు ఉండాలి. ∙కాలుష్య నియంత్రణకు గాను బలమైన నియంత్రణ, వాహన తనిఖీల విధానం అవసరం. ∙ప్రస్తుతం కార్లపై ఉన్న బహుళ పన్నుల రేట్ల స్థానంలో రెండు రేట్లకు మించకుండా చూడాలి. ఎలక్ట్రిక్ కార్లకు ప్రత్యేక పన్ను రేటును అమలు చేయాలి. 2011–12 నాటికి ఆటోమొబైల్ వాహనాలపై 10 శాతంగా ఉన్న పన్ను రేటు 2015–16 నాటికి 22–30 శాతానికి చేరింది. ప్రస్తుతం జీఎస్టీలో ఆటోమొబైల్ వాహనాలకు 28 శాతం పన్ను రేటుతోపాటు, వాహనం సౌకర్యాలు, ఇంజన్ సామర్థ్యాన్ని బట్టి అదనంగా 1–15 శాతం మధ్యలో సెస్సు ఉన్న విషయాన్ని పరిశ్రమ గుర్తు చేసింది. దీర్ఘకాలంలో పన్నుల క్రమబద్ధీకరణ జరగాల్సిన అవసరాన్ని తెలియజేసింది. ∙దిగుమతి చేసుకుంటున్న పూర్తి స్థాయి వాణిజ్య వాహనాలపై కస్టమ్స్ డ్యూటీనీ ప్రస్తుతమున్న 25 శాతం నుంచి 40 శాతానికి పెంచాలి. డబ్ల్యూటీవోలో భారత్ కట్టుబడి ఉన్న రేటు ఇది. సీకేడీ యూనిట్లు, ఎస్కేడీ యూనిట్లకు (విడిభాగాలు దిగుమతి చేసుకుని దేశీయంగా అసెంబుల్ చేయడం) పన్ను రేటు పెంపు అవసరం లేదు. ప్రస్తుతం వీటిపై సుంకాల రేటు 15–30 శాతం మధ్య ఉంది. ∙దిగుమతి అయ్యే కార్లు, ద్విచక్ర వాహనాలపైనా కస్టమ్స్ డ్యూటీని మార్చకుండా ప్రస్తుతమున్నట్టుగానే కొనసాగించాలి. ప్రస్తుతం వీటిపై కస్టమ్స్ సుంకం 50–100 శాతం మధ్య ఉంది. ∙పరిశోధన, అభివృద్ధి వ్యయాలపై 200 శాతం మినహాయింపును తిరిగి ప్రవేశపెట్టాలి. ఈవీలకు మరింత ప్రోత్సాహం ∙దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)ను పెద్ద ఎత్తున పెంచేందుకు రానున్న రెండేళ్ల కాలంలో రూ.20,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి. నిధుల సమీకరణ కోసం సంప్రదాయ వాహనాల(ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్ కలిగినవి)పై నోషనల్ గ్రీన్ సెస్సు విధించాలి. ∙హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగాన్ని వేగంగా పెంచేందుకు ఉద్దేశించిన ఫేమ్ పథకం రెండో దశను ఆరేళ్ల కాల వ్యవధి, నిర్దిష్ట అమలు ప్రణాళికతో ప్రకటించాలి. 2030 నాటికి 30 శాతం ఎలక్ట్రిక్ వాహనాల లక్ష్యాన్ని చేరుకోవాలంటే స్థిరమైన, దీర్ఘకాలిక విధానపరమైన ప్రోత్సాహం, రాయితీలు, ప్రచారం అవసరం. ∙అన్ని ఈవీలకు, బ్యాటరీలపై జీఎస్టీలో పన్ను 5 శాతం మించకూడదు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సదుపాయం కూడా ఉండాలి. -
రూపాయి పతనంతో ‘ఎలక్ట్రిక్’ షాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రోజురోజుకూ భారత్‌లో వాహన కాలుష్యం పెరుగుతోంది. పెట్రోలు ధరలు దూసుకెళ్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలే ఇందుకు పరిష్కారం అన్న చర్చ ఊపందుకున్న తరుణంలో రూపాయి విలువ పడిపోయి పరిశ్రమకు కొత్త సవాళ్లను విసిరింది. అసలే వాహనాల ధర తగ్గించే దిశగా కంపెనీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. డాలరు బలపడటంతో మోటారు, బ్యాటరీలు మరిం త ప్రియం కానున్నాయి. ఇటీవలే ధరలను పెంచిన కంపెనీలు మరోసారి ధరల సవరణకు కసరత్తు చేస్తున్నాయి. అయితే ఈ–వెహికల్స్ ధర సంప్రదాయ వాహనాలతో పోలిస్తే కాస్త ఖరీదు. ఇందుకు వీటిలో వాడే బ్యాటరీ, మోటార్లే కారణం. పూర్తిగా విదేశాల నుంచే ఇవి దిగుమతి అవుతున్నాయి. ఆ రెండు విడిభాగాలే..: మోటారు, బ్యాటరీయే ఎలక్రిక్ వాహనాల తయారీలో అత్యంత కీలకం. వాహనానికి అయ్యే ఖర్చులో 70% విలువ వీటిదే. డాలరుతో రూపాయి మారకం విలువ ఇటీవలే రూ.69.10 దాకా పడింది. బుధవారం ఇది 68.69 గా నమోదైంది. రూపాయి విలువ పడిపోతే దిగుమతులు భారం అవుతాయి. ఈ పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధర ఎంతకాదన్నా 10% వరకు అధికం అవుతుందని ఎలక్ట్రిక్ టూ–వీలర్ల తయారీలో ఉన్న ఆవెర న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ మోటో కార్ప్ టెక్ ఫౌండర్ ఆకుల వెంకట రమణ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కస్టమ్స్ డ్యూటీ తగ్గించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించామని చెప్పారు. బ్రిక్స్ దేశాల మధ్య లావాదేవీలకు డాలరుకు బదులు ఆయా దేశాల కరెన్సీ మార్పిడి జరగాలని డిమాండ్ చేశామన్నారు. ఇప్పటికే పెరిగిన ధరలు..: సాధారణ వాహనాల ధరలను తయారీ కంపెనీలు ఇప్పటికే పెంచాయి. ఈ–వాహనాలదీ ఇదే పరిస్థితి. ధర సవరణపై కస్టమర్లకు సమాచారం ఉండదని వెంకట రమణ అన్నారు. ‘ఎలక్ట్రిక్ వాహన రంగంలో పటిష్టమైన అసోసియేషన్ లేదు. వాహనాలకు స్టాండర్డ్స్ కూడా లేవు. ఎవరి ధర వారిదే. లిథియం బ్యాటరీల ధర అంతర్జాతీయంగా తగ్గింది. కానీ డాలరు మూలంగానే ఇక్కడ ప్రైస్ ఎక్కువైంది’ అన్నారు. త్రీ–వీలర బ్యాటరీల ధర ఇప్పటికే 10% పైగా పెరిగాయని బబ్లి ఈ–రిక్షా దక్షిణ ప్రాంత పంపిణీదారు ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ పేర్కొన్నారు. మరోసారి ధరలు పెరిగే అవకాశం లేకపోలేదని చెప్పారు. పెద్ద సంస్థలు హెడ్జింగ్ చేస్తాయి కాబట్టి రూపాయి ఒడిదుడుకులకు లోనైనా వాహన ధరలపై ప్రభావం ఉండదని గోల్డ్‌స్టోన్ ఇన్ఫ్రాటెక్ ఈడీ నాగ సత్యం పేర్కొన్నారు. -
ఈసారి నిప్పుల కొలిమే!
-
ఈసారి నిప్పుల కొలిమే!
అధిక ఉష్ణోగ్రతలకు కారణాలివే... ⇒ ఆయా ప్రాంతాల్లో హరిత వాతావరణం (గ్రీన్‌బెల్ట్) తగ్గడం ⇒ ఉత్తర, పశ్చిమ భారత ప్రాంతాల నుంచి వీచే వేడి గాలులు ⇒ వాహనాల కాలుష్యం, గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాలు వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు సాక్షి, హైదరాబాద్: ఈసారి ఎండలు మండిపోనున్నాయి. రోహిణి కార్తెలోనే కాదు ఎండా కాలమంతా రోళ్లు పగిలేలా ప్రతాపం చూపించనున్నాయి. వడగాడ్పులు విజృంభించనున్నాయి. మొత్తం గా ఈ వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మేనేజ్మెంట్ సంస్థలు హెచ్చరించాయి. ఈ ఏడాది జనవరిలో ఉష్ణోగ్రతలు గత 116 ఏళ్లలో జనవరి అత్యధిక ఉష్ణోగ్రతల్లో ఎనిమిదో స్థానంలో నిలిచాయని వెల్లడించాయి. తెలంగాణ, ఏపీలతో పాటు మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో కొంత ఎక్కువగా.. గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదుకావొచ్చని హెచ్చరించాయి. గతేడాది కంటే ఎక్కువగా.. ఈసారి తెలంగాణలో వడగాడ్పులు సాధారణం కంటే 47 శాతం అధికంగా వీస్తాయని, ఇది గతేడాది కంటే ఎక్కువ రోజుల పాటు కొనసాగుతాయని హైదరా బాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. ‘‘1981–2010 మధ్య ముప్పై ఏళ్ల సరాసరి ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఈసారి సగటు ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ అధికంగా నమోదవుతాయి. అంటే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 90 రోజుల సరాసరి సాధారణ ఉష్ణోగ్రతలకు ఒక డిగ్రీ అధికంగా నమోదవుతాయి. అంటే ఒక రోజు 4 డిగ్రీలు అధికంగా ఉండొచ్చు.. మరోరోజు 5 డిగ్రీలు అధికంగా ఉండొచ్చు.. ఇంకోరోజు సాధారణం కంటే తక్కువగానూ నమోదు కావచ్చు’’అని వై.కె.రెడ్డి వెల్లడించారు. అయితే ఎల్‌నినో, లానినోల ప్రభావంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని తెలిపారు. అడవులు తగ్గిపోవడం, వాతావరణంలో మార్పులు, గ్లోబల్ వార్మింగ్ కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. మండుతున్న రాజధాని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇప్పటికే మండుతున్న ఎండలతో భగ్గుమంటోంది. రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి నమోదవుతున్నాయి. వచ్చే మూడు నెలల్లో తీవ్రత మరింత పెరుగుతుందన్న సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో వడగాడ్పులు తీవ్రంగా వీయవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ కేసులు, మరణాలు పెరిగే ప్రమాదముందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ, వైద్యారోగ్య తదితర ప్రభుత్వ శాఖలు ప్రజారోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. గతేడాది పెద్ద సంఖ్యలో వడగాడ్పుల మరణాలు దాదాపు వందేళ్లతో పోల్చితే గతేడాదే (2016) అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా నిలిచింది. గత వేసవిలో రాజస్థాన్‌లోని ఫలోడి ప్రాంతంలో ఏకంగా 51 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది వడగాడ్పుల బారినపడి దేశవ్యాప్తంగా దాదాపు 700 మంది మరణించగా.. అందులో 400 మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందినవారేనని అంచనా. అధిక ఉష్ణోగ్రత, వడగాడ్పులతో సమస్యలు ఎండలో బయటికి వెళ్లే వారు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుంది. దీని వల్ల తీవ్రంగా అస్వస్థతకు గురవుతారు. తగిన చికిత్స, సహాయం అందకపోతే మరణించే ప్రమాదం కూడా ఉంటుంది. వేడిగాలులకు వాహన కాలుష్యం తోడవడంతో శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. -
కాలుష్యంపై కేంద్రానికి పట్టదా?: సుప్రీం
న్యూఢిల్లీ: వాహన కాలుష్యం తగ్గించే పరిష్కారాల్ని సూచించకపోవడంపై కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాఫీలు తాగుతూ సంబంధిత మంత్రిత్వ శాఖ ఏం పనిచేయడం లేదని, ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన సమస్యని సుప్రీంకోర్టు మండిపడింది. కాలుష్య సమస్యపై పరిశోధించి పరిష్కారాలతో ఎందుకు రావడం లేదని ప్రశ్నించింది. ఇలాంటి విషయాల్లో న్యాయస్థానాలే బలవంతంగా అన్నీ చేయించాల్సి వస్తోందని ప్రధాన న్యాయమూర్తి టీ.ఎస్.ఠాకూర్, న్యాయమూర్తులు ఏకే సిక్రి, ఆర్.భానుమతిలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఢిల్లీలో డీజిల్ వాహనాల నిషేధం కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అదనపు సొలిసిటర్ జనరల్ మణిందర్ సింగ్ వాదిస్తూ.. సీనియర్ న్యాయవాది కె.కె.వేణుగోపాల్ సూచించే పరిష్కారాల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోందని ధర్మాసనానికి తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేస్తూ... సీనియర్ న్యాయవాది నివేదిక కోసం ఎందుకు ఎదురుచూడాలని, మీరే ఆ పని చేయవచ్చు కదా అని ప్రశ్నించింది. -
పదేళ్లు దాటిన డీజిల్ వాహనాల్ని నడపొద్దు
♦ ఆదేశించిన ఎన్జీటీ ♦ ఢిల్లీకి మాత్రమే వర్తింపు ♦ బుధవారం నుంచే తనిఖీలు ♦ వాయు నాణ్యత మెరుగుపరిచేందుకు చర్యలు సాక్షి, న్యూఢిల్లీ : పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలను నగరంలో నడపకూడదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) మంగళవారం ఆదేశించింది. నగరంలోని అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద వాహనాల కాలుష్య స్థాయి, బరువు, వయసును తనిఖీ చేసే విభాగాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం, సంబంధిత సంస్థలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) 20 గంటల సమయం ఇచ్చింది. పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాలు దాటిన పెట్రో లు వాహనాల జాబితాను ఈ నెల 9 లోగా తనకు సమర్పించాలని ఢిల్లీ, హరియాణా, యూపీ ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. బుధవారం నుంచి ఆకస్మిక తనిఖీలు బుధవారం నుంచి నగరంలోకి ప్రవేశించే అన్ని వాహనాలకు సరిహద్దుల వద్ద కాలుష్య స్థాయి, బరువు, వయసు తనిఖీలు జరుపుతారు. ట్రిబ్యునల్ నియమించిన స్థానిక కమిషనర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. ఢిల్లీ, ఎన్సీఆర్లలో పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలను నడపడంపై ఎన్జీటి చైర్పర్సన్, న్యాయమూర్తి స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం నిషేధం విధించింది. తేలిక, భారీ వాహనాలకు ఈ నిషేధం వ ర్తిస్తుంది. ఈ ఉత్తర్వులు నగరంలోని