
నగరమంతా నడకే!
వీక్షణం
పెరుగుతున్న వాహనాలతో కాలుష్యం నగరాలను కమ్మేస్తోంది. ప్రతి దేశంలోనూ ఇదే సమస్య. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనాలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందట. దాంతో కాలుష్యాన్ని అరికట్టేందుకు రకరకాల ఆలోచనలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. ముందుగా ఓ నగరాన్ని పూర్తిగా కాలుష్య రహితంగా నిర్మించాలని చూస్తోంది. చుట్టూ పచ్చని పచ్చికతో ఉండే ఆ నగరంలో ఎనభై వేల మంది నివసించవచ్చు. కానీ వాహనాలు వాడటానికి వీల్లేదు. కాలి నడకనే తిరగాల్సి ఉంటుంది.
అలా ఎలా నడవగలరు అని టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే పేరుకి నగరమే అయినా, దాని విస్తీర్ణం చాలా తక్కువ. కట్టడాలను నిలువుగా, తక్కువ వైశాల్యంలో నిర్మించ బోతున్నారు. దాంతో తక్కువ ప్రదేశంలోనే ఎక్కువమంది నివసించడానికి వీలు పడుతుంది. అది మాత్రమే కాదు... నీటిని తక్కువగా వాడేలా, చెత్త తక్కువగా ఉండేలా, కార్బన్ డై ఆక్సైడ్ ఒక పరిమితి దాటకుండా చూసేలా ఈ నగరాన్ని నిర్మిస్తున్నారట!