
నేడు వీర హనుమాన్ విజయ యాత్ర
17 వేల మంది పోలీసులతో బందోబస్తు
సుల్తాన్‌బజార్: వీర హనుమాన్ విజయ యాత్రకు అంతా సిద్ధమైంది. గౌలిగూడ రాంమందిర్ నుంచి తాడ్‌బండ్ ఆంజనేయ స్వామి ఆలయం వరకు కొనసాగనున్న బైక్ ర్యాలీకి వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ నాయకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ 17వేల మంది పోలీసు బలగాలతో పాటు సాయుధ బలగాలు బందో బస్తు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శనివారం ఉదయం 8 గంటలకు గౌలిగూడ రాంమందిర్‌లో విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో యజ్ఞంతో యాత్ర ప్రారంభం కానుంది.
కోఠి ఆంధ్రా బ్యాంక్ చౌరస్తాలో బహిరంగ సభ..
ర్యాలీలో దాదాపు 2 లక్షల మంది హనుమాన్ భక్తులు బైక్ ర్యాలీగా తరలివచ్చే వారిని ఉద్దేశించి కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తాలో వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ తలపెట్టారు. కార్యక్రమానికి ముఖ్య వక్తగా విశ్వహిందూ పరిషత్ నేత, పార్లమెంట్ మాజీ సభ్యుడు రామ్‌విలాస్ దాస్ వేదాన్ పాల్గొంటారు.
శోభా యాత్ర రూట్ ఇలా..
వీర హనుమాన్ విజయయాత్ర ఉదయం 8 గంటలకు యజ్ఞంతో ప్రారంభమై వివిధ శకటాలతో గౌలిగూడ రాంమందిర్ నుంచి కోఠి ఆంధ్రా బ్యాంక్ చౌరస్తా, సుల్తాన్‌బజార్ చౌరస్తా, రాంకోఠి క్రాస్‌రోడ్, కాచిగూడ క్రాస్‌రోడ్, వైఎంసీఏ మీదుగా నారాయణగూడ ఫ్లైఓవర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్ అశోక్‌నగర్ క్రాస్‌రోడ్, గాం«దీనగర్, బన్సీలాల్‌పేట్ జంక్షన్, బైబిల్ హౌస్, బాటా, రాంగోపాల్‌పేట్, సీటీఓ జంక్షన్, రాయల్ ప్యాలెస్ నుంచి తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయం వరకు సాగుతుంది.