దాదాపు పది లక్షల వాహనాలకు వర్తిస్తుందని అంచనా వేస్తున్నారు. నిషేధానికి గురయ్యే జాబితాలో ఎక్కువ సంఖ్యలో టాక్సీలున్నాయి. డీజిల్ వాహనాలపై నిషేధంతో పాటు ఢిల్లీలో వాయు నాణ్యతను మెరుగుపరచేందుకు నివేదిక సమర్పించాలని ఎన్జీటీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 15 ఏళ్లు దాటిన వాహనాలు 28 లక్షలు నగరంలో 15 సంవత్సరాలు దాటిన పెట్రోలు వాహనాల వాడకంపై ఎన్జీటి గతేడాది నవంబర్‌లో నిషేధం విధించింది. నగరంలో 15 ఏళ్లు దాటిన వాహనాలు 28 లక్షలకు పైగా ఉన్నాయని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. అయితే గడిచిన మూడేళ్లలో రవాణా అధికారులు 1,110 వాహనాలను మాత్రమే స్వాధీనపరచుకున్నారు. గాలిలో ధూళి విడుదల చేస్తూ కాలుష్యానికి తోడ్పడుతున్న అక్రమ నిర్మాణాలపై ధర్మాసనం కఠిన ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శకాలను, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అక్రమంగా నిర్మాణాలు జరుపుతున్న ఆనేక ప్రాజెక్టులపై ట్రిబ్యునల్ స్టే విధించింది. లజ్‌పత్‌నగర్, చాందినీచౌక్‌లోని రోడ్ల పక్కన సామాగ్రిని విక్రయించే హాకర్లు, చిల్లర దుకాణాలపై కూడా ఎన్జీటి నిషేధించింది. అనేక దేశాల్లో డీజిల్ వాహనాలపై నిషేధం ఉంది: ధర్మాసనం డెన్మార్క్, బ్రెజిల్, చైనా, శ్రీలంక దే శాలు అన్ని డీజిల్ వాహనాలను నిషేధించే ప్రక్రియలో ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పటికే డీజిల్ వాహనాలపై నిషేధం విధించాయని, మరికొన్ని ఈ ప్రక్రియలో ఉన్నాయని చెప్పింది. అలాగే కొన్ని దేశాలు అధిక పన్నులు విధించడం ద్వారా డీజిల్ వాహనాల వాడకాన్ని తగ్గిస్తున్నాయని న్యాయమూర్తి చెప్పారు. నగరవాసులు తాము పీల్చే శ్వాసతో అనారోగ్యానికి చేరువ కాకుండా ఉండేలా చూసేందుకు కొన్ని కఠిన చర్యలను చేపట్టవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు ఎన్జీటీ తెలిపింది. కాగా, గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు ఎన్జీటీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ఆదేశాలను ఏ మేరకు అమలు చేశారో చూడడం కోసం ఒరిజినల్ ఫైళ్లు సమర్పించాలని ఢిల్లీ, హరియాణా, యూపీ సర్కారులను ఆదేశించింది. -
‘బెంజీన్’ భూతం
⇒ మోటారు వాహనాల కాలుష్యమే కారణం ⇒ పెట్రోలు, డీజిల్ కల్తీతో అనర్థం ⇒ గాలిలో పెరుగుతున్న బెంజీన్ మోతాదు ⇒ క్యాన్సర్, రక్తహీనత, గుండెపోటుకు కారణం సాక్షి, సిటీబ్యూరో: మహా నగరం ‘బెంజీన్’ భూతం కోరల్లో చిక్కుకుంటోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ భూతం మన ఆరోగ్యాన్ని హరి స్తోంది. ఇప్పటికే దీని కోరల్లో ఎంతోమంది చి క్కుకొని విలవిల్లాడుతున్నారు. క్యాన్సర్, గుండెపోటు, రక్తహీనతకు కారణమయ్యే బెంజీన్ మూలకం మోతాదు వాతావరణంలో రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. క్యూబిక్ మీటరు గాలిలో ఇది 5 మైక్రోగ్రాములు దాటకూడదు. కానీ అనూహ్యంగా గ్రేటర్లో 8.4 మైక్రోగ్రాములకు చేరడం ఆందోళన కలిగిస్తోంది.మహానగరంలో వాహనాల సంఖ్య 45 లక్షలకు చేరుకోవడం... ఇందులో పదేళ్లకు మించిన కాలం చెల్లిన వాహనాలు సుమారు 15 లక్షల మేర ఉండడంతో నగరం పొగ చూరుతోంది. మరోవైపు కల్తీ ఇంధనాల వాడకం పెరగడం, పెట్రోలు, డీజీలు వంటి పెట్రో ఉత్పత్తులను విచక్షణారహితంగా వినియోగిస్తుండడంతో బెంజీన్ భూతం జడలు విప్పిందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాల సమస్యే తీయటి వాసన గల బెంజీన్ మూలకం మోతాదు అవధులు దాటితే అనర్థమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి మండే స్వభావమూ అధికమేనని తెలిపారు. ఇది అతి త్వరగా ఆవిరవుతుంది. ఈ మూలకం విచ్ఛిన్నమయ్యేందుకు 10 నుంచి 30 ఏళ్లు పడుతుందని అంటున్నారు. అంటే వాతావరణంలో సుదీర్ఘకాలం దీని ప్రభావం ఉంటుందన్నమాట. ఇది గాలి ద్వారా ఒక చోటు నుంచి మరొక చోటుకు తరలి వెళుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ప్రభావం అధికంగా ఉన్న చోట క్యాన్సర్, రక్తహీనత, టీబీ వ్యాధులు ప్రబలుతాయని పీసీబీ శాస్త్రవేత్త వీరన్న ‘సాక్షి’కి తెలిపారు. మెట్రో నగరాల్లో ఇలా... క్యూబిక్ మీటరు గాలిలో బెంజీన్ మోతాదు 5 మైక్రోగ్రాములు మించరాదని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రమాణాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ దేశ రాజధాని ఢిల్లీలో ఏడాదికి సరాసరి 16 మైక్రోగ్రాములు, ముంబ యిలో 18 మైక్రోగ్రాములు, బెంగళూరులో 7 మైక్రోగ్రాములుగా నమోదైంది. చెన్నైలో 8 మైక్రోగ్రాములు, కోల్‌కతాలో 15 మైక్రోగ్రాములుగా ఉంది. దేశంలో అత్యధికంగా కాన్పూర్ నగరంలో ఏకంగా 22 మైక్రోగ్రాములుగా బెంజీన్ మోతాదు నమోదవడం గమనార్హం. ఇక మన నగరంలో ప్రస్తుతం 8.4గా ఉన్న బెంజీన్ మోతాదు సమీప భవిష్యత్తులో మరింత పెరిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాహన కాలుష్యంతోనే అనర్థం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం అన్నిరకాల వాహనాలు (ద్విచక్ర వాహనాలు, కార్లు, జీపులు, ఆటోలు) కలిపి 45 లక్షలు ఉన్నాయి. ఇందులో పదేళ్లకు పైబడిన వాహనాలు 15 లక్షల వరకు ఉన్నాయి. ఈ వాహనాల సామర్థ్యం దెబ్బతినడంతో లెక్కకు మిక్కిలి పొగ వెలువడుతోంది. నగరంలో ఏటా 58.40 కోట్ల లీటర్ల పెట్రోలు, 102 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. పైగా ఏటా 1.75 లక్షల నుంచి 2 లక్షల వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. నిత్యం 600 కొత్త వాహనాలు రిజిష్టర్ అవుతున్నట్లు రవాణా అధికారుల అంచనా. మహా నగరంలో రహదారులు 8 శాతం మేరఅందుబాటులో ఉండడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగి ఇంధన వినియోగం అధికమవుతోంది. కాలుష్యం అంతకంతకు పెరుగుతోంది. ఈ వాయు కాలుష్యంలో బెంజీన్ మోతాదు కూడా ఏటా పెరుగుతూనే ఉంది. 2015 నాటికి వాహనాల సంఖ్య సుమారు 50 లక్షలకు చేరుకోనున్నట్లు రవాణా శాఖ అంచనా వేస్తోంది. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, వంటి నగరాలతో పోల్చుకుంటే ప్రస్తుతానికి నగరంలో వాహనాల సంఖ్య తక్కువగానే ఉంది. వాహన సాంద్రత మాత్రం ఎక్కువగా ఉంది. పరిశ్రమలు సైతం.. ప్లాస్టిక్, రసాయన, డిటర్జెంట్, క్రిమి సంహారకాలు, రబ్బరు, బల్క్‌డ్రగ్ పరిశ్రమల నుంచి వెలువడే వాయువుల్లో బెంజీన్ మోతాదు ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి కళ్లుగప్పి పారిశ్రామికవర్గాలు విడుదల చేస్తున్న వాయువుల్లో బెంజీన్ ఉన్నట్లు వారు నిర్ధారించారు. -
నగరమంతా నడకే!
