
కాలుష్యంపై కేంద్రానికి పట్టదా?: సుప్రీం
న్యూఢిల్లీ: వాహన కాలుష్యం తగ్గించే పరిష్కారాల్ని సూచించకపోవడంపై కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాఫీలు తాగుతూ సంబంధిత మంత్రిత్వ శాఖ ఏం పనిచేయడం లేదని, ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన సమస్యని సుప్రీంకోర్టు మండిపడింది. కాలుష్య సమస్యపై పరిశోధించి పరిష్కారాలతో ఎందుకు రావడం లేదని ప్రశ్నించింది. ఇలాంటి విషయాల్లో న్యాయస్థానాలే బలవంతంగా అన్నీ చేయించాల్సి వస్తోందని ప్రధాన న్యాయమూర్తి టీ.ఎస్.ఠాకూర్, న్యాయమూర్తులు ఏకే సిక్రి, ఆర్.భానుమతిలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.
ఢిల్లీలో డీజిల్ వాహనాల నిషేధం కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అదనపు సొలిసిటర్ జనరల్ మణిందర్ సింగ్ వాదిస్తూ.. సీనియర్ న్యాయవాది కె.కె.వేణుగోపాల్ సూచించే పరిష్కారాల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోందని ధర్మాసనానికి తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేస్తూ... సీనియర్ న్యాయవాది నివేదిక కోసం ఎందుకు ఎదురుచూడాలని, మీరే ఆ పని చేయవచ్చు కదా అని ప్రశ్నించింది.