high temperature
-
చలికాలంలో చిటపటలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శీతాకాలం ప్రారంభం వేళ విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొన్నది. చలి పెరగాల్సిన సమయంలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. చలికాలంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టాల్సి ఉండగా.. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. దాదాపు వారం రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నది. ప్రస్తుత సీజన్లో నమోదు కావాల్సిన దాని కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ మేర అధికంగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం, వేగంగా వీస్తున్న గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.గురువారం రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదయ్యాయి. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 4 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదైంది. మెదక్, నిజామాబాద్‌లో 3 డిగ్రీలు, హైదరాబాద్, అదిలాబాద్, భద్రాచలంలో 2 డిగ్రీలు, వరంగల్, హన్మకొండలో ఒక డిగ్రీ సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైంది. గురువారం గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 34.5 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 16 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. సాధారణంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు శీతాకాలం ఉంటుంది.వాతావరణంలో మార్పులతో..సాధారణంగా సీజన్ మారుతున్న సమయంలో వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రస్తుతం ఈశాన్య రుతుపవన కాలం మధ్యస్థానికి చేరుకుంది. రుతుపవనాల ప్రభావంతో ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం, దీనికి తోడు సీజనల్ యాక్టివిటీస్‌తో వాయు కాలుష్యం ఒక్కసారిగా పెరగడంతో ఆ ప్రభావం ఉష్ణోగ్రతలపై పడినట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అందువల్లనే గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలిపారు. కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణానికి కాస్త అటుఇటుగా నమోదవుతున్నాయి.ఈ ప్రభావం మరో వారం రోజులపాటు ఉండొచ్చని అధికారులు అంటున్నారు. నవంబర్ నెలాఖరు నుంచి ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గుముఖం పడతాయి. దీంతో చలి తీవ్రత కూడా పెరుగుతుంది. ఈ ఏడాది చలికాలంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే ఉంటాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. డిసెంబర్ నెలాఖరు నాటికి ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గిపోతాయని, ఆ సమయంలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత అధికంగా ఉంటుందని ఐఎండీ వెల్లడించింది.కాస్త ఎక్కువగానే గరిష్ట ఉష్ణోగ్రతలురాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నాయి. దీనికి తోడు వాయుకాలుష్యం పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణం కంటే కాస్త ఎక్కువగానే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెలాఖరు నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయి. డిసెంబర్ నెలతో పాటు జనవరి నెలాఖరు వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటె తక్కువగా నమోదవుతాయని అంచనాలున్నాయి. – శ్రావణి, వాతావరణ శాఖ అధికారి -
నవంబర్‌లో చలి లేనట్లే!
న్యూఢిల్లీ: సాధారణంగా నవంబర్ మాసం వచి్చందంటే చలికాలం మొదలైనట్లే. చలి గాలులు గిలిగింతలు పెడుతుంటాయి. కానీ, ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర శుక్రవారం చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్‌లో సాధారణం కంటే 1.23 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. అక్టోబర్‌లో సాధారణంగా 25.69 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా, ఈసారి 26.92 డిగ్రీలు నమోదైంది. 1901 తర్వాత అత్యంత వేడి కలిగిన అక్టోబర్‌గా రికార్డుకెక్కింది. నవంబర్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గిపోయే సూచనలు కనిపించడం లేదని మృత్యంజయ్ వివరించారు. చలి పెరగడానికి వీలుగా వాతావరణ పరిస్థితులు లేవని అన్నారు. నవంబర్‌లో చలికి వాయువ్య భారతదేశం నుంచి వీలే గాలులే కీలకమని వివరించారు. అక్కడ రుతుపవనాల ప్రభావం ఇంకా ఉండడంతో గాలులు వీచడం లేదని తెలియజేశారు. వాయువ్య భాగంలో మరో రెండు వారాలపాటు ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని చెప్పారు. రెండు వారాల తర్వాత మాత్రమే ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి రావడానికి అవకాశం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. నవంబర్‌లో కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, కర్ణాటక, తమిళనాడులో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని తెలిపారు. వాస్తవానికి వాతావరణ విభాగం దృష్టిలో నవంబర్ నెల చలి మాసం కాదు. జనవరి, ఫిబ్రవరి మాత్రమే చలి మాసాలు. -
మండే ఎండలు X మధుమేహం!
సాక్షి, హైదరాబాద్: ఎండలు మండిపోతున్నాయి. 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం ఇంట్లోంచి బయటికి రావడానికి జంకుతున్నారు. ఇళ్లలో ఉన్నా వేడి తీవ్రతను తట్టుకోలేక అల్లాడుతున్నారు. సాధారణ వ్యక్తులకే ఇంత ఇబ్బంది ఉంటే.. మధుమేహ బాధితులకు మరిన్ని సమస్యలకు కారణమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.వారికి సాధారణ ఆరోగ్య సమస్యలతోపాటు కిడ్నీ, గుండె సంబంధ వ్యాధుల ఇబ్బంది పెరుగుతుందని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సాధారణంగానే మధుమేహం ఉన్నవారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని.. వారికి వైరల్, ఇతర ఉష్ణమండల వ్యాధులు త్వరగా సంక్రమించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే మధుమేహులు డీహైడ్రేషన్‌కు ఎక్కువగా గురవుతారని అంటున్నారు. ఎన్నో సమస్యలకు చాన్స్.. ∗ వైద్య నిపుణులు చెప్తున్న మేరకు.. సాధారణ వ్యక్తులతో పోలిస్తే మధుమేహ బాధితులకు అధిక ఉష్ణోగ్రతల వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది. శరీరంలో నీటి శాతం తగ్గి, మూత్ర విసర్జన తగ్గుతుంది. తల తిరగడం, తలనొప్పి, నోరు, కళ్లు పొడిబారడం వంటివి ఉంటాయి. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఇవన్నీ కిడ్నీలు, గుండె సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. ∗డయాబెటిస్ బాధితులు కాస్త ఎక్కువగా, కనీసం రోజుకు 4 నుంచి ఐదు లీటర్ల నీటిని తీసుకోవాలి. కూల్‌డ్రింక్స్, రోడ్లపై దొరికే చల్లటి పానీయాలకు దూరంగా ఉండటం మంచిది. ∗రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండేలా తృణధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. సాధారణ అన్నం, టిఫిన్లు, మైదాతో కూడిన తినుబండారాలను బాగా తగ్గించాలి. ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి. ∗వదులుగా ఉన్న దుస్తులు ధరించాలి. ఎండ వేళల్లో బయటికి వెళ్లొద్దు. ∗ఆల్కాహాలిక్ పానీయాలకు దూరంగా ఉండాలి. ఆల్కహాల్ వల్ల మూత్ర విసర్జన ఎక్కువవుతుంది. శరీరంలోని నీటి శాతం వేగంగా తగ్గి, డీహైడ్రేషన్‌కు, కిడ్నీల సమస్యకు దారితీస్తుంది. ∗అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో.. చురుకుగా ఉండటానికి తేలికపాటి వ్యాయామాలు తప్పనిసరి. చల్లని ప్రదేశాలలో, ఇంటి లోపల ఈ వ్యాయామాలు చేయాలి. -
వచ్చే నెలలో 50 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో అసాధారణ ఉష్ణోగ్రతలు అరుదుగా నమోదవుతున్నాయి. వేసవిలో రికార్డయ్యే ఈ ఉష్ణోగ్రతలు ఒకింత ఆశ్చర్యం గొలుపుతున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఏప్రిల్ ఆరంభంలోనే మే నెలను తలపించే వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. మే నెలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గడచిన 132 ఏళ్లలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గణాంకాలను పరిశీలిస్తే.. మన రాష్ట్రంలో నమోదైన గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 1875లో ఐఎండీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో రికార్డయిన ఉష్ణోగ్రతలను గమనిస్తే.. 2003 మే 28న రెంటచింతలలో (ప్రస్తుత పల్నాడు జిల్లా) అత్యధికంగా 49.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఇదే రికార్డు. ఆ తర్వాత స్థానంలో ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నిలిచింది. అక్కడ 1962 మే 26న 48.9 డిగ్రీలు నమోదైంది. గన్నవరంలో 2002 మే 11న 48.8, నంద్యాలలో 1994 మే 11న 48.2, మచిలీపట్నంలో 1906 మే 25న 47.8, తునిలో 1998 మే 30న 47.5, విజయవాడలో 1980 మే 26న 47.5, ఒంగోలులో 2003 మే 31న 47.4, నరసారావుపేటలో 1983 మే 2,3 తేదీల్లో 47, నెల్లూరులో 1892 మే 15న, 1894 జూన్ 1న 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఇలా.. ఏప్రిల్ నెలలోనూ అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులున్నాయి. గడచిన పదేళ్లలో (ఏప్రిల్‌లో) 2016 ఏప్రిల్ 25న తిరుపతిలో నమోదైన 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతే అత్యధికం. ఈ రికార్డును ఆదివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో నమోదైన 46 డిగ్రీల ఉష్ణోగ్రత చెరిపేసింది. ఇంకా ఆదివారం నంద్యాల జిల్లా చాగలమర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్‌లో ఎల్‌నినో వంటి ప్రత్యేక పరిస్థితుల్లో అసాధారణ ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా ‘సాక్షి’కి చెప్పారు. -
ఉక్కపోత పెరుగుతోంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలకు సమాంతరంగా రాత్రి ఉష్ణోగ్రతలు సైతం అదేస్థాయిలో పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వేగంగా నపమోదవుతోంది. శుక్రవారం రాష్ట్రంలోని గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ... గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 38.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 16.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శుక్రవారం రాష్ట్రంలోని చాలాచోట్ల గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. మెదక్‌లో సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు కాగా... ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో 2 డిగ్రీల సెల్సియస్, మిగతా చోట్ల ఒక డిగ్రీ సెల్సియస్ చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో తేమశాతం తగ్గడంతో ఉక్కపోత కూడా పెరుగుతోంది. -
తెలుగు రాష్ట్రాల్లో ఇంకా శాంతించని భానుడు
-
అధిక ఉష్ణోగ్రత.. ఆపై ఉక్కపోత
సాక్షి, హైదరాబాద్: ఎండ తీవ్రత మరింత పెరిగింది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత రెండ్రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త ఎక్కువగానే నమోదవుతుండగా... రానున్న వారం రోజుల పాటు వాతావరణం ఇదే తరహాలో ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శనివారం రాష్ట్రంలో దాదాపు 50కి పైగా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ప్రణాళికా విభాగం గణాంకాలు చెబుతున్నాయి. రానున్న వారం రోజులూ అధిక ఉష్ణోగ్రతతో పాటు ఉక్కపోత తీవ్రంకానుంది. వాయవ్యదశ నుంచి వడగాల్పులు మరోవైపు రాష్ట్రానికి వాయవ్య దిశ నుంచి వడగాల్పులు కూడా వీస్తుండటంతో పిల్లలు, వృద్ధులు ఎండ సమయంలో బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వానలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీ సెల్సియస్ మధ్యన నమోదయ్యే అవకాశం ఉంది. -
ఎండ ప్రచండమే
సాక్షి, విశాఖపట్నం: భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వేడి వార్త మోసుకొచ్చింది. మే నెలలో తీవ్రమైన వేడిని వెదజల్లే వాతావరణం నెలకొంటుందని బాంబు పేల్చింది. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులు కూడా ఎక్కువగానే ఉంటాయని వెల్లడించింది. సాధారణంగా వేసవి మొత్తమ్మీద మే నెలలోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ.. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఎండలు మండిపోయాయి. మే నెలను తలపించే ఎండలు, వడగాడ్పులు రాష్ట్రంలో అనేకచోట్ల కొనసాగాయి. వివిధ ప్రాంతాల్లో గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదయ్యాయి. దీంతో మే నెలలో వేసవి తాపం ఎలా ఉండబోతోందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. అందుకు అనుగుణంగానే మే నెలలో ఎండలు, వడగాడ్పులు తీవ్ర ప్రభావం చూపుతాయని ఐఎండీ వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన మే నెల ముందస్తు అంచనాల నివేదికలో బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. సాధారణంగా మే నెలలో ఆరేడు రోజుల పాటు వడగాడ్పులు వీస్తాయి. అయితే ఐఎండీ అంచనాలను బట్టి ఈసారి మరో ఆరేడు రోజులు అధికంగా వడగాడ్పులు/తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.సెల్లా తెలిపారు. కోస్తాంధ్ర కుతకుత ఐఎండీ అంచనాల ప్రకారం మే నెలలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్రలో ఉష్ణతీవ్రతతో పాటు వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉండనుంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంత జిల్లాల్లో ఉష్ణతాపం కొనసాగుతుంది. అయితే, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలతో పోల్చుకుంటే రాయలసీమలో వేసవి తీవ్రత ఒకింత తక్కువగా ఉంటుందని అంచనా వేసింది. ఫలితంగా సీమ ప్రాంతానికి ఉపశమనం కలగనుంది. మరోవైపు మే నెలలో రాష్ట్రంలో రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే తక్కువగా నమోదు కానున్నాయి. దీని ఫలితంగా పగలంతా సెగలు పుట్టించినా రాత్రి వేళ మాత్రం కాస్త వాతావరణం ఊరట కలిగించనుంది. ఈదురు గాలులు, పిడుగుల ప్రతాపం! కాగా, మే నెలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు సైతం కురవనున్నాయి. అదే సమయంలో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉంది. అయితే, రాష్ట్రంలో మే నెలలో కురిసే సాధారణ వర్షపాతం కంటే కాస్త తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఉష్ణతీవ్రత, వడగాడ్పులు, ఈదురుగాలులు, పిడుగులు సంభవించే వాతావరణం నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, అమరావతి: ఈ వేసవిలో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించినందున.. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశించింది. మంగళవారం తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో సంస్థ ఎండీ అంబేడ్కర్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. 2020వ సంవత్సరం నుంచి రాష్ట్రంలో వడగాడ్పుల మరణాలు లేవని.. ఈ ఏడాది కూడా అదే విధంగా చర్యలు తీసుకోవాలని, జిల్లా, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. వడగాడ్పుల తీవ్రత ఆధారంగా పాఠశాలల సమయాలను మార్చాలని ఆదేశించారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విభాగాన్ని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చదవండి: ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్.. -
COP27: 2015–2022.. ఎనిమిదేళ్లు అత్యంత వేడి
న్యూఢిల్లీ: పారిశ్రామిక విప్లవం (1850–1900) కంటే ముందునాటి సగటు ఉష్ణోగ్రత కంటే 2022లో అంతర్జాతీయంగా ఉష్ణోగ్రత 1.15 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉండనుందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) వెల్లడించింది. ఫలితంగా 2015 నుంచి 2022 దాకా.. ఎనిమిదేళ్లు ‘అత్యంత వేడి’ సంవత్సరాలుగా రికార్డుకెక్కుతాయని తెలియజేసింది. ఈజిప్ట్‌లో జరుగుతున్న కాప్–27 సదస్సు సందర్భంగా ఆదివారం ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. 1993 నుంచి ఇప్పటిదాకా సముద్ర నీటి మట్టం రేటు రెండింతలు పెరిగిందని వెల్లడించింది. 2022 సంవత్సరం ఐదు లేదా ఆరో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులో చేరుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ వివరించింది. -
మండే ఎండలు తగ్గాలంటే... మైండ్‌సెట్ మారాలి!
రోహిణి కార్తెలో రోళ్లు బద్దల వుతాయి అనేవాళ్లు. కానీ గడచిన కొన్ని సంవత్సరాలుగా ఆ సమయం రాగానే ఓ తుపాను, అడపాదడపా వర్షాలు వచ్చి ఎండలు మరీ మండకుండానే వేసవి ముగుస్తున్నది. అలాగని అంతటా అదే పరిస్థితి మాత్రం లేదు. ఉత్తరంగా పోయినకొద్దీ ఎండల తాకిడి మరీ దుర్భరంగా ఉంటున్నది. ఈసారి మే మొదటి వారం ముగియక ముందే దేశంలో హీట్ వేవ్ మొదలయింది అన్నారు. మార్చ్–ఏప్రిల్ మాసాలలో కూడా మామూలు కన్నా ఎక్కువ వేడిమి సాగింది. ఉత్తర భారతంలో 46 డిగ్రీలు సెల్సియస్ మామూలయింది. ఇక పాకిస్తాన్లో 49 డిగ్రీల వేడి కనిపిస్తోంది. ‘వర్షాలకు ముందు ఇటువంటి ఎండలు కొత్తేమీ కాదు. అయితే ఈసారి తీవ్రత... అనుకున్న సమయానికి ముందే మొదలయింది. వ్యవసాయం జరుగుతున్నది. బడులు, కాలేజీలకు సెలవులు ఇవ్వలేదు. ఇక ఎక్కువమంది ఎండకు గురవుతున్నారంటే ఆశ్చర్యం లేద’ంటున్నారు ప్రపంచ వనరుల సంస్థలో వాతావరణ కార్యక్రమం డైరెక్టర్ ఉల్కా కేల్కర్. రుతుపవనాలు కూడా ఈసారి త్వరగా వస్తాయంటున్నారు మరోవైపున. ప్రతి సంవత్సరం ఉత్తర భారతదేశంలో, మన దగ్గర కొన్ని ప్రాంతాలలో 40 డిగ్రీలు దాటిన వేడిమి మామూలుగా అలవాటయింది. అంతటి వేడికి మానవ శరీరం తట్టుకోజాలదు. కండరాల సమస్యలు మొదలవుతాయి. అలసట, తల తిప్పటం, చివరికి గుండెపోట్లు కూడా రావచ్చు. హాయిగా ఎయిర్ కండిషనర్లు, కూలర్ల ముందు బతికే వారికి పరిస్థితి అర్థం కాదు. బతుకుతెరువు పేరున ఎండనబడి పనిచేసే కష్టజీవుల స్థితి అధ్వాన్నం అవుతుంది. అయినా వాళ్లు అలవాటుగా పనిచేస్తూనే ఉండటం ఆశ్చర్యం. వాతావరణం రానురానూ మారుతున్నది అన్న సంగతి అందరికీ అర్థమయింది. రానురానూ మరింత వేడి పెరుగుతుంది. అందరూ ఒంటినిండా కప్పుకుని అరబ్ దేశాల వారివలె తిరిగే పరిస్థితి వస్తుంది. ఎండ తాకిడికి గురవుతున్న వారి సంఖ్య దేశంలో ఇప్పటికే బిలియన్‌ను దాటిందని పరిశోధకులు చెబుతున్నారు. ఎండ కారణంగా పంటలు, ముఖ్యంగా గోధుమ పంట దెబ్బతింటుంది అంటున్నారు. ముంబయి వంటి చోట్ల పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. అక్కడ గాలిలో తేమ మరీ ఎక్కువ. వేడిమి 32 డిగ్రీలే ఉన్నప్పటికీ 38 దాటినట్లు ఉడికిపోతుంది. దానివల్ల అలసట, అనారోగ్యం ఎక్కువవుతాయి అంటారు ఐఐటీ పరిశోధకురాలు అర్పితా మొండల్. మొత్తానికి దేశంలో ఎండలు మండే దినాల సంఖ్య పెరుగుతున్నది. 2011 నుంచి 2020 మధ్యన ఇటువంటి దినాలు 600 అని లెక్క తేలింది. 1981–1990లలో ఆ సంఖ్య కేవలం 413 మాత్రమే. మార్చి నుంచి జూన్ మధ్యన ఇటువంటి వేడి రోజులు ఎదురవుతాయి. కానీ మారుతున్న పరిస్థితులలో వాటి తీవ్రత పెరుగుతున్నది అంటారు ఎన్ఆర్డీసీ నిపుణురాలు కిమ్ నోల్టన్. భవన నిర్మాణం, వ్యవసాయం, మరిన్ని రకాల రంగాల మీద ఈ ప్రభావం తీవ్రంగా పడింది. ఎండలు పెరుగుతున్నందుకు ఇప్పుడు ఏదో చేయడం అర్థం లేని పని. మొత్తం దక్షిణాసియాలోనే దీర్ఘకాలిక పథకాలు అమలు చేయాలి. ముందుగా ప్రజలకు ఈ విషయంపై అవగాహన కలుగజేయాలి. ఎండ తీరును ముందే అంచనాలు వేసే పద్ధతులు అమలులోకి రావాలి. అందరికీ ఆరోగ్య రక్షణ, కాస్తంత నీడ, తాగునీరు అందాలి. పల్లె ప్రాంతాలలో పశువుల విషయంగా తగు జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లు ముందే చేయాలి అంటారు ఉల్కా కేల్కర్. (చదవండి: విపత్తులు సరే... నివారణ ఎలా?) నగరాల పెరుగుదల తీరును గట్టిగా పట్టించు కోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలాశయాలు తరిగిపోవడం, నిర్మాణాల పేరున అడవుల వినాశనం తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తాయి. ఏసీల పేరున విద్యుత్తు డిమాండ్ పెరగడం మరొక సమస్య. ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకం వేపు చూపు మరలించాలి. అంతా కలసి పెద్ద ఎత్తున ప్రణాళికలు వేయడంతో ఏదీ జరగదు. ‘నా పని నేను చేసుకుంటాను, నా బతుకు నేను బతుకుతాను’ అనే మనస్తత్వం మారాలి. అందరి కోసం ఆలోచించే తీరు రావాలి. (చదవండి: ఇప్పటికీ నేర్వని ఆహార పాఠాలు) - కె.బి. గోపాలం రచయిత, అనువాదకుడు -
పౌల్ట్రీలకు వడదెబ్బ.. గుడ్లు తేలేస్తున్న కోళ్లు
మండపేట(కోనసీమ జిల్లా): మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన తయారైంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కోళ్ల రైతుల పరిస్థితి. ఎగుమతులకు ఇతర రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న పోటీ, పెరిగిన మేత ధరలతో కుదేలైన కోళ్ల పరిశ్రమను మండుతున్న ఎండలు మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. వేడిగాలులకు తాళలేక రోజుకు దాదాపు లక్ష కోళ్లు మృత్యువాత పడుతుండగా, 15 శాతం మేర గుడ్ల ఉత్పత్తి పడిపోయింది. ఆయా కారణాలతో పరిశ్రమకు రోజుకు రూ.2.02 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. చదవండి: ప్రమాదాలకు చెక్.. వాటేన్ ఐడియా.. డ్రైవర్ రాజా..! నష్టాల మోత తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని పౌల్ట్రీల్లో గుడ్లు పెట్టే కోళ్లు 1.4 కోట్ల వరకూ ఉండగా, మిగిలిన దశల్లోని కోళ్లు 1.2 కోట్ల వరకూ ఉన్నాయి, సాధారణ పరిస్థితుల్లో రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 23 వేల నుంచి 25 వేల వరకూ కోళ్లు చనిపోతుంటాయి. ఆరోగ్యంగా ఉన్న కోళ్లు 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత తట్టుకుంటాయి. అధిక ఉష్ణోగ్రతలకు వేడిగాలులు తోడవడంతో కోళ్ల మరణాలు పెరగడంతో పాటు గుడ్లు ఉత్పత్తి తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక ఎండలతో కోళ్ల మరణాలు మూడు రెట్లు పెరిగినట్టు పౌల్ట్రీ వర్గాలు అంటున్నాయి. జిల్లాలో ప్రస్తుతం రోజుకు 93.5 లక్షల గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయని రైతులు అంటున్నారు. ఆయా దశల కోళ్లను బట్టి ఒక కోడి చనిపోవడం వలన సగటున సుమారు రూ.150 మేర నష్టపోవాల్సి వస్తోంది. ఈ మేరకు కోళ్ల మరణాల రూపంలో రూ.1.5 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం నెక్ ప్రకటిత రైతు ధర రూ.3.15 ప్రకారం చూస్తే.. 16.5 లక్షల గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడం వలన రైతులు రూ.51.98 లక్షల మేర నష్టపోవాల్సి వస్తోంది. కోళ్ల మరణాలు, గుడ్లు డ్రాపింగ్ రూపాల్లో మూడు జిల్లాల్లోని పౌల్ట్రీ పరిశ్రమకు రోజుకు రూ. 2.02 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. నిర్వహణ తడిసి మోపెడు.. అధిక ఉష్ణోగ్రతల నుంచి కోళ్లను కాపాడుకునేందుకు ప్రత్యేక సంరక్షణ చర్యలతో నిర్వహణ భారం తడిసి మోపెడవుతోందని రైతులంటున్నారు. వడదెబ్బకు గురి కాకుండా వాటికి ప్రత్యేక మందులు ఇవ్వడం, కోళ్లకు వేడిగాలులు తగలకుండా షెడ్లు చుట్టూ గోనె సంచులు కట్టి, వాటరింగ్ చేయడం, స్ప్రింక్లర్ల ఏర్పాటు తదితర జాగ్రత్తలతో నిర్వహణ భారం పెరిగిపోతోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఎదురవుతున్న పోటీతో జిల్లా ఎగుమతులకు డిమాండ్ పడిపోయింది. మరోపక్క మేత ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గుడ్డు ధర గిట్టుబాటు కాక ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో అధిక ఎండలతో గుడ్ల డ్రాపింగ్, కోళ్ల మరణాలు పరిశ్రమను మరింత నష్టాల పాలు చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్షోభంలో కూరుకుపోతోంది.. ఎండల తీవ్రత పెరిగిపోవడంతో కోళ్ల మరణాలు నాలుగు రెట్లు పెరిగిపోయాయి. 15 శాతం మేర గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ఆయా కారణాలతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. వడ్డీ రాయితీ, ఎఫ్‌సీఐ నుంచి సబ్సిడీపై మేతలు అందించి పరిశ్రమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – కర్రి వెంకట ముకుందరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ పౌల్ట్రీ అసోసియేషన్, కొమరిపాలెం ప్రభుత్వం గట్టెక్కించాలి ఇటీవల ఒడిశాలో ఏపీ గుడ్ల ఎగుమతులను అక్కడి ట్రేడర్స్ అడ్డుకున్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ తీసుకున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. అదే విధంగా ప్రస్తుత సంక్షోభం నుంచి పరిశ్రమ గట్టెక్కేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. -పడాల సుబ్బారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పౌల్ట్రీ ఫెడరేషన్, అర్తమూరు -
నిప్పుల కొలిమిలా రెంటచింతల@ 44.7 డిగ్రీలు!
నాడు గుంటూరు పరగణాలో ఎండుమిరప ఘాటునైనా, మండుటెండ ధాటినైనా తట్టుకొనేంత దిట్టలుండేవారట. అలాంటి దిట్టలకు కూడా ఇవాళ భానుడు ఠారెత్తిస్తున్నాడు. పౌరుషంలోనే కాదు భానుడి ప్రతాపంలోనూ పల్నాడు ఏమాత్రం తగ్గడం లేదు. ఉష్ణోగ్రతల రికార్డును మరొకరు బద్దలు కొట్టలేనంతగా ఈసారి రెంటచింతల 45.2 డిగ్రీలు దాటిపోయింది. భరణి కార్తె ఆరంభమే కాలేదు (రేపటి నుంచి), కృత్తిక రావడానికి ఇంకా 16 రోజుల గడువు ఉన్నా (వచ్చేనెల 11న) ఇప్పుడే ఎండలు బెంబేలెత్తిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రెంటచింతల(పల్నాడు): రెంటచింతల మంటచింతలగా మారిపోతోంది. భానుడి ఉగ్రరూపంతో ఈ ప్రాంతం నిప్పుల కొలిమిలా మారడంతో గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. ఆదివారం గ్రామంలో గరిష్ట ఉష్ణోగ్రత 45.2 కనిష్ట ఉష్ణోగ్రత 30.5 డిగ్రీలుగా నమోదైంది. ఉదయం 10 గంటల నుంచే ఎండకు వడగాడ్పులు తోడవడం.. భూమి నుంచి సెగ మండల వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంట్లోంచి బయటకు రాలేక.. ఉక్కపోతకు తట్టకోలేకపోతున్నట్లు వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలింతలు, చిన్నారులు, గర్భిణుల అవస్థలు అన్నిఇన్నీ కావు. ఎండతీవ్రత నుంచి కొబ్బరిబోండాలు, చెరుకురసం, శీతల పానియాలతో కొంత వరకు గ్రామ ప్రజలు ఉపశమనం పొందుతుంటే మేతకు (పశుగ్రాసం) కోసం పొలం వెళ్లిన గేదలు ఎండ తీవ్రత తట్టుకోలేక కుంటలలో, పారుతున్న వాగులలో పడుకుని సేదతీరుతున్నాయి. గతంలో రెంటచింతల గ్రామంలో 49 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన సంఘటనలు ఉన్నాయి. 1920లోనే ఉష్ణోగ్రత నమోదు కేంద్రం ఎండలకు రెంటచింతల ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఎండాకాలం ఆరంభం కాగానే రాష్ట్రంలోని అందరి దృష్టి దీనిపైనే ఉంటుంది. బ్రిటీష్ పాలకులు సైతం ఈ విషయాన్ని గమనించి రెంటచింతలలోని ఏఎల్సీకి చెందిన కాంపౌండ్‌లో ఉష్ణోగ్రత నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవి అంటే పెద్దలకు వణుకే ప్రతి ఏటా వేసవి కాలం వచ్చిందంటే ఈ ప్రాంతంలోని వృద్ధులు భయందోళనకు గురౌతుంటారు. ఈ ప్రాంతంలోని భూమిలో నాపరాయి నిక్షేపాలు అత్యధికంగా ఉండటం వలనే మార్చి నుంచి మే నెలవరకు ఎండతీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎండ తీవ్రతకు భయటకు రాలేక.. ఉక్కపోతకు ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చెట్లు నాటే కార్యక్రమాన్ని గ్రామస్తులు విజయవంతం చేసినప్పుడే వాతావరణ సమతూల్యత కారణంగా కొంతవరకు ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. –అల్లం మర్రెడ్డి, మాజీ సర్పంచ్, రెంటచింతల -
మూడ్రోజులు మంటలే..
సాక్షి, హైదరాబాద్: వేసవి ముదరకముందే ఎండలతో తెలంగాణ మండిపోతోంది. సాధారణం కంటే 2,3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ బుధవారం భానుడి భగభగలతో అల్లాడిపోయింది. సాధారణం కంటే 3.5 డిగ్రీలు అధికంగా 40.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్‌లో 42.3డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ, నిజామాబాద్, రామగుండంలలో 41డిగ్రీలు, మహబూబ్‌నగర్, మెదక్‌లలో 40 డిగ్రీలకు పైగా నమోదయ్యింది. కాగా వచ్చే మూడు రోజులు ఉత్తర తెలంగాణా జిల్లాలతో పాటు నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్ తదితర జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా 2 నుండి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని ఉత్తర, వాయువ్య జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నాయని హెచ్చరించింది. మార్చి చివరి వారంలోనే ఈ విధంగా ఎండలు దంచి కొడుతుండటంతో ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎండల తీవ్రతను బట్టి అలర్ట్‌లు వాతావరణ శాఖ ఎండల తీవ్రతను బట్టి ప్రజలను అప్రమత్తం చేస్తుంటుంది. సాధారణం కంటే ఆరు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైతే అత్యంత తీవ్రమైన ఎండగా గుర్తించి రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. నాలుగైదు డిగ్రీల వరకు ఎక్కువగా నమోదైతే తీవ్రమైన ఎండగా గుర్తించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. సాధారణం కంటే కొద్దిగా ఎక్కువగా నమోదైతే గుర్తించి ఎల్లో (హీట్ వేవ్ వార్నింగ్) అలర్ట్ ఇస్తారు. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలున్నప్పుడు వైట్ అలర్ట్ జారీ చేస్తారు. వడదెబ్బతో అనారోగ్యం.. అధిక ఎండలతో పలుచోట్ల కోతకు సిద్ధమైన వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధి కూలీలు ఎండలకు మాడిపోతున్నారు. కాగా బయట తిరిగేవారు, పిల్లలు, వృద్ధులు తీవ్రమైన ఎండలు, వడదెబ్బతో అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు డయేరియా బారిన పడే ప్రమాదముంది. వడదెబ్బ తగిలితే వాంతులు, విరోచనాలయ్యే అవకాశం ఉంది. తలనొప్పి, తల తిరగడం, నీరసం, తీవ్రమైన జ్వరం, అధికనిద్ర, మూర్ఛ, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితికి గురయ్యే ప్రమాదముందని నిజామాబాద్ మెడికల్ కాలేజీ క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ కిరణ్ మాదల చెబుతున్నారు. కెరమెరి@43.9 తిర్యాణి (ఆసిఫాబాద్): రాష్ట్రంలో ఆదిలాబాద్‌లో అత్యధిక ఉష్ణోగ్రత (42.3) నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండల కేంద్రంలో 43.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు సమా చారం అందింది. అదే జిల్లాలోని కౌటాల మండల కేంద్రంలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలుపు కాటన్ దుస్తులు మంచిది ► ఆరుబయట పనిచేసేవారు సూర్యరశ్మి నుంచి కాపాడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. బయ ట తిరిగేవారు గొడుగు వాడాలి. తరచూ నీళ్లు, ఇతర ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. ► తెలుపు లేదా లేత వర్ణం కలిగిన పలుచటి కాటన్ దుస్తులు ధరించాలి. ► తలకు వేడి తగలకుండా టోపీ పెట్టుకోవాలి లేదా రుమాలు చుట్టుకోవాలి. ► ఇంటి వాతావరణం చల్లగా ఉంచుకోవాలి. ఫ్యాను వాడాలి. చల్లని నీటితో స్నానం చేయాలి. ► వేడి లోనికి దిగకుండా ఇంటిపై కప్పులపై వైట్ పెయింట్ వేయించాలి. కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్ వంటివి ఎండ వేడిమిని తగ్గిస్తాయి. పిల్లలు, వృద్ధులపై ఎక్కువ ప్రభావం ► మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 3 గంటల మధ్య బయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనిచేయరాదు. ► నలుపురంగు, మందంగా ఉండే దుస్తులు ధరించరాదు. ► బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగరాదు. వీరిపై ఎండ త్వరగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ► శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ మానుకుంటే మంచిది. అధిక ప్రోటీన్, ఉప్పు, కారం, నూనె ఉండే పదార్థాలను తీసుకోవద్దు. ► ఎక్కువ ప్రకాశించే విద్యుత్ బల్బులను వాడకూడదు. అవి అధిక వేడిని విడుదల చేస్తాయి. ► ఎండలో నుంచి వచ్చిన వెంటనే తేనె వంటి తీపి పదార్థాలు తీసుకోకూడదు. ► శీతల పానీయాలు, ఐస్ వంటివి తీసుకుంటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. వడదెబ్బకు గురైతే.. ► వడదెబ్బ తగిలిన వారిని నీడలో, చల్లని ప్రదేశంలో ఉంచాలి. ► మజ్జిగ, గ్లూకోజు నీరు, చిటికెడు ఉప్పు.. చెంచా చక్కెర ఒక గ్లాసులో కలుపుకొని ఇంటిలోనే తయారుచేసిన ఓఆర్ఎస్ ద్రావణం తాగితే వడదెబ్బ నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. ► శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది కాబట్టి సాధారణ ఉష్ణోగ్రత వచ్చేవరకు తడి గుడ్డతో తుడుస్తూ ఉండాలి. వేడి నీటిలో ముంచిన గుడ్డతో తుడవరాదు. ► ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి. -
వేసవి ఆరంభంలోనే మండుతున్న ఎండలు
-
మండుతున్న ఎండలు.. కారణమిదే!
సాక్షి, అమరావతి: విస్తారంగా వర్షాలు కురవాల్సిన సమయమిది. అందుకు భిన్నంగా వారం రోజుల నుంచి ఎండలు మండుతున్నాయి. వాతావరణం వేసవిని తలపిస్తోంది. నైరుతి రుతు పవనాల ప్రభా వంతో వీచే గాలులు బలహీనపడటం.. నైరుతి, పశ్చిమ దిశగా వీయాల్సిన గాలుల్లో తేమ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్టు వాతావరణ శాఖ చెబుతోంది. సాధారణంగా ఈ సీజన్లో పాకిస్తాన్ వైపు నుంచి వీచే గాలులు బంగాళాఖాతం మీదుగా అరేబియన్ సముద్రం వైపు వెళ్లాలి. ఈ గాలుల్లో తేమ ఎక్కువగా ఉండాలి. అప్పుడే మేఘాలు ఏర్ప డి వర్షాలు కురుస్తాయి. వీటి ప్రభావంతో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడి వర్షాలు కురవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ గాలులు చాలావరకు బంగాళాఖాతాన్ని తాకకుండా నేరుగా అరేబియన్ సముద్రం వైపు వెళ్లిపోతున్నా యి. దీనివల్ల ఆ ప్రాంతంలో అల్పపీడనం, ఉపరిత ల ఆవర్తనం ఏర్పడ్డాయి. మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీ ర్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవడానికి ఈ గాలులే కారణమని వాతావరణ శాఖ చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 36 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గాలిలో తేమ లేకపోవడం వల్ల ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటోంది. కొద్దిగా వీస్తున్న గాలుల ప్రభావంతో అక్కడక్కడా స్వల్ప స్థాయిలో వర్షాలు పడుతున్నా.. మొత్తంగా రాష్ట్రమంతా వేడి వాతావరణం ఉంటోంది. ఈ పరిస్థితి మరో వారం రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ నెల 13వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత పరిస్థితి కొంత మారవచ్చని అంచనా వేస్తోంది. సాధారణం కంటే 2 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు పశ్చిమ, నైరుతి దిశగా వీస్తున్న గాలుల్లో తేమ లేకపోవడం వల్ల రాష్ట్రంలో వేడి వాతావరణం నెలకొంది. గాలులు బలహీనంగా ఉన్నాయి. అందువల్ల రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అన్నిచోట్లా 40 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు ఉండొచ్చు. వారం తర్వాత వాతావరణ పరిస్థితుల్లో మార్పు రావచ్చు. – డాక్టర్ స్టెల్లా, డైరెక్టర్, అమరావతి వాతావరణ కేంద్రం -
కణకణమండే నిప్పుల కొలిమి, భగభగా మండుతున్న నగరాలు
దేశాలు కుతకుతలాడుతున్నాయి. వందల మంది జనం పిట్టల్లా రాలిపోతున్నారు. మన దేశంలో ఢిల్లీ, హరియాణాతోపాటు పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీనంతటికీ కారణం ‘హీట్ డోమ్’లు ఏర్పడటమే. ఉన్నట్టుండి ఈ హీట్ డోమ్‌లు ఏమిటి? ఎందుకు ఇంతగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి? ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది? భవిష్యత్తు అంచనాలేమిటన్న వివరాలు తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ అంటార్కిటికాలోనూ పెరుగుతున్న వేడి మైనస్ ఉష్ణోగ్రతలతో, నిరంతరం మంచుతో కప్పి ఉండే అంటార్కిటికాలోనూ ఈసారి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉత్తర అమెరికా తరహాలోనే అంటార్కిటికా ప్రాంతంలోనూ హీట్ డోమ్ వంటి పరిస్థితులు ఏర్పడ్డాయని.. జూలై 1న ఇక్కడ ఏకంగా 18.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. ఏమిటీ హీట్ డోమ్? ఏదైనా ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి.. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణ పీడనం ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ వేడి ఎటూ విస్తరించలేక అక్కడే కేంద్రీకృతం అవుతుంది. అదే సమయంలో ఎండ కొనసాగుతూ ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగిపోతాయి. దీనినే హీట్ డోమ్ అంటారు. వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల ఇలా హీట్ డోమ్ ఏర్పడుతుంది. ఆయా ప్రాంతాల్లో కొద్ది రోజుల నుంచి ఒక్కోసారి రెండు, మూడు వారాల వరకు కూడా ఇవి కొనసాగుతాయి. కొద్దిరోజులుగా ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల హీట్‌డోమ్ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాతావరణంలో కొద్ది కిలోమీటర్ల ఎత్తున (స్ట్రాటోస్ఫియర్ పొరలో).. భూమి చుట్టూ తిరిగే గాలి ప్రవాహాలు (పవనాలు) ఉంటాయి. భూమ్మీద ఉష్ణోగ్రతలు, ఆయా ప్రాంతాల్లో వేర్వేరు పీడనాలను ఈ పవనాలు సమం చేస్తూ ఉంటాయి. అయితే ఒక్కోసారి ఈ పవనాలు ఏదైనా ఓ ప్రాంతంలో ఆగిపోతాయి. అలా ఆగిపోయిన చోట.. భూఉపరితలానికి ఎగువన వాతావరణ పీడనం పెరిగిపోతుంది. కింద ఉన్న గాలిపై ఒత్తిడి పెరిగి హీట్ డోమ్ ఏర్పడుతుంది. వాతావరణం ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ మేఘాలు కూడా ఏర్పడవు. ఫలితంగా సూర్యరశ్మి నేరుగా పడి.. హీట్‌డోమ్ ఉన్న ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగిపోతాయి. 1. వేడెక్కిన గాలి పైకి వెళ్తుంది 2. అధిక పీడనం ఆ గాలిని కిందికి తోస్తుంది 3. ఈ పరిస్థితి వల్ల మేఘాలు దూరంగా చెల్లాచెదురవుతాయి 4. గాలి ఒత్తిడి పెరిగి, ఎండ నేరుగా పడి ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి ఉత్తర భారతం గరంగరం మన దేశంలో మార్చి నుంచి జూన్ వరకు అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు నమోదవుతాయి. కొన్ని సందర్భాల్లో జూలైలోనూ కొనసాగుతాయి. ఢిల్లీ, ఇతర ఉత్తర భారత రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉంటుంది. ఈసారి అలా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో గురు, శుక్రవారాల్లో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంతో పోలిస్తే ఇది ఏడు డిగ్రీలు ఎక్కువ. ఢిల్లీ, హరియాణా, పరిసర ప్రాంతాల్లో హీట్ డోమ్ ఏర్పడటంతోనే.. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇరవై ఏళ్లలో మరింతగా మంటలు! భారత దేశంలో మరో ఇరవై ఏళ్లలో ఎండల తీవ్రత భారీగా పెరుగుతుందని.. వడగాడ్పులూ దానికి తోడవుతాయని ‘ది ఎకనమిస్ట్’మేగజైన్ వెల్లడించింది. కొన్నేళ్లుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు, ప్రస్తుత పరిస్థితి, వాతావరణ మార్పులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఓ నివేదికను విడుదల చేసింది. 2041 నాటికి దేశంలో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుతుందని పేర్కొంది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 49.3 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ భారత రాష్ట్రాల్లో 50 డిగ్రీలకుపైగా నమోదు కావొచ్చని పేర్కొంది. చెన్నై పరిస్థితి దారుణమవుతుందని, ఎండల తీవ్రతకు వేల మంది చనిపోవచ్చని అంచనా వేసింది. హైదరాబాద్‌లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. అమెరికా, కెనడా ఆగమాగం అమెరికాలోని వాషింగ్టన్, ఒరెగాన్ రాష్ట్రాలు, కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రాంతం కొద్దిరోజులుగా నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నాయి. కెనడా చరిత్రలోనే అత్యధికంగా 49.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటికే వందల మంది చనిపోయారు. వేడికి కార్చిచ్చు చెలరేగి ఇక్కడి లిట్టన్ ప్రాంతం 90 శాతం దహనమైపోయింది. మరోవైపు రష్యా, బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్, గ్రీస్, ఇతర యూరప్ దేశాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. అక్కడి ప్రభుత్వాలు ప్రజల కోసం ప్రత్యేకంగా కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. ♦ఎండల కారణంగా ఏసీలు, ఇతర ఉపకరణా లు, నీటి వినియోగం పెరిగిపోయింది. దీనితో బిల్లులు పెరిగి ఇబ్బంది పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్థిక సాయం చేయాలని అమెరికాలోని న్యూయార్క్ పాలకవర్గం నిర్ణయించింది. ♦గ్రీస్‌లోని ఏథెన్స్, ఇతర పట్టణాల్లో ఎండ తీవ్రత, దగ్గర్లోని కూలింగ్ సెంటర్లను సూచించేందుకు యాప్స్ వినియోగిస్తున్నారు. ♦ఇజ్రాయెల్ బహిరంగ ప్రదేశాలు, వాక్ వే లలో నీడ కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం డిజైన్లు పంపాలని పోటీలు నిర్వహిస్తోంది. అంటార్కిటికాలోనూ పెరుగుతున్న వేడి మైనస్ ఉష్ణోగ్రతలతో, నిరంతరం మంచుతో కప్పి ఉండే అంటార్కిటికాలోనూ ఈసారి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉత్తర అమెరికా తరహాలోనే అంటార్కిటికా ప్రాంతంలోనూ హీట్ డోమ్ వంటి పరిస్థితులు ఏర్పడ్డాయని.. జూలై 1న ఇక్కడ ఏకంగా 18.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. -
సమ్మర్ ఎఫెక్ట్: కరెంట్ మోత.. బిల్లుల వాత!
సాక్షి, సిటీబ్యూరో: ఎండలు భగ్గుమంటున్నాయి. గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు సగటున40 డిగ్రీలు దాటుతున్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం నగరవాసులు ఏసీలు, కూలర్లు వినియోగిస్తున్నారు. ఫలితంగా ఇంట్లో కరెంట్ మోత మోగుతోంది. సాధారణంగా ఫిబ్రవరి వరకు నెలకు 150 యూనిట్లలోపు వాడే వినియోగదారులు ప్రస్తుతం 250– 300 యూనిట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా మీటరు గిర్రున తిరిగి.. స్లాబ్‌రేట్ మారి నెలసరి విద్యుత్ బిల్లులు అమాంతం పెరిగిపోయాయి. ఇటీవల వినియోగదారుల చేతికందిన మార్చి నెల బిల్లులే ఇందుకు నిదర్శనం. భారీగా పెరిగిన బిల్లులతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. అసలే కరోనా కాలం.. ఆపై ఉపాధి అవకాశాలు కోల్పోయి రోడ్డున పడ్డ సగటు జీవులకు ఇవి మరింత భారంగా మారుతున్నాయి. రాత్రి వేళల్లోనూ రికార్డు స్థాయిలో.. ►నగరంలో 50 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లున్నాయి. గత మార్చి వరకు రోజూ పగటిపూట పీక్ అవర్‌లో కరెంట్ డిమాండ్ 2500 నుంచి 2700 మెగావాట్లకు మించలేదు. తాజాగా ఇది 2900 నుంచి 3000 మెగావాట్లు నమోదవుతోంది. రాత్రి వేళల్లోనూ రికార్డు స్థాయిలో డిమాండ్ నమోదవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలితంగా విద్యుత్ సబ్స్టేషన్లు, ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లపై ఒత్తిడి పెరుగుతోంది. ►సామర్థ్యానికి మించి డిమాండ్ నమోదవుతుండటంతో విద్యుత్ ఫీడర్లు తరచూ ట్రిప్పవుతున్నాయి. కరెంట్ సరఫరా నిలిచిపోతోంది. ఎప్పకప్పుడు డీటీఆర్లను పెంచకపోవడం, లూజ్లైన్లను సరిచేయక పోవడమే ఇందుకు కారణం. వేసవిలో తలెత్తే సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు పీక్ అవర్‌లోనూ ఇంజినీర్లు వినియోగదారులకు అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. -
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు
-
అత్యంత వేడి మాసం జూలై
వాషింగ్టన్: భూ గ్రహ చరిత్రలోనే ఈ ఏడాది జూలై నెల అత్యంత వేడి మాసంగా నమోదైంది. ఈ విషయాన్ని గతంలోనే యూరోపియన్ యూనియన్ వెల్లడించగా, తాజాగా అమెరికా జాతీయ వాతావరణ, సముద్ర పరిశీలన సంస్థ (ఎన్వోఏఏ) కూడా గురువారం ధ్రువీకరించింది. ‘ప్రపంచంలోని అనేక చోట్ల జూలై నెలలో ఎన్నడూ లేనంత వేడిగా వాతావరణం ఉంది. భూ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెల 2019 జూలై. ఈ వేడిమి కారణంగా ఆర్కిటిక్, అంటార్కిటిక్ సముద్రాల్లోనూ మంచు భారీగా కరిగింది’ అని ఎన్వోఏఏ తెలిపింది. ఆ వివరాల ప్రకారం, 20వ శతాబ్దంలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 15.8 డిగ్రీ సెల్సియస్ కాగా, తాజాగా ఈ జూలైలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 16.75 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. 2016 జూలై రెండో ఇప్పుడు ప్రపంచంలో రెండో అత్యంత వేడి మాసంగా ఉంది. పది అత్యంత వేడి జూలై మాసాల్లో తొమ్మిది 2005 తర్వాతనే నమోదవడం గమనార్హం. ఇక ఆర్కిటిక్ సముద్రంలో మంచు సాధారణంగా జూలై నెలలో ఉండే సగటు కన్నా ఈ ఏడాది జూలై నెలలో 19.8 శాతం తక్కువగా ఉంది. అంటార్కిటికాలోనూ సగటు కన్నా 4.3 శాతం తక్కువ మంచు ఉంది. -
గిర్రా.. గిర్రా.. గిర్రా..తిరుగుతోంది మీటర్
సాక్షి, విజయనగరం : వేసవి ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం 9 గంటల తర్వాత కాలు బయటపెట్టేందుకు వెనుకాడే పరిస్థితి. పగలూ, రాత్రీ తేడా లేకుండా ఉక్కపోత, వడగాల్పులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వీటి నుంచి ఉపశమనం కోసం ప్రజలు కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం రోహిణీ కార్తె ముగిసి మృగశిర కార్తె ప్రారంభమైనా ఉక్కపోత కొనసాగుతుండడంతో విద్యుత్ వినియోగం అదే స్థాయిలో పెరుగుతోంది. మీటర్ గిరాగిరా తిరుగుతోంది. విద్యుత్ బిల్లులు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. జిల్లాలో విద్యుత్ డిమాండ్ రికార్డుస్థాయిలో పెరుగుతోంది. గడిచిన మూడు నెలల వ్యవధిలో సుమారు 10 లక్షల యూనిట్ల వ్యత్యాసం కనిపిస్తోంది. ఫిబ్రవరి నెల మొదటి వారంలో జిల్లా వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులు 6.5 మిలియన్ యూనిట్లు (65 లక్షల యూనిట్లు) విద్యుత్‌ను గరిష్టంగా వినియోగించగా.. ప్రస్తుత పరిస్థితులు ఆ వినియోగం 7.8 మిలియన్ యూనిట్లు (78 లక్షల యూనిట్లకు) పెరిగిపోయింది. మే నెలలో పరిశీలిస్తే సగటున 7.5 మిలియన్ యూనిట్లు (75 లక్షల యూనిట్లు) విద్యుత్ వినియోగమైనట్టు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 7 లక్షల 22వేల 229 విద్యుత్ కనెక్షన్లు ఉండగా అందులో చీపురుపల్లి ఆర్ఈసీఎస్ పరిధిలో 61వేల 281 విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. మొత్తం సర్వీసుల్లో ఎల్టీ, హెచ్‌టీ, కమర్షియల్ సర్వీసులు ఈ ఏడాది గణనీయంగా విద్యుత్ వినియోగం పెరిగింది. గతేడాది సగటును రోజుకు 6 ఎంయూ (60 లక్షల యూనియట్లు) విద్యుత్‌ను వినియోగించే వారు. అదే వేసవిలో అయితే 6.5 ఎంయూ యూనిట్లు (65 లక్షల యూనిట్ల) వినియోగం జరిగినట్లు అంచనా. ఈ ఏడాది గతం కంటే విద్యుత్ వినియోగం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీనికి వినియోగదారులు సౌకర్యాల్లో శీతలగృహోపకరణాల వినియోగానికి ప్రాధాన్యమివ్వడమే కారణంగా తెలుస్తోంది. మరో వైపు ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలు వాడకం విద్యుత్వినియోగం పెరుగుదలకు ఊతమిస్తున్నట్టు అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఆ సమయంలోనే అధిక వినియోగం... రోజుకో విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో భానుడి ఉగ్రరూపం నుంచి రక్షణ పొందేందుకు ఏసీలు, ఫ్రిజలు, కూలర్లు తదితర శీతల గృహోపకరణ వస్తువులు వినియోగం గణనీయంగా పెరిగింది. అధికారిక లెక్కల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మరల రాత్రి 8 నుంచి 11 గంటల సమయంలో ఎక్కువగా విద్యుత్ వినియోగం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సమయాల్లో ప్రజలు ఇళ్లల్లో ఎక్కువగా ఉంటారు. దీంతో విద్యుత్ వినియోగం అధికంగా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో వినియోగదారులకు అవసరమయ్యే విద్యుత్ కన్నా 10 లక్షల యూనిట్లు తక్కువ కేటాయింపులు ఉన్నా అధికారులు నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. వాస్తవానికి జిల్లాలో విద్యుత్ సరఫరాకు సంబంధించి మాచ్‌ఖండ్, సీలేరు, సింహాచలం, వీటీపీఎస్, కృష్ణపట్నం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి విద్యుత్ కేటాయింపులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయా కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి ఆటంకాలు లేవని, ఈ ఏడాది వేసవిలో నిరంతరాయ సరఫరా ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. వినియోగం గణనీయంగా పెరిగింది.. పరిస్థితుల ప్రభావంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రతీ ఒక్కరు కూలర్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు వినియోగిస్తున్నారు. వినియోగదారులు కోరే డిమాండ్‌ను ఎదుర్కొనగలిగే సామర్థ్యం ఉంది. వినియోగదారులు అవసరంలేని సమయంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించి పొదుపు పాటించాలి. – వై.విష్ణు, ఎస్ఈ, ఏపీఈపీడీసీఎల్ -
పర్యావరణ రక్షణతోటే సుస్థిరాభివృద్ధి
రాబందులను చూపితే లక్షల రూపాయలు నగదు బహుమతి అంటూ బడి పిల్లల పాఠ్యపుస్తకాల్లో ముద్రించుకున్నాం. సీతాకోకచిలుకలు, అరుదైన పక్షి జంతుజాతులు అంతరిస్తున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గిజి గాడు, బట్టమేక పిట్టలను బొమ్మలుగా చూపించాల్సిన స్థితి ఏర్పడింది. మరోవైపు ఏటికేడు విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో మనుషులు పిట్టల్లా రాలుతున్నారు. కరువులు సుపరిచితమైన పశువులకు మేత, రైతుకు తిండి కరువై బ్రతుకే బరువై వలసలు నిత్యకృత్యమయ్యాయి. తినేతిండి, తాగేనీరు, పీల్చేగాలి కలుషితంగా మారాయి. పెరిగిన విజ్ఞానం, సాంకేతికతలతో ప్లాస్టిక్ వ్యర్థాలు మాత్రమేగాక ఎలక్ట్రానిక్ ఇ వ్యర్థాలు సవాలుగా మారాయి. భూమిపై ఉండే 17,70,000 జీవజాతులలో మనిషి దురాశ విశ్వరూపందాల్చి భావితరాలనూ కబ ళించేలా వుంది. మనిషి సృష్టిస్తున్న పర్యావరణ విధ్వంసం ఇలాగే కొనసాగితే 2030–2050 మధ్య ప్రపంచంలో ఏటా కనీసం 2,50,000 మరణాలు సంభవిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చ రిస్తోంది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ కోణాల మధ్య సమతుల్యతతో జరిగే అభివృద్ధినే సుస్థిరాభివృద్ధి అంటాం. భవిష్యత్ తరాల సంక్షేమం దెబ్బతినకుండా ప్రస్తుత తరాల అవసరాలు తీర్చుకోవాలనే మౌలిక సూత్రం ఇందులో ప్రధానంగా ఉంటుంది. సమాజ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ వ్యవస్థలు మూడు పరస్పర ఆధారితాలుగా ఉంటాయని గ్రహిస్తే జీవనవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతలు దెబ్బతినవు. పర్యావరణాన్ని పక్కకు నెట్టి ఎలాగైనా ఆర్థికంగా ముందుకు వెళ్లాలనుకోవడమంటే కూర్చున్న చెట్టుకొమ్మను తానే నరుక్కున్నట్లవుతుంది. ప్రస్తుతం జరుగుతున్నది. సుస్థిరాభివృద్ధేనా? నిజాయితీగా ఆలోచించాలి. ఒక ప్లాస్టిక్ కవరు మట్టిలో కలవటానికి 10 లక్షల ఏళ్లు పడుతుంది. ప్లాస్టిక్‌ను నిత్య జీవి తంలో విపరీతంగా వాడేస్తున్నాము. పెళ్ళిళ్ళు, వేడుకలలో వాడిపాడేస్తున్న ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కవర్లు ఎంత ప్రమాదకరమో ఆలోచించటం లేదు. వాటి ద్వారా రకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మనసుంటే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల నియమావళి 2016 ప్రకారం ప్లాస్టిక్ కవర్లు 50 మైక్రాన్లకంటే ఎక్కువ మందం ఉన్నవే వాడాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలి. వస్తు వినియోగ సంస్కృతి మూలంగా ఇళ్ళలో విపరీతంగా వస్తువులను పోగేసుకుంటున్నాం. ప్రతి వస్తువు తయారయ్యే క్రమంలో ఇంధనం ఖర్చయి, కాలుష్యం పెరుగుతుందని గ్రహించాలి. వాహనాలు, పరిశ్రమలు, అధునాతన సౌకర్యాలనిచ్చే యంత్రాలు హరితగృహ వాయువులను విడుదల చేస్తున్నాయి. ఫలితంగా భూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇదే తీరులో ఉష్ణోగ్రతలు పెరిగితే ఈ శతాబ్దాంతానికి గరిష్టంగా 2.6 నుంచి 4.8 డిగ్రీలు పెరిగే ప్రమాదం ఉంది. అడవులను, సరస్సులను, నదులను, అడవి జంతువులతో పాటు సహజ పర్యావరణాన్ని కాపాడి అభివృద్ధి పరచటం, సమస్థ జీవులపట్ల కరుణ కలిగి వుండటం ప్రతి పౌరుడి యొక్క ప్రాథమిక విధి. మతం, రాజ్యాంగం, మానవత్వం ఏ కోణంలోనూ పర్యావరణ వ్యతిరేక చర్యలు క్షమార్హం కాదు. ప్రజల్లో ఈ రకమైన అవగాహన కల్పించాలి. మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడం ప్రతి మనిషి ప్రాథమిక హక్కు. ఇటువంటి వాతావరణాన్ని కోరుకోవడం ప్రతి జీవజాతి హక్కుగా కూడా ఉంటుంది. అది నేరవేరాలంటే పుడమి తల్లి అందాలు తరిగిపోకుండా చూసుకోవాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాలి. మనిషి అంతా నాదే అనే అత్యాశ వీడి, జీవించు జీవించనివ్వు అనే ఇతర జీవజాతుల విధానాన్ని మనిషి కూడా పాటించాలి. (నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా) చింతలేని యాగంటీశ్వరప్ప, జాతీయ పర్యావరణ కన్వీనర్, జనవిజ్ఞాన వేదిక మొబైల్ : 99598 06652 -
ఎండలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సోమవారం నీరు- ప్రగతి పథకంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. నీరు - ప్రగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఎండలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందన్న ఆయన ఉష్ణోగ్రతలు తగ్గించాలని అధికారులను ఆదేశించారు. మరీ ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గించాలని హుకుం జారీ చేశారు. అయితే చంద్రబాబు ఆదేశాలకు సదరు అధికారులు షాక్‌కు గురయ్యారు. ఎండలను తామెలా తగ్గించాలంటూ సీఎం వ్యాఖ్యలపై అధికారులు విస్మయం చెందారు. -
వచ్చే మూడు రోజులు వడగాడ్పులు
-
3 రోజులు వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. ఇతర ప్రాంతాల్లోనూ తీవ్రమైన ఎండలుంటాయని పేర్కొన్నారు. ఇటీవల వర్షాలు కురవడంతో రెండు మూడు రోజులుగా వాతావరణం చల్లబడింది. అయితే మళ్లీ ఎండలు పుంజుకున్నాయి. ఆదివారం భానుడు విజృంభించాడు. ఆదిలాబాద్‌లో ఏకంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్‌లో 44.5 డిగ్రీలు, మెదక్‌లో 44 డిగ్రీలు, రామగుండంలో 43 డిగ్రీలు రికార్డయ్యాయి. ఖమ్మం, నల్లగొండలలో 42 డిగ్రీల చొప్పున, హైదరాబాద్‌లో 41 డిగ్రీలు నమోదయ్యాయి. గాలిలో తేమశాతం తగ్గడం, ఉపరితల ద్రోణుల ప్రభావం లేకపోవడంతో ఒక్కసారిగా ఎండలు పెరిగాయని రాజారావు వెల్లడించారు. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వెల్లడించారు. ప్రజలు విలవిల.. ఎండలు మండుతుండటంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. తలనొప్పి, తల తిరగడం, తీవ్రమైన జ్వరం, చర్మం పొడిబారడం, మత్తు నిద్ర, వాంతులు, కలవరింతలు, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి కలిగి ఉండటం వంటివి వడదెబ్బ లక్షణాలుగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. వడగాడ్పులు, తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు. పెద్దలు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. మరోవైపు ఎండల తీవ్రత, వడగాడ్పుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పినా, జిల్లాల్లో యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. -
వడదెబ్బతో నలుగురు మృతి
నర్సంపేట రూరల్/బయ్యారం/భువనగిరి అర్బన్ : వడదెబ్బతో వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం నలుగురు మృతి చెందారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం దాసరిపల్లికి చెందిన మేకల సమ్మయ్య(60), నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండ లం బాస్మాన్‌పల్లికి చెందిన శివరాత్రి వెంకటయ్య(70), భువనగిరి పట్టణం తారకరామనగర్ కాలనీకి చెందిన కోళ శ్రీను(45), మోత్కూరు మండల కేంద్రం సుందరయ్య కాలనీకి చెందిన బుర్ర వెంకటమ్మ(58) మృతి చెందారు. -
త్వరలో అధిక దిగుబడులిచ్చే సజ్జ
- ఇక్రిశాట్ నేతృత్వంలో జన్యు పరిశోధనలు.. - కీలక జన్యువులను గుర్తించిన శాస్త్రవేత్తలు సాక్షి, హైదరాబాద్: అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటూనే అధిక దిగుబడులిచ్చే సజ్జ వంగడాల సృష్టికి మార్గం సుగమమైంది. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సజ్జ మొక్కల జన్యుక్రమాన్ని విశ్లేషించడం ద్వారా ఈ కీలక విజయాన్ని సాధించింది. సజ్జలు అతి తక్కువ నీటితో, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని మనగలవు. సాగుకయ్యే ఖర్చు కూడా తక్కువ కావడంతో ప్రపంచవ్యాప్తంగా చాలామంది చిన్న, సన్నకారు రైతులు సజ్జ పంటను సాగుచేస్తున్నారు. అయితే వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముంది. దీనివల్ల ఇతర పంటల మాదిరిగానే సజ్జల దిగుబడులు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇక్రిశాట్‌తోపాటు చైనాలోని బీజీఐ షెన్జెన్, ఫ్రెంచ్ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ తదితర పరిశోధన సంస్థలు సజ్జపై పరిశోధనలు చేపట్టాయి. సజ్జ జన్యుక్రమాన్ని ఆధునిక టెక్నాలజీల ద్వారా విశ్లేషించి మరింత ఎక్కువ వర్షాభావ పరిస్థితులను, 42 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలను తట్టుకోగల జన్యువులు, ఇతర మాలిక్యులర్ మార్కర్స్‌ను గుర్తించారు. ఈ క్రమంలోనే సజ్జల ద్వారా మరిన్ని ఎక్కువ పోషకాలు అందించడం ఎలాగో తెలుసుకున్నారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని మనగలిగే జన్యువులు, లక్షణాలను గుర్తించడం ద్వారా మెరుగైన దిగుబడులిచ్చే సజ్జ వంగడాల సృష్టి సులువవుతుందని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న ఇక్రిశాట్ శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ వార్‡్షణీ తెలిపారు. భవిష్యత్తులో ఈ పరిశోధనలను వరి, గోధుమలకూ విస్తరిస్తామని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బెర్గ్‌విన్సన్ తెలిపారు. పరిశోధన వివరాలు నేచర్ బయోటెక్నాలజీ మ్యాగజైన్ సంచికలో ప్రచురితమయ్యాయి. -
వానాకాలం వేసవి
అనంతపురం అగ్రికల్చర్: వర్షాకాలంలోనూ భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సాధారణం కన్నా రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవల వర్షాలు కురవడంతో కొద్ది రోజుల పాటు జిల్లా అంతటా వాతావరణం చల్లబడింది. అయితే ఆ వెంటనే ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. పగటి ఉష్ణోగ్రతతో పాటు రాత్రిళ్లు ఉక్కపోతను ప్రజలు భరించలేకపోతున్నారు. 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలి విసుగు తెప్పిస్తోంది. గురువారం శింగనమల మండలంలో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పామిడి, యల్లనూరు, యాడికి, శెట్టూరు, కూడేరు, నార్పల, తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, పుట్లూరు, కనగానపల్లి, బెళుగుప్ప, చెన్నేకొత్తపల్లి, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, గుత్తి, ధర్మవరం, పెద్దవడగూరు మండలాల్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మిగతా మండలాల్లో 34 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 22 డిగ్రీలు ఉన్నాయి. గాలిలో తేమ ఉదయం 77 నుంచి 92 శాతం.. మధ్యాహ్నం 42 నుంచి 52 శాతం మధ్య రికార్డు అయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాల తర్వాత గాలిలో తేమ శాతం పాటు ఉష్ణోగ్రతలు కూడా పెరగడం వల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలకు చీడపీడలు, తెగుళ్లు సోకే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు తెలిపారు. -
తెలంగాణలో మండుతున్న ఎండలు
-
నిప్పుల కుంపటిలా ఏపీ
-
సింగరేణి నిప్పుల కొలిమి
► ఓసీపీపై 48 డిగ్రీలు నమోదు ► బెంబేలెత్తుతున్న కార్మికులు ► ఓసీపీల్లో మారిన పని వేళలు శ్రీరాంపూర్ (మంచిర్యాల): భానుడి ప్రతాపా నికి సింగరేణి కార్మికులు బెంబేలెత్తుతున్నారు. వేసవి తీవ్రత అధికంగా ఉండ టంతో బొగ్గుబాయిలపై దీని ప్రభావం పడింది. మధ్యాహ్నం డ్యూటీలకు వెళ్లి పనిచే యడం కార్మికులకు ఇబ్బందిగా మారింది. క్వారీల్లో 2 రోజులుగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవు తోంది. కార్మికులు ఎండబారిన పడకుండా ఉండేందుకు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ (ఓసీ పీ)లో ఈ నెల 7వ తేదీ నుంచే షిఫ్ట్ వేళలు మార్చా రు. ఉదయం షిఫ్ట్ ఇంతకు ముందు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటే దాన్ని ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే కుదించారు. 2వ షిఫ్ట్‌లో కూడా గంట సమయం కుదించి సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్వహిస్తు న్నారు. పని చేసేటప్పుడు ప్రతి కార్మికుడికి మస్టర్ పడే సమయంలో మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తున్నారు. నీరసంగా ఉందన్న కార్మి కులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నారు. -
భానుడి భగభగలు
జిల్లాలో భానుడి ప్రతాపం రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఉదయం పది గంటలు దాటితే రోడ్లపైకి రావాలంటే జనం భయపడి పోతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. శింగనమల మండలం తరిమెలలో మంగవారం 44.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బకు గురికాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మండలం ఉష్ణోగ్రత (డిగ్రీల్లో) శింగనమల 44.1 చెన్నేకొత్తపల్లి 42.6 పుట్టపర్తి 42.1 యల్లనూరు 41.8 కూడేరు 41.7 పుట్లూరు 41.6 బుక్కపట్నం 41.4 పామిడి 41.4 ఉరవకొండ 40.6 గుంతకల్లు 40.5 అనంతపురం 40.3 గుత్తి 40.3 కళ్యాణదుర్గం 40.3 ధర్మవరం 40.3 -
ఈసారి నిప్పుల కొలిమే!
-
ఈసారి నిప్పుల కొలిమే!
