
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి (Vijayashanti) దంపతులను చంపేస్తానంటూ బెదిరింపులు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌లు పంపించాడు. దీంతో, విజయశాంతి.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల ప్రకారం.. చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్‌కు పరిచయమయ్యాడు. ఈ క్రమంలో తాను సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తానని ప్రసాద్‌కు చంద్రకిరణ్ చెప్పుకున్నాడు. దీంతో, తమకు కూడా ప్లస్ అవుతుందనే ఉద్దేశ్యంతో శ్రీనివాస ప్రసాద్.. పనితీరు చూశాక కాంట్రాక్ట్ ఇస్తామని చంద్రకిరణ్‌కు చెప్పాడు. అయితే, కొద్దిరోజుల తర్వాత అనుకున్న స్థాయిలో అతడు పనిచేయకపోవడం.. సరైన ఫలితాలు రాకపోవడంతో అతడితో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండానే శ్రీనివాస ప్రసాద్ ఆఫీసు నుంచి పంపించేశారు.
ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం.. తనకు డబ్బులను ఎప్పుడు చెల్లిస్తారంటూ శ్రీనివాసప్రసాద్‌కు చంద్రకిరణ్ రెడ్డి మెసేజ్ చేశాడు. ఎలాంటి కాంట్రాక్ట్ లేకుండా.. చంద్రకిరణ్ డబ్బులు అడగడంతో శ్రీనివాస్ ప్రసాద్ ఆశ్చర్యపోయారు. దీంతో, తన ఆఫీసుకు వచ్చి.. దీనిపై మాట్లాడాలని శ్రీనివాస్ సూచించారు. కానీ, చంద్రకిరణ్.. ఆఫీసుకు రాకపోగా.. మెయిల్స్, మెసేజ్‌లతో బెదిరింపులకు దిగాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే.. విజయశాంతి, శ్రీనివాస్‌ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అలాగే, వారి కుటుంబాన్ని రోడ్డుకు ఈడుస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో విజయశాంతి దంపతులు.. అతడిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చదవండి: వార్నీ.. ఎయిర్‌పోర్టును కూడా వదలరా?