వీక్షణం పెరుగుతున్న వాహనాలతో కాలుష్యం నగరాలను కమ్మేస్తోంది. ప్రతి దేశంలోనూ ఇదే సమస్య. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనాలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందట. దాంతో కాలుష్యాన్ని అరికట్టేందుకు రకరకాల ఆలోచనలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. ముందుగా ఓ నగరాన్ని పూర్తిగా కాలుష్య రహితంగా నిర్మించాలని చూస్తోంది. చుట్టూ పచ్చని పచ్చికతో ఉండే ఆ నగరంలో ఎనభై వేల మంది నివసించవచ్చు. కానీ వాహనాలు వాడటానికి వీల్లేదు. కాలి నడకనే తిరగాల్సి ఉంటుంది. అలా ఎలా నడవగలరు అని టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే పేరుకి నగరమే అయినా, దాని విస్తీర్ణం చాలా తక్కువ. కట్టడాలను నిలువుగా, తక్కువ వైశాల్యంలో నిర్మించ బోతున్నారు. దాంతో తక్కువ ప్రదేశంలోనే ఎక్కువమంది నివసించడానికి వీలు పడుతుంది. అది మాత్రమే కాదు... నీటిని తక్కువగా వాడేలా, చెత్త తక్కువగా ఉండేలా, కార్బన్ డై ఆక్సైడ్ ఒక పరిమితి దాటకుండా చూసేలా ఈ నగరాన్ని నిర్మిస్తున్నారట! -
బెంజీన్ ముప్పు
=గేటర్ గజగజ =పెరుగుతున్న వాహన కాలుష్యమే కారణం =క్యాన్సర్, గుండెపోటు, టీబీ వ్యాధులు ప్రబలే అవకాశం సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్‌పై ‘బెంజీన్’ భూతం కోరలు చాస్తోంది. వాతావరణంలో ఈ మూలకం మోతాదు శ్రుతి మించుతోంది. ‘సిటీ’జనుల్లో క్యాన్సర్, గుండెపోటు, రక్తహీనత, టీబీ వ్యాధులు ప్రబలడానికి కారణమవుతోంది. క్యూబిక్ మీటరు గాలిలో 5 మైక్రోగ్రాములు దాటకూడని ఈ మూలకం వార్షిక మోతాదు గ్రేటర్లో ఇపుడు 8.4 మైక్రోగ్రాములకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. మహానగరంలో వాహనాల సంఖ్య 38 లక్షలకు చేరుకోవడం.. ఇందులో పదేళ్లకు మించిన కాలం చెల్లిన వాహనాలు సుమారు 10 లక్షల మేర ఉండడంతో నగరం పొగచూరుతోంది. మరోవైపు కల్తీ ఇంధనాల వాడకం పెరగడం, పెట్రోలు, డీజీలు వంటి పెట్రో ఉత్పత్తులను విచక్షణారహితంగా వినియోగిస్తుండటం వెరసి బెంజీన్ భూతం జడలు విప్పుతోందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవధులు దాటితే అనర్థమే తీయటి వాసన గల బెంజీన్ మూలకం మోతాదు అవధులు దాటితే అనర్థమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది అతి త్వరగా గాలిలో ఆవిరిగా మారుతుంది. దీనికి మండే స్వభావమూ అధికమే. ఈ మూలకం విచ్ఛిన్నం అయ్యేందుకు 10-30 ఏళ్లు పడుతుంది. అంటే వాతావరణంలో సుదీర్ఘకాలం దీని ప్రభావం ఉంటుందన్నమాట. ఇది గాలి ప్రవాహం ద్వారా ఒక చోట నుంచి మరొక చోటకు తరలి వెళుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ప్రభావం అధికంగా ఉన్న చోట క్యాన్సర్, గుండెపోటు, రక్తహీనత, టీబీ వ్యాధులు ప్రబలుతాయని పీసీబీ శాస్త్రవేత్త వీరన్న ‘సాక్షి’కి తెలిపారు. వాహన కాలుష్యంతోనే ముప్పు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం అన్నిరకాల వాహనాలు (ద్విచక్రవాహనాలు, కార్లు, జీపులు, బస్సులు, ఆటోలు) కలిపి 38 లక్షలున్నాయి. ఇందులో పదేళ్లకు పైబడిన వాహనాలు పదిలక్షల మేర ఉన్నాయి. ఈ వాహనాల సామర్థ్యం దెబ్బతినడంతో వీటి నుంచి విపరీతంగా పొగ వెలువడుతుంది. ఫలితంగా నగరంలో కాలుష్య మేఘాలు కమ్ముకుంటున్నాయి. అలాగే సిటీలో పెట్రోలుతో నడిచే వాహనాలకు ఏటా 5400 లక్షల లీటర్ల పెట్రోలు, డీజిల్ వాహనాలకు 12వేల లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నారు. పైగా వాహనాల జాబితాలో ఏటా 1.75 లక్షల నుంచి 2 లక్షల వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. ప్రతిరోజు 600 కొత్త వాహనాలు రిజిష్టర్ అవుతున్నట్లు రవాణా అధికారుల అంచనా. కానీ మహానగరంలో రహదారులు 8 శాతం మేరకే అందుబాటులో ఉండడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగి ఇంధన వినియోగం అధికమౌతోంది. కాలుష్యం అంతకంతకూ పెరుగుతోంది. ఈ వాయుకాలుష్యంలో బెంజీన్ మోతాదు కూడా ఏటేటా పెరుగుతూ ఉంది. కాగా 2015 నాటికి వాహనాల సంఖ్య 45 లక్షలకు చేరుకోనున్నట్లు రవాణా శాఖ అంచనా వేస్తోంది. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాలతో పోల్చుకుంటే ప్రస్తుతానికి నగరంలో వాహనాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ వాహన సాంద్రత మాత్రం ఎక్కువగానే ఉంది. పరిశ్రమలు సైతం.. ప్లాస్టిక్, డిటర్జెంట్, క్రిమిసంహారకాలు, రబ్బరు, బల్క్‌డ్రగ్, రసాయన పరిశ్రమల నుంచి వెలువడే వాయువుల్లోనూ బెంజీన్ మోతాదు ఎక్కువగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి కళ్లుగప్పి పారిశ్రామికవర్గాలు విడుదల చేస్తున్న వాయువుల్లో బెంజీన్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. క్యాన్సర్ ప్రబలడం తథ్యం బెంజీన్ కాలుష్యం వల్ల ఊపిరితిత్తులు, మూత్రకోశ క్యాన్సర్లు ప్రబలే ప్రమాదం ఉంది. నగరంలో ఇటీవల ఈ క్యాన్సర్ల బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మాస్క్‌లు ధరించినా అవి గాలిని పూర్తిగా ఫిల్టర్ చేయలేవు. కాలంచెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా చేయాలి. కల్తీ ఇంధనాల వినియోగం తగ్గించాలి. వాహనాల్లో యూరో-4 ప్రమాణాలను తప్పనిసరి చేస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుంది. - డాక్టర్ మోహనవంశీ, క్యాన్సర్ వైద్యనిపుణుడు, ఒమేగా ఆసుపత్రి