సినీ హీరోయిన్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి క్రమంగా ప్రజలకు దూరం అవుతున్నారు. అనేక పార్టీలు మారిన రాములమ్మ ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. అప్పుడప్పుడు ట్వీట్‌లు చేస్తూ తన ఉనికి చాటుకుంటున్నారు. తాజాగా బీజేపీ నేత కిషన్‌రెడ్డి కామెంట్స్ మీద ట్వీట్ చేసి సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. ఇంతకీ రాములమ్మ ఆలోచనలు ఏంటి? ఆమె కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారా? లేక మరో గూటికి చేరాలనుకుంటున్నారా?
లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న విజయశాంతి ఒకప్పుడు అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండే. 1998లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీతో రాజకీయ అరంగేట్రం చేసిన విజయశాంతి కమలం, కాంగ్రెస్ పార్టీలకు రెండు సార్లు రాజీనామాలు చేసి, మళ్ళీ చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి తర్వాత ఆ పార్టీని గులాబీ పార్టీలో విలీనం చేాశారు. కేసీఆర్‌తో వచ్చిన విభేదాల కారణంగా కాంగ్రెస్‌లో చేరిపోయారు. కొన్ని రోజులు హస్తం పార్టీలో యాక్టీవ్ గానే ఉన్నా.. ఆతర్వాత కాంగ్రెస్‌లో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని రెండోసారి బీజేపీలో చేరారు. బీజేపీ నాయకత్వం సీనియర్‌గా ఆమెకు గుర్తింపు ఇచ్చినా కొద్ది రోజులకే మళ్ళీ హస్తం గూటికి వచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి పలు జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేాశారు. ఎన్నికల అనంతరం ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర నుంచి లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు ఆరు నెలల పాటు విజయశాంతి పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. కానీ అడపాదడపాగా సోషల్ మీడియా వేదికగా పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగానో తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విజయశాంతి. తాజాగా సోషల్ మీడియాలో విజయశాంతి పెట్టిన పోస్ట్ మరోసారి చర్చకు దారితీసింది.
బీఆర్ఎస్ మీద కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వాఖ్యలకు కాంగ్రెస్ నేతగా విజయశాంతి కౌంటర్ ఇవ్వడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ట్వీట్ చేసారు. కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదని, ఆత్మగౌరవం, పోరాట తత్వం దక్షిణాది రాష్ట్రాల సహజ లక్షణమంటూ కిషన్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు. దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ అర్థం చేసుకోలేక పోయిందంటూ చురకలు అంటించారు విజయశాంతి. అయితే కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ను విమర్శిస్తే విజయశాంతి స్పందించడమే ఇప్పుడు చర్చకు దారితీసింది.
చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి ప్రస్తుత పోస్ట్ చూస్తుంటే మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా అనే అనుమానం రాజకీయ వర్గాల్లో కలుగుతోంది. కిషన్ రెడ్డి వాఖ్యలను బీఆర్ఎస్ నేతలే పట్టించుకోలేదు అలాంటిది కాంగ్రెస్ నేత అయిన విజయశాంతికి ఏమవసరం అని పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తానికి సొంత పార్టీని ఇరకాటంలో పెట్టడంలో విజయశాంతి స్టైలే వేరనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment