
సాక్షి, హైదరాబాద్: ఎండ తీవ్రత మరింత పెరిగింది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత రెండ్రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త ఎక్కువగానే నమోదవుతుండగా... రానున్న వారం రోజుల పాటు వాతావరణం ఇదే తరహాలో ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శనివారం రాష్ట్రంలో దాదాపు 50కి పైగా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ప్రణాళికా విభాగం గణాంకాలు చెబుతున్నాయి. రానున్న వారం రోజులూ అధిక ఉష్ణోగ్రతతో పాటు ఉక్కపోత తీవ్రంకానుంది.
వాయవ్యదశ నుంచి వడగాల్పులు
మరోవైపు రాష్ట్రానికి వాయవ్య దిశ నుంచి వడగాల్పులు కూడా వీస్తుండటంతో పిల్లలు, వృద్ధులు ఎండ సమయంలో బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వానలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీ సెల్సియస్ మధ్యన నమోదయ్యే అవకాశం ఉంది.