అధిక ఉష్ణోగ్రతలకు కారణాలివే... ⇒ ఆయా ప్రాంతాల్లో హరిత వాతావరణం (గ్రీన్‌బెల్ట్) తగ్గడం ⇒ ఉత్తర, పశ్చిమ భారత ప్రాంతాల నుంచి వీచే వేడి గాలులు ⇒ వాహనాల కాలుష్యం, గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాలు వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు సాక్షి, హైదరాబాద్: ఈసారి ఎండలు మండిపోనున్నాయి. రోహిణి కార్తెలోనే కాదు ఎండా కాలమంతా రోళ్లు పగిలేలా ప్రతాపం చూపించనున్నాయి. వడగాడ్పులు విజృంభించనున్నాయి. మొత్తం గా ఈ వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మేనేజ్మెంట్ సంస్థలు హెచ్చరించాయి. ఈ ఏడాది జనవరిలో ఉష్ణోగ్రతలు గత 116 ఏళ్లలో జనవరి అత్యధిక ఉష్ణోగ్రతల్లో ఎనిమిదో స్థానంలో నిలిచాయని వెల్లడించాయి. తెలంగాణ, ఏపీలతో పాటు మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో కొంత ఎక్కువగా.. గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదుకావొచ్చని హెచ్చరించాయి. గతేడాది కంటే ఎక్కువగా.. ఈసారి తెలంగాణలో వడగాడ్పులు సాధారణం కంటే 47 శాతం అధికంగా వీస్తాయని, ఇది గతేడాది కంటే ఎక్కువ రోజుల పాటు కొనసాగుతాయని హైదరా బాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. ‘‘1981–2010 మధ్య ముప్పై ఏళ్ల సరాసరి ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఈసారి సగటు ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ అధికంగా నమోదవుతాయి. అంటే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 90 రోజుల సరాసరి సాధారణ ఉష్ణోగ్రతలకు ఒక డిగ్రీ అధికంగా నమోదవుతాయి. అంటే ఒక రోజు 4 డిగ్రీలు అధికంగా ఉండొచ్చు.. మరోరోజు 5 డిగ్రీలు అధికంగా ఉండొచ్చు.. ఇంకోరోజు సాధారణం కంటే తక్కువగానూ నమోదు కావచ్చు’’అని వై.కె.రెడ్డి వెల్లడించారు. అయితే ఎల్‌నినో, లానినోల ప్రభావంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని తెలిపారు. అడవులు తగ్గిపోవడం, వాతావరణంలో మార్పులు, గ్లోబల్ వార్మింగ్ కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. మండుతున్న రాజధాని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇప్పటికే మండుతున్న ఎండలతో భగ్గుమంటోంది. రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి నమోదవుతున్నాయి. వచ్చే మూడు నెలల్లో తీవ్రత మరింత పెరుగుతుందన్న సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో వడగాడ్పులు తీవ్రంగా వీయవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ కేసులు, మరణాలు పెరిగే ప్రమాదముందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ, వైద్యారోగ్య తదితర ప్రభుత్వ శాఖలు ప్రజారోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. గతేడాది పెద్ద సంఖ్యలో వడగాడ్పుల మరణాలు దాదాపు వందేళ్లతో పోల్చితే గతేడాదే (2016) అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా నిలిచింది. గత వేసవిలో రాజస్థాన్‌లోని ఫలోడి ప్రాంతంలో ఏకంగా 51 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది వడగాడ్పుల బారినపడి దేశవ్యాప్తంగా దాదాపు 700 మంది మరణించగా.. అందులో 400 మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందినవారేనని అంచనా. అధిక ఉష్ణోగ్రత, వడగాడ్పులతో సమస్యలు ఎండలో బయటికి వెళ్లే వారు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుంది. దీని వల్ల తీవ్రంగా అస్వస్థతకు గురవుతారు. తగిన చికిత్స, సహాయం అందకపోతే మరణించే ప్రమాదం కూడా ఉంటుంది. వేడిగాలులకు వాహన కాలుష్యం తోడవడంతో శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. -
మండే ఎండలు.. అప్రమత్తత అవసరం
– అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి అనంతపురం మెడికల్ : ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ తగిలే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి పేర్కొన్నారు. శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. తీవ్రమైన తలనొప్పి, నీరసంగా ఉండడం, చర్మం పొడిబారడం, సొమ్మసిల్లడం వంటివి వడదెబ్బ లక్షణాలన్నారు. నీరు తక్కువగా తీసుకోవడం, మత్తుపానీయాలు సేవించడం, ఎండలో తిరగడం, విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పానీయాలు తాగరాదని, వదులుగా ఉన్న కాటన్ దుస్తులు ధరించాలన్నారు. ఆహారాన్ని తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవాలన్నారు. శరీర ఉష్ణోగ్రత్త తగ్గించడానికి తడి వస్త్రంతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలన్నారు. ఈ విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఎంపీహెచ్ఈఓ లక్ష్మన్న, ఐడీఎస్పీ ధరంసింగ్, ఎపిడమాలజిస్ట్ రామకృష్ణ, డిప్యూటీ హెచ్ఈఓ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రావణంలో ‘రోహిణి’
-
శ్రావణంలో ‘రోహిణి’
నిప్పులు కక్కుతున్న ఎండలు సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తాపై ఎండలు నిప్పులు కక్కుతున్నాయి. రోహిణి కార్తెను తలపించేలా సాధారణం కంటే ఐదారు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా ఒంగోలులో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కావలి, మచిలీపట్నం, నెల్లూరుల్లో 39, తుని, విజయవాడ, బాపట్ల, తిరుపతిల్లో 38, కాకినాడ, రెంటచింతలలో 37, నర్సాపురం, అనంతపురాల్లో 36 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నా అవి సెగలను తగ్గించలేకపోతున్నాయి. ప్రస్తుతం ఉత్తర, వాయవ్య బంగాళాఖాతాల్లోనే ఇవి ఏర్పడుతుండటంతో, అవేమీ మన రాష్ట్రంపై ప్రభావం చూపడం లేదు. ఫలితంగా రాష్ట్రంలో అసాధారణ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. వేసవిలో సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికంగా నమోదయితే వడగాడ్పుల హెచ్చరికలు జారీ చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిస్థితే ఉండటం గమనార్హం. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ ఉష్ణతీవ్రత అధికంగా ఉంది. -
రోను పోయి.. రోహిణి వచ్చింది..
మళ్లీ మండిపోతున్న సూర్యుడు కొత్తగూడెంలో 51.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు మరో మూడు రోజులు వడగాడ్పులు.. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి కొత్తగూడెం: నిన్న మొన్నటి వరకు వణికించిన ‘రోను’ తుఫాన్ పోయి.. మండే ఎండలతో ‘రోహిణి’ కార్తె వచ్చింది. ఈ మార్పుతో రాష్ట్రంలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఆదివారం అత్యధికంగా 52 డిగ్రీలు నమోదు కాగా, సోమవారం 51.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపిస్తుండటంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. చిన్నచిన్న వ్యాపారస్తులు షాపులను మూసివేసి ఇళ్లలోనే ఉండిపోవాల్సి వస్తోంది. మధ్యాహ్నం 51.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో పట్టణం మొత్తం వెలవెలబోయింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోగా, షాపులన్నీ మూతపడ్డాయి. పట్టణంలో రెండు రోజులుగా అనధికారిక కర్ఫ్యూ కొనసాగుతోంది. రోడ్ల వెంట వ్యాపారాలు చేసుకునేవారు ఎండదెబ్బకు కుదేలవుతున్నారు. చలి వేంద్రాలు అంతంత మాత్రమే సేవలందిస్తుండటంతో దాహార్తి తీర్చుకునేందుకు పాదచారులు, ప్రయాణికులు లీటరు నీటిని రూ.8 వరకు కొనుగోలు చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు గొడుగులు, ముఖానికి రుమాళ్లు, టోపీలు ధరించి వస్తున్నారు. సింగరేణి ఓపెన్‌కాస్టు గనుల వద్ద మరో రెండు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత ఉండటంతో కార్మికులు విధులు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు మరో మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం రామగుండంలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, భద్రాచలం, ఖమ్మం, హన్మకొండల్లో 44 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి. ఇక రాజధాని హైదరాబాద్‌లో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నమోదైన ఉష్ణోగ్రతలు ప్రాంతం ఉష్ణోగ్రత కొత్తగూడెం 51.5 రామగుండం 45.0 భద్రాచలం 44.4 ఖమ్మం 44.2 హన్మకొండ 44.1 ఆదిలాబాద్ 43.3 నల్లగొండ 42.8 నిజామాబాద్ 42.1 మెదక్ 41.4 హైదరాబాద్ 40.5 మహబూబ్‌నగర్ 38.6 -
మరో మూడు రోజులు వడగాడ్పులే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మరో 3 రోజులపాటు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం రామగుండంలో 45 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో 44.6, మహబూబ్‌నగర్, నల్లగొండల్లో 44.2, ఖమ్మంలో 43.6 చొప్పున అధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్‌లో 42.8 డిగ్రీలు నమోదైంది. ఉచిత హోమియో మందు: ఆయుష్ కమిషనర్ వడదెబ్బ నివారణకు హోమియో మందును రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా అందజేయాలని ఆయుష్ కమిషనర్ ఎ.రాజేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రామంతాపూర్ హోమియోపతి మెడికల్ కాలేజీ ప్రాంగణంలో సోమవారం ఏకీకృత రక్త పరీక్షల కేంద్రాన్ని రాజేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ రక్త పరీక్షల కేంద్రానికి వచ్చే రోగులకు ఉచితంగా అన్ని రకాల పరీక్షలు చేస్తామన్నారు. వడదెబ్బకు 58 మంది మృత్యువాత తెలంగాణ జిల్లాల్లో సోమవారం వడదెబ్బతో 57 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 15 మంది.. వరంగల్ జిల్లాలో 13 మంది, ఖమ్మంలో 13 మంది చనిపోయారు. అలాగే, కరీంనగర్లో 10 మంది, రంగారెడ్డి జిల్లాలో ఒకరు, ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు, నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు మరణించారు. అలాగే నగరంలోని ఎర్రగడ్డ యునానీ ఆస్పత్రి సమీపంలో గుర్తు తెలియని 30 ఏళ్ల వ్యక్తి వడదెబ్బకు మృతి చెందాడు. సోమవారం ప్రధాన పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ప్రాంతం ఉష్ణోగ్రత రామగుండం 45.0 నిజామాబాద్ 44.6 ఆదిలాబాద్ 44.3 మహబూబ్‌నగర్ 44.2 నల్లగొండ 44.2 ఖమ్మం 43.6 మెదక్ 43.5 హైదరాబాద్ 42.8 హన్మకొండ 42.5 -
బడికా.. మేమెళ్లలేం!
సగానికి పడిపోయిన విద్యార్థుల హాజరు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరుతున్న తల్లిదండ్రులు ప్రొద్దుటూరు : ఎండల ప్రభావం కారణంగా పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం క్రమేణా తగ్గుతోంది. ఈనెల 8వ తేది నుంచి వైఎస్ఆర్ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒంటిపూట బడులను అమలు చేస్తున్నారు. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 7.45-12.30 గంటల వరకు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3110 ప్రాథమిక, 569 ప్రాథమికోన్నత, 820 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 4499 పాఠశాలలు నడుస్తున్నాయి. వీటిలో 2,21,365 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో పదవ తరగతి పరీక్షల కోసం 173 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్క ప్రొద్దుటూరులోనే 17 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. సోమవారం నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు రోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.30 నుంచి 5 గంటల వరకు పాఠశాలలను నిర్వహిస్తున్నారు. దీంతో ఎండల ప్రభావం కారణంగా ఎక్కువ శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు గైర్హాజరవుతున్నారు. ఉదాహరణకు ప్రొద్దుటూరు అనిబిసెంటు మున్సిపల్ పాఠశాలలో మొత్తం 292 మంది విద్యార్థులకుగాను సోమవారం 220 మంది, మంగళవారం 245 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. వైవిఎస్ మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో 450 మందికిగాను సోమవారం 279 మంది, మంగళవారం 269 మంది మాత్రమే హాజరు కావడం గమనార్హం. కశెట్టి చిన్నవెంకటసుబ్బయ్య ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో కూడా పలువురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా అంతటా పలు పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నం పూట కాకుండా ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు పాఠశాలలను నడపాలని ఉపాధ్యాయ వర్గాలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎండల దృష్ట్యా పాఠశాల విశ్రాంతి సమయంలోనే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా చాలా పాఠశాలల్లో ఈ విధానం అమలు కావడం లేదు. పాఠశాల వదిలాకే భోజనం పెడుతుండటంతో ఎండలో ఉండలేక చాలా మంది పిల్లలు ఇళ్లకు పరుగులు పెడుతున్నారు. 10వ తరగతి పరీక్ష కేంద్రాల్లో ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు, ఇతర పాఠశాలల్లో 7 నుంచి 11 గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలని ఉపాధ్యాయ వర్గాలు కోరుతున్నాయి. ‘పదవ తరగతి పరీక్షలు నిర్వహించే పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు గైర్హాజరు అవుతున్నారని సమాచారం అందింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అందరికీ అనుకూలమైన నిర్ణయం తీసుకుంటాం’ అని డీఈఓ బి.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ‘ఎండల వల్ల 60 శాతం మంది విద్యార్థులే పాఠశాలలకు హాజరవుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యం దెబ్బ తినకుండా పాఠశాల వేళలు సవరించాలి’ అని కొత్తకొట్టాల మున్సిపల్ ఉర్దూ హైస్కూల్ హెడ్మాస్టర్ ఇమాం హుసేన్, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.శ్యాంసుందర్‌రెడ్డి, ఎస్టీయూ రీజనల్ కన్వీనర్ రషీద్‌ఖాన్ కోరారు. -
ఎండవేడికి వృద్ధుడి మృతి
లక్కిరెడ్డిపల్లి (వైఎస్సార్‌జిల్లా): వర్షాలు లేక ఎండలు దంచి కొడుతుండడంతో వృద్ధుల ప్రాణాల మీదకు వస్తోంది. వైఎస్సార్‌జిల్లా లక్కిరెడ్డి పల్లి మండలం బి.ఎర్రగుడి గ్రామంలో ఎండవేడికి తట్టుకోలేక సుబ్బయ్య (70) అనే వృద్ధుడు పొలంలోనే ప్రాణాలు విడిచాడు. శుక్రవారం ఉదయం పొలం కాపలాకు వెళ్లిన సుబ్బయ్య సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. పొలంలోనే అతడు కూలబడిపోయి కనిపించాడు. ఎండకు తట్టుకోలేక అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. -
‘మార్చి’ చాలా హాట్ గురూ!
హైదరాబాద్: 2015 మార్చి నెల.. భూతాపోన్నతి చరిత్రలో ఒక మైలురాయిలా నిలిచిపోయింది. భూఉపరితల వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు 400 పార్ట్స్ పర్ మిలియన్(పీపీఎం) కన్నా ఎక్కువగా మార్చి నెలంతా కొనసాగటమే ఇందుకు కారణం. అమెరికాలోని జాతీయ సముద్ర, వాతావరణ పర్యవేక్షణ సంస్థ(ఎన్ఓఏఏ) ఇటీవల వెల్లడించిన సమాచారం ప్రకారం.. బొగ్గుపులుసు వాయువు స్థాయి 400 పీపీఎం కన్నా ప్రమాదకర స్థాయికి పెరగటం ఇదే మొదటిసారి కాదు. 2012, 2013లో అప్పుడప్పుడూ కొద్ది రోజుల పాటు ఈ స్థాయి దాటి భూతాపం పెరిగిన సందర్భాలున్నాయి. అయితే, వాతావరణ కాలుష్యాన్ని నమోదు చేసే అన్ని కేంద్రాల్లోనూ, ఆ నెలలో అన్ని రోజులూ 400.83 పీపీఎం మేరకు నమోదుకావటం మాత్రం ఇదే మొదటి సారి. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు పాళ్లు 350 పీపీఎం కన్నా తక్కువ నమోదైతే మానవాళి మనుగడ సజావుగా సాగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 1980 వరకు 280 పీపీఎం వరకు నమోదైన ఉద్గారాల స్థాయి ఆ తర్వాత నుంచి వేగంగా పెరుగుతూ వస్తోంది. భూతాపం పెరుగుతున్నకొద్దీ కరువు కాటకాలు, అకాల వర్షాలు, వరదల బెడద ఎక్కువ అవుతోంది. భూ ఉపరితల వాతావరణంలో వేడిని పట్టిఉంచే బొగ్గుపులుసు వాయువు పాళ్లు ఎంత పెరిగితే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం అంత పెరుగుతుంది. -
సెగలు గక్కుతున్న సూర్య
గనుల వద్ద 47 డిగ్రీల ఉష్ణోగ్రత మార్చి నుంచి ఇప్పటివరకు వడదెబ్బతో 40 మంది మృత్యువాత రోజురోజుకు పెరుగుతున్న ఎండలు ఆదిలాబాద్ అగ్రికల్చర్ : భానుడు భగభగమండుతున్నాడు. జిల్లా అగ్నిగోళంలా మండుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు దినదినం పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. ప్రచండ భానుడి ఉగ్రరూపాన్ని తాళలేక పలువురు పిట్టల్లా రాలిపోతున్నారు. మంగళవారం ఒక్కరోజే జిల్లాలో 44.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. ఈ ఏడాది ఇప్పటివరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం విశేషం. మూడు రోజులుగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. జిల్లాలో వడదెబ్బ ధాటికి మార్చి నుంచి ఇప్పటివరకు 40 మంది మృతిచెందారు. ఒక్క మే నెలలోనే ఇప్పటివరకు 24 మంది మృత్యువాతపడ్డారు. రోజుకు ఇద్దరు.. ముగ్గురు చొప్పున వడదెబ్బకు గురవుతూ చనిపోతూనే ఉన్నారు. మంగళవారం ఒక్కరోజే ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఉదయం 9 గంటల నుంచే సూర్యప్రతాపం ప్రారంభమవుతోంది. ఇక ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు తూర్పు ప్రాంతంలోని బొగ్గు గనుల పరిధిలో మరింత తీవ్రంగా ఉన్నాయి. బొగ్గు గనులు ఉన్న ప్రాంతాల్లో మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరింది. దీంతో ఓపెన్ కాస్టుల్లో విధులు నిర్వర్తించే కార్మికులు అల్లాడిపోతున్నారు. అడవులు అంతరిస్తుండటం.. జలాశయాల్లో నీరు అడుగంటడం.. తదితర కారణాలతో ఎండ తీవ్రత ఏటా పెరుగుతోంది. వారం క్రితం జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో వర్షం పడి వాతావరణం చల్లగా ఉండేది. శనివారం నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 11 గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సాయత్రం 6 గంటలు దాటితే కాని ప్రజలు బయటికి రాలేకపోతున్నారు. వాహన చోదకులు ముఖానికి రక్షణ లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేదు. భానుడు.. బ్యాండ్ భాజా.. ఇదే నెలలో అత్యధికంగా పెళ్లిళ్లు ఉన్నాయి. ఇటు ఎండలతో ఇళ్లలో ఉక్కపోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. పెళ్లిళ్లకు వెళ్లిన వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణాలు చేసేవారు, శుభకార్యాలకు పత్రికలు పంచేవారు, దూర ప్రాంతాల వివాహాలకు హాజరయ్యే వారు వడదెబ్బ బారిన పడుతున్నారు. వేసవిలో శ్రీరామనవమితో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. వైశాఖమాసంలో దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి. ఈ నెలలో 20,21,22,28,29,30,31, జూన్ 1,3,5,6,7,10, తేదీల్లో పెళ్లిళ్లు ఎక్కువగా జరగనున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు.. శరీరాన్ని పట్టుకునేలా ఉండే దుస్తులను కాకుండా కొద్దిగా వదులుగా ఉండేలా ధరించాలి. దీంతో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందవచ్చు. సాధ్యమైనంత మేరకు ఉదయం చల్లగా ఉన్న సమయంలోనే వివాహాలకు బయల్దేరాలి. అక్కడ బంధువులతో కాలక్షేపం చేస్తూ సాయంత్రం వరకు ఉంటే మేలు. ముఖ్యంగా వ్యాన్, లారీల్లో వెళ్లాల్సి వస్తే.. వాటిపై తాటిపత్రిలాంటివి వేసుకోవాలి. అంతేకాకుండా ఇరుకుగా కాకుండా తక్కువ మోతాదులో మందిని తరలించేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇరుకుగా ఉండడం వల్ల గాలి రాకుండా.. శ్వాస ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. పెళ్లికి వెళ్లే సమయంలో తప్పనిసరిగా తగినంత మేర చల్లని నీటిని వెంట తీసుకెళ్లాలి. వాహనాలపై వెళ్లాల్సి వస్తే తలకు, ముక్కుకు, చెవులకు నిండుగా ఉండేలా కాటన్ టవల్, కర్చీప్ కట్టుకోవాలి. కళ్లకు చల్లని చలువ అద్దాలు పెట్టుకోవాలి. గొడుగు, టోపి ధరించాలి. నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి. ఎండలో తిరిగి వచ్చిన వెంటనే బాగా చల్లని నీరు ఒకేసారి తీసుకోకూడదు త్వరగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారం, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు నీరు తాగాలి. నిమ్మరసంలో ఉప్పు, చక్కెర కలిపి తీసుకోవాలి. ఎక్కువ వేడి గాలిలో తేమ ఎక్కువగా ఉన్న సమయంలో పనులు తగ్గించుకోవాలి. సోడియం, పొటాషియం ఉన్న ద్రవ పదార్థాలు తీసుకోవాలి. వడదెబ్బకు గురైన వారిని చల్లని లేదా నీడ ప్రదేశానికి తీసుకెళ్లాలి. నుదుటిపై తడిగుడ్డ వేసి తుడుస్తూ శరీర ఉష్ణోగ్రతను తగ్గించాలి. బీపీ లేదా పల్స్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. గాలి ఎక్కువగా తగిలేలా చూడాలి. నీరు ఎక్కువగా తాగించాలి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి ముఖ్యంగా చికెన్, మటన్, బిర్యానీ, ఆయిల్ ఫుడ్, మాసాల, ఫ్రై వంటివి తీసుకోరాదు. ఆల్కహాల్‌తో మరింతగా ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది. అవసరాన్ని బట్టి వైద్యుడికి చూపించి ప్రాథమిక చికిత్స అందజేయాలి. సాధ్యమైనంత మేర చిన్నారులకు నీళ్లు ఎక్కువగా తాగించాలి. రాత్రి వేళల్లో వడగాలులు వీచినా, వేడి ఎక్కువగా ఉన్నా చిన్నారులను బయట పడుకోబెట్టకూడదు. చిన్నారుల శరీరం వేడిగా అనిపిస్తే తడిగుడ్డతో తుడవాలి. ఓఆర్ఎస్ వంటి ద్రావణాన్ని తాగించాలి. ఏ మాత్రం అనారోగ్యం అనిపించినా వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించాలి. -
ఏడు కొండల్లో భానుడి భగభగలు
తిరుమల : తిరుమలలో వేసవి ఉష్ణోగ్రతలు తారా స్థాయికి చేరుతున్నాయి. మంగళవారం పగటి ఉష్ణోగ్రత 35 డిగ్రీలను దాటింది. మే మొదటి వారంలోనే ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. దీనికి తోడు ఉక్కపోత పెరగడంతో భక్తులు తల్లడిల్లిపోయారు. ఆలయ ప్రాంతంలో పాద రక్షలు నిషేధం. స్వామిని దర్శించుకుని వెలుపలకు వచ్చిన భక్తులు నేల సలసలా కాలుతుండడంతో పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఎండ నుంచి రక్షణకు భక్తులు టోపీలు, గొడుగులు, వస్త్రాలు అడ్డుపెట్టుకోవడం కనిపించింది. కాగా భక్తుల కష్టాలు గుర్తించిన టీటీడీ ఉపశమన చర్యలు ప్రారంభించింది. చలువ పందిళ్లు నిర్మించడంతోపాటు నేలపై కూల్ పెయింట్ వేస్తోంది. ఎర్ర తివాచీ పరిచి దానిపై నీటిని చల్లే ఏర్పాట్లు చేసింది. -
పగలు వేడి.. రాత్రి చలి
విశాఖపట్నం: పగటి పూట ఎండ, రాత్రి వేళ చలితో ఏపీ, తెలంగాణల్లో విచిత్ర వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి నెలంతా ఇలాగే ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు ఏపీలో 30-35 డిగ్రీలు, తెలంగాణలో 30-35 డిగ్రీల మధ్య నమోదవుతుండగా, కనిష్ట ఉష్ణోగ్రతలు ఏపీలో 13-19 మధ్య, తెలంగాణలో 13-20 డిగ్రీలుగా రికార్డవుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు తెలంగాణలో సాధారణం కంటే 2-3 డిగ్రీలు, ఏపీలో 1-2 డిగ్రీలు అధికంగా, కనిష్ట ఉష్ణోగ్రతలు తెలంగాణలో 2-4 డిగ్రీలు, ఏపీలో 2-6 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడంతో ఇక పై భానుడి ప్రతాపం అధికమవుతుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం మాజీ అధికారి ఆర్.మురళీకృష్ణ 'సాక్షి'కి తెలిపారు. -
నిప్పుల వాన
జిల్లాలో గురువారం నిప్పుల వాన కురిసింది. వడగాడ్పులు 13 మంది ఉసురు తీశాయి. ఉదయం నుంచే సూరీడు చండ ప్రచండంగా మండిపడటంతో జనం అల్లాడిపోయారు. ఉద్ధృతంగా వీచిన వడగాడ్పులను తట్టుకోలేక విల విల్లాడారు. పట్టణాలు.. పల్లెలు అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోని రోడ్లూ నిర్మానుష్యంగా మారాయి. కూలి పనులకు వెళ్లలేక బడుగు జీవులు ఇబ్బంది పడ్డారు. వేళాపాళా లేని విద్యుత్ కోతలతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. వృద్ధులు, చిన్నారులు, రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. శ్రీకాకుళం/ శ్రీకాకుళం అగ్రికల్చర్ : వారం, పది రోజు లుగా మండిపడుతున్న భానుడు గురువారం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాడు. జిల్లా ప్రజలను బెంబేలెత్తించాడు. అగ్నికి ఆజ్యం పోసినట్టు వడగాడ్పులు తోడవటంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 13 మంది పిట్టల్లా రాలిపోయారు. మృతుల్లో 12 మంది బడుగు జీవులే. జీవన భృతి కోసం పనులకెళ్లి ఎండ వేడి, వడగాడ్పులను తట్టుకోలేక అసువులు బాశారు. సాధారణంగా మే నెలలో ఎండ వేడి, వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయి. ఈ ఏడాది జూన్ రెండో వారంలో ఇంత దారుణ పరిస్థితి నెలకొనటం అందరినీ కలవరపరుస్తోంది. రుతుపవనాలు వచ్చేస్తున్నాయని ఓ పక్క వార్తలొస్తున్నా.. సూరీడు విరుచుకుపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇదే వాతావరణం కొనసాగితే ఖరీఫ్ పంటల పరిస్థితి ఏమవుతుందోనని అన్నదాతలు భయపడుతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలు.. అల్లాడిన జనం నైర వ్యవసాయ కళాశాలలో నమోదైన వివరాల ప్రకారం.. మంగళవారం 39.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా బుధవారం 41 డిగ్రీలకు చేరింది. గురువారం ఏకంగా 41.5 డిగ్రీలుగా నమోదైంది. ఎండ తీవ్రత, వడగాల్పులను తట్టుకోలేక వృద్ధులు, చిన్నారులు, రోగులు అల్లాడిపోయారు. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా తీవ్రంగా ఉంటున్నాయి. మూడు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగా నమోదవటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా వేడి కొనసాగుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనికితోడు వేళాపాళా లేని విద్యుత్ కోతలు నరకాన్ని చూపుతున్నాయి. ప్రజలు వీధుల్లోకి వెళ్లలేక, ఇళ్లల్లో ఉండలేక అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల పాట్లు గురువారం పాఠశాలలు తిరిగి తెరుచుకోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. ఎండ వేడిని వారు భరించలేకపోయారు. వేసవి సెలవులను మరో వారం రోజుల పాటు పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. లేని పక్షంలో కనీసం ఒంటి పూట బడులు నిర్వహించాలని కోరాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందిం చకపోవటం ఆందోళన కలిగిస్తోంది. బడుగు జీవులకు ఉపాధి కరువు రెక్కాడితే గానీ డొక్కాడని భవన నిర్మాణ కార్మికులు, రోజువారీ పనివారు ఎండ వేడిమిని తట్టులేకపోతున్నారు. గేదెలు, ఆవులు, ఇతర మూగ జీవాలు కూడా అవస్థలు పడుతున్నాయి. పరిస్థితి ఇంత భయానకంగా ఉంటే అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఉపాధి హామీ పనులను యధాతథంగా జరిపిస్తున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
