♦ ఆదేశించిన ఎన్‌జీటీ
♦ ఢిల్లీకి మాత్రమే వర్తింపు
♦ బుధవారం నుంచే తనిఖీలు
♦ వాయు నాణ్యత మెరుగుపరిచేందుకు చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ : పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలను నగరంలో నడపకూడదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) మంగళవారం ఆదేశించింది. నగరంలోని అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద వాహనాల కాలుష్య స్థాయి, బరువు, వయసును తనిఖీ చేసే విభాగాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం, సంబంధిత సంస్థలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) 20 గంటల సమయం ఇచ్చింది. పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాలు దాటిన పెట్రో లు వాహనాల జాబితాను ఈ నెల 9 లోగా తనకు సమర్పించాలని ఢిల్లీ, హరియాణా, యూపీ ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.
బుధవారం నుంచి ఆకస్మిక తనిఖీలు
బుధవారం నుంచి నగరంలోకి ప్రవేశించే అన్ని వాహనాలకు సరిహద్దుల వద్ద కాలుష్య స్థాయి, బరువు, వయసు తనిఖీలు జరుపుతారు. ట్రిబ్యునల్ నియమించిన స్థానిక కమిషనర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. ఢిల్లీ, ఎన్సీఆర్‌లలో పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలను నడపడంపై ఎన్‌జీటి చైర్‌పర్సన్, న్యాయమూర్తి స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం నిషేధం విధించింది. తేలిక, భారీ వాహనాలకు ఈ నిషేధం వ ర్తిస్తుంది. ఈ ఉత్తర్వులు నగరంలోని దాదాపు పది లక్షల వాహనాలకు వర్తిస్తుందని అంచనా వేస్తున్నారు. నిషేధానికి గురయ్యే జాబితాలో ఎక్కువ సంఖ్యలో టాక్సీలున్నాయి. డీజిల్ వాహనాలపై నిషేధంతో పాటు ఢిల్లీలో వాయు నాణ్యతను మెరుగుపరచేందుకు నివేదిక సమర్పించాలని ఎన్‌జీటీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
15 ఏళ్లు దాటిన వాహనాలు 28 లక్షలు
నగరంలో 15 సంవత్సరాలు దాటిన పెట్రోలు వాహనాల వాడకంపై ఎన్‌జీటి గతేడాది నవంబర్‌లో నిషేధం విధించింది. నగరంలో 15 ఏళ్లు దాటిన వాహనాలు 28 లక్షలకు పైగా ఉన్నాయని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. అయితే గడిచిన మూడేళ్లలో రవాణా అధికారులు 1,110 వాహనాలను మాత్రమే స్వాధీనపరచుకున్నారు. గాలిలో ధూళి విడుదల చేస్తూ కాలుష్యానికి తోడ్పడుతున్న అక్రమ నిర్మాణాలపై ధర్మాసనం కఠిన ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శకాలను, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అక్రమంగా నిర్మాణాలు జరుపుతున్న ఆనేక ప్రాజెక్టులపై ట్రిబ్యునల్ స్టే విధించింది. లజ్‌పత్‌నగర్, చాందినీచౌక్‌లోని రోడ్ల పక్కన సామాగ్రిని విక్రయించే హాకర్లు, చిల్లర దుకాణాలపై కూడా ఎన్‌జీటి నిషేధించింది.
అనేక దేశాల్లో డీజిల్ వాహనాలపై నిషేధం ఉంది: ధర్మాసనం
డెన్మార్క్, బ్రెజిల్, చైనా, శ్రీలంక దే శాలు అన్ని డీజిల్ వాహనాలను నిషేధించే ప్రక్రియలో ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పటికే డీజిల్ వాహనాలపై నిషేధం విధించాయని, మరికొన్ని ఈ ప్రక్రియలో ఉన్నాయని చెప్పింది. అలాగే కొన్ని దేశాలు అధిక పన్నులు విధించడం ద్వారా డీజిల్ వాహనాల వాడకాన్ని తగ్గిస్తున్నాయని న్యాయమూర్తి చెప్పారు. నగరవాసులు తాము పీల్చే శ్వాసతో అనారోగ్యానికి చేరువ కాకుండా ఉండేలా చూసేందుకు కొన్ని కఠిన చర్యలను చేపట్టవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు ఎన్‌జీటీ తెలిపింది. కాగా, గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు ఎన్‌జీటీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ఆదేశాలను ఏ మేరకు అమలు చేశారో చూడడం కోసం ఒరిజినల్ ఫైళ్లు సమర్పించాలని ఢిల్లీ, హరియాణా, యూపీ సర్కారులను ఆదేశించింది.
పదేళ్లు దాటిన డీజిల్ వాహనాల్ని నడపొద్దు
Published Tue, Apr 7 2015 10:33 PM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM
Advertisement
Advertisement