అనంతపురం అగ్రికల్చర్: వర్షాకాలంలోనూ భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సాధారణం కన్నా రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవల వర్షాలు కురవడంతో కొద్ది రోజుల పాటు జిల్లా అంతటా వాతావరణం చల్లబడింది. అయితే ఆ వెంటనే ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. పగటి ఉష్ణోగ్రతతో పాటు రాత్రిళ్లు ఉక్కపోతను ప్రజలు భరించలేకపోతున్నారు. 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలి విసుగు తెప్పిస్తోంది. గురువారం శింగనమల మండలంలో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
పామిడి, యల్లనూరు, యాడికి, శెట్టూరు, కూడేరు, నార్పల, తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, పుట్లూరు, కనగానపల్లి, బెళుగుప్ప, చెన్నేకొత్తపల్లి, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, గుత్తి, ధర్మవరం, పెద్దవడగూరు మండలాల్లో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మిగతా మండలాల్లో 34 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 22 డిగ్రీలు ఉన్నాయి. గాలిలో తేమ ఉదయం 77 నుంచి 92 శాతం.. మధ్యాహ్నం 42 నుంచి 52 శాతం మధ్య రికార్డు అయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాల తర్వాత గాలిలో తేమ శాతం పాటు ఉష్ణోగ్రతలు కూడా పెరగడం వల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలకు చీడపీడలు, తెగుళ్లు సోకే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు తెలిపారు.
వానాకాలం వేసవి
Published Thu, Sep 14 2017 10:35 PM | Last Updated on Tue, Sep 19 2017 4:33 PM
Advertisement
Advertisement