వడగాడ్పుల పంజా
ఒక్కరోజులోనే 67 మంది మృత్యువాత తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 15 మంది మృతి కోస్తాంధ్ర, తెలంగాణలో మరో రెండురోజులు ఇదే పరిస్థితి సాధారణం కంటే 4-6 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతల నమోదు నెట్వర్క్: జూన్ రెండోవారం ముగిసిపోతున్నా ఎండలు మండుతూనే ఉన్నారుు. వడగాడ్పులు తోడవడంతో వాతావరణం నిప్పుల కొలిమి సెగను తలపిస్తోంది. గత రెండు రోజులుగా కోస్తాంధ్ర, తెలంగాణలో భానుడి తీవ్రత, వడగాడ్పులు పెరిగారుు. సాధారణం కంటే 4-6 డిగ్రీలు ఎక్కుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వడదెబ్బకు గురై గురువారం ఒక్కరోజే 67మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లో 62, తెలంగాణలో ఐదుగురు మృతి చెందారు. పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఉక్కబోతతో అల్లాడుతున్నారు. వేడి, వడగాలి కారణంగా రోడ్డు మీదకు అడుగుపెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. మరో రెండురోజులు ఇదే పరిస్థితి కోస్తాంధ్రలోని విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, తెలంగాణలోని మెదక్, నల్లగొండ జిల్లాలు, రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో గురువారం వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంది. రాగల 48 గంటల్లో కూడా ఆయూ జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత కొనసాగనున్నట్టు భారత వాతావరణ శాఖ తన నివేదికలో వె ల్లడించింది. పశ్చిమ, వాయవ్య దిశ నుంచి వేడిగాలులు వీస్తుండటం, రుతుపవన గాలులు బలహీనంగా ఉండటం దీనికి కారణమని వాతావరణ నిఫుణులు చెబుతున్నారు. గత రెండు రోజులుగా గాలిలో తేమ శాతం గణనీయంగా పడిపోయింది. తీరప్రాంతాల్లో సాధారణంగా 80 శాతానికి పైగా ఉండే తేమ గురువారానికి 40-50 శాతానికి మించి లేదు. గాలిలో తేమ బాగా ఉంటే చర్మం జిడ్డుబారడం మినహా.. చెమ ట రూపంలో శరీరంలోని నీరు బయటికిపోయే పరిస్థితులు పెద్దగా ఉండవని నిపుణులు అంటున్నారు. కానీ ప్రస్తుతం తేమ శాతం తగ్గి తీవ్రమైన చెమటలతో ప్రజలు డీహైడ్రేషన్ (నిర్జలీకరణం)కు గురవుతున్నారు. వడగాడ్పులతో ప్రజలు ముఖ్యంగా వృద్ధులు మృత్యువాత పడుతున్నారు. ఒక్కరోజే 67 మంది మరణించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. స్థిరంగా అల్పపీడనం జార్ఖండ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయి. దక్షిణ కోస్తాంధ్రలో గాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను నానౌక్ ముంబైకి 940 కి.మీ. దూరంలో దక్షిణ నైరుతి దిశగా ఒమన్ తీరం వైపు పయనిస్తున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం కోస్తాంధ్ర, తెలంగాణపై ఉండబోదని స్పష్టం చేసింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు గడచిన 24గంటల్లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో గరిష్టంగా 5సెం.మీ. వర్షపాతం నమోదయింది. ఆసిఫాబాద్‌లో 2, అదిలాబాద్, సిర్పూర్, మెట్పల్లిలో ఒక్కో సెం.మీ. చొప్పున వర్షం కురిసిందని పేర్కొంది. -
మంచం పట్టిన మన్యం
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. దానికితోడు అకాల వర్షాలతో కూడిన ప్రతికూల వాతావరణం వ్యాధుల విజృంభణకు దోహదపడుతోంది. ఫలితంగా మన్య ప్రాంతంలో మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో గిరిపుత్రులు గజగజలాడుతున్నారు. ఎపిడిమిక్ సీజన్ ప్రారంభమైనా.. ఏజెన్సీలో జ్వరాల కేసులు రోజురోజుకూ పెరుగుతున్నా అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంలేదు. చాలా పీహెచ్‌సీల్లో మలేరియా నివారణ మందులే అందుబాటులో లేవు. హైరిస్క్ గ్రామాల్లో దోమల నివారణ మందులు స్ప్రేయింగ్ కూడా ఇంకా ప్రారంభం కాలేదు. సీతంపేట, న్యూస్‌లైన్: జిల్లా ఏజెన్సీ ప్రాంతా న్ని మలేరియా దోమ కాటేస్తోంది. పీహెచ్‌సీలకు జ్వరపీడితుల తాకిడి రానురాను పెరుగుతోంది. వీరిలో ఎక్కువమంది మలేరియా పీడితులు కాగా.. టైఫాయిడ్ వంటి జ్వరాల తీవ్రత కూడా అధికంగానే ఉంది. ఎపిడిమిక్ సీజన్ ప్రారంభమై వ్యాధులు పంజా విసురుతుండటంతో గిరిజనులు వణికిపోతున్నారు. ప్రతి కూల వాతావరణ పరిస్థితుల వల్ల జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చాలామంది గిరిజను లు ఆస్పత్రుల వరకు రాలేక గ్రామాల్లో సంచి ైవె ద్యులను ఆశ్రయిస్తున్నారు. సీతంపేట మండలంలోని జగతపల్లి, పెదరామ, మొగదార, జొనగ, కోసంగి, కురసింగి, అంటికొండ, పెద్దగూడ తదితర గ్రామాల్లో జ్వరాలు ఎక్కువగా ఉన్నా యి. పీహెచ్ సీకి వస్తున్న కేసుల్లో ఈ గ్రామాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. 200కుపైగా మలేరియా కేసులు ఐటీడీఏ పరిధిలో 27 పీహెచ్‌సీలున్నాయి. వీటి పరిధిలో ఈ ఏడాది ఇప్పటివరకు 202 మలేరియా పాజిటివ్ కేసులు వచ్చాయని అధికారిక గణాంకాలు చెబుతుండగా, అనధికారిక లెక్కల ప్రకారం వాటి సంఖ్య 300కు పైగానే ఉంటుంది. దీనికితోడు టైఫాయిడ్ కేసులు కూడా ఇదే స్థాయిలో నమోదవుతున్నాయి. గిరిజన గ్రామాల్లో ఈ సీజన్లోనే ఎక్కువగా జ్వరాలు వ్యాపిస్తాయి. సీతంపేట మండలంలో ఈ నెలలోనే 20 వరకు కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ సీజనులో 200 మంది వివిధ రకాల జ్వరాలతో బాధపడితే వారిలో వంద వరకు టైఫాయిడ్ బాధితులు కావడం విశేషం. వేసవిలో అత్యధిక గ్రామాలకు మంచినీటి సౌకర్యం లేకపోవడం, కలుషిత జలాలనే తాగుతుండటంతో రోగాలు విజృంభిస్తున్నాయి. ఒక్కసారి జ్వరం వచ్చిందంటే.. ఇక ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండటం లేదని, వారాల తరబడి జ్వరాలు తగ్గుముఖం పట్టడం లేదని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల కు మలేరియా, టైఫాయిడ్ ఎక్కువగా సోకుతుండటంతో నానా అవస్థలు పడుతున్నారు. ఈమాల్ ఇంజక్షన్లు నిల్... మలేరియా సోకిన రోగులకు ఈమాల్ ఇంజక్షన్ డోస్ ఇస్తారు. అయితే పీహెచ్‌సీల్లో ప్రస్తుతం ఆ ఇంజక్షన్లు అందుబాటులో లేవు. దీంతో అత్యవసర సమయాల్లో రోగులే కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరో వైపు చిన్నారులకు మలేరియా సోకితే ఏసీటీ కిట్ అనే మందు బిళ్లలు ఇస్తారు. అవి కూడా స్టాక్ లేవు. దీంతో పెద్దవారికి వాడిన ఏసీటీ కిట్లే చిన్నారులకు కూడా వాడాల్సివస్తోంది. ఎపిడమిక్ సీజన్ ప్రారంభ మై మలేరియా విజృంభిస్తున్నా మందుల సరఫరా లేకపోవడం గమనార్హం. 713 హైరిస్క్ గ్రామాల్లో స్ప్రేయింగ్... మలేరియా నివారణకు ఐటీడీఏ పరిధిలో 713 మలేరియా హైరిస్క్ గ్రామాల్లో సింథటిక్ ఫైరిత్రిన్ ద్రావణాన్ని పిచికారి చేయనున్నామని మలేరియా నివారణ కన్సల్టెంట్ శ్రీకాంత్ తెలిపారు. ఈ ప్రక్రియ రెండో తేదీ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఈమాల్, ఏసీటీ కిట్ల కోసంఐటీడీఏ పీవోకు ప్రతిపాదనలు సమర్పించామన్నారు. -
ఇంటా..బయటా..నరకమే..
సాక్షి, రాజమండ్రి :జిల్లావాసులు శనివారం ఇంటా బయటా నరకం చవిచూశారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు కాస్త అటూ ఇటూగా నమోదైనా.. విపరీతమైన ఉక్కపోత.. ఎడాపెడా విధించిన కరెంటు కోతలతో అల్లాడిపోయారు. శనివారం విధించిన విద్యుత్ కోతలు ప్రజల పాలిట శాపంగా మారాయి. ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని అన్ని వర్గాల ప్రజలు వాపోయారు. గరిష్ట ఉష్ణోగ్రతలు ఇలా.. మండపేట 41; రాజమండ్రి 40.5; తుని, జగ్గంపేట 40; కాకినాడ 39.5; అమలాపురం 39 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే మూ డో వారంలో జిల్లాలో ఈ సీజన్లోనే అత్యధికంగా 43 నుంచి 46 డిగ్రీల .సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనా.. ఇంత ఉక్కపోత లేదు. వాతావరణంలో తేమ శాతం పెరగడమే ఇందుకు కారణమంటున్నారు. కోతల వాతలు గత మూడేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా శనివారం జిల్లాలో విద్యుత్ కోతలు విధించారు. గతంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప రాజమండ్రి, కాకినాడ నగరాలు, ఇతర పట్టణాల్ల్లో నాలుగు నుంచి ఆరు గంటల పాటు కోత విధించింది లేదు. గ్రామాల్లో మాత్రమే పది గంటల కోతలు విధించేవారు. కానీ శనివారం జిల్లావ్యాప్తంగా తొమ్మిది నుంచి పది గంటల పాటు విద్యుత్ కోతలు విధించారు. రాజమండ్రి, కాకినాడల్లో ఉదయం ఏడు నుంచి రాత్రి పది వరకూ తొమ్మిది గంటల పాటు దఫదఫాలుగా అత్యవసర కోతలు విధించారు. ఇతర ప్రాంతాల్లో కూడా ఎనిమిది నుంచి పది గంటలు పైగా విద్యుత సరఫరా నిలిపివేశారు. ఫ్రీక్వెన్సీ పడిపోవడమే కారణం గ్రిడ్ లైన్లలో విద్యుత్ సరఫరా ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్డ్స దాటి ఉండాలి. ఇది తగ్గితే ఆ ప్రభా వం రాష్ట్రంలోని ఉత్పత్తి కేంద్రాలపై పడుతుంది. ఒక వేళ ఉత్పత్తి నిలిచిపోతే మూడు రోజుల వరకూ పునరుద్ధరణ సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. దీంతో వినియో గం పెరిగిప్పుడల్లా ఎడాపెడా కోతలు పెడుతున్నారు. రెండు రోజులుగా వినియో గం భారీగా పెరడగంతో పాటు జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కనిష్ట స్థాయికి పడిపోవడమే కోతలకు కారణమని చెబుతున్నారు. ఇంటర్ విద్యార్థుల ఇబ్బందులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా ఇంటర్ విద్యార్థులు శనివారం కెమిస్ట్రీ పరీక్ష రాశారు. ఉదయం 9 నుంచి 12 వరకూ మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకూ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఆ సమయంలో కరెంటు కోత విధించడంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లో అవస్థలు పడ్డారు. చెమటకు ఆన్సర్ షీట్లు తడిసిపోయి ఇబ్బందులు పడ్డామని పలువురు చెప్పారు.