
పదేళ్లు దాటితే.. కారు షెడ్డుకే!
మీకు డీజిల్ కారు ఉందా.. అది కూడా తీసుకుని పదేళ్లు దాటిందా? అయితే ఇక దాన్ని షెడ్డుకు పరిమితం చేయాల్సిందే. అయితే ప్రస్తుతానికి ఇది ఢిల్లీ, కేరళలలో మాత్రమే అమలవుతోంది. అచ్చం దేశ రాజధాని ఢిల్లీలోలాగే పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలను నిషేధిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎర్నాకులం బెంచి ఆదేశిచింది. లాయర్స్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ ఫోరమ్ (లీఫ్) అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్ విచారణ అనంతరం జస్టిస్ జె.స్వతంత్రకుమార్ నేతృత్వంలోని బెంచి ఈ మధ్యంతర ఆదేశాలు జారీచేసింది.
పదేళ్లు దాటిన నెల రోజుల తర్వాత కూడా అలాంటి వాహనాలను నడిపిస్తుంటే రూ. 10 వేల జరిమానా విధించాలని కూడా ఆదేశించారు. కొచ్చి నగరం అత్యంత కలుషిత నగరంగా ముద్ర పడిందని, కేరళలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల పరిస్థితి కూడా ఇంతేనని పిటిషన్లో పేర్కొన్నారు. పాత కాలం నాటి లారీలు, బస్సుల నుంచి వెలువడుతున్న విషవాయువులను వెంటనే అరికట్టాలని కోరారు.