ఈసారి ఎండలు మండిపోనున్నాయి. రోహిణి కార్తెలోనే కాదు ఎండా కాలమంతా రోళ్లు పగిలేలా ప్రతాపం చూపించనున్నాయి. వడగాడ్పులు విజృంభించనున్నాయి. మొత్తం గా ఈ వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మేనేజ్‌మెంట్ సంస్థలు హెచ్చరించాయి. ఈ ఏడాది జనవరిలో ఉష్ణోగ్రతలు గత 116 ఏళ్లలో జనవరి అత్యధిక ఉష్ణోగ్రతల్లో ఎనిమిదో స్థానంలో నిలిచాయని వెల్లడించాయి. తెలంగాణ, ఏపీలతో పాటు మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో కొంత ఎక్కువగా.. గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదుకావొచ్చని హెచ్చరించాయి.