జూన్‌ మొదటి వారం వరకూ మంటలే!  | Summer Hot Temperatures High In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

జూన్‌ మొదటి వారం వరకూ మంటలే! 

Published Thu, May 25 2023 4:39 AM | Last Updated on Thu, May 25 2023 4:39 AM

Summer Hot Temperatures High In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత జూన్‌ మొదటి వారం వరకూ కొనసాగనుంది. నైరుతి రుతు పవనాలు నెమ్మదిగా కదులుతుండటమే దీనికి కారణమని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాలు గత మూడు రోజుల నుంచి బంగాళాఖాతంలో నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ సమయానికి బంగాళాఖాతంలో ఎక్కువ ప్రాంతాలకు విస్తరించి అండమాన్‌ నికోబార్‌ దీవులను తాకాల్సి ఉంది. కానీ ఇంకా అవి బంగాళాఖాతంలోనే నెమ్మదిగా కదులుతుండడంతో నెలాఖరుకు కేరళను తాకే అవకాశం తక్కువేనంటున్నారు.

వాతావరణం అనుకూలించి రెండు, మూడు రోజుల్లో రుతు పవనాలు ముందుకు కదిలితే వచ్చే 3, 4 తేదీల్లో కేరళలో ప్రవేశించి.. ఆ తర్వాత జూన్‌ రెండో వారానికి రాష్ట్రాన్ని తాకే  అవకాశముంటుందని భావిస్తున్నారు. ఎల్‌నినో పరిస్థితుల వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. దీన్నిబట్టి జూన్‌ 8వ తేదీ వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుందని చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో అక్కడక్కడా కురుస్తున్న వర్షాలకు కారణం అరేబియన్‌ సముద్రం నుంచి వస్తున్న గాలులేనని వాతావరణ శాఖ చెబుతోంది. 
 
 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు  
బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురి సౌత్‌లో 44.7, ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జువ్విగుంటలో 44.5, పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం, నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో 44.4, బాపట్ల జిల్లా బల్లికురువు మండలం కొప్పెరపాడులో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

గురువారం ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, పెనుగంచిప్రోలు, గుంటూరు జిల్లా గుంటూరు, దుగ్గిరాల, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని, తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు, పల్నాడు జిల్లా అమరావతి, అచ్చంపేట, పెదకూరపాడు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేడ్కర్‌ చెప్పారు.       

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement