తెలంగాణ ఇచ్చినందునే కాంగ్రెస్‌లో చేరా! | Vijayashanthi to join Congress | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఇచ్చినందునే కాంగ్రెస్‌లో చేరా!

Published Mon, Oct 7 2013 2:55 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Vijayashanthi to join Congress

మెదక్ రూరల్, న్యూస్‌లైన్: సమైక్యవాద కబంధ హస్తాలనుంచి సంకెళ్లు తెంపుకుని బయటకు వచ్చే రోజులు దగ్గరకు వచ్చాయని మెదక్ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. ఆదివారం మెదక్ మండల పరిధిలోని గ్రామాల్లో అమె పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఖాజిపల్లి, కూచన్‌పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అమె మాట్లాడుతూ 60 ఏళ్లుగా వేచిఉన్న తెలంగాణ ప్రజల నిరీక్షణ ఫలించనుందన్నారు.
 
 ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చొరవతో తెలంగాణ బిల్లు కేబినె ట్ ఆమోదం పొంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావ దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. గతంలో తెలంగాణ కోసం కాంగ్రెస్‌ను విమర్శించిన తాను ప్రస్తుతం ఆ పార్టీని సమర్ధించక తప్పదన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటును ప్రకటించగానే కాంగ్రెస్ పార్టీలో చేరతానని తాను చెప్పానని, తెలంగాణ ప్రకటించగానే మొదటి సారిగా తానే సోనియాగాంధీకి కృతజ్ఞలు తెలిపానన్నారు. కొందరు చిన్నాచితక పార్టీల నాయకుల మాటలకు చేతలకు పొంతన ఉండడంలేదని ఆమె పరోక్షంగా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను విమర్శించారు.  ప్రత్యేక రాష్ట్రం మరో ఏడాదిలో ఏర్పడనున్నందున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే అధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు.
 సమైక్య రాష్ర్టం కోసం కృషి చేస్తున్న సీఎం కిరణ్‌కుమార్డ్డ్రి తెలంగాణ ప్రాంతానికి   చెందిన నాయకులను పట్టించుకోవడంలేదన్నారు. సమైక్యవాదులు తెలంగాణకు అడ్డుపడి తమ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. తన పదవీ కాలంలో మెదక్-అక్కన్నపేట రైల్వే లైన్ మంజూరీతోపాటు పల్లెపల్లెకు హైమాస్టు లైట్లు, తాగునీరు, రోడ్లు తదితర అభివృద్ధి పనులను చేపట్టానన్నారు.
 
 మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయని తెలంగాణ ప్రాంతానికి కొత్తసీఎం వచ్చాక మనం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతామన్నారు.  కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం  62 సంవత్సరాలుగా  తెలంగాణ ప్రజలు కడుపుకాలి పోరాటం చేస్తుంటే  సీమాంధ్రులు 62రోజులుగా కృత్రిమ ఉద్యమం చేస్తూ తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆరునూరైనా తెలంగాణ వస్తుందని, ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకోవడం ఎవరి తరంకాదన్నారు. ఆంధ్రుల పాలనలో తెలంగాణలో ఉద్యోగాలు లేవని, అభివృద్ధి కుంటుపడిందని ఆయన ధ్వజమెత్తారు. కార్యక్రమంలో గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి,  నాయకులు మామిళ్ల అంజనేయులు, కిషన్‌గౌడ్, దేవాగౌడ్, సర్పంచులు వివిధ గ్రామాల సర్పంచులు హైమావతి నాగరాజు, మహేందర్‌రెడ్డి, ఫయాజ్  పాల్గొన్నారు. అంతకు ముందు ఖాజిపల్లి సర్పంచ్ సాద లక్ష్మితోపాటుమరో 100 మంది కార్యకర్తలు విజయశాంతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
 
 ప్రారంభోత్సవాలు..శంకుస్థాపనలు
 మండల పరిధిలోని ఖాజిపల్లి గ్రామంలో హైమాస్టు లైట్ల ప్రారంభం, కోంటూర్‌లో బోరుమోటారుకు ప్రారంభోత్సవం, హవేళిఘణపూర్, మంబోజిపల్లి,  ముత్తాయికోట గ్రామాల్లో హైమాస్టు లైట్లు, కూచన్‌పల్లి, గ్రామంలో హైమాస్టు లైట్లతో పాటు రూ. 5 లక్షల వ్యయంతో చేపట్టనున్న  సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ విజయశాంతి  శంకుస్థాపన చేశారు.
 
 రాములమ్మను అడ్డుకున్న చిన్నశంకరంపేట గ్రామస్థులు
 చిన్నశంకరంపేట: మెదక్ ఎంపీ విజయశాంతిని ఆదివారం చిన్నశంకరంపేట ఎస్సీకాలనీ ప్రజలు అడ్డుకున్నారు.
 
 స్థానిక బీసీ కాలనీలో బోరు మోటారును ప్రారంభించిన అనంతరం ఎంపీ తిరిగి  వస్తుండగా అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ సంఘటన జరిగింది. తాము మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా  పట్టించుకునేటోల్లే లేరంటూ కొందరు దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీ వాహనాన్ని అడ్డుకుని తమ సమస్యను పరిష్క రించాలని డిమాండ్ చేశారు. వారిని సముదాయించేందుకు చిన్నశంకరంపేట ఎస్‌ఐ ప్రశాంత్ ప్రయత్నించగా తాము ఎంపీతోనే మాట్లాడుతామని చెప్పడంతో ఎంపీ విజయశాంతి వాహనం దిగి వారి సమస్యను పరిష్కరిస్తానని, నిధులు కేటాయిస్తానని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement