సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లో కాలుష్యం కోరలు చాస్తోంది. రోజురోజుకు పరిస్థితి తీవ్రంగా మారుతోంది. ముఖ్యంగా డీజిల్ వాహనాల కారణంగా సిటీ పొగచూరుతోందని, గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని పీసీబీ తాజా అధ్యయనంలో తేలింది. గ్రేటర్‌లో వాహనాల సంఖ్య సుమారు 80 లక్షలకు చేరువైంది. ఇందులో పదిహేనేళ్లకు పైబడిన కాలంచెల్లిన వాహనాలు 20 లక్షలకు పైమాటే. వీటిలో డొక్కు బస్సు లు, ట్రక్కులు, కార్లు తదితర డీజిల్ వాహనాలు విడుదల చేస్తున్న పొగతో ప్రధాన నగరంతోపాటు శివారు ప్రాంతాలు పొగచూరుతున్నాయి.
ప్రధానంగా మోటారు వాహనాలు, పరిశ్రమలు విడుదల చేస్తున్న పొగలో సూక్ష్మ ధూళి కణాల(పిఎం2.5) మోతాదు అనూహ్యంగా పెరగడంతో సిటీజన్లలో గుండె కండరాలు, దమనులు దెబ్బ తింటున్నట్లు పీసీబీ తాజా అధ్యయనంలో వెల్లడైంది. నగ రంలో 28 ప్రాంతాల్లో సూక్ష్మ ధూళికణాల మోతాదును ఈ సంస్థ నిపుణులు నమోదు చేశారు. వీరి లెక్కల ప్రకారం ఘనపుమీటర్ గాల్లో సూక్ష్మ ధూళికణాల మోతాదు 32 మైక్రో గ్రాములకు మించరాదు. కానీ ఆయా ప్రాంతాల్లో వీటి మోతాదు 60 మైక్రో గ్రాములకు పైగా నమోదవడం ఆందోళన కల్గిస్తోంది.
గుండెకూ చేటు..
ఈ సూక్ష్మ ధూళికణాలు గుండెలోని సూక్ష్మ దమనులు, కెరోటిడ్ ఇంటిమా మీడియాపై పేరుకు పోవడంతో వాటి మందం పెరిగి గుండెకు రక్తసరఫరా తగ్గుతున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ పరిణామంతో గుండెదడ, గుండెపోటు తదితర హృదయ సంబంధిత సమస్యలు సిటీజన్లలో క్రమంగా పెరుగుతున్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. సూక్ష్మధూళి కణాల కాలుష్యంతో పురుషుల్లో 1.79 శాతం గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని, మహిళల్లో 2.98 శాతం మందికి గుండె సంబందిత సమస్యలు పెరుగుతున్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. ధూళి కణాల కాలుష్యం మెదడుకు రక్తం సరఫరా చేసే రక్త నాళాలకు కూడా చేటు చేస్తుందని ఈ అధ్యయనం స్పష్టంచేయడం గమనార్హం.
చదవండి: Hyderabad: పెంపుడు పిల్లిని ఎత్తుకెళ్లాడు.. సీసీటీవీలో రికార్డు.. కేసు నమోదు
కాలుష్యానికి కారణాలివే..
►పలు కూడళ్లలో వాయు కాలుష్యం అవధులు దాటుతోంది. గ్రేటర్ పరిధిలో సుమారు 80 లక్షలకు పైగా ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగ, ట్రాఫిక్ రద్దీలో రహదారులపై రేగుతున్న దుమ్ముతో సిటీజన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.
►పలుప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లోచెత్తను తగులబెట్టడంతో కాలుష్య తీవ్రత పెరుగుతోంది. పరిశ్రమలు వెదజల్లుతోన్న కాలుష్యంతో సమీప ప్రాంతాలు పొగచూరుతున్నాయి.
►శివారుప్రాంతాల్లో నిర్మాణ సంబంధ కార్యకలాపాలు పెరగడంతో సూక్ష్మధూళికణాలు పీల్చే గాలిలో చేరి సమీప ప్రాంతాల్లోని సిటీజన్ల ఊపిరితిత్తులోకి చేరుతున్నాయి. ఘణపు మీటరు గాలిలో సూక్ష్మధూళికణాలు(పీఎం2.5) మోతాదు 32 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ పలు కూడళ్లలో పలుమార్లు అంతకు రెట్టింపు స్థాయిలో ధూళికాలుష్యం నమోదవుతోంది.
►గ్రేటర్ పరిధిలో రాకపోకలు సాగించే 80 లక్షలవాహనాల్లో ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు,120.45 కోట్ల లీటర్ల డీజిలును వినియోగిస్తుండడంతో పొగ తీవ్రత ఏటేటా పెరుగుతూనే ఉంది.
►గ్రేటర్ పరిధిలో పదిహేనేళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలు 20 లక్షల వరకు ఉన్నాయి. ఇవన్ని రోడ్లపైకి ముంచెత్తుతుండడంతో పొగ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాహనాల నుంచి వెలువడుతున్న పొగ నుంచి కార్భన్‌మోనాక్సైడ్,నైట్రోజన్ డయాక్సైడ్,సల్ఫర్‌డయాక్సైడ్,అమ్మోనియా,బెంజీన్,టోలిన్,ఆర్‌ఎస్‌పీఎం(ధూళిరేణువులు) వంటి కాలుష్య ఉద్గారాలు వాతావరణంలో చేరి నగర పర్యావరణం పొగచూరుతోంది.
జాగ్రత్తలు తప్పనిసరి..
►సూక్ష్మ ధూళి కణాల కాలుష్యం బారిన పడకుండా ముక్కుకు మాస్‌్కలు ధరించాలి.
►కాలం చెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా నియంత్రించాలి.
►ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఎక్కువ సేపు గడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
►కల్తీ ఇంధనాల వినియోగాన్ని కట్టడి చేయాలి. ప్రతీపెట్రోలు బంకులో తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో ఇంధన నాణ్యత తనిఖీలు
నిర్వహించాలి.
కాలుష్య నియంత్రణ మండలి తాజా లెక్కల ప్రకారం నగరంలో బాలానగర్, ప్యారడైజ్, చార్మినార్, జీడిమెట్ల, లంగర్‌హౌజ్, కూకట్‌పల్లి, సైనిక్‌పురి, నాచారం, జూపార్క్, పంజగుట్ట తదితర ప్రాంతాల్లో ధూళికాలుష్యం వంద మైక్రోగ్రాములు మించడం ఆందోళన కలిగిస్తోంది. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానికులు, పాదచారులు, వాహనదారులు ఈ ధూళికాలుష్యంతో అస్తమా, సైనస్, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులతో సతమతమౌతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment